2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం.. | Telangana: Celebrities Goals In New Year | Sakshi
Sakshi News home page

2021లో హరీష్‌రావు ఏంచేస్తానన్నారు.. డీజీపీ టార్గెట్‌ ఏంటి..?

Published Fri, Jan 1 2021 2:34 AM | Last Updated on Fri, Jan 1 2021 9:54 AM

Telangana: Celebrities Goals In Mew Year - Sakshi

కొత్త సంవత్సరం వస్తుందనగానే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మనలో చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు.. చేస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. న్యూఇయర్‌ రిజల్యూషన్‌ పెట్టుకోవడం అన్నది పరిపాటి. వీటిని కచ్చితంగా పాటించేవాళ్లు కొందరైతే.. 31న ఒట్టు పెట్టుకుని.. ఒకటో తేదీ సరికి దాన్ని గట్టు మీద పెట్టేసేవాళ్లు మరికొందరు.. మన సంగతి అలా ఉంచితే.. నిత్యం బిజీబిజీగా గడిపే ప్రముఖులు ఈసారి ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 2021లో స్వదేశీ వస్తువులకే ‘సై’ అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సొంతూళ్లో ఇల్లు కట్టుకోవడమే ఈ ఏడాది టార్గెట్‌ అన్న కామ్రేడ్‌ ఎవరు?  హరీశ్‌రావు ఏం చేస్తానన్నారు? సీఎస్‌ ఏం రాస్తారన్నారు? ఇంతకీ కొత్త ఏడాదిలో డీజీపీ మహేందర్‌రెడ్డి టార్గెట్‌ ఏమిటి? 

లోకల్‌కేవోకల్‌..
స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లోకల్‌–వోకల్‌ నినాదం ఇచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని 2021లో  పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయించా. రోజూ ఉదయం గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. సమతుల ఆహారం నేను తీసుకుంటుంటాను. కొత్త ఏడాదిలో ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాను. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను.  
–  రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌  

ఇప్పటిదాక చదివా.. ఇక రాస్తా     
కొత్త సంవత్సరంలో బాగా పుస్తకాలు చదవడంతో పాటు పుస్తకాలు రాయడాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న. మెథడ్స్‌ ఆఫ్‌ కమ్యూనిటీ పార్టిసిపేషన్‌ పేరుతో ఇప్పటికే  రాసినా.. వాటిని గూగుల్‌లో ఎవరైనా చూడవచ్చు. ఈ ఏడాది అభివృద్ధి అనే అంశంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నా. అంతేకాదు.. ఆరోగ్యంపై మరింత ఫోకస్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యాయామం చేయడం ప్రారంభిస్తా. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  

హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌పైనే..   
శరీరం ఫిట్‌గా ఉంటే ఎలాంటి వ్యాధినైనా, విపత్తునైనా ఎదుర్కోగలుగుతాం. మానవాళిపై కరోనా వైరస్‌ విసిరిన పంజా మన ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పింది.  అందుకే, కొత్త సంవత్సరంలో హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నాతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడతా.  – డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి

రెండు మూడు ఉన్నాయి..    
నాకు రెండు, మూడు లక్ష్యాలు ఉన్నాయి. సహజసిద్ధమైన అడవులు, సుందర ప్రదేశాలతోపాటు నదుల వెంట పయనిస్తూ చేసే ప్రయాణం నాకెంతో ఇష్టం. అందుకే ప్రత్యేకమైన అటవీ, వృక్ష సంపదకు, సముద్ర జీవనానికి కేరాఫ్‌ అయిన అండమాన్, నికోబార్‌ దీవులను ఈ కొత్త సంవత్సరంలో తప్పక విజిట్‌ చేస్తాను.  ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కల్పిత సాహిత్యం మరింత ఎక్కువ చదవాలనుకుంటున్నాను.  – ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఆర్‌.శోభ 

సిక్స్‌ డేస్‌ ఏ వీక్‌..
ఈ ఏడాది తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నది నా లక్ష్యం. గతేడాది అనుకున్నా.. సాధ్యమవలేదు.. ఈసారి మాత్రం పక్కా..  శారీరక దృఢత్వంతోనే మానసిక సంకల్పం కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అంతేకాదు.. ఆత్మవిశ్వాసంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.. 
– స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్‌ సేఫ్టీ వింగ్‌ 

నేను.. నా రెహాన్‌..      
ఈ బిజీబిజీ పనుల్లో నేను గ్రహించనే లేదు.. నా కొడుకు రెహాన్‌ పెద్దవాడు అయిపోతున్నాడు. వాడికిప్పుడు 12 ఏళ్లు. ఈ కొత్త ఏడాది వాడికి బెస్ట్‌ ఫ్రెండ్‌గా మారాలని నిర్ణయించుకున్నా.. ఈ సంవత్సరం ఎలా ఉందో చూశాం. అందుకే 2021లో ఫిట్‌నెస్‌ మీద ఫోకస్‌ పెడతా. వ్యాయామానికి మరింత టైం కేటాయిస్తాను.
– సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్‌  

ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేయాలి     
2015లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత ఎల్‌ఎల్‌ఎం కోసం అడ్మిషన్‌ తీసుకున్నా. అయితే పని ఒత్తిడి నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయా. 2021లో అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతో పాటు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదును మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను.    
– రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

బోలెడు పుస్తకాలు చదవాలి      
ఇప్పటివరకు వీకెండ్‌లో ఒక పుస్తకం మాత్రమే చదివేవాడిని. 2021లో మాత్రం ప్రతీ వీకెండ్‌లో బోలెడన్ని పుస్తకాలు చదవాలని డిసైడ్‌ అయ్యా. బోలెడన్ని అంటే కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా చదవాలి. గతంలో మూడు నెలలకోసారి సెలవులపై దేశ విదేశాలకు టూర్‌ వెళ్లేవాడిని. కొత్త సంవత్సరంలో మాత్రం కనీసం రెండు నెలలకోసారి వారం రోజులపాటు సెలవులపై వెళ్లాల్సిందే.     – సన్‌షైన్‌ ఎండీ డా. గురువారెడ్డి

లాస్ట్‌ ఇయర్‌లా చేయను..  
అందరూ తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని కోవిడ్‌ పరిస్థితులు నొక్కి చెప్పాయి. నేను చాలా కాలంగా యోగా చేస్తున్నా.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల వల్ల నాలుగు నెలల నుంచి చేయడం లేదు. ఈమారు గత ఏడాదిలా కాదు.. యోగాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అలాగే ప్రాణాయామం ప్రాక్టీస్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నా.    – మంత్రి టి.హరీశ్‌రావు

ఆరోగ్యమే మహాభాగ్యం..  
ప్రజా జీవితంలో ఉండేవాళ్లు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్తూ ఉంటారు. అందుకేవ్యక్తిగత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నా. అలాగే నా జీవితంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో లెఫ్టిజమ్, రైటిజం అంటూ అనేక ఇజాలు వింటూ వచ్చాం. కానీ రాబోయే రోజుల్లో అంతా గ్రీనిజమే.  – ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ 

5 కి.మీ. వాకింగ్‌ మస్ట్‌..  
నాకు వాకింగ్‌ చేసే అలవాటు ఉంది. అయితే.. రెగ్యులర్‌గా చేయలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలా చేయను. 2021లో శరీర దారుఢ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక నడక మానే ప్రసక్తే లేదు. రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 5 కిలోమీటర్లు తగ్గకుండా నడుస్తా.. వ్యక్తిగతంగా కొత్త సంవత్సరంలో నేను నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇదే..    – టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 

మా ఊర్లో ఓ ఇల్లు  
ఈ మధ్య చలో సొంతూరు నినాదం పెరుగుతోంది. నాక్కూడా సొంతూళ్లో ఇల్లుండాలనే కోర్కె బలంగా ఉంది. అమెరికాలో వున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి.. మన పద్ధతులు చూడకుంటే.. మనతో మమేకం కాలేరు.. అందుకే మేం కూడా ఊర్లో ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం.  ఇక అభ్యుదయ సంగీతం , అన్నమయ్య కీర్తనలు , ఫ్లూట్‌ మ్యూజిక్‌ నాకిష్టం.. అవి వింటూ.. అలా మనవళ్లతో కాలక్షేపం చేయాలని ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement