బద్ధకమో.. నిర్లక్ష్యమో? | People Careless In Voting In Nizamabad | Sakshi
Sakshi News home page

బద్ధకమో.. నిర్లక్ష్యమో?

Published Mon, Dec 10 2018 11:49 AM | Last Updated on Mon, Dec 10 2018 11:50 AM

People Careless In Voting In Nizamabad - Sakshi

పోలింగ్‌ శాతం పెరిగిందని అంతా సంతోషపడుతున్నారు.. ఓటర్లలో మార్పు వచ్చిందని మస్తు ఖుష్‌ అవుతున్నారు.. కానీ, ఓటర్లలో మార్పు రాలేదు. పోలింగ్‌ శాతం పెద్దగా పెరగలేదు. గతంతో పోల్చితే 1.69 శాతమే ఓటింగ్‌ పెరిగింది. శుక్రవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 73.81 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 72.12 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ స్టేషన్‌ వరకు వెళ్లి వరుసలో నిలబడి ఏం ఓటేస్తాంలే అని ఊరుకున్నారో.. ఓటేస్తే ఏం ఒరుగుతుందని భావించారో.. కానీ జిల్లాలో ఏకంగా 2,85,281 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.

 సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 11,99, 985 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 9,14, 704 మంది తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. మిగతా 2,85,281 మంది ఓటు వే సేందుకు ముందుకు రాలేదు. బద్ధకమో.. నిర్లక్ష్యమో మరే కారణమో కానీ 2.85 లక్షల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఓటర్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో పట్టణ వాసుల కంటే పల్లె ప్రజలే మేలు.. అందులోనూ మహిళలే ఎక్కువగా ఓటు వేయడం విశేషం.
జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, బాన్సువాడ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో మేజర్‌ పంచాయతీలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కానీ, ఆయా పట్టణాల్లో పెద్దగా పోలింగ్‌ నమోదు కాలేదు.

ఫలించని ఈసీ ప్రయత్నాలు 

జిల్లాలో విద్యావంతులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువ మంది పోలింగ్‌కు దూరంగా ఉంటుండడంపై ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టి సారించింది. 90 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా చూడాలన్న లక్ష్యంతో ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నో చర్యలు తీసుకుంది. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. కళాబృందాలను రంగంలోకి దింపింది. మైకుల ద్వారా సైతం ప్రచారం చేపట్టింది. ఇంటింటికీ అధికారులే వెళ్లి పోల్‌ చీటీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. అయినా బద్ధకస్తులు కదల్లేదు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేదు. ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో పోలింగ్‌ శాతం 1.69 శాతానికి మించి పెరగలేదు.

 అర్బన్‌లో పోలింగ్‌ పెరిగినా అత్యల్పమే! 

మిగతా నియోజకవర్గాల కంటే నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనే అత్యల్పంగా 60.95 శాతం పోలింగ్‌ నమోదైంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 39 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 43 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో అర్బన్‌లో 52.02 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈసారి 8 శాతం పెరగడం గమనార్హం. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడం అధికారులకు సంతృప్తి కలిగించే అంశం. 

గ్రామాల్లోనే చైతన్యం 

పట్టణ ప్రాంతాల్లోని వారు పోలింగ్‌కు దూరంగా ఉండగా.. గ్రామీణులు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకొచ్చారు. ఓటు వేయడానికి ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. ఏ పోలింగ్‌ కేంద్రం వద్ద చూసినా భారీ క్యూ కనిపించింది. బాన్సువాడలో అత్యధికంగా 83.66 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 60.95 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాల్కొండలో 79.14 శాతం, నిజామాబాద్‌ రూరల్‌లో 78.70, ఆర్మూర్‌లో 72.15, బోధన్‌లో 68.23 శాతం మేర ఓటింగ్‌ నమోదైంది. 

మహిళలే నయం.. 

  • ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వారిదే పైచేయిగా ఉంది. జిల్లాలో మొత్తం మహిళా ఓటర్లు 6,28,095 మంది ఉంటే, 5,02,528 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 5,71,794 మంది ఉంటే, 4,12,174 మంది ఓటేశారు. మిగతా 1,59,620 మంది పోలింగ్‌ కేంద్రాల ముఖమే చూడలేదు.
  • ఆర్మూర్‌ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1,77,446 ఉండగా 1,35,583 మంది ఓట్లు వేశారు. 41,863 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటేసిన వారిలో మహిళలే అధికం గా ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 94,052 ఉం డగా, 77030 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 83,388 ఉండగా, 58,552 మంది మాత్రమే ఓట్లు వేశారు. 
  • బోధన్‌లో 1,95,206 మంది ఓటర్లు ఉండగా 1,58,217 మంది ఓట్లు వేయగా, 36,989 మంది ఓట్లు వేయలేదు. పురుషుల ఓట్లు 94,672 ఉండగా 75,003 ఓట్లు వేశారు. మహిళా ఓటర్లు 1,00,523మందికి గాను  83,213 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • బాన్సువాడ నియోజకవర్గంలో 1,73,230 ఓటర్లకు గాను 1,45,132 మంది ఓట్లు వేశారు. 28,098 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 83,578 కాగా, 69,533 మంది ఓట్లు వేశారు. మహిళా ఓటర్లు 89,638 మందికి గాను 75,599 మంది ఓట్లు వేయడం విశేషం. 
  •  నిజామాబాద్‌అర్బన్‌లో 2,41,438 మంది ఓటర్లకు గాను 1,49,326 ఓట్లు పోల్‌ అయ్యా యి. 92,112 మంది ఓటేసేందుకు సుముఖత చూపలేదు. ఇక్కడ పురుష ఓటర్ల సంఖ్య 1, 18,786 కాగా 73,874 మంది ఓటేశారు. మ హిళా ఓటర్లు 1,22,606 మంది ఉండగా, 75, 452 మంది ఓటు వేశారు. ఇతరుల ఓటర్లు 46 ఉండగా ఒక్కటి కూడా పోల్‌ కాలేదు.
  •  నిజామాబాద్‌రూరల్‌లో 2,18,423 మంది ఓటర్లకు గాను 1,72,218 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 46205 మంది పోలింగ్‌ కేంద్రాల ముఖమే చూడలేదు. ఇక్కడ పురుష ఓట్లు 1,02,051 మందికి ఉండగా, కేవలం 71,870 మంది మాత్రమే ఓటేశారు. మహిళ ఓట్లు 1,16,361 ఉండగా, 1,00,348 ఓట్లు నమోదు కావడం విశేషం. 
  • బాల్కొండ నియోజకవర్గంలో 1,94,242 మంది ఓటర్లకు గాను 1,54,228 ఓట్లు నమోదయ్యాయి. 40,014 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుష ఓట్ల సంఖ్య 89,319 ఉండగా, 63,342 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,04,915 మహిళా ఓటర్లు ఉంటే, 90,886 మంది ఓటు వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement