
సాక్షి, హైదరాబాద్ : తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేత లక్ష్మీపార్వతి సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కోటి అనే వ్యక్తిని నా బిడ్డలాగా భావించాను. కానీ అతను నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను కించపరుస్తూ విమర్శలు చేస్తున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక.. ‘ఈ నెల 4న కోటి టీవీ చానెల్స్, సోషల్ మీడియాలో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. ఇందుకు గాను కోటీతో పాటు ఆరోపణలను ప్రచారం చేసిన మీడియా చానెల్, సదరు యాంకర్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. దీని వెనక ఉన్న కుట్రను ఛేదించి నా పరువు మర్యాదలు కాపాడాలి’ అని డీజీపీని కోరినట్లు ఆమె తెలిపారు.