2016లో పట్టుబడిన జిలెటిన్ స్టిక్స్, పేలుడు సామగ్రి
విజయనగరం, బొబ్బిలి రూరల్: గతంలో బొబ్బిలి నియోజకవర్గంలో బాణసంచా పేలుళ్లు అనేకం జరిగాయి. ఒకానొక సమయంలో జిలెటిన్ స్టిక్స్, పేలుడు సామగ్రి కూడా లభ్యమైంది. కేవలం మందుగుండు సామగ్రి తయారీలో సాధారణ ప్రజలు, సంబంధం లేని కొందరు ప్రాణాలు కోల్పోతే, తీవ్ర గాయాలపాలై అంగవైకల్యం పొందినవారు మరికొందరు ఉన్నారు. లైసెన్స్ లేని అమ్మకాలు, నాసిరకం సామగ్రి పేలుళ్లకు ఒక కారణమైతే, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకర పేలుడు పదార్థాలు పట్టణం నడిబొడ్డున అమ్మకాలు జరుపుతుండడం ఇంకో కారణం. గతంలో ఇలాంటి డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కూడా. మళ్లీ ఇప్పుడు అదే తరహా ప్రమాదం జరిగింది. అంటే ఇది నిర్లక్ష్యమా..? నిఘా, పోలీసు వర్గాల వైఫల్యమా అని పలువురు అనుకుంటున్నారు. సరదాగా చేసుకోవాల్సిన సంబరాలు విషాదంగా ముగుస్తుండడంతో నిర్లక్ష్యం అన్న వాదనకు మరింత బలం చేకూరుతుంది.
2012 నుంచి మొదలుపెడితే..
2012 సెప్టెంబర్ 18న బొబ్బిలి మండలం పారాది గ్రామంలో బాణసంచా పేలుళ్లు జరిగాయి. అప్పట్లో గ్రామంలో ఓ ఇంట్లో తయారు చేస్తున్న గోడ బాంబులు తరలిస్తున్న సమయంలో పేలుడు జరగడంతో ముగ్గురు మరణించారు. 12 మంది గాయపడ్డారు. దీంతో జిల్లా దృష్టి అంతా బొబ్బిలివైపు మళ్లింది. పోలీసులు కూడా అప్పటి నుంచే అప్రమత్తమయ్యారు. మళ్లీ 2013 ఫిబ్రవరి 14న కలువరాయిలో బాంబు పేలి ముగ్గురు విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారు. పేలని బాంబు తీసుకుని విద్యార్థులు వెలిగించడానికి యత్నించారని చెప్పారు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత మరో 6 నెలలకు గోపాలరాయుడిపేట వద్ద బాంబు పేలి ఒకరు చనిపోగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల క్రితం బాడంగి మండలం ఎరుకుల పాకల వద్ద బాణసంచా పేలి ఇద్దరు మరణించారు. ఇలా వరుస పెట్టి ఘటనలు జరుగుతున్న సమయంలోనే బొబ్బిలిలో జిలెటిన్ స్టిక్స్, భారీ పేలుడు సామగ్రి లభ్యమైంది. అప్పట్లో విజయనగరం నుంచి పోలీసులు వచ్చి వీటిని స్వాధీనం చేసుకుని పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరులను అరెస్టు చేశారు. 2016 జనవరి 29న బొబ్బిలిలో చిన్నబజారు వీధిలో నిత్యం జనం రద్దీగా ఉండే ప్రాంతంలో 7 వేలకు పైగా జిలెటిన్ స్టిక్స్, 7,118 ఎలక్ట్రానిక్, 12,400 నాన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి. బస్తాలకు బస్తాలు లభ్యం కావడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇవికాక దీపావళి సమయంలో అమ్మకాలు జరిపే మందుగుండు సామగ్రి కో కొల్లలు. అనుమతులు లేకుండా అమ్మకాలు జరిపే వ్యాపారుల నుంచి వేలాది రూపాయల సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నాసిరకం సరుకు వల్లే..
బాణసంచా అమ్మకాలు ఒక ఎత్తు అయితే, నాసిరకం సరుకులు తెచ్చి అమ్మకాలు చేయడం, లైసెన్స్ ఒకరి పేరిట ఒక షాపుకు పెట్టి అనేక ప్రాంతాలలో అమ్మకాలు చేపట్టడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు బాధ్యతతో వ్యవహరించకపోవడం, అమ్యామ్యాలకే పరిమితం కావడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కఠినంగా వ్యవహరిస్తామని ఎలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే 104 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని, ముడి సరుకు అమ్మే వ్యాపారులను కూడా హెచ్చరించామని ఏఎస్‌పీ గౌతమిశాలి తెలిపారు. పదేళ్లలో ఇలాంటి సంఘటనలు, దీనికి బాధ్యులను గుర్తించామని, రోజూ గ్రామాల్లో, పలు ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా సమాచారం సేకరించి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఏఎస్‌పీ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
బాణసంచా తయారీ, అమ్మకాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం జరిగాక ఎవరినో నిందించే బదులు మనం కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలి. సంబరాల మాట అటుంచితే ప్రమాదం జరిగితే అందరం విషాదంలో గడపాల్సి వస్తుంది. చీకటి బతుకులు అయి పోతాయి. – ఆకుల దామోదరరావు,
లోక్‌సత్తా నాయకుడు, బొబ్బిలి.
చర్యలు చేపడుతున్నాం..
ఇప్పటికే అవేర్‌నెస్ క్యాంపులు పెడుతున్నాం. నిఘా మరింత పెంచుతున్నాం. బాణసంచా తయారీదారులు బాడంగి, బలిజిపేటలో ఇద్దరు ఉన్నారు. వారిని పిలిపించి అనధికారికంగా ఎలాంటి తయారీ వద్దని హెచ్చరించాం. ముడి సరుకు అమ్మకందారులను గుర్తించి వారిని హెచ్చరించాం. ప్రజలు ఎవరైనా 08944–254333 నంబర్‌కు తమ వివరాలు చెప్పకుండా ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయొచ్చు. నిరంతర నిఘా పెట్టి చర్యలు తీçసుకుంటాం. – గౌతమిశాలి, ఏఎస్‌పీ, బొబ్బిలి.
Comments
Please login to add a commentAdd a comment