కచ్చితంగా ఒక మాట చెపొచ్చు. ఏపీలో ఈసారి ఎన్నికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పే వాస్తవాలకు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిత్యం పలికే అసత్యాలకు మధ్య జరగబోతున్నాయి. అసత్యాలది ఎప్పటికీ పై చేయి కాదని తెలిసినా, అబద్దాలతో విష ప్రచారపు దాడిని తీవ్రం చేయాలని విపక్షంతో పాటు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. సీఎం జగన్ భీమవరంలో జరిగిన సభలో విసిరిన సవాళ్లకు చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని నేరుగా జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఒకే రోజు ఇటు భీమవరం సభ, అటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఆయా చోట్ల ప్రసంగాలు చేసిన సభలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు. వీటన్నిటిని జాగ్రత్తగా విశ్లేషిస్తే జగన్ అడిగే వాటికి ఈ ఇద్దరు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది గత మూడు, నాలుగు ఏళ్లుగా సాగుతున్నదే. అయినా ఈ దఫా జగన్ మరింత స్పష్టతతో చంద్రబాబు, పవన్ లకు సవాల్ విసిరారు. సీఎం జగన్ చెప్పిన వాస్తవాలు ఏమిటో చూద్దాం.
✍️కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా తాను చేసిన అభివృద్ది పనులు చూపిస్తానని సీఎం జగన్ చాలెంజ్ చేశారు. దీని ఒక్కదానికి చంద్రబాబు ఒప్పుకోగలిగితే చాలు. ఆయనలో నిజాయితీ ఏమిటో తెలిసిపోతుంది. కాని చంద్రబాబు అంగీకరించరన్నది పచ్చి నిజం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోను పలు అభివృద్ది పనులు జరిగాయి. కుప్పం లో సైతం నేను స్వయంగా చూసి వచ్చాను. చంద్రబాబు కుప్పం కు ముప్పై ఐదేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుప్పం సెంటర్ లోనే ఒక ప్రభుత్వ స్కూల్ ఉంటుంది. అది అద్వాన్నంగా ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నాడు-నేడు కింద చేర్చి బాగు చేయించారు.దీనిని చంద్రబాబు కాదనగలరా?
✍️కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, మున్సిపాల్టీలోని ప్రతి వార్డులో సచివాలయాలు ఉన్నాయా?లేవా? వాటికి ఆయా చోట్ల భవనాలు నిర్మించారా?లేదా? గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా?లేవా?గ్రామ క్లినిక్ లు ఉన్నాయా?లేదా?వలంటీర్ల ద్వారా కుప్పం ప్రాంత వృద్దులందరికి ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్ ఇంటికి పంపుతున్నారా?లేదా? ఇళ్లకు రేషన్ సరుకులు వస్తున్నాయా?లేదా? కుప్పంలోని వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా?లేదా?వాటిలో పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోందా?లేదా?ఇవే కాదు.కుప్పం కు తాగు నీటిని ఇవ్వడం కోసం సీఎం జగన్ నిధులు మంజూరు చేశారా?లేదా? నవరత్నాల కింద కుప్పం నియోజకవర్గంలోనే సుమారు రెండువేల కోట్ల రూపాయల మేర ప్రజలకు ఆర్దికసాయం అందిందా?లేదా?వీటిలో చంద్రబాబు దేనిని కాదనగలరు?ఇదే పరిస్థితి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఉన్నమాట పచ్చి నిజం.
✍️ మనసున్నవారు ఎవరైనా జగన్ చెప్పినవాటిని కాదనగలరా?అందుకే ఆయన సవాళ్లను చంద్రబాబు, పవన్ స్వీకరించలేరు.కుప్పం గురించి మరో మాట చెప్పాలి. ఈ మధ్య నేను జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందులతో పాటు కుప్పం కూడా చూసి వచ్చాను. పులివెందుల చుట్టూరా బ్రహ్మాండమైన రింగ్ రోడ్డు, ఊళ్లో సైతం మంచి రోడ్డు కనిపించాయి. పులివెందులలో అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. పరిశ్రమలను తెచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ మధ్యనే ఆదిత్య బిర్లాకు చెందిన పరిశ్రమను జగన్ స్వయంగా సందర్శించి వచ్చారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ, త్రిబుల్ ఐటి ,వెటర్నరీ కాలేజీ ఇలా పలు సంస్థలు కనిపిస్తాయి. అదే కుప్పం వెళితే అక్కడ కొన్ని వార్డులకు రోడ్లు కూడా లేవు. మరి ఏడుసార్లు గెలిచిన కుప్పంలో ఆయన రోడ్లు ఎందుకు వేయించలేకపోయారో తెలియదు. బస్టాండ్ కూడా నిర్మించలేదు.
✍️ కుప్పం రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినా చంద్రబాబు దానిని పూర్తి చేయలేదు. బహుశా ఎన్ టి ఆర్ టైమ్ లో వచ్చిన ద్రవిడ యూనివర్శిటీ తప్ప చెప్పుకోదగిన ప్రభుత్వ సంస్థ లేదు. ప్రైవేటు రంగంలో ఒక మెడికల్ కాలేజీ ఉంది.కుప్పం ను ఈసారి గెలిస్తే అంతర్జాతీయ పటంలో పెడతానని,వంద కోట్ల తో విమానాశ్రయం కడతానని ఆయన తన ప్రసంగాలలో చెప్పారు.తన పద్నాలుగేళ్లపాలనలో కుప్పం ను మున్సిపాల్టీగా కూడా చేయని చంద్రబాబు, ఆర్డిఓ సెంటర్ చేయని చంద్రబాబు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో పెడతానంటే నమ్ముతారా?కుప్పం ను మున్సిపాల్టీ చేస్తుంటే అడ్డుకోబోయింది చంద్రబాబు కాదా!ఆయన కోరిన వెంటనే జగన్ ఆర్డిఓ కార్యాలయం ఏర్పాటు చేయలేదా? వంద కోట్లతో ఎయిర్ పోర్టు ఎలా అవుతుందో తెలియదు. అక్కడి నుంచి రైతుల కూరగాయల ఉత్పత్తులను ఎగుమతి చేస్తారట.
✍️ ఈ పని తను ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఎందుకు చేయలేకపోయారో చెప్పరు. ఆయనకు అంతర్జాతీయం, అంతా నేనే చేశా..అన్నవి ఊతపదాలు. దేనికైనా అంతా నాదే అనడం ద్వారా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుంటారు. కాని ప్రజలకు వాస్తవాలు తెలియని రోజులా ఇవి!గతంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ పేరుతో విఫల వ్యవసాయం చేసిన చంద్రబాబు మళ్లీ ఆ పాట ఎత్తుకున్నారు.కాని 2014-19 మధ్య ఎందుకు మర్చిపోయారో చెప్పాలి? జగన్ వస్తే భూములు లాక్కుంటారని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. అది ఎక్కడైనా జరుగుతుందా? జగన్ ప్రజలకు మరింత సదుపాయంగా ఉండడానికి, లావాదేవీలు సులువుగా సాగడానికి వీలుగా భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు తెస్తే దానిని వక్రీకరించి చంద్రబాబుతో పాటు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.
✍️ తద్వారా ప్రజలలో అనుమానాలు రేకెత్తించాలన్నదే వారి లక్ష్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు నిత్యం రాసే అబద్దాల మీద ఆధారపడి టిడిపి, జనసేన లు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకాలం ఎపిలో నేరాలు పెరిగిపోయాయని వీరు తప్పుడు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఎపిలో నేరాలు గత ఏడాది కన్నా బాగా తగ్గాయి. అదే టైమ్ లో తెలంగాణలో నేరాలు గణనీయంగా పెరిగాయి.ఇంకో మాట చెప్పాలి. తెలంగాణలో ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ బాగా తగ్గింది. దాంతో కొంతమంది వ్యాపారులు ఏపీ వైపు చూస్తున్నారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి కొత్త భాష్యం చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి. ఇక్కడ జగన్ ప్రభుత్వం ఓడే అవకాశం ఉందని భావించి రియల్ ఎస్టేట్ వారు భూములు కొంటున్నారని తప్పుడు ప్రచారం చేశారు.
✍️ ఒక్కసారి ఈ ఏడాదికాలంలో కాని, గత సంవత్సరం కాని ఏపీలో జరిగిన భూముల అమ్మకాల లావాదేవీలను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ లు తగ్గలేదు. తద్వారా వచ్చే ఆదాయం తగ్గలేదు. అయినా ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తుంటుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో మాంద్యం పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల అని రాసే దమ్ము ఈ ఎల్లో మీడియాకు ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అక్కడ ఫార్మాసిటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు కంపెనీలు ఇప్పటికే అక్కడ భూములు తీసుకున్నా, ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఫార్మాసిటీ బదులు మెగాసిటీ నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాంటి పనే ఏపీలో జరిగి ఉంటే ఇదే ఎల్లో మీడియా నానా రచ్చ చేసి ఉండేది.
✍️అంతెందుకు అమరావతిలో ఏభైఐదు వేల ఎకరాలలో రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేయలేమని, ప్రాంతీయ అసమానతలు వస్తాయని ,అందుకే మూడు రాజధానులు విధానాన్ని తీసుకువస్తుంటే ఈ శక్తులు ఎలా అడ్డుపడుతున్నాయో చూస్తున్నాం. విశాఖ అయితే హైదరాబాద్ కు పోటీగా తయారవుతుందన్నది జగన్ ఉద్దేశం అయితే,దానిని ఎలా చెడగొట్టాలన్నదే ఎల్లోగ్యాంగ్ ప్రయత్నం అన్న సంగతి తెలిసిందే. భీమవరం సభలో సీఎం జగన్ ఎన్నికల వేడిని బాగా పెంచారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహరాన్ని ప్రస్తావించి ఇలాంటి వారు ప్రభుత్వంలోకి వస్తే మన ఆడపిల్లలకు రక్షణ ఉంటుందా?అన్న ప్రశ్నవేశారు.అంతేకాదు. భార్యతో నాలుగేళ్లు కాపురంఏ చేయలేని వాడు చంద్రబాబుతో మాత్రం పదేళ్లు పార్టీ కార్యకర్తలు కలిసి ఉండాలని చెబుతున్నారని ఎద్దేవ చేశారు.అలాగే పవన్ కు కొత్త పేరు పెట్టారు. ప్యాకేజీ కోసం తనను నమ్ముకున్నవారిని త్యాగం చేసే త్యాగరాజు అని సీఎం జగన్ వ్యంగ్యాస్త్రం విసిరారు.
✍️ చివరిగా తనను ఓడించలేమని తెలిసే వీరంతా కలిసి తనపై దాడికి వస్తున్నారని ఆయన అన్నారు. ఇది కూడా నిజమే కదా! తెలుగుదేశం పార్టీ తాను ఒంటరిగా పోటీచేసి గెలవలేనని ఎప్పుడో చేతులెత్తేసింది. జనసేనకు ఎప్పుడూ అంత సీన్ లేదు. బీజేపీకి ఉన్నది నామమాత్రపు బలమే. తాజాగా ఈ ముగ్గురు కలవవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు జవాబులు చెప్పలేరన్నది స్పష్టమైన సత్యం. అందుకే చంద్రబాబు, పవన్ లు అచ్చంగా అబద్దాలపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలలో జగన్ ఎదుర్కోవాల్సింది చంద్రబాబు, పవన్‌ల రాజకీయ విధానాలను కాదు. వారు చెప్పే అబద్దాలనే. వారికి తబలా వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటి మీడియాల అసత్యప్రచారాన్నే.
Comments
Please login to add a commentAdd a comment