పెండింగ్ అనే మాట వినిపించకూడదు
► ఎప్పటి ఫైళ్లు అప్పుడు క్లియర్ చేయాలి
► నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించను
► అధికారులకు జేసీ నాగలక్ష్మి ఆదేశం
ఒంగోలు టౌన్ : కలెక్టరేట్‌లో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయనే మాటే వినిపించకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతి ఫైల్ సకాలంలో డిస్పోజ్ కావాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌పై ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టరేట్‌కు చెందిన అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారం సంబంధిత మండల, డివిజనల్ కార్యాలయాల నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని సూచించారు.
ఈ–ఆఫీసు ద్వారా ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. కోర్టు కేసులు, లోకాయుక్త కేసులు, మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చే కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత కేసుల స్థితిగతులను తెలుసుకోవడంతోపాటు వాటి సమాచారాన్ని యుద్ధ ప్రాతిపదికన తెప్పించుకొని, నిర్ణీత గడువుకు పూర్తిస్థాయి సమాచారంతో అందించే విధంగా ఉండాలన్నారు. వచ్చే బుధవారం నిర్వహించే సమావేశానికల్లా ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.