కర్ఫ్యూ పెడితేనే దారికొస్తారా? | Corona Virus: Lockdown Terms Violations from morning to night in Telangana | Sakshi
Sakshi News home page

కర్ఫ్యూ పెడితేనే దారికొస్తారా?

Published Tue, Mar 24 2020 2:23 AM | Last Updated on Tue, Mar 24 2020 1:53 PM

Corona Virus: Lockdown Terms Violations from morning to night in Telangana - Sakshi

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూర్‌ వద్ద వాహనాల రద్దీ

మార్చి 22, ఆదివారం: 
జనతా కర్ఫ్యూ..హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో జనం ఇళ్లకే పరిమితం... వెతికితే కానీ రోడ్లపై కనిపించనంతగా జనం.. కోవిడ్‌ బాధితుల చికిత్సలో నిమగ్నమైన వైద్యులు, పోలీసులు, ఆపత్కాలంలో జనం కోసం కష్టపడుతున్నవారికి సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లతో సంఘీభావం..ఈ క్రమశిక్షణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నుంచి తెలంగాణకు అభినందనలు. 

మార్చి 23, సోమవారం: 
లాక్‌డౌన్‌ అమలు.. సాధారణ రోజులను తలపిస్తూ గుంపులుగా రోడ్లపై జనం. ఆటోల పరుగులు, ఒక్కో బైక్‌పై ముగ్గురి ప్రయాణం.. పని లేకున్నా రోడ్లపైకి వచ్చి హల్‌చల్‌.. పాన్‌షాపులు, వైన్స్‌లో దొడ్డిదారి విక్రయాలు. ట్రాఫిక్‌ జామ్‌లు.. గుంపులుగా జనం ముచ్చట్లు... 
– సాక్షి, హైదరాబాద్‌

కోవిడ్‌ వ్యాప్తిని కట్టడిచేసే క్రమంలో ప్రభుత్వం వరుసగా రెండ్రోజుల్లో ఇచ్చిన ఆదేశాలివి. కానీ వాటి అమలులో మాత్రం పొంతన లేని ఫలితాలు కనిపించాయి. రెండింటి లక్ష్యం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలనేది. కానీ, ఆదివారం జనం కనబరిచిన స్ఫూర్తిని సోమవారం గాలికొదిలేశారు. కారణం.. మొదటిది– ‘కర్ఫ్యూ’. రెండోది– స్వచ్ఛందం. అందుకే కర్ఫ్యూ పెడితే తప్ప జనం మారేలా కనిపించట్లేదు. ఇళ్లకు పరిమితం కావటం మినహా, కోవిడ్‌ వ్యాప్తి నిరోధానికి మరో మార్గం లేని తరుణంలో ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌ అపహాస్యమైంది.  

కోవిడ్‌ ఎప్పుడెలా పంజా విసురుతుందోనన్న భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో వారం క్రితం పాజిటివ్‌ కేసుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌లో ఉండగా, ఇప్పుడు 33కి చేరింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గట్టి చర్యలకు ఉపక్రమించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూకు ఆదేశించగా, దాన్ని 24 గంటలపాటు నిర్వహించేలా సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సోమవారం నుంచి పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు మూసేసి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల మూసివేత బాగానే అమలైనా, జనం ఇళ్లకే పరిమితం కావాలన్న ఆదేశం ఎక్కడా అమలు కాలేదు. ప్రభుత్వం మాటలను పెడచెవిన పెడుతూ ఉదయం నుంచే జనం పెద్దసంఖ్యలో రోడ్లపైకి చేరారు. కొన్ని దుకాణాలు మూతపడటం, ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు తిరగకపోవడం మినహా మిగతా నిబంధనలన్నీ యథేచ్ఛగా ఉల్లంఘనకు గురయ్యాయి. 

అసలు అవగాహన ఉందా? 
కోవిడ్‌పై చాలామందిలో అవగాహన ఉన్నట్టే లేదు. ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోకి గత వారంపది రోజుల్లో 20 వేల మంది వచ్చారు. వీరి నుంచే క్రమంగా కొందరు వైరస్‌ బారినపడి గాంధీలో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ సోకుతోందంటూ ప్రచారం జరగటంతో జనం ఇప్పటికీ దాన్నే నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. తాము విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లం కాదనే ధీమాతో జనం రోడ్డెక్కుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి రెండో దశకి చేరుకుందన్నది నిపుణుల మాట. అయితే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా స్థానికులకూ సోకటం మొదలైంది. దీనిపై జనానికి అవగాహన తక్కువగా ఉందని స్పష్టమవుతోంది. కోవిడ్‌ లక్షణాలు ఎవరికి ఉన్నాయో.. లేవో వెంటనే గుర్తించే వీలు లేదు. దీంతో వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీన్ని కనీసం 20 శాతం మంది కూడా పాటించట్లేదు. సోమవారం షేర్‌ ఆటోల్లో పది మంది వరకు కూర్చుని ప్రయాణించిన దృశ్యాలు చాలాచోట్ల కనిపించాయి. షేక్‌హ్యాండ్లు, ఆలింగనాలు, సామూహిక ప్రార్థనలు షరా మామూలయ్యాయి.  

పోలీసులనూ పట్టించుకోలేదు.. 
లాక్‌డౌన్‌ను జనం సరిగా పట్టించుకోవటం లేదన్న ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం డీజీపీ మహేందర్‌రెడ్డి.. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆ మేరకు స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలు కనిపించాయి. కానీ పోలీసుల సూచనలను కూడా జనం పట్టించుకోలేదు. కర్ఫ్యూ తరహా నిర్బంధ అమలు లేకపోవటంతో పోలీసులు కూడా సూచనలు చేయటం తప్ప ఏమీ చేయలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఆటోలను సీజ్‌ చేయటంతో ప్రధాన రోడ్లపై జనసంచారం కాస్త తగ్గినా, బస్తీల్లో మాత్రం పరిస్థితి అదుపు తప్పింది. లాక్‌డౌన్‌ను అపహాస్యం చేసి జనం గుంపులుగా రోడ్లపైనే తిరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌కు బదులు కర్ఫ్యూను అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేదంటే ఇటలీ తరహా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనీ అంటున్నారు.  

పాతబస్తీలో మరీ అధికం
పాతబస్తీలోని చాలా ప్రాం తాల్లో సోమవారం లాక్‌డౌన్‌ నామమాత్రంగానే కనిపించింది. పాన్‌ దుకాణాల ముందు యువకులు పెద్దసంఖ్యలో గుమికూడి కనిపించారు. షేర్‌ఆటోలు యథేచ్ఛగా తిరిగాయి. అత్యవసర సరుకులు కొనే ఉద్దేశంతో ఎక్కువ మంది రోడ్లపైకి వచ్చారు. ద్విచక్రవాహనాలపై ముగ్గురేసి ప్రయాణించారు. ఆదివారం జనతాకర్ఫ్యూ సందర్భంలోనూ పాతబస్తీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. ప్రార్థనలు ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న ఆదేశాలనూ పట్టించుకోలేదు.

లాక్‌డౌన్‌ కేసులు రెండు వేలు
జనం సోమవారం లాక్‌డౌన్‌ను ఆషామాషీగా తీసుకున్న క్రమంలో, ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897 ప్రకారం.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారితో పాటు, క్వారంటైన్‌ నిబంధనలు పాటించని దాదాపు 2,000 మందిపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 950కి పైగా నమోదయ్యాయి. ఇలాగే ఉంటే పరిస్థితి చేజారే ప్రమాదం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించే అవకాశం లేకపోలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దని, కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సోమవారం నిబంధనలు పాటించకుండా బయటికొచ్చిన ప్రజలకు నమస్కారాలు పెట్టి, గులాబీలు ఇచ్చి పోలీసులు వివిధ పద్ధతుల్లో నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. విననివారిపై కేసులు నమోదు చేశారు.

చార్మినార్‌లో డీజీపీ పర్యటన
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసు బందోబస్తును పరిశీలించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద ఆయన హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌తో కలిసి పర్యటించారు. చార్మినార్‌ ఠాణాలోని సిబ్బందితో సమావేశమయ్యారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సలహా, సూచనలు ఇచ్చారు. పౌరులు నిబంధనలు ఉల్లం ఘించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చార్మినార్‌ వద్ద డీజీపీ మహేందర్‌రెడ్డి,సీపీ అంజనీకుమార్‌ 

ఉల్లంఘిస్తే బుక్కవుతారు
కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తీసుకుంటారు. 
ప్రాణాంతక వ్యాధికి గురైన వారు ఇతరులకు ఆ వ్యాధిని వ్యాప్తి చేసినట్టు తేలితే, ఐపీసీ సెక్షన్‌ 269, 270 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. వీటి కింద 6 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష పడుతుంది. 
విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌ నిబంధనలను పాటించని వారిపై ఐపీసీ 271 ప్రకారం.. కేసు నమోదు చేసే వీలుంది. 
కోవిడ్‌పై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తే సెక్షన్‌ 54 ప్రకారం కేసులు నమోదు చేసి తక్షణమే రిమాండ్‌ చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement