సాక్షి, దేవరపల్లి (తూర్పుగోదావరి): కట్టుకున్న భార్యను పథకం ప్రకారంహతమార్చి, గుట్టు చప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని ఊర చెరువులో పడేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతురాలి తల్లి అమరావతి కథనం ప్రకారం.. యాదవోలుకు చెందిన సూరే వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మికి, అదే గ్రామానికి చెందిన ముమ్మిడి నాగరాజుకు మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది.
వివాహ సమయంలో కట్న కానుకలతో పాటు కొంత సామగ్రిని ముట్టజెప్పారు. వివాహం జరిగిన కొన్నాళ్లకు భార్య నాగలక్ష్మిని నాగరాజు సూటిపోటి మాటలతో వేధించడంతో పాటు శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడం ఆరంభించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. ఇద్దరికీ పెద్దలు సయోధ్య కుదిర్చేవారు. గతంలో ఒకసారి భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. పెద్దల సమక్షంలో సర్దుబాటు చేసి, తిరిగి కాపురానికి పంపించారు.
అయినప్పటికీ నాగరాజులో మార్పు రాకపోవడంతో దంపతుల మధ్య తిరిగి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి (19) కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెను ఈ నెల 27న భర్త వద్దకు పంపించారు. తెల్లవారేసరికి తన భార్య నాగలక్ష్మి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులకు నాగరాజు చెప్పాడు. ఆమె కోసం తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో, అల్లుడిపై అనుమానం ఉందంటూ శుక్రవారం రాత్రి దేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా, భార్య నాగలక్ష్మిని తానే హత్య చేసి ఊరి చెరువులో పడేసినట్టు అంగీకరించాడు. చెరువులో నాగలక్ష్మి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైందని ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. సంఘటన స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్, ఇన్‌చార్జి సీఐ కె.లక్ష్మణరెడ్డి పరిశీలించారు. నిందితులు నాగరాజును, అతడికి సహకరించిన మేనల్లుడు గన్నూరి సూరిబాబు, నాగరాజు తల్లి ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment