దీపం చెప్పిన కథ | Funday cover story | Sakshi
Sakshi News home page

దీపం చెప్పిన కథ

Published Sun, Nov 4 2018 12:57 AM | Last Updated on Sun, Nov 4 2018 12:57 AM

Funday cover story - Sakshi

అమావాస్య నాటి కారుచీకటి రాత్రిని ధగధగలాడే వెలుగులతో మిరుమిట్లు గొలిపించే పండుగ దీపావళి. దీపాల వరుసనే దీపావళి అంటారు. ఇంటింటా వీధి గుమ్మాల్లో వరుసగా దీపాలను వెలిగిస్తారు. ఉదయం పండుగ పిండివంటలను ఆరగించి, రాత్రి బాణసంచా కాల్పులతో సంబరం చేసుకుంటారు. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ప్రతీకగా జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. లోకానికి నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ జరుపుకొంటారు. ఇది హిందువులకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు కూడా ఇది ముఖ్యమైన పండుగ. 

దీపావళికి సంబంధించిన పురాణేతిహాసాలు, చరిత్ర సంగతి అటుంచితే, చిన్నారులకు మాత్రం దీపావళి అంటే పిండివంటలతో పాటు గుర్తొచ్చేది బాణసంచానే. బాణసంచా కాల్పుల వల్ల కాలుష్యం పెరుగుతోందంటూ కొంతకాలంగా పర్యావరణవేత్తల గగ్గోలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా బాణసంచా కాల్పులపై ఆంక్షలు విధించింది. దీపావళి రోజున రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు కేవలం రెండు గంటల సేపు మాత్రమే బాణసంచా కాల్పులు జరుపుకోవాలని ఆదేశించింది. బాణసంచా అభిమానులకు ఇది కొంత నిరుత్సాహం కలిగించే విషయమే అయినా, సుప్రీంకోర్టు ఆదేశం పర్యావరణానికి జరిగే చేటును కొంత మేరకైనా కట్టడి చేయగలదని సంతృప్తి చెందాలి.

స్త్రీశక్తిని చాటే పండుగ
లోక కంటకుడైన నరకాసురుడిని సత్యభామ సాయంతో చతుర్దశి రోజున సంహరించాడు. నరకాసురుడు మరణించిన మర్నాడు జనాలందరూ అతడి పీడ విరగడైనందుకు సంబరాలు చేసుకున్నారు. ఊరూ వాడా ఇంటింటా దీపాలు వెలిగించుకున్నారు. అప్పటి నుంచి నరక చతుర్దశి మర్నాడు అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణాల కథనం. క్రూరుడైన నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించేవాడు. కంటికి నచ్చిన స్త్రీనల్లా చెరపట్టేవాడు. అతడి భయానికి స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. రాత్రివేళల్లో ఇళ్లలో దీపాలను వెలిగించుకోవడానికి కూడా భయపడేవారు. మహా బలవంతుడైన నరకుడిని దేవ దానవ మానవులలో ఎవరూ ఎదిరించలేకపోయేవారు. తనకు ఎదురే లేకపోవడంతో నరకాసురుడు యథేచ్ఛగా ముల్లోకాలనూ పీడించేవాడు. అతడి బాధలను తాళలేని దేవతలు, మునులు మహావిష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. కృష్ణావతారంలో తాను అతడిని అంతమొందిస్తానని విష్ణువు వారికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే కృష్ణావతారంలో నరకుడిపై యుద్ధానికి దిగుతాడు. నరకునితో జరిగిన యుద్ధానికి కృష్ణుడితో పాటు సత్యభామ కూడా వెళుతుంది. నరకుడి సేనాని మురాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో హతమవుతాడు. నరకుడు క్రోధావేశంతో కృష్ణుడితో తలపడతాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు కాసేపు సొమ్మసిల్లిపోతాడు. అప్పుడు సత్యభామ స్వయంగా ధనుర్బాణాలు ధరించి నరకుడితో యుద్ధం కొనసాగిస్తుంది. సత్యభామ పోరు సాగిస్తుండగా మెలకువలోకి వచ్చిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకుడిని అంతమొందిస్తాడు. లోకాలను వణికించే నరకుడిపై సత్యభామ ధైర్యంగా పోరు సాగించిన కారణంగా దీపావళిని స్త్రీశక్తికి ప్రతీకగా భావిస్తారు. 

ఐదు రోజుల వేడుకలు
దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు కొనసాగుతాయి. ఆశ్వీయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’గా జరుపుకొంటారు. ఉత్తరాదిలో దీనినే ‘ధన్‌ తెరాస్‌’ అంటారు. దేవదానవులు  క్షీరసాగర మథనం చేసినప్పుడు ఇదే రోజు ధన్వంతరి, లక్ష్మీదేవి ఉద్భవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరికి, ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి పుట్టిన రోజు ధనత్రయోదశి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుతూ ఈ రోజు ధన్వంతరికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధనత్రయోదశి మర్నాడు వచ్చే నరక చతుర్దశి నాడు అభ్యంగన స్నానాలు ఆచరించి, ఇళ్లకు అలంకరణలు చేస్తారు. దీపావళి వేడుకలకు సన్నాహాలు ప్రారంభిస్తారు. దీపావళి రోజున ప్రధానంగా లక్ష్మీపూజ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవితో పాటు గణపతికి, సరస్వతికి, కుబేరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. మార్వాడీలకు, గుజరాతీలకు దీపావళి నాటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. వారు నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటారు. బంధు మిత్రులకు మిఠాయిలు పంచుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సాయంత్రం చీకటి పడగానే ఇళ్ల ముందు వరుసగా దీపాలను వెలిగించి, బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చడం వల్ల దుష్టశక్తులు పారిపోతాయని విశ్వసిస్తారు. రావణ వధ తర్వాత సీతా రామలక్ష్మణులు దీపావళి రోజునే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని
పురాణాలు చెబుతాయి. 

దీపావళి మర్నాడు వచ్చే కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా పాటిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమి రోజునే ‘పడ్వ’ అని అంటారు. దంపతుల మధ్య పరస్పర అనురాగం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి ప్రీతి కోసం గోవర్ధన పూజ చేస్తారు. కార్తీక శుద్ధ విదియ రోజున కొన్ని ప్రాంతాల్లో ‘భాయీ దూజ్‌’గా పాటిస్తారు. రక్షాబంధనం తరహాలోనే సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి చిహ్నంగా ఈ పండుగ జరుపుకొంటారు. అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. సోదరులను ఇంటికి పిలిచి పిండివంటలతో భోజనం పెడతారు. యముడికి అతడి సోదరి యమున ఇదేరోజు ఆతిథ్యం ఇచ్చిందని పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఈ పండుగను ‘యమ ద్వితీయ’ అని కూడా అంటారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. కాళీమాతను ఆరాధిస్తారు.

దీప ప్రశస్తి
దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మిపూజ జరుపుకోవడం వెనుక ఒక పురాణగాథ ఉంది. దుర్వాస మహర్షి ఒకసారి ఇంద్రసభకు వచ్చాడు. దేవేంద్రుడు ఆయనకు చక్కని ఆతిథ్యమిచ్చాడు. దేవేంద్రుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు అతనికి ఒక మహిమాన్వితమైన హారాన్ని ఇస్తాడు. స్వర్గాధిపతి అయిన తాను ఒక మునిపుంగవుడు ఇచ్చిన హారాన్ని ధరించడమా అనే అహంకార భావంతో ఇంద్రుడు ఆ హారాన్ని తన పట్టపుటేనుగైన ఐరావతం మెడలో వేస్తాడు. ఐరావతం దానిని తొండంతో తీసి, నేల పడవేసి తొక్కి చిందరవందర చేసింది. అసలే ముక్కోపి అయిన దుర్వాసుడు ఇదంతా చూసి పట్టరాని ఆగ్రహంతో ఇంద్రుడిని శపిస్తాడు. శాప ఫలితంగా ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని, సంపదలను పోగొట్టుకుని దైన్యస్థితిలో పడతాడు. దిక్కుతోచని స్థితిలో విష్ణువును ఆశ్రయిస్తాడు. మట్టి ప్రమిదలో ఒక దీపాన్ని వెలిగించి, దానిని మహాలక్ష్మిగా తలచి పూజించమని విష్ణువు అతడికి సూచిస్తాడు. విష్ణువు సూచన మేరకు దీపాన్ని పూజించిన ఇంద్రుడు తాను పొగొట్టుకున్న సిరిసంపదలను, స్వర్గాధిపత్యాన్ని తిరిగి పొందుతాడు. విష్ణువును దర్శించుకున్న సమయంలో ఇంద్రుడు లక్ష్మీదేవిని ‘అమ్మా! ఎల్లవేళలా నీవు శ్రీహరి వద్దనే ఉండిపోతావా? నీ భక్తులను కరుణించవా?’ అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ‘నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా తప్పక కరుణిస్తాను. మోక్షగాములైన మహర్షులకు మోక్షలక్ష్మిగాను, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగాను, విద్యార్థులకు విద్యాలక్ష్మిగాను, ఐశ్వర్యాన్ని కోరేవారికి ధనలక్ష్మిగాను, భక్తుల సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మిగాను అనుగ్రహిస్తూనే ఉంటాను’ అని బదులిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించేవారికి సిరిసంపదలకు లోటుండదని భక్తులు విశ్వసిస్తారు.

దీపావళి వేడుకలను భారత్‌తో పాటు పలు దేశాల్లో ఘనంగా జరుపుకొంటారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మియాన్మార్, మారిషస్, మలేసియా, సింగపూర్, ఫిజి, సురినేమ్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, పాకిస్థాన్‌లోని సిం«ద్‌ రాష్ట్రంలో దీపావళి అధికారిక సెలవుదినం కావడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఇండోనేసియా, కరీబియన్‌ దీవులు, అమెరికాలలోనూ దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసంలోను కూడా దీపావళి వేడుకలను ఏటా నిర్వహిస్తుండటం విశేషం. బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో దీపావళి వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. భారత్‌లోని నగరాల తర్వాత లీసెస్టర్‌ నగరంలోనే అంత ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతాయి. సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రాంతంలో కూడా దీపావళిని దేదీప్యమానంగా జరుపుకొంటారు. నేపాల్‌లో దీపావళిని ‘తీహార్‌’ అని, ‘స్వాంతి’ అని అంటారు. భారత్‌లో మాదిరిగానే నేపాల్‌లోనూ దీపావళి సందర్భంగా ఐదు రోజులు వేడుకలు చేసుకుంటారు. మొదటిరోజును ‘కాగ్‌ తీహార్‌’ అంటారు. ఆ రోజు కాకులకు ఆహారం పెడతారు. రెండో రోజు ‘కుకుర్‌ తీహార్‌’ అంటారు. ఆ రోజు శునకాలను అలంకరించి, వాటికి ఆహారం పెడతారు. మూడో రోజు ‘గాయి తీహార్‌’ సందర్భంగా గోవులను పూజిస్తారు. అదేరోజు లక్ష్మీపూజ చేస్తారు. సాయంత్రం ఇళ్ల ముంగిట దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తారు. దీపావళి మర్నాడు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ తర్వాతి రోజు భారత్‌లో ‘భాయి దూజ్‌’ జరుపుకొన్నట్లే నేపాలీలు ‘భాయి టీకా’ వేడుకలు జరుపుకొంటారు. మహిళలు తమ సోదరులను ఇళ్లకు ఆహ్వానించి, వారి నుదట తిలకం దిద్ది, విందు భోజనాలు పెడతారు. నేపాల్‌లోని నేవార్‌ బౌద్ధులు వజ్రయాన సంప్రదాయం ప్రకారం దీపావళి సందర్భంగా ‘మహాపూజ’ నిర్వహిస్తారు. ఇండోనేసియాలోని బాలి దీవిలో దీపావళిని ‘గలుంగాన్‌’ అంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ తమిళులు సుమత్రా దీవిలోని మరియమ్మన్‌ ఆలయంలో దీపావళికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్‌లోను అక్కడి భారతీయులతో పాటు స్థానికులు కూడా దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 

బాణసంచా జాగ్రత్తలు
దీపావళి రోజున బాణసంచా కాల్చడానికి పిల్లలు ఎక్కువగా ఉత్సాహపడతారు. బాణసంచా కాల్చే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బాణసంచా విషయంలో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

►తగిన అనుమతి కలిగిన దుకాణాల్లోనే నాణ్యమైన బ్రాండ్ల బాణ సంచా సామగ్రిని కొనుగోలు చేయండి.
►బాణసంచా కాల్చేటప్పుడు నూలు దుస్తులు ధరించండి. కాళ్లకు తప్పనిసరిగా షూస్‌ లేదా కనీసం చెప్పులు వేసుకోండి.
►సీమటపాకాయలు, లక్ష్మీబాంబులు, తాటాకు టపాకాయలు వంటి పేలే బాణసంచాను కాల్చేటప్పుడు వాటికి సురక్షితమైన దూరంలో ఉండి కాల్చండి.
►బాణసంచా కాల్చేటప్పుడు జనసంచారాన్ని కాస్త గమనించండి. వీధుల్లో జనాలు నడుస్తున్నప్పుడు బాణసంచా కాల్పులను విరమించుకోవడమే క్షేమం.
​​​​​​​►బాణసంచా కాల్చేటప్పుడు నిప్పురవ్వలు కళ్లలోకి పడకుండా ఉండేలా గాగుల్స్‌ ధరించడం మంచిది. విపరీతమైన పేలుడు శబ్దాల నుంచి చెవులను కాపాడుకోవడానికి చెవుల్లో దూది పెట్టుకోవడం కూడా మంచిది.
​​​​​​​►ఇంటి వద్ద తగిన ఖాళీ స్థలంలో మాత్రమే బాణసంచా కాల్చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలో కాల్చవద్దు.
​​​​​​​►ఇళ్లలో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే అవి బాణసంచా చప్పుళ్లకు బెదిరిపోయే అవకాశం ఉంది. వాటిని ఒకచోట కట్టేసి, వాటి మానాన వాటిని విడిచిపెట్టకుండా ఎవరో ఒకరు వాటి దగ్గర ఉంటూ వాటిని సముదాయించడం మంచిది.
​​​​​​​►మితిమీరిన పొగ వెలువరించే సామగ్రిని, భయంకరమైన చప్పుళ్లు చేసే పేలుడు సామగ్రిని కాల్చకుండా ఉంటేనే మంచిది.
​​​​​​​►బాణసంచా పొగ, చప్పుళ్ల కారణంగా కళ్లకు, చర్మానికి, చెవులకు, ఊపిరితిత్తులకు హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు, ఉబ్బసం ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు మరింతగా పెరిగే ​​​​​​​►అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న చోట బాణసంచా కాల్పులను కనీస స్థాయికి పరిమితం చేసుకోవడం క్షేమం.

దీపావళి గురించి అవీ ఇవీ...
​​​​​​​►దీపావళి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలు వివిధ పద్ధతుల్లో జరుపుకొంటారు. 
​​​​​​​►వర్ధమాన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినందున జైనులు ఈ రోజును అత్యంత పవిత్రదినంగా భావిస్తారు. మహావీరుడిని తలచుకుంటూ జైనులు తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగిస్తారు.
​​​​​​​►మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ చెర నుంచి సిక్కుల మతగురువు గురు హరగోవింద్‌ సింగ్‌  విడుదలైన రోజు కావడంతో సిక్కులు కూడా దీపావళి రోజున వేడుకలు చేసుకుంటారు. క్రీస్తుశకం 1577 ​​​​​​​►సంవత్సరంలో దీపావళి రోజునే అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన జరగడం విశేషం.
​​​​​​​►దీపావళి రోజున దేశవ్యాప్తంగా కాల్చే బాణసంచా విలువ వందలాది కోట్ల రూపాయల మేరకు ఉంటుంది. తమిళనాడులోని శివకాశీలో బాణసంచా తయారీ పరిశ్రమ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ తయారైన బాణసంచా దేశ విదేశాలకు సరఫరా అవుతుంది.
​​​​​​​►క్రీస్తుశకం ఆరోశతాబ్ది కాలంలో చైనావారు బాణసంచా తయారీలో కీలకమైన పొటాషియం నైట్రేట్‌ను కనుగొన్నారు. బాణసంచా కనుగొనడానికి ముందు దీపావళి వేడుకల్లో కేవలం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు.
​​​​​​​►మందుగుండు కనుగొన్న తర్వాత చిత్రవిచిత్రమైన బాణసంచా సామగ్రిని తయారు చేసేవారు. దీపావళి రోజున బాణసంచా కాల్చడం మన దేశంలో క్రమంగా వాడుకలోకి వచ్చింది. ఇతర దేశాల్లోనూ వివిధ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం మొదలైంది.
​​​​​​​►అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు జూలై 4న అక్కడి జనాలు భారీస్థాయిలో బాణసంచా కాలుస్తారు. 
​​​​​​​►ప్రపంచంలోనే అత్యధికంగా బాణసంచా వినియోగించే సంస్థగా ‘వాల్డ్‌ డిస్నీ’ రికార్డులకెక్కింది.
​​​​​​​►బ్రిటిష్‌ పాలకులకు బాణసంచా కాల్పులంటే చాలా ఇష్టం ఉండేది. బ్రిటిష్‌ రాణి మొదటి ఎలిజబెత్‌ వైవిధ్యభరితమైన బాణసంచా సామగ్రి తయారు చేసే వ్యక్తి కోసం ఏకంగా ‘ఫైర్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’ అనే ఆస్థాన పదవిని కల్పించింది. 
​​​​​​​►బ్రిటిష్‌ రాజు రెండవ జేమ్స్‌కు కూడా బాణసంచాపై విపరీతమైన మోజు ఉండేది. తన పట్టాభిషేక వేడుకల్లో వింతవింత బాణసంచా కాల్పులను ప్రదర్శించిన వ్యక్తిని ‘నైట్‌హుడ్‌’తో సత్కరించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement