Naga Lakshmi
-
భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి..
సాక్షి, దేవరపల్లి (తూర్పుగోదావరి): కట్టుకున్న భార్యను పథకం ప్రకారంహతమార్చి, గుట్టు చప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని ఊర చెరువులో పడేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతురాలి తల్లి అమరావతి కథనం ప్రకారం.. యాదవోలుకు చెందిన సూరే వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మికి, అదే గ్రామానికి చెందిన ముమ్మిడి నాగరాజుకు మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలతో పాటు కొంత సామగ్రిని ముట్టజెప్పారు. వివాహం జరిగిన కొన్నాళ్లకు భార్య నాగలక్ష్మిని నాగరాజు సూటిపోటి మాటలతో వేధించడంతో పాటు శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడం ఆరంభించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. ఇద్దరికీ పెద్దలు సయోధ్య కుదిర్చేవారు. గతంలో ఒకసారి భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. పెద్దల సమక్షంలో సర్దుబాటు చేసి, తిరిగి కాపురానికి పంపించారు. అయినప్పటికీ నాగరాజులో మార్పు రాకపోవడంతో దంపతుల మధ్య తిరిగి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి (19) కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెను ఈ నెల 27న భర్త వద్దకు పంపించారు. తెల్లవారేసరికి తన భార్య నాగలక్ష్మి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులకు నాగరాజు చెప్పాడు. ఆమె కోసం తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో, అల్లుడిపై అనుమానం ఉందంటూ శుక్రవారం రాత్రి దేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా, భార్య నాగలక్ష్మిని తానే హత్య చేసి ఊరి చెరువులో పడేసినట్టు అంగీకరించాడు. చెరువులో నాగలక్ష్మి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైందని ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. సంఘటన స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్, ఇన్చార్జి సీఐ కె.లక్ష్మణరెడ్డి పరిశీలించారు. నిందితులు నాగరాజును, అతడికి సహకరించిన మేనల్లుడు గన్నూరి సూరిబాబు, నాగరాజు తల్లి ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీహరిరావు తెలిపారు. -
విజయనగరం డిప్యూటీ మేయర్ కన్నుమూత
సాక్షి, విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి(47) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకటో డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలు పొందిన ఆమె మార్చి 18న డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాగలక్ష్మికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఆమె మృతిపై కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ ప్రసాదరావు, ఇతర విభాగాల అధికారులు సంతాపం తెలుపుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదవి చేపట్టిన అనతికాలంలోనే మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వరరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ, ఈఈ డాక్టర్ దిలీప్, కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు తమ సంతాపం తెలియజేశారు. చదవండి: మరి ఇలాగైతే కరోనా రాదా అండీ....? -
తల్లి కష్టం
ఆ తల్లి ఇల్లు కదిలి ఇరవై ఏళ్లు అయిపోతోంది. ఎక్కడకు వెళ్లినా కాసేపట్లోనే ఇంటికి చేరుకోవాలి. ఇంట్లో ఇద్దరు కూతుళ్లున్నారు. కదల్లేరు. మెదల్లేరు. తల్లి రెక్కల బలం మీదే లేచి కూచుంటూ ఉంటారు. మనిషిని జీవచ్ఛవం చేసే కండరాల వ్యాధి ఒకరికి వస్తేనే తట్టుకోవడం కష్టం. ఆ ఇంట ఇద్దరు తోబుట్టువులకు వచ్చింది. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కాని తోడు సమాజం ఉందన్న ఆశే వారిని పోరాడేలా చేస్తోంది. దాదాపు ఆరువందల గడపలు ఉండే అయినపర్రు గ్రామం అది. పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం లో ఉంది. తణుకు నుంచి 20 కిలోమీటర్ల దూరం. చుట్టూ వరి పొలాలతో, చేపల చెరువులతో ప్రశాంతంగా ఉండే ఆ ఊరిలో ఆ ఇల్లు మాత్రం ఒక నిశ్శబ్ద పోరాటం చేస్తోంది. బతుకు కోసం పోరాటం. ఆశ కోసం పోరాటం. ఆరోగ్యం కోసం పోరాటం. కష్టాలను దాటి ఆవలి తీరానికి చేరాలనే పోరాటం. ఆ పోరాటం చేస్తున్నది వరహాల రెడ్డి, లక్ష్మి ప్రభావతి అనే తల్లిదండ్రులు. వారి ఇద్దరు కుమార్తెలు. మా అమ్మాయికి ఏమైంది? వరహాల రెడ్డి, లక్ష్మీ ప్రభావతిల పెద్ద కుమార్తెగా నాగలక్ష్మి శారదా దేవి 35 ఏళ్ల క్రితం పుట్టింది. హుషారైన అమ్మాయి. చదువు కోసం బడిలో చేరింది. కూతురు పుట్టింది కదా బాగా చూసుకోవాలి అని ఏదో ఒకటి సంపాదించుకొని రావడానికి వరహాల రెడ్డి గల్ఫ్ వెళ్లాడు పని వెతుక్కుంటూ. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. కాని నాగలక్ష్మికి పదేళ్లు వచ్చే సరికి నడుస్తూ నడుస్తూ పడిపోయేది. ఏమైందో తల్లిదండ్రులకు అర్థమయ్యేది కాదు. అమ్మాయి కూడా ఎందుకు తాను పడిపోతోందో చెప్పలేకపోయేది. అప్పటికే గల్ఫ్ వదిలేసి వచ్చిన వరహాల రెడ్డి భార్యతో పాటు కూతురిని తీసుకొని హాస్పిటల్స్‌కు తిరగడం మొదలుపెట్టాడు. తణుకు వాళ్లు ఏమీ చెప్పలేకపోయారు. హైదరాబాద్ నిమ్స్ తీసుకు వస్తే తొడ నుంచి కొంత కండరం తీసి పరీక్ష చేయించి ‘మస్క్యులర్ డిస్ట్రఫీ’ (కండరాల క్షీణత) అని చెప్పారు. దీనికి మందు లేదని కూడా చెప్పారు. కాలక్రమంలో ఒక్కో అంగం చచ్చుబడిపోతుందన్న పెద్ద బండరాయి వంటి వార్తను గుండెల మీద పెట్టారు. అప్పటికి ఆ తల్లిదండ్రులు మరో సంతానం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు పెద్దమ్మాయికి ఇలా అవడం చూసి ఇక సంతానమే వద్దనుకున్నారు. కాని బంధువులు వినలేదు. మీది మేనరికం కాదు, చుట్టరికం కూడా ఏమీ లేదు.. ఒకమ్మాయికి ఇలా అయితే మళ్లీ పుట్టేవారికి కూడా అవుతుందా.. ఇంకొకరిని కనండి అన్నారు. పెద్దమ్మాయి పుట్టిన సరిగ్గా పన్నెండేళ్లకి జయ సాయిశ్రీ పుట్టింది. ఆ అమ్మాయి కూడా పుట్టినప్పుడు హుషారు పిల్లే. కాని కచ్చితంగా ఐదో క్లాసుకు వచ్చేసరికి అక్కలాగే ఉండి ఉండి నడుస్తూ పడిపోయేది. తల్లిదండ్రుల పై ప్రాణాలు పైనే పోయాయి. మళ్లీ డాక్టర్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. మళ్లీ అదే వ్యాధిని నిర్థారించారు. మస్క్యులర్ డిస్ట్రఫీ. ఇద్దరు బంగారు తల్లులు పుడితే ఇద్దరి జీవితం ఇలా ప్రమాదంలో పడితే కన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది? మందు కోసం పిల్లలకు ఎలాగైనా బాగు చేయించాలని వరహాల రెడ్డి, లక్ష్మీ ప్రభావతి చేయని ప్రయత్నం లేదు. అల్లోపతిలో మందు లేదని చెబుతున్నా ఆశ కొద్ది ఆయుర్వేదం, హోమియోపతి అన్నీ వాడి చూశారు. తెలిసో తెలియకో హైడోస్ మందులు కూడా వాడేశారు. ఏమీ ప్రయోజనం లేదు. రకరకాల మందులు వాడటం వల్ల దుష్ప్రభావాలు కూడా మొదలయ్యాయి. ‘ఇక మందులు వాడకండి’ అని డాక్టర్లు గట్టిగా చెప్పాక మానేశారు. ఇప్పుడు పెద్దమ్మాయి నాగలక్ష్మి తల, కొద్దిగా చేతులు మాత్రమే కదల్చగలదు. శరీరంలోని అన్ని కండరాలు క్షీణించి పక్క మీద ఎప్పుడూ పడుకునే ఉంటుంది. రెండో అమ్మాయి జయ సాయిశ్రీ కొద్దిగా చేతులు కదల్చగలదు. కూచోపెడితే కూచోగలదు. వారు ఈ మాత్రమైనా ఉన్నారంటే తాము తీసుకున్న జాగ్రత్త వల్లేనని వరహాల రెడ్డి అంటారు. లేకుంటే కుమార్తెల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని, దక్కి ఉండేవారు కాదని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. అన్నీ అమ్ముకుని కుమార్తెల వైద్యానికి వరహాల రెడ్డి తనకున్న రెండెకరాల పొలం అమ్మేశాడు. అది చాలక ఉన్న పెంకుటిల్లును ఆడమానం (తాకట్టు) పెట్టి రెండున్నర లక్షల అప్పు చేశాడు. ఆ అసలు, వడ్డీ ఇప్పుడు నెత్తిమీదకు వచ్చి ఉన్నాయి. ఊళ్లో కొద్దిమంది సాయం చేస్తే చిన్న లేయర్ కోళ్ల ఫారమ్ వేసి గుడ్లు అమ్ముతూ రోజుకు ఐదారు వందల ఆదాయం మీద బతుకు వెళ్లదీస్తున్నాడు. ఈ కష్టాలను తాము ఎదుర్కొనగలమనే ఈ నలుగురు నమ్ముతున్నారు. కాకుంటే ఆ పోరాటానికి కావలసిన శక్తి కోసం సమాజం వైపు చూస్తున్నారు. కావలసిందల్లా నేనున్నాను అని సమాజం చెప్పడమే. – గుమ్మడి ఆంజనేయులు సాక్షి ప్రతినిధి, ఇరగవరం, ప.గో.జిల్లా అన్ని పనులు నేనే నా ఇద్దరు కూతుళ్ల అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. వారు టాయ్‌లెట్ దాకా కూడా వెళ్లలేరు. ఇంట్లో ఉన్న చోటనే వారి అవసరాలు చూస్తాను. స్నానం చేయిస్తాను. తల దువ్వడం, బట్టలు వేయడం అన్నీ నేనే. ఇల్లు కదిలి ఎక్కడికీ పోను. వెళ్లినా ఏమో ఎలా ఉన్నారో అని అరగంటలో వచ్చేస్తాను. నా పిల్లలు పడే కష్టం చెప్పనలవి కానిది. దేవుడు వారిద్దరికీ ఒకే రకమైన కష్టం తెచ్చినందుకు బాధ పడాలో ఆ కష్టం వల్ల ఒకరికొకరు తోడుగా ఉన్నారని సంతోషపడాలో తెలియడం లేదు. ఏనాటికైనా నా పిల్లలు బాగవుతారనే ఆశతోనే ఉన్నాను. – లక్ష్మీ ప్రభావతి, తల్లి ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది జగన్ ప్రభుత్వం నా ఇద్దరు కూతుళ్లకి చెరొక ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుండబట్టి వారి అవసరాలకు, తిండికి జరిగిపోతోంది. నాలుగైదు నెలలుగా కోళ్లు గుడ్లు పెట్టే వయసుకు రావడంతో వాటి మీద ఎంతోకొంత ఆదాయం వస్తోంది. పెన్షన్ రాకపోతే మా గతి ఏమయ్యేదో! – వరహాల రెడ్డి, తండ్రి అమ్మానాన్నలు అప్పుల నుంచి బయటపడాలి మా అమ్మానాన్నలకు మేము చేసి పెట్టాల్సిన వయసు. కాని మేము వారి చేత చేయించుకోవాల్సి వస్తోంది. మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఎవరైనా దేవుని పుస్తకాలు తెచ్చిస్తే చదువుతుంటాను. మాకు ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఆ ఇంట్లోకి మారి మా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చుకుంటాము. ఇల్లు అమ్ముదామన్నా మేము ఖాళీ చేయలేము అనే భయంతో ఎవరూ కొనడానికి రావడం లేదు. మేం చాలా కష్టాల్లో ఉన్నాము. – నాగలక్ష్మి, పెద్ద కూతురు -
పెండింగ్ అనే మాట వినిపించకూడదు
► ఎప్పటి ఫైళ్లు అప్పుడు క్లియర్ చేయాలి ► నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించను ► అధికారులకు జేసీ నాగలక్ష్మి ఆదేశం ఒంగోలు టౌన్ : కలెక్టరేట్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయనే మాటే వినిపించకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతి ఫైల్ సకాలంలో డిస్పోజ్ కావాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌పై ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టరేట్‌కు చెందిన అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారం సంబంధిత మండల, డివిజనల్ కార్యాలయాల నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని సూచించారు. ఈ–ఆఫీసు ద్వారా ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. కోర్టు కేసులు, లోకాయుక్త కేసులు, మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చే కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత కేసుల స్థితిగతులను తెలుసుకోవడంతోపాటు వాటి సమాచారాన్ని యుద్ధ ప్రాతిపదికన తెప్పించుకొని, నిర్ణీత గడువుకు పూర్తిస్థాయి సమాచారంతో అందించే విధంగా ఉండాలన్నారు. వచ్చే బుధవారం నిర్వహించే సమావేశానికల్లా ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
క్షణికావేశం నింపింది విషాదం!
► ఇద్దరు బిడ్డలతో సహా రైలు కింద దూకిన తల్లి ►అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన తల్లి ►ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు ►చికిత్స పొందుతూ మృతి చెందిన కుమారుడు ► కుమార్తె పరిస్థితి విషయం ► మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలింపు ►జాండ్రపేట రైల్వే స్టేషన్ వద్ద ఘటన చీరాల అర్బన్ : క్షణికావేశం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. దంపతుల మధ్య వివాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు పసి బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లి వారిని భుజాలకు ఎత్తుకొని వేగంగా వస్తున్న రైలు కిందకు దూకేసింది. రైలు ఢీకొట్టడంతో చిన్నారులిద్దరూ చెరోవైపు పడిపోగా తల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కుమారుడు మృతిచెందాడు. కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన చీరాల మండలం జాండ్రపేట రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చీరాల మండలం పాతచీరాలకు చెందిన పులుగు విజయకుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు జీవన్‌రెడ్డి, ఏడాదిన్నర వయస్సు గల కుమార్తె మహిమ ఉన్నారు. విజయకుమార్ బేల్దారి పని చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య తర చూ వివాదాలు జరుతున్నారుు.గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగలక్ష్మి.. భర్త బయటికి వెళ్లిన సమయం లో ఇద్దరు పిల్లలను తీసుకుని జాండ్రపేట రైల్వేస్టేషన్‌కు వచ్చింది. బిడ్డలను భుజాల మీదకు ఎత్తుకొని వేగంగా వస్తున్న రైలు కింద పడింది. ఈ సంఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. ఇరువురు పిల్లలు రెండు వైపులా దూరంగాపడిపోరుు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా పట్టాలు దాటుతున్న స్థానికుడు వారిని చూసి చలించిపోయాడు. 108కి సమాచారం అందించాడు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని,గాయపడిన చిన్నారులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే జీవన్‌రెడ్డి(3) మృతిచెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి మహిమను మెరుగైనవైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో అభాగ్యుల్లా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న చిన్నారుల చెంత బంధువులెవరూ లేవరూ పోవడం చూపరులను కలిచివేసింది. మృతురాలు నాగలక్ష్మి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డి తెలిపారు. -
పోలీసు కస్టడీకి శివ గ్యాంగ్
మూడు రోజులు విచారించనున్న పోలీసులు బంగారం రికవరీ కోసం యత్నాలు సాక్షి, సిటీబ్యూరో: కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలులో ఉన్న శివ గ్యాంగ్ సభ్యులు ముగ్గురినీ నార్సింగి పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఈనెల 15న శంషాబాద్‌లో పోలీసు కాల్పుల్లో కరుడుగట్టిన చైన్‌స్నాచర్ శివ మృతి చెందగా, పోలీసులు అదే రోజు శివ గ్యాంగ్ సభ్యులైన అతని భార్య నాగలక్ష్మి, అనుచరులు జగదీష్, రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నార్సింగిలోని వీరింటిని సోదా చేసిన పోలీసులకు ముత్తూట్, శ్రీరామా ఫైనాన్స్ తదితర కంపెనీల్లో తాకట్టుపెట్టిన బంగారు నగల రసీదులతో పాటు ఆయా బ్యాంకుల ఫిక్సిడ్ డిపాజిట్ రసీదులు కూడా దొరికాయి. ఈ రసీదుల ఆధారంగా ఆయా ఫైనాన్స్ కంపెనీల్లో ఉన్న బంగారాన్ని రికవరీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుల నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, ఖరీదైన వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత రికవరీపై దృష్టి పెట్టారు. శివ గ్యాంగ్ రెండేళ్లలో కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన బంగారు నగలు చోరీ చేసిందని విచారణలో తేలింది. దీంతో ఈ బంగారం అంతా రికవరీ చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఒక్క సైబరాబాద్‌లోనే ఈ గ్యాంగ్ 700కుపైగా స్నాచింగ్‌లకు పాల్పడినట్టు నిర్థారించారు. నగర పోలీసు కమిషనరేట్‌తో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాలలోనూ వీరు పంజా విసిరారు. ఇవన్నీ కలుపుకుంటే కనీసం వెయ్యికిపైగా నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు నిందితులు ముగ్గురినీ కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. విచారణలో వారు వెల్లడించిన అంశాల ఆధారంగా రికవరీ చేస్తారు. దొంగ సొమ్ము ఖరీదు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నారు. శివ తన మకాం పోలీసులకు తెలియకుండా ఉండేందుకు తన సెల్‌ఫోన్‌ను మూడు కిలోమీటర్ల దూరంలోనే స్విచ్ఆఫ్ చేసి ఇంటికి వెళ్లేవాడని, అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాక ఫోన్ ఆన్ చేసేవాడని తెలిపింది.