అలాంటి ప్రచారం! ప్చ్‌.. ప్రార్ధనలు చేసినా ప్రయోజనం ఉండదు.! | False Allegations By Chandrababau On YS Jagan | Sakshi
Sakshi News home page

అలాంటి ప్రచారం! ప్చ్‌.. ప్రార్ధనలు చేసినా ప్రయోజనం ఉండదు.!

Published Tue, Dec 26 2023 1:39 PM | Last Updated on Wed, Jan 24 2024 2:44 PM

False Allegations By Chandrababau On YS Jagan - Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భలే చిత్రమైన మనిషి. తను బైబిల్ చదివితే అది లోకం కోసం అని నమ్మబలుకుతారు. అదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చదివితే మతం కోసం అని దుష్ప్రచారం చేస్తారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు క్రైస్తవమతాన్ని అపహాస్యం పాలు చేసేలా ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు! ఏకంగా ఆయా పదవులలో ఉన్నవారికి మతం ఆపాదించి విమర్శలు చేశారు.

కాని మరి ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు అవసరం అయి ఉంటాయి. ఆయనే క్రిస్టమస్‌ను పురస్కరించుకుని చర్చీల చుట్టూ తిరిగారు. ఇంతవరకు తప్పు లేదు. కాని అక్కడకు వెళ్లి కూడా ఆయన దిక్కుమాలిన రాజకీయాలు, ముఖ్యమంత్రి జగన్ పై పిచ్చి ఆరోపణలు, సెంటిమెంట్‌తో కూడిన విమర్శలు చేశారు. ఆయన కంటే చిన్నవాడైన జగన్ ఎంత హుందాగా క్రిస్టమస్ సమావేశంలో పాల్గొని వ్యవహరించారు? రాజకీయాలకు అతీతంగా ఎలా మాట్లాడారు. మరి ఎంతో సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు ఏమి ప్రసంగించారు. 

✍️ఏకంగా ఏడు లక్షల కోట్ల రూపాయల విలువైన క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి ప్లాన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండగా  ఈ ఆస్తులన్నిటిని జగన్ దోపిడీ చేసేస్తారా? చెప్పేదానికి అయినా అర్ధం ఉండాలి.  నిజంగానే ఆయన అలాంటి ఆలోచలతో ఉండి ఉంటే ఈ ఐదేళ్లలో ఒక్క ఆరోపణ కూడా ఎందుకు రాలేదు?అంటే తప్పుడు ఆరోపణ చేయడం, దానిని ఈనాడు ఎల్లో మీడియా పటం కట్టి మొదటి పేజీలో అచ్చేయడం నిత్యకృత్యంగా మారింది. ఆ తర్వాత  అచ్చోసిన  ఆంబోతును  జనం మీదకు వదలినట్లు, ప్రజల మీదకు ఈ పత్రిక కాపీలను వదలడం. ఇదే పనిగా గత నాలుగేళ్లుగా సాగిస్తున్నారు.

✍️బహుశా అమరావతి  రాజధాని గ్రామాలలో  తన పార్టీవారు చేసిన భూ దోపిడి ఏమైనా చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందేమో!  క్రైస్తవ మిషనరీలవారు  విద్యాసంస్థలు, ఆస్పత్రులు, శరణాలయాలను నెలకొల్పి ప్రభుత్వం చేయని పనులను  క్రైస్తవ మిషనరీలు చేస్తుంటే, గత ప్రభుత్వాలు  వారికి గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ సాయం నిలిపివేసి ఆయా విద్యాసంస్థలను మూతపడేలా చేసి వాటి ఆస్తులను ఆక్రమించాలని చూసిందని పచ్చి అసత్యం చెప్పారు. ఏ ఆస్పత్రి స్థలాన్ని తీసుకున్నారు?ఏ విద్యా సంస్థను ఆక్రమించారు.

✍️మిషనరీలు అన్నీ హిందూమతాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తున్నాయని ఆరోపించే బీజేపీతో కలిసి పనిచేసింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీనే కదా!. బీజెపీతో సావాసం కోసం క్రైస్తవ మతస్తులను అవమానించేలా, పాస్టర్లను అనుమానించేలా ప్రసంగాలు చేసింది చంద్రబాబు, ఆయన అనుచరులే. కాని ఇప్పుడు మాత్రం మాట మార్చి మిషనరీల ఆస్తులు ఆక్రమించే యత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు.నిజానికి అలాంటి ఆరోపణలకు గురైంది టిడిపి నేతలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరులో ఎఈఎల్సి అనే క్రైస్తవ సంస్థకు చెందిన దాదాపు  ఎకరం స్థలాన్ని చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఒక నేత ఏడాదికి కేవలం లక్ష రూపాలయ లీజుకు లాగించేశారట.

✍️గుంటూరులోని ఓ కాలేజీకి చెందిన రెండు ఎకరాల స్థలాన్ని కూడా  ఏడాదికి ఏడు లక్షల లీజుకు ఒక  ఆస్పత్రికి బలవంతంగా ఇప్పించారట. విజయవాడ లో లయోలా కాలేజీకి చెందిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని చంద్రబాబు టైమ్ లో ఒక క్లబ్ కు ఇప్పించారట. ఇలా పలు అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన వెనుక ఇంత పెద్ద మచ్చ పెట్టుకుని జగన్ పై దారుణమైన ఆరోపణ చేశారు.జగన్ ఎయిడెడ్ స్కూళ్లను సంస్కరించే క్రమంలో తీసుకున్న చర్యలను తప్పుపడుతున్నారు. అదేమీ బలవంతంగా ఎవరి నుంచి తీసుకోలేదు. అయినా చంద్రబాబు , టీడీపీ మీడియా దుష్ప్రచారం చేస్తుంటాయి.శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్ చెబుతోందని చంద్రబాబు సూక్తి ముక్తావళి చెప్పారు.

✍️ మరి అసలు ఏ పదవిలో లేనప్పుడు  జగన్ పై కక్ష కట్టి సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు  తప్పుడు కేసులు ఎలా పెట్టించారు? నిత్యం జగన్ పై తప్పుడు ప్రచారం ఎలా చేశారు?సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు  పెట్టి ఎదుటివారిని అవమానిస్తే కూడా చర్య తీసుకోకూడదని చెబుతున్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎర్రబుక్ అంటూ ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు? అందరి అంతు చూస్తామని ఎలా  బెదిరిస్తున్నారు?ఎన్నికలు   లేకపోతే  క్రైస్తవమతం గురించి ఈయనకు పడుతుందా!. ఎన్నికలు రాగానే క్రీస్తు, బైబిల్, పాస్టర్ లకు భృతి,చర్చిల మరమ్మతులకు నిధులు  మొదలైనవి గుర్తుకు వస్తాయి. అవే జగన్ ప్రభుత్వం చేస్తే ఇదే టీడీపీ తప్పు పడుతుంది. జగన్ ను సమర్ధిస్తే దేవుడి సందేశాన్ని అపహాస్యం చేసినట్లే అని ఆయన ఎంత దారుణంగా వ్యాఖ్యానించారు! జగన్ అమలు చేస్తున్న స్కీములను ఎదుర్కోలేక, ప్రజలలో జగన్ పట్టు తగ్గించడం ఎలాగో తెలియక ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

✍️అంటే దేవుడి సందేశం ప్రకారమే గత ఎన్నికలలో  టీడీపీని ప్రజలు ఓడించారని చంద్రబాబు ఒప్పుకుంటారా? ఇంత వయస్సు వచ్చాక కూడా చంద్రబాబులో అసూయ, ద్వేషం వంటివి పోలేదనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరమా?  దైవ సందేశం అంటే  ఇలా మాట్లాడడమా!చంద్రబాబు కన్నా అధిక అసూయతో రగిలిపోతున్న రామోజీరావు ఇంతకన్నా నీచంగా జగన్ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఇంకో సంగతి ఏమిటంటే గతంలో ఎన్నడూ సందర్శించని గుణదల మేరీమాత ఆలయానికి కూడా చంద్రబాబు వెళ్లారట. ఓట్ల కోసం ఎక్కడికైనా ఈయన వెళతారు. మరో వైపు ఇంటిలో యాగం కూడా చేస్తున్నారట.  మనిషి లో మార్పు రాకుండా ఎన్ని ఆలయాలు, చర్చీలు, మసీదులకు వెళ్లితే,ఎన్ని యాగాలు, ప్రార్ధనలు చేస్తే  మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది?. 


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement