క్వారంటైన్ నిబంధనలు: టీ సర్కార్‌ కీలక నిర్ణయం | Telangana Government Relaxation For Quarantine Stipulation On Foreign Returnees | Sakshi
Sakshi News home page

క్వారంటైన్ నిబంధనలు: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Published Sat, Aug 29 2020 5:52 PM | Last Updated on Sat, Aug 29 2020 7:19 PM

Telangana Government Relaxation For Quarantine Stipulation On Foreign Returnees - Sakshi

సాక్షి, హైదరాబాద్: వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇకపై హైదరాబాద్‌కు వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పేర్కొన్న నిబంధనలకు లోబడి ఇప్పుడు సరాసరి తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులకు పలు సడలింపులు ఇచ్చారు. 

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇచ్చిన సడలింపులు 

  • 4 రోజుల్లోపు రిటర్న్ టిక్కెట్లతో వ్యాపానిమిత్తం తెలంగాణకు వచ్చే ప్రయాణీకులు, వారు బయలుదేరడానికి ముందు 96 గంటలలోపు నిర్వహించిన నెగటివ్ RT-PCR పరీక్ష నివేదికను చూపిస్తే వారికి ఎలాంటి క్వారంటైన్ ఉండదు. 
  • బయలుదేరడానికి 96 గంటల ముందు నిర్వహించిన నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టుతో ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. 
  • నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తూ, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులలోని కొన్ని విభాగాలకు సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వీరు కేవలం 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలి. వీరిలో గర్భిణులు, 10 లేదా అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణిస్తున్న వాళ్లు లేదా వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు ఉన్నారు.  
  • అయితే నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) మిగతా ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా 7 రోజుల సంస్థాగత క్వారంటైన్, దాని తర్వాత హోం క్వారంటైన్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.  

ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఎయిర్ బబుల్ ఒప్పందాల’ ద్వారా యూకే, యూఏఈ దేశాలతో కనెక్ట్ అయి ఉంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ హైదరాబాద్, లండన్‌ల మధ్య వారానికి నాలుగు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్- యూఏఈల మధ్య నడిచే ఇతర ఎయిర్‌లైన్స్– ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్‌లు కూడా త్వరలో తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి ‘వందే భారత్ మిషన్’ కింద ఛార్టర్ విమానాలు (వీటిలో ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి), ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా (నిబంధనలకు లోబడి) వస్తున్నాయి. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన 55,000 మందికి పైగా భారతీయులు నగరానికి రాగా, 10,000 మందికి పైగా వివిధ దేశాలకు చెందిన వారు హైదరాబాద్ నుంచి తమ దేశాలకు తరలి వెళ్లారు.  

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌ను పూర్తిగా శానిటైజ్ చేసి, అక్కడ థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారు. విమానం దిగే ప్రయాణికులు, వైమానిక సిబ్బందిని విమానం నుంచి 20-25 మందిని ఒక బృందంగా తీసుకువస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తి చేయడానికి ముందు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం, ప్రతి ప్రయాణికుడు/వైమానిక సిబ్బందిని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎయిరోబ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ చేస్తున్నారు. ప్రతి ఇమిగ్రేషన్ కౌంటరు వద్ద ప్రయాణికులు, ఇమిగ్రేషన్ అధికారులు ఒకరినొకరు తాకకుండా ఉండేందుకు గాజు అద్దాలను బిగిందారు. ప్రతి బ్యాగేజీని బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానం చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. పూర్తిగా శానిటైజ్ చేసిన ట్రాలీలను ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement