వైఎస్‌ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టు చేస్తారా?: నాగలక్ష్మి | Panja Naga Lakshmi Serious On AP Police Over False Arrest, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టు చేస్తారా?: నాగలక్ష్మి

Published Sat, Jan 18 2025 11:14 AM | Last Updated on Sat, Jan 18 2025 12:44 PM

Panja Naga Lakshmi Serious On AP Police Over False Arrest

సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ ఆటోపై వైఎస్‌ జగన్‌ ఫొటో ఉందని, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడనే కారణంతో కూటమి ఎమ్మెల్యే ఉడికిపోయారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎ‍‍స్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను అరెస్ట్‌ చేసి.. ఆటోను సీజ్‌ చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పంజా దుర్గారావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన దౌర్జన్యకాండ శుక్రవారం తణుకులో సంచలనం రేకెత్తించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ఎండగడుతున్న దుర్గారావును టార్గెట్‌ చేసిన ఎమ్మెల్యే నడిరోడ్డుపై ఒక సామాన్య ఆటో డ్రైవర్‌ అని కూడా చూడకుండా వెంటాడి వీరంగం చేసిన ఘటనను ప్రజలు చీదరించుకుంటున్నారు. బెదిరించి, ఇష్టానుసారంగా దూషించిన తర్వాత పోలీసులకు అప్పగించడం, ఆపై స్టేషన్‌లో నడిచిన హైడ్రామాపై పలువురు విమర్శిస్తున్నారు. ఉదయం 12 గంటల నుంచి తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హై డ్రామా నడిచింది. 

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గారావును స్టేషన్‌లో ఎవరూ కలవకుండా నిర్బంధించడం, వ్యవహారాన్ని గుట్టుగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన ప్రముఖులు స్టేషన్‌కు రావడం, అధికారులతో మంతనాలు జరపడం, లీగల్‌ బృందంతో సంప్రదింపులు జరపడం వెనుక భారీ కుట్రపూరిత వ్యవహారం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కుటుంబసభ్యులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఏ కేసులు నమోదు చేస్తారో, ఎక్కడికి తీసుకువెళ్తారోననే ఉత్కంఠ నడిచింది. రాత్రి 10.30 గంటలు గడిచినా దుర్గారావును స్టేషన్‌లోనే ఉంచడం, సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ చేయాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతుండటం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి.

కన్నీరుమున్నీరవుతున్న భార్య, పిల్లలు
తన భర్త దుర్గారావును చూసేందుకు తణుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్య నాగలక్ష్మి, కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా ఆడబిడ్డల రోదనలు తణుకువాసులను కదిలించాయి. తాజాగా దుర్గారవు భార్య పంజా నాగలక్ష్మి మాట్లాడుతూ..‘ఆటో నడుపుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. నిన్న నా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త ఎవరి​కి అన్యాయం చేశాడని పోలీసులు తీసుకువెళ్లారు?. ఏం పోస్టులు పెట్టాడని తీసుకువెళ్లారు?. ఆటో తీసుకెళ్లి నా భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారు. మేము మధ్యతరగతి ప్రజలం.. ఎలా బతకాలి?. మాకు వైఎస్‌ జగన్ అంటే అభిమానం. వైఎస్‌ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టులు చేస్తారా?. నా భర్తకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాధ్యుడు అవుతాడు. నా భర్తను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

విడ్డూరంగా ఆర్టీఓ తీరు
సామాన్య ఆటోడ్రైవర్‌ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్టీఓ హుటాహుటిన పోలీసుస్టేషన్‌కు రావడం, వెంటనే దుర్గారావు ఆటోను స్వాధీనం చేసుకుని నిమిషాల వ్యవధిలోనే తణుకు ఆర్టీసీ బస్‌డిపోకు తరలించడం విడ్డూరంగా మారింది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించలేదని, జిల్లా మారి హైవేపైకి ఆటో వచ్చిందని తదితర కారణాలు చూపించి రూ.3,400 జరిమానా విధించడం, రవాణా కార్యాలయం నుంచి పనిగట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ అధికారం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు చూపిస్తున్న అధికార దర్పాన్ని చూసిన తోటి ఆటోడ్రైవర్లు ముక్కున వేలేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement