సాక్షి,సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎన్నికల సందడి మొదలైందంటే చాలు.. గ్రామాల్లో మైకులు హోరెత్తుతుంటాయి. మీ ఓటు మాకే అంటూ పాటల రూపంలో, అనుకరణల మధ్య పార్టీల పేరుతో ఊదరగొట్టడం సర్వసాధారణం. ప్రచార సాధనాల మోత చెవుల్లో మార్మోగుతుంది. హద్దులు మీరిన శబ్ధాలతో తలబొప్పి కడుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా డీజే శబ్ధాలతో విపరీత ధోరణికి పోవడంతో కొంత సమస్యగా మారుతుంది. చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. శబ్ధం పెరిగిందా.. కేసులు నమోదు కావాల్సిందే.
ఈసారి ఎన్నికల్లో అతి శబ్ధంతో ఊదరగొడితే కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు, ఆయన తరపున ప్రచారం చేసే వారు జాగ్రత్త పడాల్సిందే మరి. ఏ ప్రాంతంలో ఎంత శబ్ధం వినియోగించాలో.. ఎన్ని డెసిబుల్స్ ఉండాలో పర్యావరణ చట్టానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు.
- నివాస ప్రాంతాల్లో 45-55 డెసిబుల్స్ మాత్రమే వినియోగించాలి.
- వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల సమీపంలో 40-50 డెసిబుల్స్ .
- వ్యాపార ప్రాంతాల్లో 55-65 డెసిబుల్స్ .
- పారిశ్రామిక ప్రాంతాల్లో 70-75 డెసిబుల్స్ లోపు వినియోగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment