సాక్షి, సిద్దిపేట: ఇప్పటివరకు సేఫ్ జోన్‌గా ఉన్న సిద్దిపేటలో కరోనా కలకలం మొదలైంది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే అనేక మంది జిల్లాకు రావడం, దానికి తోడు హైదరాబాద్‌కు సమీపంలో జిల్లా ఉండటంతో కరోనా ముప్పు మరింతగా పొంచి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 11 కేసులు నమోదు కాగా.. వందలాది మంది నుంచి శాంపుల్స్ తీసి పరీక్షించారు. ఇదిలా ఉండగా జిల్లాలో వివిధ కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతుండటం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, జిల్లాలోని పలువురు రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు హైదరాబాద్‌కు తరచూ వెళ్లి రావడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కలవడంతో జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఎక్కడి నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియక జిల్లా ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయంతో వణుకుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో అంతా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఇప్పుడు భయం మొదలైంది.
కలెక్టర్ సహా పలువురు సెల్ఫ్ క్వారంటైన్
భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా కలెక్టర్ సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. అక్కడి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటన విడుదల చేశారు. అలాగే పలువురు అధికారులు కూడా ఇంటి నుంచే విధులు నిర్వర్తించేందుకు అనుమతి పొందినట్లు సమాచారం. వీరితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
ఎక్కడి నుంచి ఏ ప్రమాదమో..
ఇప్పటికే మహారాష్ట్రలోని సోలాపూర్, మంబై తదితర ప్రాంతాల్లో వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం వెళ్లిన జిల్లా వాసులు స్వస్థలాలకు చేరారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో మొత్తం 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వారిలో ప్రముఖ నాయకుడి వద్ద పనిచేసే పీఏ కూడా ఉన్నారు. దీంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అంతా అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కార్యాలయంలోని పలువురు అధికారులు, వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బంది, రాజకీయ నాయకులు.. ఒక్క శుక్రవారం రోజే మొత్తం 34 మంది తమ గొంతు స్రావాలను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలకు ఇచ్చారు.
మరికొందరు రాజకీయ ప్రముఖులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. జిల్లా ఆస్పత్రిలో శాంపిల్స్ ఇచ్చినవారు, హైదరాబాద్ వెళ్లిన వారికి సిద్దిపేట పట్టణంలోని అత్యధిక మందితో పరిచయాలు ఉండటంతోపాటు, రోజూ ఎక్కువ మందిని కలిసే వారు ఉండటం గమనార్హం. వీరిలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా సిద్దిపేట పట్టణంతోపాటు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఎప్పుడు.. ఏ రూపంలో ఉపద్రవం ముంచుకొస్తుందో అని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment