సాక్షి, హైదరాబాద్: తన యూట్యూబ్ చానల్‌లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. పంజాగుట్ట కేసులో ఓ మహిళను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అన్ని రకాల హద్దులు దాటాడని అరుణ కుమారి ఆరోపించారు.(చదవండి: 139 మంది అత్యాచారం: ‘భూమి’కి న్యాయం చేయండి)
తన ఇంటర్వ్యూలో సభ్యసమాజం తలదించుకునే విధంగా బాధితురాలికి ప్రశ్నలు వేశాడని మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం ఏంటని, అతను సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గతేడాది జరిగిన ‘దిశ’ ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ మల్లన్న వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో నవీన్ సుప్రీంకోర్టుతో పాటు ‘నిర్భయ’ చట్ట నిబంధనలను అతిక్రమించాడని, అతడిపై తగినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ కిడ్నాప్.. విడుదల!
దుండిగల్: ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అనుమానాస్పద స్థితిలో కిడ్నాప్ అయ్యాడు. దుండిగల్ సీఐ వెంకటేశం తెలిపిన మేరకు..న్యూషాపూర్‌నగర్‌కు చెందిన హజ్మత్ అలీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్. మంగళవారం రాత్రి మరో యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సలీం.. అలీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే అనుమానంతో కైసర్‌నగర్ చౌరస్తా లోని బాచుపల్లి రోడ్డు వరకు ఓ ఆటోను వెంబడించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వారు అందుకు ఒప్పుకోకుండా ఆటోను మియాపూర్ వైపు పోనిచ్చారు. ఈ క్రమంలో సదరు ఆటోను బాచుపల్లి పోలీసులు కోకకోలా చౌరస్తాలో పట్టుకున్నారు.
అయితే అప్పటికే విషయం తెలుసుకున్న రేషన్ బియ్యం తరలింపు ముఠా సభ్యులు ఇన్నోవా కారులో వచ్చి సలీంను ఎత్తుకెళ్లడానికి యత్నించగా అతను తప్పించుకోవడంతో హజ్మత్ అలీని తమ వెంటకు తీసుకువెళ్లారు. దీంతో హజ్మత్ అలీ కుటుంబ సభ్యు బుధవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హజ్మత్ అలీ దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. తనను కిడ్నాపర్లు వదిలేశారని, బస్సులో ఇంటికి చేరుకున్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని పోలీసులు రేషన్ బియ్యం ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment