లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘నేను ఒక సీరియస్ జోక్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కానీ జోక్ అది. ఆయన మరణానికి కారణమైన వాళ్లే.. ఇప్పుడు ఎన్టీఆర్ కంటే గొప్ప వ్యక్తి లేరు అంటూ కీరి్తస్తున్నారు’ అని టీడీపీ మహానాడును ఉద్దేశించి సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. నాడు లక్ష్మీపార్వతితో ఉన్న ఎన్టీఆర్‌ను తిట్టిన వాళ్లే.. నేడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అతిథులు ఎన్టీఆర్ లలిత కళా అవార్డును పోసాని కృష్ణమురళికి ప్రదానం చేశారు. అనంతరం రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అనేది స్వయంగా ఎన్టీఆరే చెప్పారన్నారు. రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్లతో కూర్చున్నారంటే.. ఒకరకంగా ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తున్నట్లేనన్నారు.
నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తాతకు వెన్నుపోటు పొడిచిన వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే.. ఆయన వీళ్లందరికీ దూరంగా ఉంటున్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు. తాను ‘వ్యూహం’ సినిమా తీస్తున్నానని, అందులో చంద్రబాబు క్యారెక్టర్‌ను అరటిపండులా వలిచి చూపిస్తానని ప్రకటించారు.
లక్ష్మీపార్వతిపై బాబు పుకార్లు..
ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ఏ కులం, ఏ మతం వారితో అయినా స్నేహం చేయవచ్చు కానీ.. గుణం లేని వారితో మాత్రం చేయకూడదన్నారు. గుణం లేని వాడు చంద్రబాబు అని.. అతనికి దూరంగా ఉండటం చాలా మంచిదని సూచించారు.
తన మంచిచెడులు చూసుకునేందుకు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ఆహ్వా నించారని, కానీ ఆమెపైనా చంద్రబాబు అనేక పుకార్లు పుట్టించారని చెప్పారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడుసార్లు గుండెపోటు వచ్చినా.. లక్ష్మీపార్వతి ఒక్కరే అండగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ మళ్లీ వైఎస్సార్‌సీపీని గెలిపిస్తేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు.
బాబు కుట్రలకు ఎన్టీఆర్ కుమిలిపోయారు
తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. అడ్డదారుల్లో అధికారాన్ని లాక్కునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఎన్టీఆర్ ఎంతగానో కుమిలిపోయారని చెప్పారు. ఎన్టీఆర్‌ను అడుగడుగునా వేధింపులకు గురిచేశారని వివరించారు. ఎన్టీఆర్ కష్టకాలంలో దేవినేని నెహ్రూ అన్నీ తానై నిలిచారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తన గౌరవాన్ని నిలబెట్టిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలు ఎప్పటికీ చిరస్మరణీయమేనని అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి గొప్ప మనిషి కూడా చంద్రబాబు కుట్రకు బలయ్యారన్నారు.
దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు కన్వీనర్, వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి అవినాశ్ మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్ ఒక కులానికో, పార్టీకో పరిమితం కాదన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment