సాక్షి, చైన్నె: దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికితోడు ఉత్తరాది రాష్ట్రాలలో బాణసంచాలకు నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది శివకాశిలోని పరిశ్రమలకు రూ. 700 కోట్ల మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. వివరాలు.. వెలుగులు చిమ్మే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టం. బాణసంచా పేల్చడం అంటే, మరెంతో ఆనందం. దీపావళిని పురస్కరించుకుని రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో బాణసంచాలు మార్కెట్లోకి వస్తోంది.
ఇక టపాకాయల తయారీకి పేరుగాంచిన విరుదునగర్ జిల్లాలోని శివకాశిలో ప్రస్తుతం నిరాశాజన వాతావరణ నెలకొంది. ఒకప్పుడు ఇక్కడ దీపావళికి రూ. 5 వేల కోట్ల మేరకు టపాకాయల ఉత్పత్తి జరిగేది. అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడి ఉత్పత్తి దారులకు షాక్‌ల మీద షాక్‌లు తప్పడం లేదు. ఇక కోర్టులు ఇచ్చిన కొత్త నిబంధనలు, పలు రాష్ట్రాల్లో బాణసంచాలకు నిషేధం వెరసి ఇక్కడి వ్యాపారులు ఏటా నష్టాలను ఎదుర్కొకుంటున్నారు. గత ఏడాది వెయ్యి కోట్ల స్టాక్ శివకాశికే పరిమితమైంది.
ఈ ఏడాది 50 శాతం మేరకు ఉత్పత్తిని తగ్గించినా, రూ.700 కోట్ల వరకు నష్టాన్ని తాము ఎదుర్కొక తప్పదని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా పర్యావరణానికి ఆటంకం కలిగించకుండా ఉండే బాణసంచాలను పేల్చాలని, ఉదయం 6 నుంచి 7 వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకే రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానా విధిస్తామన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక పండుగకు పది రోజులు సమయం ఉండడంతో ఆయా ప్రాంతాలలో బాణా సంచాల విక్రయాల దుకాణాల ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment