joint collector
-
అప్పుడే డిసైడ్ అయ్యా...జేసీ మయూర్ అశోక్..
సాక్షి, విశాఖపట్నం: రంగుల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం బాల్యం. కొత్త ప్రపంచంలోకి నడిపించే శైశవదశలో ప్రతి విషయం ఓ మధుర జ్ఞాపకమే అన్నారు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. బాలల దినోత్సవం సందర్భంగా తన చిన్న నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాల్యంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పారు. ‘మా సొంతూరు మహారాష్ట్రలోని బీడ్. నేను 6వ తరగతి చదువుతున్న రోజులవి. స్కూల్లో ఉన్న సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని మా టీచర్లు చెప్పారు. స్కూల్లో ఉదయం ప్రతిజ్ఞ సమయంలో వార్తలు చదివేవాళ్లం. దేశం యావత్తూ భుజ్ భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తోందని.. మనం కూడా సాయమందిద్దామని టీచర్లు చెప్పారు. ఫండ్ కలెక్ట్ చేసేందుకు టీమ్ లీడర్‌గా నన్ను ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు హెడ్ సర్కి చెప్పేవాడిని. అప్పుడే ఒక ఆర్థిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అలవర్చుకున్నాను. ఫండ్ ఎంత ఎక్కువగా ఇస్తే.. అంత మందికి సాయం చేయగలమన్న ఆలోచన నాలో వచ్చింది. అందుకే ప్రతి విద్యార్థీ వీలైనంత పెద్ద మొత్తంలో డబ్బులు అందించేలా ప్రోత్సహించాను. ప్రతి క్లాస్‌కు వెళ్లి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అది అందర్నీ ఆకట్టుకుంది. అప్ప ట్లోనే మా స్కూల్ తరఫున దాదాపు రూ.5లక్షల వరకు సేకరించగలిగాం. దీంతో నన్ను టీచర్లు అభినందించారు. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించే బాధ్యతను నాకే అప్పగించారు. అప్పుడే మొదటిసారి కలెక్టరేట్‌కు వెళ్లాను.అక్కడ కలెక్టర్ చాంబర్ చూశాను. ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారన్నది చూసిన నాకు అక్కడ వాతావరణం ప్రేరేపించింది. నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా చేసింది. ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యాన్ని నాలో కలిగించిందీ ఆ సంఘటనే.. అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని మా టీచర్లను, తల్లిదండ్రులను అడిగేవాడిని. వారు చెప్పినదానికనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివాను. తర్వాత 2018లో సివిల్స్‌కు ఎంపికై .. నా కలను నెరవేర్చుకున్నాను. ప్రణాళికాబద్ధంగా శైశవదశను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుంది. భావితరాలకు చరిత్రగా మారుతుంది’ అని జేసీ మయూర్ అశోక్ చెబుతూ.. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సంఘటనే మలుపు తిప్పిందిచిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్‌లో ప్రైజ్‌లు వచ్చేవి. నాకు బాగా గుర్తుంది.. ఒకటో తరగతిలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలపై పోటీలు నిర్వహించారు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో వెళ్లి డైలాగ్‌లు చెప్పాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని జేసీ గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు. -
అడవివరంలో 20 ఎకరాలపై కన్నేసిన కబ్జాదారులు
సాక్షి, విశాఖపట్నం : అది సింహాచలం దేవస్థానానికి చెందిన అటవీ ప్రాంతం.. తాము అక్కడ నివాసముంటున్నామని పలువురు.. ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చిన రిపోర్టుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అఫిడవిట్ చూసిన జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ నివాసం కాదు.. పూర్తి చెట్లతో నిండిన అడవి ఉందని గుర్తించారు. రూ.కోట్ల భూమిని కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడకు సహకరించిన ప్రభుత్వాధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో 20.39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించడంతో పాటు అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నేపథ్యంలో రెవెన్యూ రికార్డులో తమ పేరుతో మార్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని బి.మంగతల్లితో పాటు మరో ఆరుగురు హైకోర్టులో రిట్‌పిటిషన్ వేశారు. పిటిషనర్ దరఖాస్తుపై నెల రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశాఖ రూరల్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే విభాగం అధికారులు సదరు భూమికి సర్వే నిర్వహించారు. 1903 సేల్ ప్రకారం అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో ఉన్న 20.39 ఎకరాల భూమి మంగతల్లి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని, వారు పొజిషన్లు ఉన్నారని నిర్ధారిస్తూ నివేదిక సమర్పించారు. సర్వే అధికారుల నివేదిక ఆధారంగా ఆ భూమి తమదేనని, సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మరోసారి మంగతల్లి మరో ఆరుగురు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్టాటస్ కో ఇచ్చింది. సర్వే నివేదిక తప్పంటూ దేవస్థానం పిటిషన్ సర్వే విభాగం ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారులు 2021, అక్టోబర్ 20న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. సదరు నివేదిక సక్రమంగా లేదని, సర్వే నెంబర్ 275లో మొత్తం 5,279.57 ఎకరాల భూమి దేవస్థానం పరిధిలోనే ఉందని, ఈ సర్వే నంబర్‌కు సంబంధించి ఎలాంటి సబ్ డివిజన్లు లేవని పిటిషన్లో స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ విస్తీర్ణం మొత్తం 22ఏ జాబితాలో చేర్చడం జరిగిందని, ఆ భూమిలో దేవస్థానం కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా ఉందని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్.. జాయింట్ సర్వే బృందానికి, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అప్పుడే సర్వే బృందం అవకతవకలు బయటపడ్డాయి. స్వయంగా పరిశీలించిన జేసీ 2021లో సర్వే చేసిన విశాఖ రూరల్ మండలం అప్పటి సర్వేయర్, ప్రస్తుత గోపాలపట్నం సర్వేయర్ డి.జగదీశ్వరరావు, సింహాచలం దేవస్థానం అప్పటి సర్వేయర్ కె.హరీష్‌కుమార్, అప్పటి గోపాలపట్నం సర్వేయర్, ప్రస్తుతం యలమంచిలి సర్వేయర్ సత్యనారాయణ, డీఐవోఎస్ కె.వేణుగోపాల్‌ను అధికారులు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది మే 15న భీమిలి ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, సింహాచలం దేవస్థానం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఇతర అధికారులతో కలిసి జేసీ కేఎస్ విశ్వనాథన్ స్వయంగా ఆ భూమిని పరిశీలించి విస్తుపోయారు. పిటిషన్ వేసిన వారి భూ పత్రాల్లో సదరు భూమి గోపాలపట్నం మండలం మాధవధారలో ఉంది. కానీ వారు చూపిస్తున్న భూమి, వారి డాక్యుమెంట్లో ఉన్న భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. దీని ప్రకారం సర్వే నెంబర్ 275లో ఉన్న భూమి సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉందని గుర్తించారు. ఆ భూమిలోనే పొజిషన్లో ఉన్నట్లు సర్వేయర్లు ఇచ్చిన నివేదిక తప్పు అని బట్టబయలైంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న సర్వే ఏడీ విజయ్‌కుమార్, డీఐవోఎస్ వేణుగోపాల్, ముగ్గురు సర్వేయర్లపై క్రమశిక్షణ చర్యలకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిని సింహాచలం దేవస్థానానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
కృష్ణా: కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్ మ్యారేజ్
సాక్షి, కృష్ణా: కాబోయే కలెక్టర్.. కాబోయే ఎస్పీల వివాహం నిరాడంబరంగా జరిగింది. అదీ రిజిస్టర్ మ్యారేజ్‌గా సింపుల్‌గా దండలు మార్చుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని ఛాంబర్ వీళ్ల వివాహానికి వేదిక అయ్యింది. వీళ్లిద్దరిదీ రాజస్థాన్ కావడం గమనార్హం. ఈ కొత్త జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. వివాహం తర్వాత కొత్త జంట గుడ్లవల్లేరు వేమవరంలోని శ్రీకొండాలమ్మ ఆలయాన్ని దర్శించారు. ఇదిలా ఉండగా.. దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. -
అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా..
అనకాపల్లి: అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా.. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా.. అంటూ జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పలకరించారు. మద్యం వ్యసనం మాన్పించేందుకు జేసీ ‘విముక్తి’ అనే ప్రాజెక్టును మునగపాక మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం విడిచిపెట్టిన ఇద్దరు వ్యక్తులు పాటిపల్లి గ్రామంలో ఉన్నారు. భూముల రీసర్వే సమీక్ష కోసం మంగళవారం మండలానికి వచ్చిన జేసీ.. పాటిపల్లిలో ఆ ఇద్దరు వ్యక్తుల ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మద్యం మానేశాక వారి ఇంటి పెద్దలో వచ్చిన మార్పు, ఇప్పటికీ అదే పరివర్తన కొనసాగుతోందా.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారింట్లో ఫొటో ఆల్బమ్ చూస్తూ పాత జ్ఞాపకాల గురించి వారితో ముచ్చటించారు. ‘విముక్తి’ పైలట్ ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన ఏఎన్ఎం సుజాతను ఈ సందర్భంగా జేసీ అభినందించారు. ఓ పెద్ద కూతురిలా తమ ఇంటికి వచ్చి అంత పెద్ద ఐఏఎస్ అధికారి తమ మంచి చెడ్డలను వాకబు చేయడంతో ఆ ఇంటివారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
‘నారాయణ’ అకృత్యాలపై కన్నెర్ర.. రూ.5 లక్షల జరిమానా
అనంతపురం: సోములదొడ్డి వద్దనున్న నారాయణ జూనియర్ కళాశాలను జిల్లా పర్యవేక్షణ కమిటీ (డి స్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీ) చైర్మన్ జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాసికరమైన భోజనం అందిస్తున్నారని, చదువులో వెనుకబడిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని, వార్డెన్ ప్రవర్తన తీరు బాగోలేదని విద్యార్థులు కమిటీ దృష్టికి తెచ్చారు. నిర్దేశిత ఫీజులకు మించి వసూలు చేయడమే కాకుండా నాసిరకమైన భోజనం పెడుతూ.. విద్యార్థులపై అకృత్యాలకు పాల్పడతారా అంటూ సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ కళాశాలకు రూ.5 లక్షల జరిమానా విధించారు. కార్యక్రమంలో డీఎంఎస్ఎసీ కన్వీనర్ వెంకటరమణ నాయక్, ఆర్ఐఓ డాక్టర్ సురేష్‌బాబు, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవికుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ -
ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాలి
కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయించాలని జాయింట్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి థియేటర్ల యజమానులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్డీఓలతో కలసి థియేటర్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ నంబర్ 69 ప్రకారం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారానే విక్రయించాలన్నారు. సినిమా ప్రదర్శన కంటే ఏడు రోజుల ముందు టిక్కెట్లను విక్రయించరాదన్నారు. బుక్ చేసుకున్న టిక్కెట్‌ను వినియోగదారుడు నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే జీఎస్టీ, సర్వీసు చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయాలన్నారు. కార్యక్రమంలో పత్తికొండ, ఆదోని, కర్నూలు ఆర్డీఓలు మోహన్‌దాస్, రామకృష్ణారెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్: టెన్త్ విద్యార్థులకు తీపి కబురు) -
Kakinada: కలెక్టర్, జేసీ పెద్ద మనసు.. కోవిడ్‌తో అనాథలైన చిన్నారులను
కాకినాడ సిటీ: కలెక్టరు కృతికాశుక్లా, జేసీ ఇలక్కియ పెద్ద మనసు చాటుకున్నారు. కోవిడ్‌తో అనాథలైన చిన్నారుల్లో తలో బిడ్డ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. వారికి సంబంధించిన అన్ని విషయాలు ఇకపై వీరు చూస్తారు. మిగిలిన అధికారులు కూడా చొరవ తీసుకుని తలో చిన్నారి దత్తత బాధ్యతలను తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. సోమవారం కలెక్టరేట్ స్పందన హాలులో స్పందన అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్–19 కారణంగా 23 మంది చిన్నారులు అనాథలయ్యారన్నారు. చదవండి: నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో! వీరి విషయంలో జిల్లా స్థాయి మహిళా అధికారులు ఆలన, పాలన పరంగా చొరవ చూపాలని కలెక్టర్ కోరారు. మాతృత్వ భావనతో చిన్నారులు మహిళ అధికారులకు చేరువ అవుతారనే ఉద్దేశంతో తాము దత్తత బాధ్యత తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. పురుష జిల్లా అధికారులు కూడా ఔదార్యంతో పిల్లల సంక్షేమానికి తమ వంతు సేవలను అందించవచ్చన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం 44 ల్యాప్‌టాప్‌లు, 19 స్మార్ట్ టచ్ ఫోన్లు, 300 హియరింగ్ ఎయిడ్లు, 40 కాలిపర్స్ పరికరాలు జిల్లా విభాగానికి కేటాయించామన్నారు. వీటికి అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ముగ్గురు బధిరులకు స్మార్ట్ టచ్ ఫోన్లను, ఒక దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. స్పందనలో 237 అర్జీలు అధికారులకు అందాయి. -
సినిమా టికెట్ ధరల నిర్ణయం లైసెన్సింగ్ అథారిటీదే
సాక్షి, అమరావతి: టికెట్ ధరలు, సర్వీసు చార్జీలను లైసెన్సింగ్ అథారిటీ (జాయింట్ కలెక్టర్) మాత్రమే నిర్ణయించగలదని, ప్రభుత్వం కాదని హైకోర్టు పేర్కొంది. టికెట్ ధరలు, సర్వీసు చార్జీల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాలను తెలియచేయగలదని, నిర్ణయం తీసుకోవాల్సింది లైసెన్సింగ్ అథారిటీనేనని స్పష్టం చేసింది. ఆన్లైన్ టికెట్ల విక్రయం సందర్భంగా సినిమా థియేటర్లు ప్రేక్షకులకు విధించే సర్వీసు చార్జీని టిక్కెట్ ధరలో కలపడానికి వీల్లేదని పేర్కొంది. సర్వీసు చార్జీ విధింపు నిధుల మళ్లింపునకు దారితీయదని తెలిపింది. ఆన్లైన్ టికెట్ల విక్రయ ప్రక్రియ రికార్డవుతుందని, అందువల్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు రిస్క్ ఉండదని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా విక్రయించే టికెట్ మొత్తం ధరలో సర్వీసు చార్జీని కలపడాన్ని తప్పుబట్టింది. పాత విధానంలోనే ఆన్లైన్ టికెట్లను విక్రయించుకోవచ్చునని, ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రేక్షకుడిపై సర్వీసు చార్జీ భారం మోపవచ్చని తెలిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ ధరలను ఖరారు చేస్తూ జారీచేసిన జీవోను, సర్వీసు చార్జీని కూడా కలిపి ఆన్లైన్ టికెట్ ధరను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ‘ప్రత్యేక సౌకర్యం’ ప్రేక్షకులకు కల్పిస్తున్నామని, ఇందుకు తాము వసూలుచేసే సర్వీసు చార్జీని టికెట్ ధరలో కలపడానికి వీల్లేదని అసోసియేషన్ వాదించింది. ఈ వ్యాజ్యంపై గత వారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరిన విధంగా బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు ‘సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీప్లెక్స్ థియేటర్లు భాగం కాదు. ఆ కమిటీ కూడా టికెట్ ధరలు నిర్ణయించే సమయంలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు. వారిని సంప్రదించినట్లుగానీ, వారి అభ్యంతరాలు స్వీకరించినట్లుగానీ చూపేందుకు ఎలాంటి డాక్యుమెంట్‌ను ఈ కోర్టు ముందుంచలేదు. ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం ప్రకారం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించినందుకు సినిమా థియేటర్లు ప్రేక్షకుడిపై విధించే సర్వీసు చార్జీని టికెట్ మొత్తం ధరలో కలపడానికి వీల్లేదు. సినిమా హాలులో ప్రవేశానికి చెల్లించే ధరే.. అసలు టికెట్ ధర. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉపయోగించుకున్నందుకు విధించే చార్జీలను అసలు టికెట్ ధరగా పరిగణించడానికి వీల్లేదు. టికెట్ ధరలను నిర్ణయించే అధికారాన్ని కూడా పిటిషనర్ ప్రశ్నించారు. జీవో 69 ప్రకారం టికెట్ ధరలను నిర్ణయించాల్సింది లైసెన్సింగ్ అథారిటీయే తప్ప ప్రభుత్వం కాదు. గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాల ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ టికెట్ ధరలను నిర్ణయిస్తుంది. ఈ విషయంపై లోతుగా విచారణ జరపాలి..’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీల నియామకం
సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
సినిమా థియేటర్‌ను జప్తు చేసే అధికారం వారికే: హైకోర్టు
సాక్షి, అమరావతి: లైసెన్స్ లేదన్న కారణంతో సినిమా థియేటర్‌ను జప్తు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏపీ సినిమా (నియంత్రణ) రూల్స్ 1970 ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారి మాత్రమే సినిమా థియేటర్‌ను జప్తు చేయగలరని స్పష్టం చేసింది. ఈ రూల్స్ ప్రకారం లైసెన్స్ జారీ అధికారి జాయింట్ కలెక్టర్ (జేసీ) అవుతారని తెలిపింది. అందువల్ల జేసీకి మాత్రమే సినిమా థియేటర్‌ను మూసివేసే అధికారం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీనివాస మహల్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదని తహసీల్దార్ దాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్‌ను జప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పడాన్ని కూడా ఖండించింది. జప్తు చేసిన థియేటర్‌ను తెరవాలని తహసీల్దార్‌ను ఆదేశించింది. లైసెన్స్ పునరుద్ధరణ అంశం లైసెన్స్ జారీ అధికారి ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ థియేటర్లో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని థియేటర్ యాజమాన్యానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ లేదన్న కారణంతో తమ థియేటర్‌ను తహసీల్దార్ జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస మహల్ మేనేజింగ్ పార్టనర్ సనపాల శంకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
భోగి సంబరాల్లో పాల్గొన్న విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్
-
‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటారు.. చేతకాకపోతే వెళ్లిపోండి’ జేసీ ఫైర్
సాక్షి, అనంతపురం: ‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటున్నారు...బాధ్యత మాత్రం విస్మరిస్తున్నా రు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన అదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత లేదా..? పనిచేయడం చేతకాకపోతే ఇళ్లకు వెళ్లిపోండి.’ అని జాయింట్ కలెక్టర్ అట్టాడ సిరి చెన్నేకొత్తపల్లి, వెంకటాంపల్లి పంచాయతీ కార్యదర్శులు అరుణ్ పాండే, యల్లప్పలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మండలంలోని వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి, ఓబుళంపల్లి గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి గ్రామాల్లోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సందర్శించారు. అవి మరీ అధ్వానంగా ఉండటంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శుల కు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం వెంకటాంపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. భోజనం సరిగా లేకపోవడంతో వెంటనే ఏజెన్సీ మార్చాలని ఎంఈఓ మల్లికార్జునకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు జయరామిరెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జేసీ సిరి కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలో పర్యటించి జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో వేసిన బోరుబావులను పరిశీలించారు. చదవండి: అందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ అధికారులు అందజేసిన నివేదికలోని కొలతల ప్రకారం బోరుబావి ఉందా? లేదా ? తెలుసుకునేందుకు పరమేశ్వరరెడ్డి పొలంలోని బోరుబావి లోతును కొలిపించారు. అనంతరం అధికారులు, రైతులతో జేసీ మాట్లాడుతూ ‘వైఎస్సార్ జలకళ’ పథకం మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బోర్లు తవ్వడం, విద్యుత్ సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జేసీ వెంట ఏపీడీ పుల్లారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది, రైతులు ఉన్నారు. చదవండి: ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్ -
మళ్లీ వైరల్ అవుతున్న బుల్లెట్ బండి
-
Bullet Bandi: మళ్లీ వైరల్ అవుతున్న బుల్లెట్ బండి
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసిన బుల్లెట్ బండి పాట మళ్లీ వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి పాటకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బుల్లెట్ బండి పాట విడుదల అయ్యినప్పటి నుంచి పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఆ పాట లేకుండా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకు పిల్లలు, పెద్దలు, నవ దంపతులు అంతా స్టెప్పులు వేస్తూ ఆడిపాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా బుల్లెట్ బండి పాటపై జాయింట్ కలెక్టర్ దంపతులు స్టెప్పులు వేశారు. వివరాలు.. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సెలవు రోజు కావడంతో బంధువులు ఫ్రెండ్స్‌తో బర్త్‌డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దంపతులు బుల్లెట్ బండి పాటకి స్టెప్పులు వేసి బంధువులకి ఉత్సాహన్ని కలిగించారు. దీంతో మళ్లీ బుల్లెట్ బండిపాట సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. -
జేసీ అయితే ఏంటి?
సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ‘మీరు ఎవరో నాకు తెలియదు. పాస్ ఉంటే చూపించండి. కొండపైకి పంపుతా’ అంటూ జాయింట్ కలెక్టర్ శివశంకర్ కారును ఎస్ఐ, సీఐ అడ్డగించిన ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రి టోల్గేట్ వద్ద చోటు చేసుకుంది. దసరా పనుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ శుక్రవారం మధ్యాహ్నం తన కారులో కొండపైకి బయలుదేరారు. టోల్గేట్ వద్ద జేసీ కారును అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ బి.శంకర్రావు అడ్డుకుని పాస్ చూపించాలని కోరారు. తాను జేసీనని చెప్పినా వినకపోవడంతో అక్కడే ఉన్న సీఐ ఎస్.ఎస్.వి.నాగరాజు వద్దకు వెళ్లి తన కారునే ఆపుతారా అని ప్రశ్నించారు. పాస్ ఉంటేనే కారును కొండపైకి పంపుతానని సీఐ చెప్పడంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీంతో జేసీ శివశంకర్ వెంటనే నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని సీపీ శ్రీనివాసులు మీడియా ముఖంగా వెల్లడించారు. చదవండి: (డ్రగ్స్ డాన్.. కుల్దీప్ సింగ్) పోలీసుల తీరుపై సీరియస్ సీఐ, ఎస్ఐ తీరుపై జేసీ శివశంకర్ సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా ఘాట్‌రోడ్డు నుంచి కొండపైకి నడిచి వెళ్లారు. మార్గమ ధ్యలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రొటోకాల్‌పై కలెక్టర్ సీరియస్ వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో అధికారుల ప్రొటోకాల్ వ్యవహరంపై కలెక్టర్ జె.నివాస్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం రాత్రి ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని ఆయా పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఘాట్‌రోడ్డులో జాయింట్ కలెక్టర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై అధికారులను కలెక్టర్ మందలించారు. ఉత్సవాలు సవ్యంగా, విజయవంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూచించారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం
సాక్షి, అనంతపురం: ప్రైవేట్ ఆస్పత్రులో దోపిడీపై జాయింట్ కలెక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. హర్షిత ఆస్పత్రికి రూ.20 లక్షలు, చంద్ర ఆస్పత్రికి రూ.9 లక్షలు జరిమానా విధించారు. 14 ఆస్పత్రులకు రూ.39 లక్షలు జరిమానా విధించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పదేపదే అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు. చదవండి: ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు -
నాగలి పట్టి పొలం దున్నిన జాయింట్ కలెక్టర్
రాజానగరం: వ్యవసాయం అంటే మనిషికి, మట్టికి మధ్య ఉండే ఒక అందమైన బంధం. ఇది అర్థమయ్యేది ఒక్క రైతుకు.. వారి గురించి ఆలోచించే కొద్దిమందికి మాత్రమే. పండించే వాళ్లు తగ్గిపోయి.. తినేవాళ్లు నానాటికీ పెరిగిపోతున్న కాలంలో.. ఆశలన్నీ కొడిగట్టిపోతున్న రైతుల బతుకులకు ఇం‘ధనం’ అందించి.. వారి కష్టాలను అర్థం చేసుకుని.. అన్నివిధాలా ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ‘రైతు అంటే సింపతీ కాదు.. రెస్పెక్ట్’ అని నిరూపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా కదులుతోంది. ప్రస్తుతం తొలకరి వర్షాలు కురుస్తూండటంతో అన్నదాతలు ఖరీఫ్ సాగుబడికి సమాయత్తమవుతున్నారు. రాజానగరం మండలం ముక్కినాడలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా ఏరువాక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మీశ.. పొలం దున్నుతున్న రైతులతో చేయి కలిపారు. మేడి పట్టి కాసేపు.. తరువాత ట్రాక్టర్‌తోను మడి దున్నారు. ఆరుగాలం చెమట చిందిస్తూ, ప్రజల ఆకలి తీర్చేందుకు అవసరమైన తిండిగింజలు పండిస్తున్న రైతులే దేశానికి నిజమైన వెన్నెముక అని ఈ సందర్భంగా అన్నారు. -
ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి: ప్రభుత్వ నిబంధనలను పాటించని ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పెద్దాపురానికి చెందిన కరోనా రోగి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేస్తూ రూ.4.50 లక్షలను ఆస్పత్రి సిబ్బంది వసూలు చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంపై సర్పవరం పీఎస్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యింది. ఆస్పత్రిపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇనోదయ ఆస్పత్రిని డీ నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి రూ.15-20 లక్షల జరిమానా కూడా విధించారు. ఆస్పత్రి యాజమాన్యంకు సహకరించిన ఆరోపణలపై ఆరోగ్య మిత్ర నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే -
బొండాల రకం ధాన్యం: రైతులు దళారుల మాటలు నమ్మొద్దు
సాక్షి, తూర్పు గోదావరి: బొండాల రకం ధాన్యం పండించిన రైతులు దళారుల మాటలు నమ్మొద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. దళారుల మాటలు నమ్మి పంటను విక్రయించొద్దని రైతులకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొండాల రకం ధాన్యం పండిందని తెలిపారు. ఇందులో 95 శాతం పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. బొండాల రకం ధాన్యాన్ని క్వింటా రూ.1868 చొప్పున.. 75 కేజీలు రూ.1,401గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని గుర్తుచేశారు. రైతులకు సమస్యలుంటే కమాండ్ కంట్రోల్ నంబరు: 88866 13611కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. రైతుభరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. చదవండి: Kharif Crop: ఖరీఫ్‌కు రెడీ -
ఆ సమయంలో చాలెంజింగ్‌గా పనిచేశాం..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పీఎస్ గిరీషా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు. లాక్డౌన్ సమయంలో కరోనా కట్టడికి ఆదర్శవంతంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతులయ్యారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. – తిరుపతి తుడా కోవిడ్ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కొన్నారు..? సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి ఆ దిశగా పరుగులు పెట్టే సమయంలో కరోనా ఉపద్రవంగా వచ్చిపడింది. సుమారు 3నెలల పాటు మరో పనిలేకుండా చేసింది. కరోనా కట్టడిలో తిరుపతి కార్పొరేషన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛ సర్వేలోనూ నగరం అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాం. వారి ఇళ్లకు రెడ్ నోటీసులు, చేతికి స్టాంప్ వేయడం వంటివి సత్ఫలితాలు ఇచ్చాయి. కూరగాయల మార్కెట్‌ను వికేంద్రీకరించి, తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. స్పెషల్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాం. హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం, రెడ్ జోన్ల అమలు వంటి కీలక నిర్ణయాలు కరోనా కట్టిడికి దోహదపడ్డాయి. తిరుపతిలో నాలుగు లక్షలకుపైగా జనాభా ఉండగా లాక్ డౌన్ సమయంలో కేవలం తొమ్మిది పాజిటివ్ కేసులకే కట్టడి చేశామంటే సమష్టి కృషితోనే సాధ్యమైంది. అభివృద్ధిలో మీ మార్క్..? కరోనా కట్టిడికి 3 నెలలు, వార్డు సచివాలయాల ఏర్పాటుకు మరో మూడు నెలలు సమయం గడిచిపోయింది. మిగిలిన ఆరు నెలల్లో అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుని వాటిని పరుగులు పెట్టించాం. పద్మావతి, ప్రకాశం పార్కులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. గరుడ వారధికి నిధులు సమకూర్చి పనులకు ఆటంకం లేకుండా చేశాం. అమృత్ స్కీమ్ ద్వారా 90 శాతం పనులు పూర్తి చేశాం. 15 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశాం. సుమారు రూ.21 కోట్లతో వినాయక సాగర్‌కు అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాం. విలీన పంచాయతీల్లో రూ.16 కోట్లతో తాగునీటి సౌకర్యం, రోడ్లు, కాలువలు, యూడీఎస్ అందించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నాం. డీబీఆర్, కరకంబాడి–రేణిగుంట రోడ్లను కలిపే చెన్నగుంట లింక్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయడంతో కమిషనర్‌గా నా మార్కు కనిపించడం ఆనందంగా ఉంది. చదవండి: పలమనేరులో నువ్వా- నేనా..? ఇళ్ల పట్టాల పంపిణీపై..? పట్టణాల్లో ఇళ్లు లేని ప్రజలకు బహుళ అంతస్తులు నిర్మించి ఇవ్వడం ఇప్పటి వరకు చూశాం. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. ఈ అపురూప ఘట్టం నా చేతుల మీదుగా జరుగుతుండడం జీవితంలో మరచిపోలేను. నగరంలో 23 వేల మంది అర్హులకు జూలై 8న ఇంటి పట్టాలు పంపిణీ చేస్తాం. ఏడాది పాలన ఎలాఉంది...? తిరుపతిలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదివరకు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసినా ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించడం ప్రత్యేకమనే చెప్పాలి. బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో అధిగమించాం. పథకాల అమలులో రాష్ట్రంలోనే తిరుపతి ముందుంది. ఏడాది పాలన విజయవంతంగా పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 మొదలైందా..? స్వచ్ఛ సర్వేక్షణ్ 2020ను విజయవంతంగా పూర్తిచేశాం. కరోనా కారణంగా ర్యాంకులను ఇప్పటి వరకు ప్రకటించకపోయినా గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉంటామని ఆశిస్తున్నాం. సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్లో దేశవ్యాప్తంగా ఏ నగరం కూడా మనకు సాటి రాదు. సుమారు రూ. 40 కోట్లతో బయోమైనింగ్, తడి చెత్త ద్వారా దేశంలోనే అతిపెద్ద బయో గ్యాస్ ప్లాంట్, భవన వ్యర్థాల ద్వారా ఉత్పత్తులు, ఇలా చెత్త నిర్వహణ చేపట్టాం. ఇదే స్ఫూర్తితో 2021 పోటీలకు సన్నద్ధమయ్యాం. మీకు చాలెంజింగ్‌గా అనిపించినవి ..? ప్రజలకు సులభంగా.. తొందరగా.. అవినీతిరహితంగా సేవంలదించాలనే సంకల్పంతో వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మాకు ఇదో పెద్ద టాస్క్. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు గత ఏడాది జూలై లోపు నగరంలో 102 సచివాలయాలను ఏర్పాటు చేశాం. భవనాల ఎంపిక, మౌలిక వసతుల కల్పన సమస్యలను అధిగమించాం. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన సచివాలయాలను నగరంలో ఏర్పాటు చేయడం, ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలను అందించడం, సుమారు 3 వేల మంది వార్డు వలంటీర్లను ఎంపిక చేయడం, కరోనా కట్టడి వంటివి చాలెంజింగ్‌గా తీసుకుని పనిచేశాం. అర్జీలను పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ మార్కండేయులు (ఫైల్) సేవలో విలక్షణ శైలి అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ అధికారి స్థాయికి చేరుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రెవెన్యూ పాలనలో తన మార్క్ వేస్తున్నారు. భూ బకాసురులపై కొరడా ఝళిపిస్తున్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వా«దీనానికి చర్యలు చేపట్టారు. పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజల ప్రశంసలు అందుకున్నారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న జేసీ (రెవెన్యూ) డి.మార్కండేయులుపై ప్రత్యేక కథనం. – చిత్తూరు కలెక్టరేట్ జిల్లా పాలనలో తనదైన మార్క్ వేసుకున్నారు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డి.మార్కండేయులు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సమర్థవంతగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీకి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేందుకు కిందిస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కింది స్థాయి నుంచి ఐఏఎస్‌గా ఎదిగిన ఆయన గతంలో డీఆర్ఓగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికలసంఘం జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. 2019 జూన్ 24 న జాయింట్ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తవుతోంది. భూఆక్రమణలపై ప్రత్యేక దృష్టి జాయింట్ కలెక్టర్ మార్కండేయులు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముందుగా వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఏడాదిలో సుమారు 225.12 ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేశారు. వెదురుకుప్పం మండలం అల్లమడుగు గ్రామంలో 86.38 ఎకరాలు, ఎస్ఆర్పురం మండలంలోని జీఎంఆర్ పురంలో 9.00 ఎకరాలు, పెనుమూరు మండలం గుంటిపల్లిలో 35 ఎకరాలు, నారాయణమండలం బొప్పరాజుపాళ్యంలో 36.97 ఎకరాలు, వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరులో 10.29 ఎకరాలను ప్రభుత్వానికి స్వా«దీనం చేశారు. అలాగే శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లిలో సర్వే నంబర్ 1లో 903.63 ఎకరాలు, సోమల మండలంలోని పెద్దఉప్పరపల్లిలో 269/7 సర్వే నంబర్లో 1.58 ఎకరాల గుట్టపోరంబోకును సర్కార్ ఆధీనంలోకి తీసుకువచ్చారు. ఎస్టేట్ అబాలి‹Ùమెంట్ యాక్ట్ 1948 ప్రకారం 11 కేసులకు గాను 92.10 ఎకరాల భూ సమస్యలను పరిష్కారించారు. 22ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం 166 కేసులకు గాను 314.70 ఎకరాల భూ సమస్యలకు తెరదించారు. 32 చుక్కల భూముల కేసులకు గాను 28.41 భూ సమస్యలకు పరిష్కారం చూపించారు. చదవండి: మాతృదేవతా మన్నించు! స్పందన సమస్యల పరిష్కారం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారు. ఏడాది కాలంలో భూ సమస్యలపై ప్రజలిచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల ద్వారా పరిష్కారం చేయించారు. హైవే విస్తరణ సమస్యలకు చెక్ జిల్లాలో జరుగుతున్న ఎన్‌హెచ్–140 హైవే పనుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. భూ విరాళదాతలకు వెంటనే పరిహారం అందించేందుకు కృషి చేశారు. ముఖ్యంగా కుక్కలపల్లి, కాణిపాకం, పూతలపట్టు, పి.అగ్రహారం, కొత్తకోట, పాకాల, గాదంకి, చంద్రగిరి ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించారు. ఈ పనులకు రూ.21,11,66,852ల నష్టపరిహారం పంపిణీ చేశారు. అదేవిధంగా బెంగళూరు– చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే పనులకు 1,57,113.70 చదరపు అడుగుల భూమిని కేటాయించి రూ. 84.80 కోట్ల పరిహారం అందించారు. జిల్లాలో పనిచేయడం అదృష్టం చిత్తూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సాగుతున్న కసరత్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నా. ఆక్రమణకు గురైన భూములను తిరిగి ప్రభుత్వం పరం చేయడం సంతృప్తినిచ్చింది. కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నాం. – మార్కండేయులు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) -
జాయింట్ కలెక్టర్‌గా అట్టాడ సిరి
అనంతపురం అర్బన్: జిల్లా జాయింట్ కలెక్టర్ (విలేజ్, వార్డు సెక్రటేరియెట్ అండ్ డెవలప్మెంట్)గా అట్టాడ సిరి(ఐఎస్ఎస్)ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం జీఓ 849ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆమెను జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. అయితే గతంలో ఇదే స్థానంలో ఉపాధి, శిక్షణ డైరెక్టర్‌గా ఉన్న బి.లావణ్యవేణిని ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆమెకు బదులు ఎ.సిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్ కలెక్టర్ల వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. అన్ని జిల్లాల నాన్‌కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్ జేసీలుగా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అనంతపురం జేసీ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల బదిలీ అయిన స్థానాలు.. ► శ్రీకాకుళం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా సుమిత్‌కుమార్ ► శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కె.శ్రీనివాసులు ► విజయనగరం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్ ► విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా మహేష్ కుమార్ రావిరాల ► విశాఖపట్నం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.వేణుగోపాల్‌రెడ్డి ► విశాఖపట్నం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి. అరుణ్‌బాబు ► తూర్పు గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి.లక్ష్మీషా ► తూర్పు గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కీర్తి చేకూరి ► పశ్చిమ గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.వెంకటరమణారెడ్డి ► పశ్చిమ గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా హిమాన్షు శుక్లా ► కృష్ణా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.మాధవీలత ► కృష్ణా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా శివశంకర్ లోతేటి ► గుంటూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఏఎస్ దినేష్‌కుమార్ ► గుంటూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి.ప్రశాంతి ► ప్రకాశం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జె.వెంకటమురళీ ► ప్రకాశం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా టీఎస్ చేతన్ ► నెల్లూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా వి.వినోద్‌కుమార్ ► నెల్లూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎన్. ప్రభాకర్‌రెడ్డి ► చిత్తూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా డి. మార్కండేయులు ► చిత్తూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వీరబ్రహ్మయ్య ► వైఎస్సార్ జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.గౌతమి ► వైఎస్సార్ జిల్లా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా సాయికాంత్ వర్మ ► అనంతపురం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిషాంత్‌కుమార్ ► అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా లావణ్య వేణి ► కర్నూలు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రవిసుభాష్ ► కర్నూలు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎస్.రామసుందర్‌రెడ్డి -
‘తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దు’
సాక్షి, కాకినాడ: జిల్లా వ్యాప్తంగా 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అదనంగా మరో 100 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు ఎవ్వరూ తక్కువ ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవద్దని ఆయన సూచించారు. రైతులు తమ పంటను విక్రయించాలనుకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలకే రానవసరం లేదని.. మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదా 1902 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో రబీ పంట సాగు అయ్యిందన్నారు. 878 వరి కోత యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా అని.. దాంట్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని లక్ష్మీ షా వివరించారు. -
మారు వేషంలో ధరలు తెలుసుకున్న జేసీ!
సాక్షి, విజయనగరం: లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల వ్యాపారులు కొందరు ధరలు పెంచేస్తున్నారు. దీంతో కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజల జేబులకు చిల్లులు తప్పడం లేదు. అయితే, అధిక ధరలు వసూలు చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ వినూత్న ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాజీవ్ మైదానంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. కొందరు వ్యాపారులు నిత్యావసరాలు, కూరగాయల్ని రూ.5 ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అనంతరం అధికారులతో చర్చించి.. రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జేసీ మారు వేషంలో వచ్చింది తెలుసుకుని వ్యాపారులు షాకయ్యారు. (చదవండి: ‘వృద్ధులు, పిల్లలు ఏమాత్రం బయటకు రావొద్దు’) (చదవండి: ఏపీలో 87కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు) -
రైతుబజార్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
-
భర్త మాటలే సైంటిస్ట్ నుంచి ఐఏఎస్‌కు..
సాక్షి, అమరావతి బ్యూరో: ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటారు. రెండు మూడు పర్యాయాలు ప్రయత్నిస్తే గాని ఎంపిక కాలేరు. కానీ ఆమె మాత్రం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. పైగా తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ (మహిళా విభాగంలో)గా నిలిచి గ్రూప్–1కు సెలెక్టయ్యారు. సైంటిస్టుగా ఉద్యోగంలో చేరి, గ్రూప్–1 అధికారిగా ఎంపికై, అంచెలంచెలుగా ఐఏఎస్‌కు ఎదిగిన ఆమె కె.మాధవీలత. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాధవీలత విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ఆమెను పలకరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. వ్యవసాయ పరిశోధనలో 4 గోల్డ్‌మెడల్స్.. మాది కడప. నాన్న కృష్ణారెడ్డి రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. అమ్మ రామలక్ష్మి గృహిణి. అమ్మా, నాన్నలకు ముగ్గురూ ఆడపిల్లలమే. నేను పెద్దదాన్ని. పెద్ద చెల్లెలు రాధిక అమెరికా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్. చిన్న చెల్లెలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలు బాగా చదువుకోవాలని, ప్రయోజకురాలివి కావాలని చెప్పేవారు. వారి మాటలు నాలో పట్టుదలను పెంచాయి. నేను అగ్రికల్చర్లో పీహెచ్డీ చేశాను. కందులపై ప్రపంచంలోనే తొలిసారిగా పరిశోధనలు చేసి నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించాను. ఇక్రిసాట్‌లో సైంటిస్టుగా చేరాను. మా వారు పి.రామమునిరెడ్డి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సైంటిస్టు (ప్రస్తుతం పంచాయతీరాజ్‌లో వాటర్‌షెడ్స్ డైరెక్టర్). నువ్వు ప్రతిభావంతురాలివి. గ్రూప్–1కు ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా? అని నా భర్త సూచించారు. అందుకు అంగీకరించి గ్రూప్–1కి ప్రిపేరయ్యాను. దీనికి అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అంతా ‘ఆయనే’ సమకూర్చారు. రోజుకు 12 గంటలు కష్టపడి చదివి పరీక్ష రాశాను. తొలి ప్రయత్నంలోనే (2007లో) మహిళా విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాను. తొలుత డిప్యూటి కలెక్టర్‌గా, ఆ తర్వాత నంద్యాల, నెల్లూరు ఆర్డీవోగా, తిరుపతి ‘తుడా’ కార్యదర్శిగాను పనిచేశాను. నేను ఉద్యోగంలో చేరకముందు ఎప్పుడూ ఐఏఎస్ కావాలనుకోలేదు.. ఆ దిశగా ప్రయత్నమూ చేయలేదు. గ్రూప్–1 అధికారి నుంచి 2014లో ఐఏఎస్ అయ్యాను. లేదంటే నేను శాస్త్రవేత్తగా నా పరిశోధనలు కొనసాగించేదాన్ని. 'అమ్మ మాట నన్ను ఐఏఎస్ దాకా నడిపించింది' ఎంతో సంతృప్తి.. జాయింట్ కలెక్టర్‌గా నా తొలి పోస్టింగ్ కృష్ణా జిల్లాలోనే. గత ఏడాది జూన్‌లో ఇక్కడ చేరాను. సైంటిస్ట్‌గా కొనసాగలేదన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఐఏఎస్‌గా నాకు ఎంతో సంతృప్తి ఉంది. ప్రజలకు నిత్యం సేవ చేసే అవకాశం దక్కిందన్న ఆనందం ఉంది. పురుషుడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ నా విజయం వెనక ‘ఆయన’ ఉన్నారు. నాలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించారు. ఆయన ఆశలకనుగుణంగానే గ్రూప్–1కు ఎంపికయ్యాను. క్రమంగా ఐఏఎస్‌గా పదోన్నతి పొందాను. మాకు ఇద్దరు పిల్లలు. బాబు కౌషిక్‌రెడ్డి ఇంటర్, పాప హర్షిత ఏడో తరగతి చదువుతున్నారు. -
అర్హులెవరికీ అన్యాయం జరగదు
సాక్షి, రాజమహేంద్రవరం: అర్హత ఉన్న ఏ ఒక్కరికీ ఏ పథకంలోనూ అన్యాయం జరగదని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం అంతే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ఉగాది నాటికి అర్హులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. జిల్లా వాసులకు సరిపడా బియ్యం అందించడమే కాకుండా మరో రెండు జిల్లాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేసేటంత సామర్థ్యం జిల్లాకు ఉందన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజానగరం ‘సాక్షి’ ప్రచురణ కార్యాలయానికి విచ్చేసిన ఆయనతో ‘సాక్షి’తో జరిపిన చిట్‌చాట్.. సాక్షి : రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాలో పనిచేయడంపై మీ అభిప్రాయం. జేసీ: తూర్పుగోదావరి పెద్ద జిల్లా. అన్ని రంగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాక్షి :ఈ జిల్లాలో పనిచేసే అధికారులు ఎలా ఫీలవుతుంటారు. జేసీ: ఏ ఉద్యోగి అయినా ఈ జిల్లాలో పని చేస్తే దేశంలో ఏ జిల్లాలోనైనా అత్యంత సమర్థంగా, ఏ రంగంలోనైనా మంచి అనుభవంతో పని చేయవచ్చు. సాక్షి ఎడిటోరియల్ విభాగంలో జరిగే కార్యకలాపాలను జేసీ లక్ష్మీశకు వివరిస్తున్న ఎడిషన్ ఇన్చార్జ్ కృష్ణారావు, బ్యూరో చీఫ్ ఎల్.శీనివాస్ సాక్షి : ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఈ జిల్లాలో పనిచేయాలనుకుంటారు. మీరేమనుకుంటున్నారు. జేసీ: పెద్ద జిల్లా కావడంతో పాటు భౌగోళికంగా అన్ని ప్రాంతాలు ఉండడంతో ఎక్కువ అవగాహన కోసం ఉపయోగపడుతుంది. తీర, గిరిజన ప్రాంతాలు మంచి ఆహ్లాదకరంతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చేవిగా ఉండడంతో జిల్లాను మంచి అభివృద్ధి చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. సాక్షి :ప్రభుత్వ ప్రాధాన్య అంశాలేమిటి? జేసీ: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, నవరత్న పథకాల అమలుకు జిల్లా నలుమూలల పర్యటించి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కృషి చేస్తున్నాం. సాక్షి :గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ప్రచురణ యంత్రాల వివరాలు జేసీకి వివరిస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ రామకృష్ణ, చిత్రంలో బ్రాంచి మేనేజర్ రమేష్ రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది జేసీ: జిల్లాలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. అవనీతికి తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరి కొద్ది రోజులు నడిస్తే అన్నింటికీ వలంటీర్ల వ్య వస్థ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి : రాష్ట్రానికి అన్నపూర్ణగా పిలిచే జిల్లా నుంచి బియ్యం జిల్లా వాసులందరికీ సరిపోతుందంటారా? జేసీ: జిల్లాలో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో బియ్యం ఇక్కడి కుటుంబాలందరికీ సరిపోగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన శ్రీకాకుళంలో ఇంటింటికీ బియ్యం పంపిణీ ప్రారంభించారు. అక్కడి అవసరానికి తగ్గట్టుగా మన జిల్లా నుంచే బియ్యం సార్టెక్స్ చేసి ప్యాకింగ్‌ల్లో 13 వేల టన్నుల బియ్యాన్ని పంపించే ఏర్పాటు చేశా సాక్షి : నాణ్యమైన బియ్యానికి, ఇప్పుడు ఇస్తున్న బియ్యానికి తేడా ఏమిటి? సాక్షి ముద్రణ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ, వివిధ విభాగాల సిబ్బంది జేసీ: ఇప్పుడు ప్రభుత్వం అందించే బియ్యాన్ని పరిశీలిద్దాం, ఆ బియ్యాన్ని నిల్వ చేయడానికి సాంకేతికంగా చేసే ఏర్పాటుతో కొంత పౌడర్లా బియ్యానికి పట్టి ఉంటుంది. దాని వల్ల ఇప్పుడిస్తున్న బియ్యం వాసన కూడా వస్తుంటాయి.అదే త్వరలో పంపిణీ చేసే బియ్యం పూర్తి నాణ్యతతో కూడుకుని ఉంటుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నా. సాక్షి : నాణ్యమైన బియ్యం ఎలా వస్తుంది? అందుకు కారణమేమిటి? జేసీ: బియ్యం బజార్లో కిలో రూ.60 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ షాపుల వద్ద నుంచి అందించే బియ్యాన్ని దగ్గర పెట్టి పరిశీలిస్తే బజార్లో దొరికే బియ్యం కన్నా రేషన్ షాపుల నుంచి ఇచ్చే బియ్యం నాణ్యంగా ఉండనున్నాయి. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని సార్టెక్స్ చేసి అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి ప్రింటింగ్ యూనిట్లో పేపరు నాణ్యతను ఆసక్తిగా గమనిస్తున్న జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ సాక్షి : కొత్తగా రేషన్ కార్డులు ఎన్ని ఇస్తున్నారు. వారికి ఎంత మేరకు బియ్యం అవసరమవుతాయంటారు. జేసీ: జిల్లాలో 16.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి స్థానే త్వరలో బియ్యం కార్డులు అందజేస్తాం. లక్ష కొత్తకార్డులు వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ 25 వేల టన్నులు బియ్యం అవసరమని అంచనా వేస్తున్నాం. రేషన్ కార్డు ఇది వరకు బహుళ ప్రయోజనకరంగా ఉపయోగపడేది. ఇప్పుడు రైస్ కార్డుగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ కార్డుపై బియ్యం మాత్రమే ఇస్తారు. ప్రతి ప్రభుత్వ పథకానికి ఒక కార్డు ఇవ్వనున్నారు. కనుక బియ్యం అవసరం ఉంటేనే బియ్యం కార్డు ఇస్తారు. సాక్షి : ఇంటింటా బియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనుకుంటున్నారు. జేసీ: ఏప్రిల్ నుంచి జిల్లాలో ఇంటింటా బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
పాలనలో కొత్త పుంతలు.. కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పాలనలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం జిల్లా అధికారులకు పని విభజన చేసింది. ప్రస్తుతమున్న జిల్లా కలెక్టర్లకు చేదోడు వాదోడుగా ఉండటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలను పూర్తి చేసేందుకు అదనపు కలెక్టర్లను నియమించింది. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టును రద్దు చేసి దాని స్థానే ఇద్దరు అడిషనల్ కలెక్టర్లను నియమించి వారికి వేర్వేరు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యంగా కొత్తగా తేవాలనుకుంటున్న రెవెన్యూ చట్టంతోపాటు ఇప్పటికే అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్, పుర చట్టాలను సమర్థంగా అమలు చేయడమే ప్రధాన బాధ్యతగా ఈ పోస్టులను తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థలను గాడిన పెట్టడం, రెవెన్యూ వ్యవహారాలను కొలిక్కి తేవడమే ప్రాతిపదికగా కొత్త సారథులను రంగంలోకి దించింది. మొత్తంమీద జిల్లా స్థాయిలో ఇక నుంచి కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లతో తీన్‘మార్క్’పడనుంది. పల్లె, పట్టణాలకు పెద్దపీట... ప్రస్తుతం జేసీలుగా పనిచేస్తున్న వారు ఇక నుంచి అదనపు కలెక్టర్ (సాధారణ) బాధ్యతలు నిర్వహించనున్నారు. వారు రెవెన్యూ వ్యవహారాలతో పాటు పౌర సరఫరాలు, కొనుగోళ్ల కమిటీ, భూసేకరణ అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ పోస్టుకుతోడు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పదవిని ప్రభుత్వం సృష్టించింది. పంచాయతీరాజ్, పురపాలనను ఈ అధికారి పరిధిలోకి తేనుంది. దీంతో పట్టణ, పంచాయతీల్లో పాలనను పారదర్శకంగా, అవినీతిరహితంగా మలచాలని భావిస్తోంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలపై కలెక్టర్లకు పెద్దగా అధికారాలుండేవి కావు. యాజమాయిషీ అంతా పురపాలకశాఖ డైరెక్టర్‌దే ఉండేది. కమిషనర్లు, ఇతర ఉద్యోగులు తప్పులు చేస్తే చర్యలు తీసుకొనే అధికారం కూడా కలెక్టర్లకు లేదు. కేవలం సిఫారసుకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉండేది. అయితే మనుగడలోకి వచ్చిన కొత్త పుర చట్టంలో ఈ లోటును అధిగమించేలా సర్కారు సంస్కరణలు చేపట్టింది. పురపాలికలనూ కలెక్టర్ల పరిధిలోకి తెచ్చి వారికి సంపూర్ణ అధికారాలు కట్టబెట్టింది. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకు వేసింది. పురపాలన పర్యవేక్షణకు ఏకంగా అదనపు కలెక్టర్లను నియమించి పరిపాలనలో సంస్కరణలకు కొత్త బీజం వేసింది. అయితే అదనపు కలెక్టర్‌ను కేవలం మున్సిపల్ వ్యవహారాలకే పరిమితం చేయకుండా పంచాయతీరాజ్ పగ్గాలను కూడా అప్పగించనుంది. తద్వారా స్థానిక సంస్థలపై పట్టుబిగించేలా జిల్లా పాలనలో కీలక సంస్కరణ తీసుకొచ్చింది. పల్లె ప్రగతి కార్యక్రమాల పర్యవేక్షణ, హరితహారం, నర్సరీల నిర్వహణ వ్యవహారాలను వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పురపాలనలో పట్టణ æప్రగతి, లే అవుట్ల మంజూరు, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చే కమిటీలో వారే ప్రధాన పాత్ర పోషించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాడు ఏజేసీ.. నేడు జేసీ పోస్టుకు మంగళం గతంలో రంగారెడ్డి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో అడిషనల్ జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) పోస్టు ఉండేది. ఏజేసీకి కూడా కొన్ని శాఖలను కేటాయించడం ద్వారా పని విభజన చేశారు. రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇద్దరు జేసీలు ఉండేవారు. వారికి జిల్లాలోని మండలాలను దాదాపు చెరిసగం పంచారు. అలాగే సంక్షేమం, పౌర సరఫరాలు తదితర శాఖలతో సర్దుబాటు చేశారు. అయితే విధానపరమైన నిర్ణయాల్లో అంతిమ నిర్ణయం మాత్రం జిల్లా కలెక్టర్‌కే ఉండేది. 2016లో జిల్లాల పునర్విభజన అనంతరం ఏజేసీ పోస్టులు సహా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్–2 పోస్టును కూడా రద్దు చేసి ఒకరితోనే సరిపెట్టారు. తాజాగా అన్ని జిల్లాల్లో జేసీ పోస్టును ఎత్తేసి ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించడం ద్వారా పాలనను కొత్త పుంతలు తొక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖను సంస్కరించాలని భావిస్తున్న సీఎం... మరిన్ని కొత్త నిర్ణయాలు, పాలనాపరమైన అధికార వికేంద్రీకరణ జరిపే అవకాశం లేకపోలేదు. మరిన్ని అధికార కేంద్రాలను సృష్టించే ఆస్కారమూ లేకపోలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. అయితే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందులో భాగంగానే జిల్లా పాలనా కేంద్రాల్లో మార్పులు జరిగి కొత్త పోస్టును సృష్టించారనే ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ప్రజల దైనందిన వ్యవహారాల్లో కీలకమైన రెవెన్యూ వ్యవస్థను పకడ్బందీగా నడిపించే బాధ్యతను అదనపు కలెక్టర్లు చూస్తారని, మిగతా రెవెన్యూ శాఖ స్వరూపంలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని తెలుస్తోంది. గ్రామస్థాయి పోస్టుల్లో కొన్నింటిని మార్చడంతోపాటు భూ రికార్డుల సవరణలు, రిజిస్ట్రేషన్ చట్టాల అమలు బాధ్యతలను ఆర్డీవో, ఆపై స్థాయి అధికారులకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం... జిల్లా కలెక్టర్లతోపాటు కొత్తగా నియమితులైన అదనపు కలెక్టర్లకు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మొత్తం 8 అంశాలతో ఎజెండా తయారు చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో కలెక్టర్ల పాత్ర, ప్రక్షాళన చేసిన భూ రికార్డుల ఫ్రీజింగ్, అదనపు కలెక్టర్ల జాబ్‌చార్ట్, కీలక ప్రగతి సూచికలు, మత్స్య సంపద, మాంస ఉత్పత్తుల పెంపుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగంగా కీలక మానవాభివృద్ధి సూచికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేయనున్నారని, ఈ విషయంలోనే జిల్లా అధికారులు చేపట్టాల్సిన కీలక చర్యల గురించి వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు కొత్త రెవెన్యూ చట్టం అమలుపైనా ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్టు సమాచారం. -
తెలంగాణలో జేసీ పోస్టు రద్దు
-
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా సంస్కరణల అమల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో రెవెన్యూ చట్టం అమలు, భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టును రద్దు చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించింది. చాలా జిల్లాల జాయింట్ కలెక్టర్లను అదే జిల్లాకు అదనపు కలెక్టర్లుగా బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త అధికారులను అదనపు కలెక్టర్లుగా, అలాగే 14 జిల్లాలకు వేరే అధికారులను అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 49 మంది నాన్‌కేడర్, కేడర్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పాలన సర్వీసుల దిశగా.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీసును నెలకొల్పి రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేసి అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పోస్టులను సృష్టించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కలెక్టర్ నేతృత్వంలోని అదనపు కలెక్టర్ల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)లకు కొన్ని నిర్దిష్ట శాఖలు అప్పగించనుంది. అదనపు కలెక్టర్లు ప్రధానంగా రెవెన్యూ శాఖను పర్యవేక్షించనున్నారు. అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థలు)కు ప్రభుత్వం కీలకమైన కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల అమలు బాధ్యతలను అప్పగించనుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, అకస్మిక తనిఖీలు, నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారాలను వీరికి కట్టబెట్టనుంది. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను సైతం వీరి పరిధిలోకి తీసుకురానుంది. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల గణన (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులను వీరికే అప్పగించే అవకాశముంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, నర్సరీ ఏర్పాటు, సర్టిఫికెట్ల జారీ ఇకపై వీరే పర్యవేక్షించనున్నారు. వీరిపై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పోస్టుల విధులు, బాధ్యతలు, జాబ్ చార్ట్‌పై ఈ నెల 11న నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. అవినీతి నిర్మూలనే ప్రధాన ధ్యేయం.. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భారీగా పరిపాలన వికేంద్రీకరణ జరిగినా అవినీతి కారణంగా ప్రజలకు ఆశించిన ఫలితాలు అందట్లేదు. అవినీతి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకురాగా, త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావల్సిన పనులు జరగాలని, ఇందుకు కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా స్థాయిలో కొత్తగా అదనపు కలెక్టర్ పోస్టులను సృష్టించి, ఒక్కో అదనపు కలెక్టర్‌కు కొన్ని కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించబోతోంది. త్వరలో రాష్ట్ర స్థాయిలో కూడా.. రాష్ట్ర స్థాయిలో సైతం ప్రభుత్వం పాలన సంస్కరణలను అమలు చేయబోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. సీఎస్‌కు సహాయంగా అదనపు సీఎస్ల బృందాన్ని నియమించనుంది. వీరికి కొన్ని శాఖల బాధ్యతలను అప్పగించనుంది. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించనుంది. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోనుంది. (చదవండి: అక్బరుద్దీన్ ఒవైసీ వినతి.. కేసీఆర్ ఆదేశం) -
జిల్లాలో ఇసుక కొరత లేదు: జాయింట్ కలెక్టర్
సాక్షి, పెరవలి(పశ్చిమ గోదావరి): జిల్లాలో ఇసుక కొరత లేదని.. రోజుకు 20 వేల టన్నులు లభిస్తుందని, జిల్లా అవసరాలు పోను మిగిలింది ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నామని జిల్లా జాయింట్ కలక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇసుక వారోత్సవాల సందర్భంగా కానూరు–పెండ్యాల ఇసుక ర్యాంపును బుధవారం ఆయన ప్రారంభించారు. జిల్లాలో 22 రీచ్‌ల ద్వారా ఇసుక తీస్తున్నామని, ఓపెన్ రీచ్‌లు అయిన ఖండవల్లి నుంచి ఇసుక సరఫరా అవుతుందని, వారం రోజుల్లో ఉసులుమర్రు, కానూరు–పెండ్యాల ర్యాంపుల నుంచి కూడా ఇసుక లభ్యమవుతుందని చెప్పారు. దీంతోపాటు కొత్త రీచ్‌ల కోసం సిఫార్సులు చేస్తున్నామని వాటికి అనుమతులు వస్తే ఇసుక రాష్ట్రం అంతా సరఫరా చేయవచ్చన్నారు. డ్రెడ్జింగ్‌కు అనుమతులు గోదావరిలో ఆనకట్టపైన ఉన్న ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ చేయటానికి అనుమతులు వచ్చాయని దీని ద్వారా కూడా ఇసుక లభ్యమవుతుందని జేసీ తెలిపారు. డ్రెడ్జింగ్‌కు టెండర్లు పిలుస్తున్నామని అవి పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. దీని కోసం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా గోదావరిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు జిల్లా సరిహద్దు అయిన చింతలపూడి నుంచి కుక్కునూరు వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇందుకోసం రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులను నియమించామన్నారు. అక్రమంగా ఇసుక తరలించినా, నిల్వ చేసినా, ఇతర ప్రాంతాలకు తరలించినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా తప్పదని హెచ్చరించారు. స్టాకు యార్డుల ఏర్పాటు జిల్లాలో ఇసుకను లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించటానికి ప్రధాన పట్టణాలతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో స్టాకుయార్డులను ఏర్పాటు చేస్తున్నామని జేసీ తెలిపారు. ఏలూరు, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, జంగారెడ్డి గూడెం, తణుకు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యార్డుల వద్దే ఇసుక ధరలు పట్టిక కూడ ఉంటుందని, అంతకుమించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇసుక తోలటానికి 500 వాహనాలకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటికి జీపీఎస్ అమర్చుతామని దీని వలన వాహనం ఎక్కడ ఉందో తెలుస్తుందని తెలిపారు. జీపీఎస్ విధానాన్ని సక్రమంగా అమలు చేయడానికి బృందాన్ని ఏర్పాటుచేస్తామని, పది రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయన్నారు. కొత్త ర్యాంపులకు సిఫార్సు జిల్లాలో గోదావరి ప్రాంతంలో కొత్త ర్యాంపుల ఏర్పాటు చేయటానికి సిఫార్సులు పంపించామని అనుమతులు వచ్చిన వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని జేసీ తెలిపారు. ఇలా చేస్తే జిల్లా అవసరాలతో పాటు రాష్ట్రం నలుమూలకు ఇసుక సరఫరా చేయవచ్చన్నారు. ఇసుక మాఫియాకు చెల్లు ఇసుక ర్యాంపుల్లో మాఫియా ఆగడాలకు కాలం చెల్లిందని దళారీ వ్యవస్థ లేకుండా చేయటమే తమ ముందున్న లక్ష్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దోచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తే తమ ప్రభుత్వం ప్రజలకు సేవలు చేయటానికి కృషి చేస్తుందన్నారు. ఇసుక అమ్మకాల్లో అక్రమాలకు తావులేకుండా ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, కేంద్రపార్టీ రాజకీయ సలహాదారుడు జీఎస్ రావు, జిల్లా మైనింగ్ డీడీ వైఎస్ బాబు, ఏపీఎండీసీ జిల్లా ఇన్చార్జి గంగాధరరావు, కొవ్వూరు ఆర్డీఓ నవ్య, తహసీల్దార్ పద్మావతి, మండల కనీ్వనర్ కార్చెర్ల ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొమ్మిశెట్టి రాము, యూత్ ప్రెసిడెంట్ తోట సురేష్, కరుటూరి గోపి, నిడదవోలు పట్టణ, రూరల్ కనీ్వనర్లు మద్దిపాటి ఫణీంద్ర, అయినీడి పల్లారావు వైíసీపీ నాయకులు పాల్గొన్నారు. -
నీట మునిగిన గ్రామాలలో పర్యటించిన జేసీ
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది మండలంలో నీటమునిగిన గ్రామాలను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే నీట మునిగిన గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గండిపడిన చెరువులకు మరమ్మత్తులు చేయడంతో పాటు, నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు నేడు, రేపు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వరదనీటితో నిండిపోయిన గ్రామాల్లో తక్షణ వైద్యసాయం అందించాలంటూ సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు ఆయన వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని, గ్రామ సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. -
జేసీ కుమారుడు సర్కార్ బడికి..
సాక్షి, విజయనగరం: కుటుంబ పోషణ కోసం రోజం తా కష్టపడే కూలీ సైతం తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలని తపన పడుతున్న రోజులివి. వాటికి భిన్నంగా.. ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించేలా.. తన తోటి అధికార యంత్రాంగానికి ఆదర్శంగా నిలిచేలా జేసీ–2 కూర్మనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఒక్కగానొక్క కుమారుడు ఆర్.త్రివిక్రమ్‌ను విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న కస్పా ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో సోమవారం ఉదయం చేర్పిం చారు. హెచ్ఎం శంకరరావు నుంచి ప్రవేశ ధ్రువీ కరణపత్రం తీసుకున్నారు. అనంతరం స్వయం గా తనే తరగతి గదికి కుమారుడిని తీసుకెళ్లి సహ విద్యార్థుల మధ్య కూర్చోబెట్టారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచేందుకే... రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోంది.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వి నియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు తన కొడుకుని ప్రభుత్వ బడిలో చేర్పించినట్టు జేసీ–2 కూర్మనాథ్ వెల్లడించారు. విద్యార్థి చిన్నతనం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలన్నీ ప్రభుత్వ బడులలో అందుబాటులో ఉంటాయన్నారు. తద్వారా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేవలం చదువులోనే కాకుండా శారీరక దారుఢ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సమాజం పట్ల అవగాహన ప్రభుత్వ పాఠశాలల్లో సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు అమ్మఒడి పథకం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఉపకార వేతనాలు అందజేస్తోందని తెలిపారు. వీటి కోసం బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వబడుల్లో చక్కగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు చదువుకునే వాతావరణం ఇంటివద్ద కల్పిస్తే చాలన్నారు. -
మీడియాకు నో ఎంట్రీ.!
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కవరేజీపై సాక్షాత్తు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి నాయక్ ఆంక్షలు విధించారు. ప్రజావాణి సమావేశ మందిరంలోకి జర్నలిస్టులకు అనుమతి లేదని, ఫొటోలు తీసుకుని వెళ్లి పోవాలని, సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు పంపే ప్రెస్‌నోట్ చూసి వార్తలు రాసుకోవాలని సూచిస్తూ సరి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఇదేంటని ప్రశ్నించిన జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది సహకారంతో వారిని బలవంతంగా సమావేశ మందిరం నుంచి బయటికి పంపిన సంఘటన హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు వివిధ పత్రికలు, చానళ్ల రిపోర్టర్లు కలెక్టరేట్‌కు వెళ్లారు. జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ ఇతర సమీక్షా సమావేశాల్లో బిజీగా ఉన్నందున ‘ప్రజావాణి’కి హాజరుకాలేదు. దీంతో జాయింట్ కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి భూపాల్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం ప్రజా సమస్యలకు సంబంధించి ఆయా శాఖల అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్త చేశారు. దీనిని గమనిస్తున్న జర్నలిస్టులను గుర్తించిన జేసీ జర్నలిస్టుల ప్రజావాణికి పాత్రికేయులు రావాల్సిన అవసరం లేదని, ఫొటోలు తీసుకొని బయటికి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నివ్వెరపోయిన జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా కవరేజీ కోసం వచ్చినట్లు చెప్పగా, మీరు జర్నలిస్టులని తెలుసునని, అయితే సమావేశ మందిరంలోకి అనుమతి లేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులైనా.. తాము ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేటెడ్ జర్నలిస్టులమని కార్డులు చూపిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలను కవర్ చేసేందుకు అనుమతి ఉంటుందని కొందరు పాత్రికేయులు జేసీకి వివరించే ప్రయత్నం చేయగా ప్రజావాణి కార్యక్రమం పిటీషన్లు స్వీకరించేందుకు మాత్రమేనని, డీపీఆర్ఓ ప్రెస్ నోట్ పంపిస్తారని, దీనిని ప్రత్యేకంగా కవరేజీ చేయాల్సిన అవసరం లేదన్నారు.వారు పంపించింది రాసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ప్రజావాణి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నామని, అన్ని జిల్లాల్లో మీడియాను అనుమతిస్తున్నట్లు చెప్పగా ఆగ్రహానికిలోనైన జేసీ ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసుకోవచ్చు జాయింట్ కలెక్టర్ ప్రజావాణికి రానివ్వడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చునని సూచించారు. అనంతరం ‘కాల్ది డీపీఆర్ఓ’ అంటూ జర్నలిస్టులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దీంతో జిల్లా రెవెన్యూ అధికారి సీసీ పవన్ అక్కడికి వచ్చి ప్రాతికేయులను బయటికి వెళ్లాలంటూ నెట్టివేసేందుకు ప్రయత్నించారు. దీంతో కలెక్టరేట్ ఏఓ ఆశోక్ రెడ్డి అక్కడికి వచ్చి తర్వాత మాట్లాడుకుందాం... మొదట బయటికి వెళ్లాలని విలేకరులను బయటికి పంపారు. అనంతరం డీపీఆర్ఓను వేదిక వద్దకు పిలిపించుకున్న జేసీ కేవలం ఫొటోలు తీసుకుని పొమ్మనండి.. మీరు పంపించిన ప్రెస్‌నోట్ రాసుకోమ్మని చెప్పాలంటూ హుకుంజారీ చేయడం విస్మయానికి గురిచేసింది. -
అన్న క్యాంటీన్ అవినీతిపై దర్యాప్తు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : గత ప్రభుత్వ హయాంలో పేదలకు భోజనం పెట్టే పేరుతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో దోచేశారని, జిల్లాలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ జేసీ ఎం.వేణుగోపాలరెడ్డిని కోరారు. దీనిపై స్థానిక కలెక్టరేట్లో గురువారం ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో జిల్లాలో మొత్తం 16 అన్న క్యాంటీన్లను నిర్మించారన్నారు. వీటి కొరకు ప్రభుత్వం నుంచి రూ.36 లక్షలు, స్థానిక మున్సిపాలిటీల నుండి రూ.6 లక్షలు చొప్పున మొత్తం రూ.42 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే స్థలం కొని దాని నిర్మాణం చేస్తే స్థలం, నిర్మాణము కలిపి ఒక చదరపు అడుగుకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుందన్నారు. అయితే అన్న క్యాంటీన్లు కట్టడానికి స్థలాలు మున్సిపాలిటీ, ప్రభుత్వ స్థలాలు కావడం వల్ల నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి రూ.1,500 చొప్పున మాత్రమే ఖర్చవుతుందన్నారు. అయితే గత పాలకులు ఒక చదరపు అడుక్కి రూ.5,532 చొప్పున వసూలు చేశారన్నారు. ఒక్కో అన్న క్యాంటీన్లో రూ.30 లక్షల వరకూ అవినీతి చోటు చేసుకుందని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ లెక్కన జిల్లాలోని 16 అన్న క్యాంటీన్లలో సుమారు రూ.4.80 కోట్లు అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ నిర్వహించి ప్రజాధనాన్ని కాపాడాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి గణపతిరావు, రేలంగి శ్రీనివాసరావు, కాపిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జేసీ వాహనానికి జరిమానా
సాక్షి, మంచిర్యాల : చట్టానికి ఎవరు అతీతులు కాదు.. నిబంధనలు అందరికీ సమానమే అని స్పీడ్ లేజర్ గన్ (కెమెరా) ద్వారా స్పష్టమైంది. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌కు చెందిన టీఎస్19సీ1009 నంబర్ గల వాహనానికి ఈ నెల 28న సైబర్‌బాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట వద్ద స్పీడ్ లేజర్ గన్‌తో జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్‌శాఖ వాహనాల అతివేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ లేజర్ గన్ను అందుబాటులోకి తెచ్చారు. రహదారులపై నిర్ధేశించిన వేగానికంటే అధికవేగంతో వెళ్తే స్పీడ్ లేజర్ గన్ పసిగడుతుంది. దీంతో ఈ–చలాన్ ద్వారా జరిమానా విధించడం జరుగుతోంది. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ వాహనం అతివేగంగా వెళ్లడంతో స్పీడ్ లేజర్ గన్ ద్వారా రూ.1035 జరిమానా విధించారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జాయింట్ కలెక్టర్
సాక్షి, కాకినాడ సిటీ(తూర్పు గోదావరి) : ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన కర్తవ్యమని జిల్లాకు కొత్త జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి.లక్ష్మీశ అన్నారు. ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ‘సాక్షి’తో మాట్లాడారు. తన అనుభవాలను, మనోభావాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాది కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని హాళుగుండనహాళీ అనే చిన్న పల్లెటూరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నా తల్లిదండ్రులు లక్ష్మమ్మ, గంగముత్తయ్య వ్యవసాయం చేస్తుంటారు. ఒక అన్న, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. నా బాల్యం అంతా కర్నాటకలోనే సాగింది. వ్యవసాయ కుటుంబం కావడంతో బీఎస్సీ అగ్రికల్చర్ చేసి అదే సబ్జెక్టులో పీహెచ్డీ చేశాను. అమ్మ కోరిక మేరకు ఐఏఎస్ చదివేందుకు ఢిల్లీ వెళ్లాను. అక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష కోసం చదివాను. 2010లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాను. అదే సమయంలో వ్యవసాయశాఖ కృషి విజ్ఞాన్ కేంద్రంలో సైంటిస్టుగా పోస్టింగ్ వచ్చింది. అప్పట్లో ప్రజలకు సేవ చేయాలన్నా, అమ్మ ఆశయం నెరవేరాలన్నా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసే కరెక్ట్ అని భావించి దానిలో చేరాను. అయితే అమ్మ కోరిక ప్రకారం ఐఏఎస్‌కు ఎంపిక కావాలనే ఆశయంతో మరోమారు ప్రయత్నించాను. ఇలా నాలుగో సారి 2013 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం సాకారమైంది. జేసీగా తూర్పులోనే తొలి పోస్టింగ్ 2013లో ఐఏఎస్‌గా ఎన్నిక అయిన తరువాత మొట్టమొదటిగా కర్నూలు జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా చేరాను. అనంతరం నూజివీడులో సబ్ కలెక్టర్‌గా పని చేశాను. అక్కడ నుంచి 2016లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెళ్లాను. అక్కడ పని చేస్తుండగా బదిలీ చేయడంతో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చాను. నూజివీడులో సబ్ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఎయిర్‌పోర్టుకు 450 ఎకరాల భూమిని ఫిల్లింగ్ చేశాను. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి 1,400 ఎకరాలు సేకరించాం. కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఇన్చార్జిగా పని చేశాను. జిల్లాను పూర్తి అవగాహన చేసుకుంటాను. మెరుగైన సేవల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాను. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాలను పేద వర్గాల ప్రజలకు నేరుగా చేరేందుకు కృషి చేస్తాను. భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడతాను. రైతులు నిత్యం ఎదుర్కొనే భూ సమస్యలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్స్, ఒకరి భూమి మరొకరి పేరిట ఆన్లైన్ చేయడం, భూమి కొలతలు, చుక్కల భూములు తదితర అనేక సమస్యలు ఉన్నాయి. జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకున్న అనంతరం రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయనతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం, తొండంగి తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములను సేకరించారు. ఆ భూములను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం. అదే విధంగా సివిల్‌సప్లైస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం, పంచదార, కందిపప్పు తదితర నిత్యావసర సరుకులు నేరుగా పేద ప్రజలకు చేరేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో పని చేయడం అదృష్టం వ్యవసాయ ప్రధానమైన, ధాన్యాగారంగా పేరున్న తూర్పుగోదావరి జిల్లాలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అదే ఉద్దేశంతో బీఎస్సీ అగ్రికల్చర్ చదివి పీహెచ్డీ చేశాను. రైతు బాగుంటేనే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం బాగుంటుందని నేను నమ్మడంతో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా పేద రైతుకు చేరేలా ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తాను. సీఎం జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అవినీతిరహిత పాలన సాగిస్తూ, ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని పేదలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. అధికారులు కూడా అందుకు అనుగుణంగానే పనిచేయాలి. ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తా. ప్రజలకు జవాబుదారీగానే పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రెవెన్యూలో అనేక రకాల భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా పని చేస్తాం. అమ్మ చెప్పింది.. అమ్మ నన్ను ఓ ఉన్నతమైన వ్యక్తిగా, పది మందికి సేవ చేసే వాడిగా చూడాలనుకొంది. బాగా చదువుకుంటేనే అది సాధ్యమవుతుందనుకున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆదర్శంగా తీసుకుని, అమ్మ ఆశయం నెరవేర్చాలని భావించాను. పేదరికంలో ఉన్నా నేను ఉన్నతస్థాయికి వెళ్లి పేదలకు సేవలు చేయాలన్న అమ్మ కోరికను నెరవేర్చాలని సంకల్పించుకున్నాను. ఒక్క ఐఏఎస్‌తోనే అది సాధ్యమని భావించాను. సాధించాను. –డి.లక్ష్మీశ -
వాస్తు సరిగా లేదని జేసీ బంగ్లాను కాజేసిన టీడీపీ ఎమ్మెల్యే!
చెరువులను కబ్జా చేసిన వాళ్లను చూశాం.. పేదోడి భూమిని కాజేస్తున్న వాళ్లనూ చూస్తున్నాం. ఖాళీగా కనిపిస్తే ప్రభుత్వ స్థలాలనూ దర్జాగా దక్కించుకుంటున్న వాళ్ల గురించీ విన్నాం. వీటికి మించిన విచిత్రం చిత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. వాస్తు దోషాల నివారణ కోసం టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు ఏకంగా జాయింట్ కలెక్టర్ బంగ్లా స్థలాన్నే ఆక్రమించేశారు. విలువ రూ.3 కోట్లు! టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ తన ఇంటి వాస్తు సరిగా లేదని పక్కనే ఉన్న దశాబ్దాల చరిత్ర కలిగిన జేసీ బంగ్లాకే ఎసరు పెట్టారు. దాదాపు రూ. 3 కోట్లు విలువ చేసే 7,200 చ.అడుగుల బంగ్లా స్థలాన్ని ఆక్రమించారు. రాత్రికి రాత్రే అందులో గోడ నిర్మించుకున్నారు. దీనికి అడ్డు రావడంతో పురాతన చింత చెట్లను కూడా నరికి వేయించారు. ఆక్రమించిన కొంత భూమిలో నాటు కోళ్ల ఫారం, లాన్, కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వాస్తు దోష నివారణకు.. చిత్తూరు సర్వే నెంబర్ 311/ఏలో 3.47 ఎకరాల్లో జేసీ బంగ్లా ఉంది. దీని పక్కనే 309/1ఏలో 7,500 చదరపుటడుగులు, 306/2లో 3,500 చదరపుటడుగుల్లో టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ నివాసం ఉంది. ఆమె ఇంటి వాస్తు సరిగా లేదని సిద్ధాంతి చెప్పడంతో దోషాల నివారణ కోసం ఉత్తరం వైపున్న జాయింట్ కలెక్టర్ బంగ్లా స్థలాన్ని ఆక్రమించుకుని గోడ కట్టేశారు. దీనిపై చర్యలు తీసుకోడానికి అధికారులు ప్రయత్నించినా పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో వెనక్కి తగ్గారు. ఆక్రమించిన స్థలంలో ఏర్పాటు చేసుకున్ననాటుకోళ్ల ఫారం, కారు షెడ్డు, లాన్ మీరిస్తానంటే చెప్పండి...! ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఎమ్మెల్యే సత్యప్రభ ఆక్రమణలకు పాల్పడటంతో... అప్పటి కలెక్టర్ సిద్దార్థజైన్, జేసీ భరత్‌గుప్తా బంగ్లా స్థలం కబ్జాకు గురైనా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ నేతలు కొందరు సీఎం వద్ద మొరపెట్టుకున్నా... ‘ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాకు ఫండింగ్ అవసరం. మీరు ఇస్తానంటే ఆమెపై చర్యలు తీసుకుంటా...!’ అని వ్యాఖ్యానించడంతో సైలెంట్‌గా వెళ్లిపోయినట్లు తెలిసింది. చింత దుంగలను ట్రాక్టర్లో తరలిస్తున్న దృశ్యం -
విజయనగరం: మీ ఓటును చెక్ చేసుకున్నారా?
నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.inజీఛి.జీn వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం ఇన్చార్జ్ అధికారి 9963794303 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు check your vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
గుంటూరు.. మీకు ‘ఓటుందా’..!
సాక్షి, గుంటూరు: - నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - కలెక్టరేట్లోని ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ 0863–2234070 - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ఈ నెల 15వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
పెథాయ్‌ను ఎదుర్కొందాం
విశాఖపట్నం, నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సృజన ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో ఆమె నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో ఆదివారం పర్యటించారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం, రేవుపోలవరం తీర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మత్య్సకారులు, తీరప్రాంత గ్రామాలవారితో మాట్లాడారు. భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. మండల, గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేసి తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అందుబాటులో ఉంచామన్నారు. కేటాయించిన గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అధికారులతో సమీక్ష.. పాయకరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో తీరప్రాంతం ఉన్న రాంబిల్లి, అచ్యుతాపురం,ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల అధికారులతో జేసీ సృజన అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, ఉపాధిహామీ, ట్రాన్స్‌కో, రవాణా, విద్యా, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ సృష్టించిన విధ్వంసం తెలిసిందే అన్నారు. అక్కడ చోటుచేసుకున్న పొరపాట్లు ఇక్కడ జరగకుండా పెథాయ్‌ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సోమవారం ఉదయం పదిగంటలకు తీరం దాటవచ్చని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభావిత గ్రామాలకు ముందుగానే నిత్యావసర సరుకులు తరలించాలని పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రక్షిత భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను పునరావాస కార్యక్రమాలకోసం స్వాధీనంలోకి తీసుకోవాలన్నారు. విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. 4 వేల విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 400 స్తంభాలు పాయకరావుపేట నియోజకవర్గానికి కేటాయించామన్నారు. మిగిలిన స్తంభాలు తూర్పుగోదావరి జిల్లాకు పంపినట్టు చెప్పారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులన్నింటినీ నీటితో నింపాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోని ట్యాంకులను కూడా నింపి తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైతే వాటర్ ప్యాకేట్ బస్తాలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. రేషన్ డీలర్లతో పాటు, మధ్యాహ్నభోజన పథక నిర్వాహకులను కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఒక్కో తుఫాన్ రక్షిత కేంద్రంలో 3 వేల మందికి భోజన వసతి ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిత్యావసర సరకులు ఈ రాత్రికే తీరప్రాంత గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. పొక్లెయిన్లు, జనరేటర్లతో సిద్ధంగా ఉండాలని విపత్తుల నివారణ శాఖను ఆదేశించారు. ఎక్కడైనా భారీ వృక్షాలు కూలిపోతే వెంటనే తొలగించడానికి అవసరమైన సంరంజామా సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వంనుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తీరప్రాంత గ్రామాల్లో విధులకు నియమించిన వారంతా అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో నర్సీపట్నం ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఏఎస్పీ హఫీజ్, డ్వామాపీడీ కల్యాణ చక్రవర్తి, డీపీవో కృష్ణకుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఐదుమండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు,ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి
డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వర్తించే అదికారులు, సిబ్బంది ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా, సూక్ష్మంగా పరిశీలించాలని జేసీ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్లో మంగళవారం ఎన్నికల మైక్రో అధికారులతో ఆమె సమావేశమయ్యారు. సాక్షి,సిరిసిల్ల : ఎన్నికల్లో ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సూచించారు. స్థానిక పొదుపు భవన్లో పోలింగ్ సూక్ష్మస్థాయి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో జరిగిన ప్రతీ అంశాన్ని మైక్రో పరిశీలకులు నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మైక్రో పరిశీలకులు కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఒకరోజు ముందుగానే మైక్రో పరిశీలకులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్‌లో వచ్చిన ఓట్లను ఈవీఎంలతో సరిపోల్చి, ఈవీఎం పనిచేస్తున్న విధానాన్ని ఏజెంట్లకు తెలపాలన్నారు. అన్ని సవ్యంగా ఉంటే ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీజ్‌చేయాలని సూచించారు. లోటుపాట్లు ఉంటే ఎన్నికల అధికారులకు నివేదించాలని కోరారు. సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రవత్ కుమార్లెంక, ఎల్డీఎం రంగారెడ్డి, ఎంఈవో రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
సాంకేతికతతో నిఘా..!
సాక్షి,నల్లగొండ: ఎన్నికల నిర్వహణ పారదర్శంగా సాగాలంటే అందుకు సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది.గమనించిన ఎన్నికల సంఘం ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతుల్లో ఉపయోగించి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పూనుకుంది. అందులో భాగంగా జిల్లాలో కూడా అన్ని పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా ఉండడంతో పాటు త్వరితగతిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఓటు నమోదుతో పాటు మార్పులు చేర్పులకు కూడా ఆన్లైన్లో అవకాశం ఇవ్వడంతో నేరుగా దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇంటర్నెట్ సౌకర్యం ఏవిధంగా ఉపయోగ పడిందనేది అర్థం అవుతుంది. అంతేకాక ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంల ద్వారా ఓటరు ఓటు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేస్తుండగా వీవీ ప్యాట్ల ద్వారా ఏ వ్యక్తికి, ఏ గుర్తుకు ఓటు వేసింది నిజంగా తను వేసిన గుర్తుకు ఓటు పడిందా లేదా అనేది వెంటనే తెలిసి పోతుంది. ఆ విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. అయితే ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ బూతును శాటిలైట్ ఆధారంగా గుర్తించడంతోపాటు, ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్ తీసుకువస్తున్నారు. దీనికి ఇంటర్నెట్ ఎంతో అవసరం ఉంది. ఇంటర్నెట్ అంతంత మాత్రమే.. బీఎస్ఎన్ఎల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందడం లేదు. చాలా గ్రామాల్లో బ్రాడ్‌బ్రాండ్ సేవలు అందడం లేదు. సెల్‌టవర్లు కూడా మారుమూల ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. దీంతో అన్ని గ్రామాలకు నెట్‌సౌకర్యం లేదు. గత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటర్ నెట్‌ను కంప్యూటర్లకు అనుసంధానం చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అయితే లైన్ల విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరించాలంటే చాలారోజులు పట్టేది. వాటిని అధిగమించి ఎన్నికల్లో సాంకేతికను ఉపయోగించాల్సి ఉంది. నెట్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది.. ప్రస్తుతం బ్రాడ్‌బ్రాండ్ సేవలు అందతున్నాయి. కానీ స్పీడ్ తక్కువగా ఉంది. ఎన్నికల్లో ఆ స్పీడు సరిపోదు. అధికారులు దాని సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదు. దీంతో పోలింగ్ వెబ్‌కాస్టింగ్, ఇతర డాక్యుమెంట్లు పంపే విషయంలో కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఇంటర్నెట్ లేని 30గ్రామాల గుర్తింపు... అధికారులు ఇప్పటికే ఇంటర్నెట్ లేని గ్రామాలను గుర్తించారు. దేవరకొండ డివిజన్‌లోనే ఈ గ్రామాలు ఉన్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ పేదలకు ఫుడ్ సెక్యూరిటీ కింద రూ.1 కిలో బియాన్ని ఇస్తుంది. అయితే అందులో ఈ పాసింగ్ విధానాన్ని అమలు చేశారు. అయితే ప్రతి ఒక్కరు తంబ్ వేయాల్సి ఉంది. అది నెట్ఉంటేనే సాధ్యం. దాంతో దేవరకొండ డివిజన్లో 30 గ్రామాలు నెట్లేని కారణంగా ఈ పాస్ విధానం కాకుండా మ్యానువల్‌గా ఇస్తున్నారు. ఇంటర్నెట్ లేని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు : జేసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. అయితే జిల్లాలో 30 గ్రామాలను ఇంటర్ నెట్ సౌకర్యం లేని గ్రామాలుగా గుర్తించాం. సారి ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇంటర్ నెట్ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో స్టీల్ కెమెరాలు ఉపయోగించడం లేదా మైక్రో అబ్జర్వర్‌ను (సెంట్రర్ గరవర్నమెంట్ ఉద్యోగి) ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తాము. వారు సూచించిన విధంగా నిర్ణయం తీసుకుంటాం. -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ పూర్వపు జాయింట్ కలెక్టర్ కె.శివకుమార్ నాయుడుకు 30 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అధికారులు అకారణంగా జైలుపాలు చేసినందుకు పిటిషనర్‌కు ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని హెకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఆదేశించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు ఉత్తర్వులను 3 వారాలపాటు నిలిపేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో బుచ్చయ్య అనే ప్రభుత్వ మాజీ ఉద్యోగికి చెందిన స్థలంలో కల్యాణ మంటపం నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి జేసీ పనులు చేయరాదని 2017 జూలై 1న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై బుచ్చయ్య హైకోర్టు నుంచి ఆగస్టు 29న స్టే ఉత్తర్వులు పొంది నిర్మాణ పనులు ప్రారంభించారు. సెప్టెంబర్‌లో జేసీ ఆదేశాల మేరకు పోలీసులు బుచ్చయ్యను అరెస్టు చేసి 2 నెలల 29 రోజులు జైల్లో పెట్టారు. కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించి తనను జైల్లో పెట్టారని బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పునిచ్చింది. -
పరిహారం ప్రకటించి భరోసా కల్పించాలి
అనంతపురం అర్బన్: ‘‘హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ కింద 60,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుండా పనులు చేయడం ఏమిటి. చట్ట విరుద్ధంగా పనులు చేస్తున్న కాంట్రాక్టరుపైన, ప్రశ్నించిన రైతులపై దౌర్జన్యం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నీరు రావాలని మేమంతా పోరాటం చేసిన వారిమే. అయితే అది చట్టపరంగా జరగాలే తప్ప ఇలా చట్ట విరుద్ధంగా.. రైతులకు ఆందోళనకు గురిచేసే విధంగా కాదు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేసి, పరిహారం ప్రకటించి రైతులకు భరోసా కల్పించండి.’’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి.. జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావును కోరారు. జాయింట్ కలెక్టర్‌ను గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శివారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, రైతులు కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. పరిహారం ఇవ్వకుండానే 36వ ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతుండడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పరిహారం చెల్లించకుండా పనులు ముందుకు సాగనివ్వమంటూ బాధిత రైతులు చెబితే.. స్థానిక రాజకీయ నాయకులు, కొంత మంది వారిని భయపెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారిగా మీరు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారం మేరకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 36వ ప్యాకేజీ పనులను చట్టవిరుద్ధంగా చేపట్టిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులు మూకుమ్మడిగా పనులను అడ్డుకుంటారని, తద్వారా చట్టపరమైన అవరోధాలు తలెత్తితే, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కరువు జిల్లాగా ప్రకటించాలి జిల్లా మొత్తం కరువు నెలకొన్నప్పటికీ కేవలం 44 మండాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం సరైన విధానం కాదని, జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని జాయింట్ కలెక్టర్‌ను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి కోరారు. 2014 నుంచి రాయలసీమ ప్రాంతం కరువుతో విలవిల్లాడుతోందన్నారు. రైతులు, రైతు కూలీలు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. ఆ కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిల్లాలో మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్నారు. –ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి -
ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
-
రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత
రేణిగుంట/చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్‌పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్ కలెక్టర్‌ను హెచ్చరించారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వే నుంచి వారు అరైవల్ ఎంట్రెన్స్ గుండా బయటకు వస్తారని ప్రొటోకాల్ అధికారులు వేచి ఉన్నారు. ఆ సమయంలో వారికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు అక్కడే వేచి ఉన్నారు. అయితే అతిథులు అనూహ్యంగా మెయిన్‌గేటు గుండా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేను మెయిన్ గేటు వద్దకు తీసుకుని వెళ్లడానికి జేసీ వచ్చిన సమయంలో.. తనను అనసవరంగా అక్కడ కూర్చోబెట్టారంటూ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీకు ప్రొటోకాల్ మర్యాదలు తెలియవా? నీ అంతు చూస్తా’’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న తహసీల్దార్ నరసింహులునాయుడు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయనపై తీవ్ర దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా హతాశులయ్యారు. ఎమ్మెల్యేది అహంకార ప్రవర్తన ఎమ్మెల్యే బొల్లినేని రామారావుది అహంకారపూరిత ప్రవర్తన అని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నరసింహులునాయుడు, జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్వో సంఘనేత చెంగల్రాయులు అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి అధికారుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరానిదన్నారు. ఘటనపై తాము సీఎంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే.. జాయింట్ కలెక్టర్ గిరీష, తహసీల్దార్ నరసింహులునాయుడులకు శుక్రవారం ఉదయం 10 గంటలోపు ఎమ్మెల్యే రామారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ విజయసింహారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులంతా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. -
అప్పు చెల్లించలేదని భార్యను తీసుకెళ్లారు
మంచిర్యాలసిటీ: అప్పు చెల్లించలేదని ఓ వ్యాపారి రుణగ్రహీత భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి దాచిపెట్టాడు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుడు జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావుకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. నెన్నెల మండలం ఆవ డం గ్రామానికి చెందిన బాసవేన హన్మంతు, సరోజ దంపతులకు, రుషిత్ (3), ఐసు(1) సంతానం. అదే మండలం చిత్తాపూర్‌కు చెందిన రైస్‌మిల్లు వ్యాపారి సందాని వద్ద రెండేళ్ల కిందట రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి అసలుతో పాటు వడ్డీ చెల్లించలేదు. ఈ క్రమంలో హన్మంతు రెండు నెలల కిందట తన కాపురాన్ని ఆవడం నుంచి మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్‌నగర్‌కు మార్చాడు. విషయం తెలుసుకున్న సందాని.. హన్మంతు భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఓ ఇంట్లో దాచి పెట్టాడు. నెల క్రితం హన్మంతు తర్వాత భార్యా పిల్లలు ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్లడంతో సందాని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆదివారం మరోసారి వెళ్లానని, కొడుకు నాన్నా అంటూ నా వెంట రావడంతో తీసుకొచ్చానని తెలిపాడు. ‘అప్పు తీర్చితేనే నీ భార్యా పిల్లలు నీ వెంట వస్తారు.. లేకుంటే చంపేస్తా’ అని బెదిరించడంతో నెన్నెల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇది సివిల్ కేసు, కోర్టుకు వెళ్లమని ఎస్ఐ చెప్పడంతో గత్యంతరం లేక జేసీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని రోదిస్తూ విలేకరులకు చెప్పాడు. వడ్డీ సహా అప్పు తీర్చుతానని ఎంత ప్రాథేయపడినా వ్యాపారి కనికరించడం లేదని వాపోయాడు. -
రేషన్‌డీలర్ల సమ్మెపై సీరియస్
కరీంనగర్ సిటీ: కనీస గౌరవ వేతనంతోపాటు సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు పూనుకుంటున్న రేషన్ డీలర్లపై సర్కారు సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సరుకులు డీడీలు కట్టకుండా జూలై 1 నుంచి సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. 48 గంటల్లో సరుకులకు డీడీలు చెల్లించకుంటే డీలర్లను సస్పెన్షన్ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ జిల్లా డీలర్లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ‘పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వానికి ఎంతయితే ఉందో రేషన్‌డీలర్లపై కూడా అంతే ఉంది. అది ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరువొద్దు. సరుకుల పంపిణీకి ఆటంకం కలిగించే డీలర్లపై కఠిన చుర్యలు తీసుకోక తప్పదు’ అని హెచ్చరించారు. ఈనెల 28వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్వో(రిలీజ్) తెలుసుకుని ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం డీలర్లకు విజ్ఞప్తి చేసిందన్నారు. నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వం కలిగి ఉందన్నారు. కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున ప్రతినెలా ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తూ అవసరమైన ఆహార భరోసా కల్పిస్తుందన్నారు. సమ్మె పేరుతో పేద ప్రజల నోటికాడి ముద్దను అడ్డుకోవద్దన్నారు. పేద ప్రజల ఆహారభద్రత దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ప్రభుత్వం మరోమారు రేషన్ డీలర్లకు విజ్ఞప్తి చేసిందన్నారు. ఆందోళన వద్దు.. రేషన్ సరుకులు అందుతాయో లేదో అని పేద ప్రజలు ఆందోళన చెందవద్దని, సకాలంలో సరుకులు అందించడానికి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టిందని జేసీ అన్నారు. ప్రత్యామ్నాయ చర్యల ద్వారా సరుకుల పంపిణీకి పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు. అయితే.. ఇటు డీలర్లు భీష్మించడం.. అధికార యంత్రాంగం హెచ్చరించడం చూస్తుంటే పేద ప్రజల్లో సరుకుల పంపిణీపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం చెబుతున్న ప్రత్యామ్నాయ చర్యలతో రేషన్ సరుకుల పంపిణీ సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుభవమున్న డీలర్లతోనే సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్తగా పంపిణీ చేసేవారితో ఎలా సాధ్యమనే ప్రశ్న వ్యక్తమవుతోంది. సమ్మెకు వెనుకాడేది లేదు ప్రభుత్వం ఎన్ని బెదిరింపు చర్యలకు పాల్పడినా సమ్మెకు వెనుకాడేది లేదని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ స్పష్టం చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం జరిగే వరకు రాష్ట్రశాఖ పిలుపు మేరకు డీడీలు కట్టకుండా సమ్మె చేపడతామని పేర్కొన్నారు. ‘వస్తే గౌరవ వేతనం.. పోతే రేషన్ షాపు’ నినాదానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ చర్చలకు పిలిచి ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారని, డీడీలు కట్టకపోతే తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. అయితే.. ఇప్పటివరకు జిల్లాలోని 487 మంది డీలర్లు ఎవరూ డీడీలు కట్టలేదన్నారు. కేవలం కొన్ని సొసైటీలు మాత్రమే డీడీలు చెల్లించాయన్నారు. ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
జాయింట్ కలెక్టర్‌గా కోటేశ్వరరావు
సాక్షి, కడప : జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా పులిపాటి కోటేశ్వరరావును నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈయనకు తొలుత రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత గవర్నర్ పేషీలో పనిచేశారు. అనంతరం హైదరాబాద్‌లో బీసీ కార్పొరేషన్ విభాగంలో పనిచేసిన ఆయనకు 2009లో ఐఏఎస్ క్యాడర్ ఇచ్చిన ప్రభుత్వం జేసీగా పదోన్నతి కల్పించింది. తర్వాత మూడు సంవత్సరాల మూడు నెలల పాటు పశ్చిమ గోదావరి జేసీ పనిచేశారు. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కేవలం నెలన్నర రోజులు మాత్రమే పనిచేశారు. ఈలోపే కడపకు బదిలీచేశారు. అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉండడంతోపాటు పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా కోటేశ్వరరావు మంచిపేరు గడించారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు..: జిల్లాకు సంబం ధించి చాలారోజుల తర్వాత ప్రభుత్వం జేసీని నియమించింది. నెలన్నర రోజుల కిందట కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌కు సెక్రటరీగా పనిచేస్తున్న నాగరాణిని జేసీగా బదిలీ చేసినప్పటికీ ఆమె విధుల్లో చేరలేదు. అంతకుముందు ఇక్కడ జేసీగా పనిచేస్తున్న శ్వేత మార్చిలో సెలవులపై వెళ్లి తర్వాత బదిలీ అయ్యారు. అప్పటి నుంచి జేసీగా ఎవరినీ నియమించలేదు. జేసీగా నాగరాణిని నియమించినా రాకపోవడంతో ప్రభుత్వం తాజాగా కోటేశ్వరరావును నియమించింది. గత నెలలో ఇన్చార్జి జేసీగా పనిచేస్తున్న జేసీ–2 శివారెడ్డి విదేశీ పర్యటన నిమిత్తం వెళ్లడంతో అప్పటినుంచి ఇన్చార్జి జేసీగా కడప స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. కోటేశ్వరరావు మంగళవారం కడపకు చేరుకుని జేసీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. -
మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలి
ఒంగోలు టౌన్: జిల్లాలో మలేరియా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు ఆదేశించారు. ప్రతి ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు మలేరియా కేసులు నమోదవుతుంటాయని, ఈ కాలంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మలేరియా వ్యాధి నివారణ, చికిత్సలపై అవగాహన పెంపొందించడం ద్వారా దానిని నియంత్రించవచ్చన్నారు. 2027 నాటికి మలేరియా రహిత దేశంగా భారత్‌ను ప్రకటించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 1,15,358 రక్తనమూనాలు సేకరించగా అందులో 70మందికి మలేరియా ఉన్నట్లు తేలిందన్నారు. నల్లమల అటవీప్రాంతం, చీమకుర్తి గనుల ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నందున, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మలేరియా అంతానికి మేమంతా సిద్ధం అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఖాళీ ప్రదేశాలు, క్వారీల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దోమల లార్వాలు చల్లి ఆయిల్ బాల్స్ వేయించాలని ఆదేశించారు. నీళ్ల ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న పాత్రలపై మూతలు వేసి ఉంచాలన్నారు. వినియోగంలో లేని బావులను మూసివేయించాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను సంబంధిత ఎంపీడీఓల వద్ద అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మలేరియా నివారణలో అంగన్వాడీలు, స్వయం సహాయక సంఘాలు, సాధికారమిత్రలను భాగస్వాములను చేయాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మలేరియా వ్యాధి నివారణకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మార్కండేయులు ఆదేశించారు. సమావేశంలో జోనల్ మలేరియా అధికారి ఉమామహేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, జిల్లా మలేరియా అధికారి నాగేంద్రయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ శకుంతల, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఆనంద్‌కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయికుమారి, డీఈఓ సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మర్ధన్ఆలీ, రిమ్స్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ కార్యాలయ సూపరింటెండెంట్ హైమావతి, డీపీఓ కార్యాలయ ఏఓ జయలక్ష్మి పాల్గొన్నారు. -
సినిమా హాళ్లలో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమం): సినిమా హాళ్లలలో నిర్ధేశించిన ధరల కంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ 2 పిడుగు బాబురావు స్టాళ్ల యజమానులను హెచ్చరించారు. మంగళవారం నగరంలోని పి.వి.పి మాల్, పి.వి.ఆర్ సినిమా హాళ్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాల్స్‌లోని స్టాళ్లలలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించారు. తాగునీరు, సమోసా, పాప్‌కార్న్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. నగరంలో ఉన్నటువంటి సినిమా హాళ్లలో ఎట్టి పరిస్థితుల్లో అదనపు ధరలను సహించబోమన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆహార పదార్థాలు విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. ఇటువంటి స్టాళ్లకు నోటీసులు అందిస్తామన్నారు. ఆయన వెంట అర్బన్ తహసీల్దార్ రవీంద్రబాబు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
రబీ కొనుగోళ్లకు 161 కేంద్రాలు
సిరిసిల్ల : జిల్లావ్యాప్తంగా రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం 161 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం డీఆర్డీవో, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని సూచించారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను మార్చి మూడో వారంలో ప్రారంభించాలని, అందుకు అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకు ఆరోజే ట్యాబ్‌ల్లో నమోదు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీటివసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తూకంలో మోసాలు లేకుండా, హమాలీల సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం ఎప్పుటికప్పుడు మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూర్చుకోవాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. అన్నిప్రభుత్వ శాఖలు సమన్వయంలో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా కొనసాగించాలని సూచించారు. ఈసమావేశంలో డీఆర్డీవో బి.రవీందర్, డీఎస్వో పద్మ, జిల్లా వ్యవసాయాధికారి ఆర్.అనిల్‌కుమార్, మార్కెటింగ్‌శాఖ జిల్లా మేనేజర్ షాహబొద్దీన్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయాధికారి కె.తిరుపతి, ఐకేపీ ఏపీఎం పర్శరాం తదితరులు పాల్గొన్నారు. -
ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘గత జాతరలో ఐటీడీఏ పీఓ హోదాలో పనిచేశాను. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే విధుల్లో పాల్గొన్నాను. తల్లిని ఆలయం బయటకు తీసుకువచ్చే సమయంలో వచ్చే జాతరలో నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించు అని మొక్కుకున్నా.. ఆ తర్వాత జిల్లాల విభజన కావడం జయశంకర్ జిల్లాకు నేను జాయింట్ కలెక్టర్‌గా నియమించబడ్డాను. అంతేకాదు జాతరకు ముందే నాకు ఐఏఎస్ హోదా వచ్చింది. ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. టీడీఏ పీఓగా, జాయింట్ కలెక్టర్‌గా రెండు సార్లు ఆయన జాతర విధులు నిర్వర్తించారు. ఈ జాతర అనుభవాలు, వచ్చే జాతరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేసీ ‘సాక్షి’ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... కలిసికట్టుగా పని చేశారు... జాతర నిర్వహణకు సరిపడా ఉద్యోగులు జయశంకర్ జిల్లాలో ఉన్నారు. అయితే వీరికి జాతరలో పని చేసిన అనుభవం లేదు. అందువల్లే ఇతర జిల్లాల నుంచి అధికారులు, సిబ్బందిని రప్పించాం. అందరు ఇది మన జాతర అన్నట్లుగా పని చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి సరైన వసతి, సమయానికి భోజనం అందించాం. ఎవరు ఏ విధులు నిర్వహించాలో చెప్పాం. అంతా కలిసికట్టుగా పని చేశారు. అంతేకాదు వచ్చే జాతరకు అనుగుణంగా జిల్లాలో ఉన్న 400 మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వచ్చే జాతర పూర్తిగా జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగంతో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం. నెల రోజుల ముందే... గతంతో పోల్చితే మేడారం భక్తుల సంఖ్య పెరిగిపోయింది. జాతరకు నెల రోజు ముందు నుంచే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలన్నీ నెల రోజులు మందుగానే పూర్తి చేయాలి. అంతేకాదు ఇక నుంచి జాతరకు వచ్చే వీఐపీల సంఖ్య పెరుగుతుంది. వీఐపీల రాక సందర్భంగా భక్తుల క్యూ లైన్లను ఆపేయాల్సి వస్తుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలు, భక్తులు ఒకే సారి దర్శనం చేసుకోవాల్సి వస్తే.. భక్తులు గద్దెల మీదకు బెల్లం విసరకుండా చూడాలి. దీని కోసం భక్తులకు అవగాహన కల్పించాలి. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక టైమ్ కేటాయించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. సౌకర్యాలు పెరగాలి.. జాతర సందర్భంగా ప్రతీసారి తాత్కాలిక ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నాం. ఇకపై శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలి. జాతర సమయంలో సిబ్బంది బస చేసేందుకు విరివిగా డార్మిటరీలు నిర్మించాలి. సాధారణ రోజుల్లో వీటిని భక్తులకు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వల్ల నీటి వృథాతో పాటు జాతర పరిసరాల్లో బురద ఎక్కువ అవుతోంది. దీన్ని నివారించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా నీటి సరఫరా చేయాలి. చెత్త నిర్వహణకు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. కోళ్లు, మేకల వ్యర్థాల కోసం ఇన్సులేటర్లు అందుబాటులో ఉంచాలి. ఇంటింటికీ వైద్యం... గతంలో జాతర తర్వాత మేడారం పరిసర ప్రాంత ప్రజల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించే వాళ్లు. ఈసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేశాం. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడే చికిత్స అందిస్తున్నారు. జాతర తర్వాత 15 రోజుల వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. టాయిలెట్ల నిర్మాణం కోసం నిర్మించిన బేస్మెంట్లను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తొలగిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం. -
బాలికల హక్కులు సామాజిక బాధ్యతగా గుర్తించాలి
ఒంగోలు టౌన్: రాజ్యాంగపరంగా బాలికలకు కల్పించిన హక్కులు, సమాన అవకాశాల కల్పన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు కోరారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బాలికా సంరక్షణతో పాటు సాధికారత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.సరోజని మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడటంతో పాటు బాలిక విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు. బాలికలు బాల్యం నుంచే పలు ఆంక్షలకు గురవుతున్నారన్నారు. నేటి సమాజంలో బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, అత్యాచారాలు వంటివి అక్కడకక్కడా జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సతీసహగమనం, కన్యా శుల్కం వంటి దురాచారాలను రూపుమాపినా ప్రస్తుతం బాలికలు ఎదుర్కొంటున్న ఇతర దురాచారాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. బాలికల చదువుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. బాలికల బంగారు భవిష్యత్ కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఏపీడీ జి. విశాలాక్షి, ఆంధ్రప్రదేశ్ ప్రొచైల్డ్ గ్రూపు ప్రతినిధి బీవీ సాగర్, చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ ఎం.కిషోర్‌కుమార్ పాల్గొన్నారు. గంటకుపైగా నిలువు కాళ్లపై నిరీక్షణ జాతీయ బాలికా దినోత్సవం రోజు బాలికలు గంటకుపైగా నిలువు కాళ్లపై నిలబడాల్సి వచ్చింది. బాలికా దినోత్సవ ర్యాలీ కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని ప్రకటించడంతో అంతకంటే ముందుగానే పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలతో పాటు బాలురను కూడా కలెక్టరేట్‌కు తరలించారు. జిల్లా ఉన్నతాధికారులు ర్యాలీ ప్రారంభిస్తారని మహిళా శిశు అభివృద్ధి సంస్థ అధికారులతో పాటు బాల బాలికలు ఎదురు చూశారు. నిమిషాలు, గంటలు అవుతున్నా ఉన్నతాధికారుల జాడ మాత్రం కనిపించలేదు. 11.15 గంటల సమయంలో జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు హడావుడిగా వచ్చి ర్యాలీకి సంబంధించిన జెండా ఊపి వెళ్లారు. అప్పటివరకు నిలువు కాళ్లపై నిరీక్షించిన బాల బాలికలు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. స్థానిక రామనగర్‌లోని మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ర్యాలీలు జరిగే ప్రతిసారీ బాల బాలికలకు పరీక్ష పెట్టడం జిల్లా యంత్రాంగానికి పరిపాటైంది. -
31వ వరకు అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, యాదాద్రి : యాదాద్రి వైటీడీఏను ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చట్టం 1975 ప్రకారంగా గుర్తించిన 7 గ్రామాల్లో ఏవేని అభ్యంతరాలు, ఆక్షేపణలు మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకతలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైటీడీఏ అధికారులు, మాస్టర్‌ప్లాన్ పరి« దిలోని గ్రామాల సర్పంచ్‌లు, ఈఓపీఆర్డీలకు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు ఈనెల 31వ తేదీ వరకు ఫిర్యాదుల ఇవ్వవచ్చన్నారు. వీటిని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపి తగు చర్యతీసుకుం టామని తెలిపారు. అనంతరం వైటీడీఏ అభివృద్ధిపై ఏఏ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రజంటేషన్ చేశారు. సమావేశంలో వైటీడీఏ సెక్రటరీ సాయిరాం, వైటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి ఆర్.హరిప్రసాద్, టౌన్‌ప్లాన్ అధికారి సుష్మిత, జిల్లా పంచాయతీ అధికారి భిక్షం పాల్గొన్నారు. -
పెద్దల అరెస్టుకు రంగం సిద్ధం...
సాక్షి, విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఎన్వోసీ ఉల్లంఘనుల్లో డిప్యూటీ కలెక్టర్, ఆ పైస్థాయి అధికారులు కూడా ఉండటంతో వారి అరెస్ట్‌లకు రంగం సిద్ధమైంది. సిట్ సభ్యురాలు, జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన నిన్న (సోమవారం) ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. వచ్చేవారం అరెస్టులు ఉంటాయని తెలిపారు. సిట్‌కు మరో రెండు నెలల గడువు ఎన్వోసీల విచారణ పూర్తయేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని జేసీ తెలిపారు. సిట్ దర్యాప్తుపై పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసేందుకు సమయం పట్టే అవకాశాలు ఉన్నందున మరో రెండు నెలల సమయం కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. 20మందిపై క్రిమినల్ కేసులు...! సిట్ పరిధిలో వచ్చిన 337 అర్జీల్లో 260 అర్జీలపై దర్యాప్తు పూర్తయింది. తహసీల్దారు కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన సమయంలో రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు కూడా పరిశీలించారని జేసీ తెలిపారు. వారిలో 48మందిపై శాఖాపరమైన చర్యలు, 20మందిపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామన్నారు. ఈ 48మందిలో వీఆర్వోల స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకూ ఉన్నారన్నారు. ఇప్పటివరకూ విచారించిన 260 ఫిర్యాదుల్లో ప్రభుత్వానికి సంబంధించిన 2వేల ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించామని, వాటిని త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. సిట్ పరిగణనలోకి తీసుకున్న 2,500 ఫిర్యాదుల్లో సుమారు 1300 ఫిర్యాదులకు సంబంధించి రిపోర్టులను ఎమ్మార్వోల నుంచి తీసుకున్నామన్నారు. వారిచ్చిన ప్రతి రిపోర్టును చదువుతామని, అందులో ఏమైనా లోపాలుంటే మళ్లీ తిప్పి పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి 22(ఎ) లో భూముల వివరాల సవరణ కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకుని 22(ఎ) సవరణ, యూఎల్సీ ఎన్వోసీ అనుమతి మీ సేవ ద్వారా పొందేందుకు అవకాశం కల్పించామని జేసీ తెలిపారు. ఇది రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ జిల్లాలో ప్రారంభిస్తున్నామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని చెప్పారు. 22(ఎ) కు సంబంధించి పాత, కొత్త లిస్టులు ఉన్నాయని, అయితే గతంలో పాత లిస్ట్ పంపించడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ప్రస్తుతం కొత్త లిస్టును అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రికార్డుల స్వచ్ఛీకరణ బాధ్యత వీఆర్వోలదే గతంలో రికార్డుల మార్పుచేర్పులు వీఆర్వోలకు తెలిసే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం రికార్డుల స్వచ్ఛీకరణ వారి బాధ్యతగా తీసుకొని సరైన సమాచారాన్ని పొందుపరచాలి. లేదంటే గతంలో రికార్డులు మార్పుచేర్పులకు కారణమైన వాటిపై విచారణ చేస్తానని వారిని హెచ్చరించారు. స్వచ్ఛీకరణకు సహకరిస్తే పాత తప్పులను విడిచిపెడతామని వారికి చెప్పామన్నారు. అందువల్ల ప్రస్తుతం బాగా జరుగుతోందన్నారు. రోజుకు 50 నుంచి 60 ఎకరాల భూములకు సంబంధించి స్వచ్ఛీకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో 27 మండలాల్లో 128 పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. పత్రాల జారీలో జాప్యం వహిస్తే నోటీసులే... మీ సేవా ద్వారా నెల రోజుల్లో పత్రాలను జారీ చేయాలి. అలా చేయని అధికారులకు నోటీసులు ఇస్తున్నాం. ఒక తహసీల్దారు, నలుగురు ఆర్ఐవోలు, నలుగురు వీఆర్వోలకు నోటీసులు జారీ చేశామన్నారు. -
జేసీ చంద్రుడు బదిలీ
సాక్షి, మచిలీపట్నం: జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయ.కె (కృష్ణన్)ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జేసీకి స్థాన చలనం కలిగింది. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జేసీ చంద్రుడు శిక్షణ అనంతరం తూర్పుగోదావరి జిల్లా రంపచౌడవరం ఐటీడీఏ పీఓగా తొలి పోస్టింగ్ పొందారు. అనంతరం సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరించారు. 2015 మార్చి 5వ తేదీన జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై జిల్లాకు వచ్చారు. అప్పటి నుంచి అధికారులను సమన్వయ పరిచి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. బందరు పోర్టు భూ సమీకరణ నేపథ్యంలో అవతరించిన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంయూడీఏ) విభాగం అభివృద్ధికి కృషి చేశారు. భూ సమీకరణ అంశంపై ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సత్ఫలితాలు సాధించారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీవెన్స్, తనకు స్వయంగా వచ్చిన భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వారు. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం, అడంగల్‌లో తప్పులు దొర్లకుండా క్రమబద్ధీకరించారు. నూతన జేసీగా విజయ.కె జేసీ గంధం చంద్రుడు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న కె.విజయను నియమించారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్నారు. త్వరలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు. -
జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చిత్తూరు , తిరుపతి అర్బన్ : జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి తిరుపతి పరిధిలోని కరకంబాడి రోడ్డులో జరిగింది. ఈ ఘటనలో తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా రాత్రి రుయాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి రుయావద్ద మృతుని కుటుంబ సభ్యులు, తిమ్మినాయుడుపాలెం స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర్లు కరకరంబాడి రోడ్డు పక్కన చిల్లర కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం తిరుమలలో గరుడసేవ కారణంగా అవసరమైన ఇంటి వస్తువులు, పూజాసామగ్రి కొనుగోలు చేసేందుకు ఇంటికి బయలుదేరారు. ఈ తరుణంలో కరకంబాడి మెయిన్ రోడ్డునుంచి తిమ్మినాయుడు పాలెంకు వెళ్లే దారివద్ద జేసీ వాహనం ఢీకొనడంతో వెంకటేశ్వర్లు తలకు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపుమడుగులో పడి అక్కడే మరణించాడు. అయితే జేసీ వాహనం కరకంబాడి వైపునుంచి తిరుపతికి చాలా స్పీడ్‌గా, దురుసుగా వెళ్లడం వల్లే ప్రమాదం తీవ్రమై వెంకటేశ్వర్లు ప్రాణాలు విడిచాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రెండు నెలల క్రితం కూడా జేసీ వాహనం పుత్తూరు వద్ద రోడ్డుపై వెళ్తున్న స్కూల్ పిల్లాడిని ఢీకొట్టి మరణానికి కారణమైంది. అయితే ఆరోజు వాహనం నడిపిన డ్రైవరు, మంగళవారం రాత్రి కరకంబాడి రోడ్డులో వాహనం నడిపిన డ్రైవరూ ఒకరేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన వెంకటేశ్వర్లు మృతితో అతని భార్య రాధ, ఎనిమిదేళ్ల కొడుకు గణపతి, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
భూ సర్వే పకడ్బందీగా నిర్వహించండి
బజార్హత్నూర్(బోథ్): భూముల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ సర్వే రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాలు లేకుండా, రెవెన్యూ గ్రామ ప్రజల సహకారంతో భూసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సంబంధిత అధికారులు స్థానికంగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. కోర్టు కేసులు, భూవివాదాలు ఉన్న వాటిని రెండవ విడతలో చట్టబద్ధంగా రికార్డులను పరిశీలించి సర్వే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేందర్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఎంఆర్ఐ రాజేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ వినోద్, వీఆర్వోలు పాల్గొన్నారు. -
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
అనంతపురం అర్బన్: జిల్లాలో పర్యటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి పేర్కొన్నారు. ఇందు కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 211.86 భూమి కేటాయించామన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి పర్యటక రంగ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి కోసం తాడిపత్రి మండలం సజ్జలదిన్నె వద్ద 1.75 ఎకరాలు, లేపాక్షి జఠాయువు ప్రాజెక్టుకి 3.30 ఎకరాలు, లేపాక్షి యాంఫీ ధియేటర్ కోసం 2 ఎకరాలు, గుత్తిలో రోప్ వే కోసం 50 సెంట్లు కేటాయించామన్నారు. పర్యాటక ప్రాజెక్టు కోసం పెనుకొండలో 19.75 ఎకరాలు, తనకల్లు మండలం కోటిపల్లి వద్ద రూ.184.56 ఎకరాలు కేటాయించే భాగంలో అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం పర్యాటక రంగం పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యటక శాఖ రీజినల్ డైరెక్టర్ గోపాల్, సంబంధిత విభాగం పర్యవేక్షకుడు వెంకటనారాయణ పాల్గొన్నారు. -
లాస్ట్ వార్నింగ్!
– గృహ నిర్మాణ శాఖ పనితీరుపై జేసీ అసహనం – పద్దతులు మార్చుకోవాలంటూ అధికారులకు చురక – నిర్లక్ష్యం వీడకుంటే ఇంటికెళతారంటూ హెచ్చరిక – పేదల సొంతింటి కలను సాకారం చేయాలని హితవు అనంతపురం సిటీ: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యతను ఆ శాఖ అధికారులు, సిబ్బంది మరిచారు. గృహాల మంజూరు, నిర్మాణాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదంటూ జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్ధీన్ అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణశాఖ ఇఇలు, డిప్యూటీ డీఇలు, ఏఇలతో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా ఆ శాఖ అధికారుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు. తక్షణం అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు అందించాలన్నారు. ఆఖరి స్థానంలో ‘అనంత’ గృహ నిర్మాణాల్లో అనంతపురం జిల్లా చాలా వెనుక బడి ఉందని జేసీ స్పష్టం చేశారు. గ్రామీణ గృహ నిర్మాణ శాఖా మంత్రి సొంత జిల్లాలో ఇంతటి దుస్థితి ఉందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఇందుకు అధికారులే కారకులవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం పథకం కింద ఆయా నియోజకవర్గాల్లో నిర్ధేశించిన మేరకు పునాదులు వేయించాలని సూచించారు. 2017-19 వరకు జిల్లాకు 29,500 గృహాలు కేటాయించినట్లు వివరించారు. ఈ నెల 31 లోపు కేటాయింపులన్నీ వంద శాతం పూర్తి కావాలని అదేశించారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ సి.వి.ప్రసాద్, పెనుకొండ ఇఇ చంద్రమౌళీ రెడ్డి, ధర్మవరం ఇఇ శేషుబాబుతో పాటు ఆయా డీఇలు, ఏఇలు పాల్గొన్నారు. -
వీఆర్వోపై చేయిచేసుకున్న జేసీ
మహబూబ్‌నగర్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఓ వీఆర్వోపై జాయింట్ కలెక్టర్ చేయి చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది. ధర్మాపూర్ గ్రామ సదస్సులో పాల్గొన్న జేసీ శివకుమార్ గ్రామానికి భూ వివరాలు చెప్పాలని స్థానిక వీఆర్వో మహమూద్ పాషాను అడిగారు. దీనికి వీఆర్వో సరైన సమాధానం చెప్పకపోవడంతో కోపోద్రిక్తుడైన జేసీ గ్రామసభలోనే వీఆర్వోపై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. -
ప్రభుత్వ భూముల్లో ఇసుక నిల్వలపై ఆరా
జడ్చర్ల: నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని దుందుబీవాగు పరివాహక ప్రాంతాన్ని అనుసరించి ఉన్న ప్రభుత్వ భూములలో ఇసుక నిల్వలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలిస్తున్నట్లు జేసీ శివకుమార్‌నాయుడు తెలిపారు. గురువారం ఆయన ఆకస్మికంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పలు రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకుఆయా ఇసుకను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే మిడ్జిల్ మండలంలో వాడ్యాల, మున్ననూర్, మిడ్జిల్, కొత్తపల్లి, తదితర గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో ఇసుక నిల్వలపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆయన పోలేపల్లి గ్రామ పరిధిలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ,ప్రైవేట్ భూములకు సంబంధించి తప్పుగా ఉన్న పలు సర్వే నంబర్ల రికార్డులను తనిఖీ చేశారు. సమగ్ర వివరాలు సేకరించి కలెక్టర్‌కు నివేదించనున్నట్లు తెలిపారు. జేసీ వెంట తహసీల్దార్ లక్ష్మినారాయణ,తదితరులు ఉన్నారు. -
పునరావాస కాలనీల గురించి పట్టించుకోరా?
► అధికారులపై జేసీ నాగలక్ష్మి ఆగ్రహం ► త్వరగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక ఒంగోలు టౌన్ : గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో పనులు నత్తనడక సాగడంపై జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గుండ్లకమ్మ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్ప నపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కాలనీల్లో నిర్మించనున్న ఆలయాలకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండు మూడు ఆలయాల నిర్మాణాలను ఒక ప్యాకేజీ కింద టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు పూర్తయినందున వాటి నిర్వహణను సంబంధిత శాఖలు తీసుకోవాలన్నారు. పునరావాస కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. వెలుగొండపై నివేదిక ఇవ్వాలి.. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస కాలనీలకు సంబంధించి నివేదిక అందించాలని సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నాగలక్ష్మి ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా పునరావాస కాలనీల్లో మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి కచ్చితంగా పురోగతి కనిపించాలన్నారు. ఈ సమావేశంలో పీఏ టు స్పెషల్ కలెక్టర్ వెంకటరావు, గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదయభాస్కర్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కరనాయుడు, కొండయ్య, ఆర్‌డబ్లు్యఎస్ ఈఈ ఆలి, ప్రాజెక్టŠస్ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
పెండింగ్ అనే మాట వినిపించకూడదు
► ఎప్పటి ఫైళ్లు అప్పుడు క్లియర్ చేయాలి ► నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించను ► అధికారులకు జేసీ నాగలక్ష్మి ఆదేశం ఒంగోలు టౌన్ : కలెక్టరేట్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయనే మాటే వినిపించకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతి ఫైల్ సకాలంలో డిస్పోజ్ కావాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌పై ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టరేట్‌కు చెందిన అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారం సంబంధిత మండల, డివిజనల్ కార్యాలయాల నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని సూచించారు. ఈ–ఆఫీసు ద్వారా ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. కోర్టు కేసులు, లోకాయుక్త కేసులు, మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చే కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత కేసుల స్థితిగతులను తెలుసుకోవడంతోపాటు వాటి సమాచారాన్ని యుద్ధ ప్రాతిపదికన తెప్పించుకొని, నిర్ణీత గడువుకు పూర్తిస్థాయి సమాచారంతో అందించే విధంగా ఉండాలన్నారు. వచ్చే బుధవారం నిర్వహించే సమావేశానికల్లా ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అగ్రస్థానమే లక్ష్యం
– క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యత – అందరి సహకారంతో ముందుకు – జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ టీకే రమామణి అనంతపురం అర్బన్ : ప్రజలకు సత్వరమే మెరుగైన సేవలందేలా చూడడం, రెవెన్యూపరంగా జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ టీకే రమామణి అన్నారు. ఆ దిశగానే తన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. టూరిజం శాఖలో ఓఎస్డీగా ఉన్న రమామణిని జిల్లా జేసీగా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఆమె శుక్రవారం కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, ప్రజలందరి సహకారంతో ముందుకు వెళతానన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటానని, వాటిని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. 1990లో గ్రూప్–1కు ఎంపికైన తాను ఇప్పటి వరకు వివిధ శాఖల్లో పనిచేశానన్నారు. 2009లో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా జిల్లాలో ఐదు నెలలు పనిచేసినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో వచ్చిన సాధారణ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగానూ విధులు నిర్వర్తించానన్నారు. జిల్లాపై కొంత మేర అవగాహన ఉందన్నారు. వెబ్లాండ్లో భూమి వివరాల నమోదులో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
ఇంటి వద్దకే ‘మధ్యాహ్న’ సరుకులు
అనంతపురం అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వేసవిలోనూ అమలు కానుంది. అయితే.. భోజనానికి బదులు రేషన్ సరుకులు అందించనున్నారు. చౌక డిపో డీలర్లు నేరుగా విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పౌర సరఫరాల సంస్థ, విద్యా శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం కింద పంపిణీ చేసేందుకు బియ్యం, కందిపప్పు స్టాక్ ఎంత వచ్చిందని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివశంకర్‌రెడ్డిని అడిగారు. 1,257 టన్నుల బియ్యం, 250 టన్నుల కందిపప్పు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్యార్థికి నాలుగు కిలోల బియ్యం, నెలకు సరిపడా కందిపప్పు (రోజుకు 20 గ్రాముల చొప్పున), 200 మి.లీ. పామాయిల్ ఇవ్వాలని ఇన్చార్జ్ జేసీ ఆదేశించారు. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఆరు కిలోల బియ్యం, రోజుకు 30 గ్రాముల చొప్పున కందిపప్పు (నెల కోటా), 300 మి.లీ. పామాయిల్ ఇవ్వాలన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు నెలకు 15 కోడిగుడ్లు అందజేయాలన్నారు. బియ్యం, కందిపప్పును ఈ నెల నాల్గో తేదీలోగా చౌక డిపోలకు సరఫరా చేయాలని, ఐదో తేదీ నుంచి విద్యార్థులకు డీలర్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి.శివరాంప్రసాద్, డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పైప్‌లైన్ మరమ్మతు.. తాగునీటి సరఫరా
► ‘తాగునీటి తండ్లాట’ తీర్చిన అధికారులు నార్నూర్(ఆసిఫాబాద్): ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాదాపూర్, అన్నాభావ్‌సాఠెనగర్, మాదాపూర్ గూడేల్లో 40 ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. శుక్రవారం ‘సాక్షి’ మెయిన్ పేజీలో ‘తాగునీటి తండ్లాట’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆయా గ్రామాల్లో 500 జనాభా ఉండగా.. మూడు చేతిపంపులు ఉన్నా పని చేయడం లేదని, పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయనే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తగూడ సమీపంలోని బావి నుంచి పైప్‌లైన్ ద్వారా ట్యాంక్‌కు నీటి సరఫరా చేసేవారు. పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో నీటి సరఫరా కాక నిరుపయోగంగా మారింది. ఆయా గ్రామాల ప్రజల కష్టాలను ప్రచురించడంతో స్పందించిన అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించారు. పైపులైన్ పనులకు మరమ్మతులు చేపట్టారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. మధ్యాహ్నం వరకు గ్రామంలో ఉన్న నీటిట్యాంక్‌కు నీటిని సరఫరా చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
జూన్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు
► పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిందే ► జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు కనబరిచిన పాతపట్నం చౌకధర దుకాణ డీలర్ కోట్ని శ్రీరామచంద్ర గుప్తకు శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో 8 లక్షల 50 వేల రేషన్ కార్డుదారులు ఉండగా లక్షా 30 వేల మంది నగదు రహిత లావాదేవీలను నిర్వహించారన్నారు. ఇందుకు సహకరించిన సీఎస్డీటీలు, రేషన్ డీలర్లను జేసీ అభినందించారు. రేషన్ డీలర్ల కోసం కంట్రోల్ రూమ్‌ను (08942–240563) ఏర్పాటుచేశామని, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించా రు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా జిల్లాలో ఒకరికి రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా పాతపట్నానికి చెందిన రేషన్ డీలర్ కోట్ని శ్రీరామచంద్ర గుప్తాకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. మండలస్థాయిలో ఏడుగురికి సెల్ఫోన్లు పంపిణీ చేయనున్నామని చెప్పారు. ఇటీవల విద్యార్థి సేవలో రెవెన్యూ శాఖ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, సుమారు 30వేల మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారని జేసీ వివరించారు. ఆదివారం జరగనున్న పల్స్‌పోలియోపై రేషన్ డీలర్లు కూడా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం నగదు రహిత ప్రతిభా పురష్కార గ్రహీత కోట్ని శ్రీరామచంద్ర, మండలస్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన రేషన్ డీలర్ సంజీవరావుకు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఆర్.వెంకటేశ్వరరావు, ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మేరీ సగారియా, శ్రీకాకుళం, పాలకొండ ఆర్డీఓలు బి.దయానిధి, ఆర్.గున్నయ్య, తహసీల్దార్లు, సీఎస్డీటీలు తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస జాబితాలను సిద్ధం చేయండి.
► జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు హిరమండలం : వంశధార రిజర్వాయర్‌కు సంబంధించి పునరావాసం కల్పించని, కల్పించిన నిర్వాసిత కుటుంబాల జాబితాలను సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం హిరమండలం సమీపంలోని బస్టాండ్ వెనుక భాగంలో గార్లపాడు, హిరమండలం నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించిన స్థలాన్ని జేసీ పరిశీలించారు. పాలకొండ ఆర్డీవో ఆర్ గున్నయ్య, తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్రావులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలం లోతట్టుగా ఉండటంతో నిర్వాసితులు ఇక్కడ పునరావాసం నిర్మించుకునేందుకు ముందుకురావడం లేదని తహసీల్దార్ జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ స్థలానికి బదులు ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.5 లక్షల ప్యాకేజీ కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం జేసీ మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో ఇంకా ఎంతమంది పునరావాసం, ప్యాకేజీ కోరుతున్నారో గ్రామాల వారీగా తక్షణం జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జేసీ వెంట వంశధార ఎస్ఈ కె.అప్పలనాయుడు, డీఈ, ఆర్ఐలు గౌరీశంకర్, నీలిమ, వీఆర్వో ఆనందరావు తదితరులు ఉన్నారు. పునరావాస కాలనీ నిర్మాణాలు వేగవంతం కొత్తూరు: వంశధార ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల నిర్మాణాలు వేగవంతం చేయాలని జేసీ చక్రధర్‌బాబు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. మండలంలోని మోట్టూరు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలను జేసీ గురువారం పరిశీలించారు. కాలనీలో బోర్లు పాడైపోవడంతో తాగునీటికి, ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాసితులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం జేసీ మాట్లాడుతూ అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. రోడ్లు, కాలువలు, మంచినీటి పథకాలు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు వేయాలని సూచించారు. ఆయనతో పాటు కొత్తూరు తహసీల్దార్ సావిత్రి, ఆర్ఐ భీమారావు, వీఆర్వో సంగమేశ్వరరావు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. పనులు చేపడితే సహించం సింగిడి(భామిని): వంశధార ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస చట్టం ప్రకారం పరిహారం అందించేవరకు పనులు జరగనివ్వబోమని సింగిడి దళితకాలనీ నిర్వాసితులు స్పష్టం చేశారు. గురువారం భామిని మండలం సింగిడి దళితకాలనీకి వెళ్లిన రెవెన్యూ, భూసేకరణ, వంశధార అధికారులను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సింగిడి దళిత కాలనీకి పునరావాస పరిహారం అందే అవకాశాలు లేవని ఉత్తర్వులు అందాయని, డీ–పట్టా భూముల్లో చెట్లకు పరిహరం వస్తుందని అధికారులు చెప్పగా నిర్వాసితులు అడ్డుతగిలారు. వరద కాలువకు 65 మీటర్ల దూరంలోని గృహ సముదాయాన్ని సర్వే చేసి గుర్తించి ఇప్పుడు పరిహరం రాదని చెప్పడం తగదన్నారు. న్యాయం జరిగే వరకు పనులు ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్ జల్లేపల్లి గోపాలరావు, వంశధార ఈఈ విజయకుమార్, డీఈఈ నాగేశ్వరరావు, భూసేకరణ అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి సిర్ల ప్రసాద్, నిర్వాసితుల సంఘ అధ్యక్షుడు పి.గణపతి, వైఎస్సార్ సీపీ నాయకుడు మజ్జి సంజీవ్, మజ్జి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల చెంతకే ధృవపత్రాలు
- జాయింట్ కలెక్టర్ కీలక నిర్ణయం - కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రెవెన్యూశాఖ కర్నూలు(అగ్రికల్చర్): త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారభం కానున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన వివిధ రకాల ధృవపత్రాలు పొందేందుకు విద్యార్థులు పడుతున్న కష్టాలను తొలగించేందుకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన ధృవపత్రాలను వారి చెంతకే చేర్చాలని నిర్ణయించారు. ఈ వినూత్న విధానానికి కార్యాచరణ ప్రణాళికను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. స్కాలర్‌షిఫ్‌లు, ఫీజు రీ ఎంబర్స్మెంట్ ఇతరత్రా సంక్షేమ ఫలాలు పొందడానికి విద్యార్థులకు పలు రకాల ధృవపత్రాలు అవసరమవుతాయి. విద్యా సంవత్సరం వస్తుందంటే చాలు వీటికోసం విద్యార్థులు మీసేవ కేంద్రాలు, తహసీల్దారు కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాయింట్ కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుల ధృవీకరణ పత్రాలు ఒకసారి తీసుకుంటే శాశ్వతంగా ఉపయోగపడుతాయి. అలాగే తెల్లరేషన్‌కార్డులున్న వారు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరంలేదు. నివాస ధృవీకరణ కోసం రేషన్ కార్డు/ఆధార్ కార్డును ఉపయోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇది కార్యాచరణ ప్రణాళిక... మొదటి దశలో ఈ నెల 24 నుంచి 30వరకు తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది విద్యా సంస్థలకు వెళ్లి ధృవీకరణ పత్రాల అవశ్యకతపై అవగాహన కల్పిస్తారు. ధృవపత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు దరాఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలు అందిస్తారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 10వరకు విద్యార్థులు తమకు అవసరమైన సర్టిపికెట్ల కోసం దరఖాస్తులు పూర్తి చేసి అవసరమైన ఫీజుతో సహా ప్రధానోపాధ్యాయులకు అందిస్తారు. 11 నుంచి 20 వ తేదీ వరకు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది వీటిపై విచారణ జరిపి ధృవీకరణపత్రాలను మంజూరు చేస్తారు. మీసేవ నిర్వాహకులు వాటిని ప్రింట్ తీసి సంబంధిత తహసీల్దార్లకు అందచేస్తారు. ధృవ పత్రాల మంజూరు సమాచారం విద్యార్థులకు మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. అనంతరం రెవెనూ సిబ్బంది వాటిని నేరుగా విద్యాసంస్థలకు తీసుకెళ్లి విద్యార్థులకు అందిస్తారు. -
జాతీయ రహదారి పనులపై జేసీ సమీక్ష
ఏలూరు సిటీ : జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని, జాతీయ రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ రహదారులను ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేని విధంగా పనులు చేపట్టాలన్నారు. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా ప్రయాణానికి అనువుగా ఉండేలా చూడాలన్నారు. వచ్చిన బడ్జెట్ ఆధారంగా జిల్లాలో ప్రాధాన్యత ప్రకారం రహదారుల పనులు చేపట్టాలని ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మలను ఆదేశించారు. చేపట్టే పనుల్లో ఏది ముఖ్యమో గుర్తించి ఆయా పనులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టాలన్నారు. రైల్వే అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ దువ్వాడ–విజయవాడ మూడో రైల్వే లైన్ ఎందుకు అవసరమో ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో సమగ్ర వివరాలతో ఒక నివేదిక తయారు చేసి సోమవారంలోగా ఇవ్వాలని రైల్వే అధికారులను జేసీ ఆదేశించారు. చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే పనులు చాలా మందకొడిగా జరుగుతున్నాయని ఏలూరు ఆర్డీవో చక్రధరరావు జేసీ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ అవసరమైతే సర్వే టీములను, సూపర్వైజర్లను పెంచి సర్వే పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏజేసీ ఎంహెచ్.షరీఫ్, డీఆర్వో కె.హైమావతి, భూసేకరణ డెప్యూటీ కలెక్టర్ భానుప్రసాద్, ఐటీడీఏ పీవో షాన్మోహన్, ఆర్డీవో జి.చక్రధరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, భూసేకరణ అధికారులు ఏవీ సూర్యనారాయణ, పుష్పమణి, పోలవరం ఎస్ఈ శ్రీనివాసయాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రంగలక్షి్మదేవి తదితరులు పాల్గొన్నారు. -
జనరిక్ మందుల వినియోగంపై అవగాహన కల్పించండి
అనంతపురం అర్బన్ : జిల్లాలో జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృతస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ సమావేశం నిర్వహించి, అధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేయాలన్నారు. ఆహార పదార్థాల కల్తీ, తూనికలు - కొలతల్లో మోసాలు, గడువు దాటిన మందుల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో కిరాణా, జనరల్, వస్త్ర దుకాణాలు తదితర వాటిపై దాడులు నిర్వహించి, 35 కేసులు నమోదు చేసి, రూ.65 వేలు అపరాధ రుసుం వసూలు చేశామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 ఆహార నమూనాలు సేకరించి, పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపామన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో 24 మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ పుట్లూరు మండలం గోపరాజుపల్లి చౌక దుకాణంలో బియ్యం, కిరోసిన్, చక్కెర నిలువను తనిఖీ చేశామన్నారు. అవకతవకలు ఉండంతో రూ.6,949 విలువజేసే సరుకు స్వాధీనం చేసుకున్నామన్నారు. పౌర సరఫరాల అధికారుల పని తీరుపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డీఎస్ఓ శివశంకర్‌రెడ్డి, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ వై.జి.శంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పి.ఎల్లమ్మ, ఎం.రవిశంకర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంధ్య పాల్గొన్నారు. దీపం గ్రౌండింగ్ వేగవంతం చేయండి : దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరు వేగవంతం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మీ –సేవ అర్జీలు సత్వరం పరిష్కరించాలన్నారు. -
కాటేసిన పుష్కరిణి..
► శ్వేతపుష్కరిణిలో మునిగి ఇద్దరు యువకులు మృతి ► మృతులు విజయనగరం, రాయగడ వాసులు ► తాత అస్థికలు నిమజ్జనం చేసేందుకు వచ్చి అనంతలోకాలకు.. ► ప్రాణాలతో బయటపడిన మరో యువకుడు ► శ్రీకూర్మంలో ఘటన శ్రీకూర్మం(గార): తాత అస్థికలు నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు పుష్కరిణిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు కన్నవారికి విషాదాన్ని మిగిల్చా రు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన శ్రీకూర్మంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. విజయనగరం పట్టణంలోని గాజులరేగకు చెందిన పట్నాన అరుణ్‌కుమార్ అలియాస్ నవీన్‌కుమార్ (25), అతని బంధువు.. ఒడిశాలోని రాయగడకు చెందిన కొత్తకోట జనార్దనరావు (20) తన తాత వారణాసి సుబ్బారావు అస్తికలు నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకూర్మం వచ్చారు. శ్రీకూర్మనాథాలయ సమీపంలో గది అద్దెకు తీసుకొని లగేజీరి అందులో ఉంచారు. పిల్లలందరినీ గదిలోని బాతు రూంలోనే స్నానాలు చేయాలని అరుణ్‌కుమార్ తల్లి బాలి సూచించింది. అయితే ఆలయం ఎదురుగా ఉన్న శ్వేతపుష్కరిణిలో స్నానాలు చేస్తామని చెప్పి అరుణ్‌కుమార్, జనార్దనరావు, వారణాసి శరత్ అనే మరో యువకుడు కలసి వెళ్లారు. మెట్ల మార్గం వద్ద నీటిలో దిగి స్నానం చేసేందుకు ప్రయత్నించారు. లోపలికి వెళ్లి నీటిలోనే ఆటలాడారు. దీన్ని చూసిన స్థానికులు అక్కడ లోతు ఎక్కువుగా ఉంటుందని హెచ్చరికలు చేసినప్పటికీ యువకులు పట్టించుకోలేదు సరికదా.. మరింత లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈత రాకపోవడంతో ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న కండ్రవీధికి చెందిన మత్స్యకారులు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే అరుణ్‌కుమార్, జనార్దనరావు చనిపోయారు. మరో యువకుడు శరత్‌ను కాపాడడంతో ప్రాణంతో బయటపడ్డాడు. పట్నాన నాగేశ్వరరావు, తల్లి బాలి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చనిపోయిన అరుణ్‌కుమార్ పెద్ద కుమారుడు. అలాగే కొత్తకోట వెంకటరమణ, ఉమావతి దంపతులకు జనార్దన్ ఒక్కడే కుమారుడు. అందివచ్చిన పిల్లలు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కన్నవారు కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాద సమాచారం తెలుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు, డీఎస్పీ భార్గవరావు నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, సర్పంచ్ బరాటం రామశేషు, ఆలయ ఈవో వి.శ్యామలాదేవి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆలయ అధికారుల వైఫల్యం: కూర్మనాథ ఆలయ అధికారుల వైఫల్యం వల్లే ఇద్దరు యువకులు మృతి చెందారని స్థానికులు విమర్శించారు. మూడు నెలల కిందట కూడా ఓ వ్యక్తి ఇలాగే పుష్కరిణలో మునిగి చనిపోయాడని స్థానికులు తెలిపారు. అప్పుడే బారికేడ్లు పెట్టాలని సూచిం చినా ఆలయ ఈవో శ్యామలాదేవి పట్టించుకోలేదని ఎంపీటీసీ సభ్యులు కోరాడ వెంకటరావు, వీవీ గిరి, టీపీ రాఘవాచార్యులు అన్నారు. జేసీ ఆగ్రహం: కూర్మనాథాలయ శ్వేత పుష్కరిణిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోవడంపై జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చిన ఆయన ఆలయ ఈఓ వి.శ్యామలాదేవికి పలు సూచనలు చేశారు. సీనియర్ అధికారులుగా ఉండి బారికేడ్లు ఏర్పా టు చేయకపోవడం తగదన్నారు. స్నా నాల రేవు వద్ద సిబ్బందిని ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఔట్సోర్సింగ్ ద్వారా ఇద్దరిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవాలయ అధికారులపై స్థానికుల నుంచి ఫిర్యాదులు ఉండకూడదన్నారు. హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచిం చారు. క్లోరినేషన్ చేయించాలని, పారిశుద్ధ్య పనులు జరిపించాలని ఆదేశించా రు. బారికేడ్ల పనులు తక్షణమే చేపట్టి నివేదిక అందజేయాలని స్పష్టం చేశా రు. ఇద్దరు యువకుల మరణపై జిల్లా పంచాయతీ అధికారిచే సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానికులు టీపీ రాఘవాచార్యులు, వీవీఎస్ గిరి, కోరాడ వెంకటరావు, మైగాపు ప్రభాకర్ తదితరులు ఆలయ ఈవో దేవాలయంపై దృష్టిసారించడం లేదని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. రెగ్యులర్ ఈవోని నియమించాలని కోరారు. -
శ్రీశైలానికి జేసీ పాదయాత్ర
ఆత్మకూరురూరల్: కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ బుధవారం సాయంత్రం సతీ సమేతంగా శ్రీశైలానికి పాదయాత్రతో వెళ్లారు. ఆయన తన వాహనంలో సాయంత్రం వెంకటాపురం చేరుకుని అక్కడ నుంచి వాహనాన్ని వెనక్కు పంపి కాలి బాట మార్గం పట్టారు. వెంకటాపురం నుంచి గోషాయి కట్ట మీదుగా రాత్రి 7.30 గంటలకు ఆయన నాగలూటి చెంచు గూడెం చేరుకున్నారు. నాగలూటి వీరభధ్రాలయం వద్ద స్వామి వారిని దర్శించుకుని రాత్రి భోజనాన్ని ముగించి పెచెర్వు వైపుగా మెట్ల మార్గం గుండా సాగిపోయారు. అర్ధరాత్రి పెచ్చెర్వు చేరుకుని జేసి దంపతులు అక్కడ విశ్రమించే అవకాశం ఉంది. వెంట ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, మంది మార్బలం లేకుండా జేసీ దంపతులు భక్తి పూర్వకంగా పాదయాత్రన వెళ్లడాన్ని పలువురు ఆసక్తిగా గమనించారు. -
లక్షలు ఇచ్చినా భూములివ్వం
పెనుకొండ రూరల్ : కన్నతల్లి వంటి భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. అలాంటి భూమిని ఎన్ని రూ.లక్షలు ఇచ్చినా ఇవ్వడానికి మేం సిద్ధంగా లేమని అమ్మవారుపల్లి సమీపంలో ఉన్న ఎర్రమంచి పొలాల రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి పక్కన మండలం అమ్మవారుపల్లి, కురుబవాండ్లపల్లి మధ్య 134–616 సర్వే నంబరులో ఉన్న 600 ఎకరాల భూమిని దక్షిణకొరియాకు చెందిన కియో కార్ల కంపెనీకి ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఈనేపథ్యంలో శుక్రవారం అధికారులు గ్రామానికి వెళ్లి సంబంధిత రైతులతో సమావేశమయ్యారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర అఖిలక్ష నాయకులు మాట్లాడుతూ నంబులపూలకుంటలో సోలార్ ఫ్యాక్టరీకి 7 వేల ఎకరాలు, లేపాక్షి హబ్‌కు భూసేకరణ చేశారు. ఎవరి కోసం చేశారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలంటూ ఆర్డీఓ రామ్మూర్తి, తహశీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ తదితర రెవెన్యూ అధికారులను నిలదీశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడి రైతులతో చర్చించి చట్ట ప్రకారం రైతుల పక్షాన పోరాడుతామని యంగ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ బేడీ, ఏపీసీసీ కార్యదర్శి రమణ, అఖిల భారత కూలీ సంఘం నాయకులు నాగరాజు, ఓపీడీఆర్ శ్రీనివాసులు అన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మూర్తి మాట్లాడుతూ 600 ఎకరాలు భూసేకరణ చట్టం ప్రకారమే చేశామన్నారు. ఎకరా రూ.8 లక్షలతో «ప్రభుత్వం ధర‡ నిర్ణయించినట్లు రైతులకు తెలిపారు. తర్వాత జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఇదివరకే చాలా నష్టపోయాం. ఈప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడ అసైన్డ్, డీకేటీ, ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులు ఎంత పరిహారం అడుగుతారో చర్చించడానికి వచ్చామన్నారు. ఇక్కడి రైతుల స్థితిగతులను పరిశీలించి మెరుగైన రీతిలో నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు రైతులకు వివరించారు. దీనికి రైతులు ఆవేదనతో రగిలిపోయారు. సాగు చేస్తున్నఽ భూములను పరిశ్రమలకు ఇవ్వబోమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో జేసీ వెనుతిరిగాడు. అనంతరం ఆర్డీఓ వెళ్తున్న కారును రైతులు అడ్డగించి సమస్య పరిష్కరించాలని కోరారు. -
అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్ : పట్టణ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు లేకుండా ఉన్న మరుగుదొడ్లకు వాటిని నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బందిని ఆదేశించారు. వివిధ పనుల కోసం కార్యాయానికి వచ్చే ప్రజలను తిప్పుకోకుండా పనులు వెంట వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో లైట్లు పోయిన ప్రాంతాలను గుర్తించాలని, అలాంటి చోట్ల వెంటనే కొత్త లైట్లు వేయాలన్నారు. ప్రకాశం బజార్లో ఒక్క లైట్ కూడా వెలగడం లేదని, అవన్ని వెలిగే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ సత్యనానాయణ, ఏసీపీ ప్రసాధరావు, డిఈలు వెంకటేశ్వర్లు, రాములు, పర్యావరణ ఇంజనీరు కొమ్ము ప్రసాద్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు
గ్యాస్ ఏజన్సీ డీలర్ల సమావేశంలో జాయింట్ కలెక్టెర్ కాకినాడ సిటీ : వందశాతం గ్యాస్ కనెక్షన్లు ఉన్న జిల్లాగా మార్చే విధంగా అన్ని కుటుంబాలకు వంట గ్యాస్కనెక్షన్ల పంపిణీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో గ్యాస్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్యాస్ కనెక్షన్ల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 20 వేలS619 మంది గ్యాస్కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిజానికి జనాభా లెక్కల ప్రకారం 14 లక్షల 65వేల 351 కుటుంబాలు జిల్లాలో ఉన్నాయని, ఇంకా లక్షా 69వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తే వందశాతం పూర్తవుతుందన్నారు. ఆ మేరకు మార్చి నాటికి గ్యాస్కనెక్షన్ల పంపిణీ పూర్తిచేయాలని డీలర్లకు స్పష్టం చేశారు. తదుపరి మిగిలిన కుటుంబాలందరికీ గ్యాస్కనెక్షన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జన్మభూమి, మా ఊరు సభలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా సభల్లో ఇప్పటికే మంజూరైన గ్యాస్కనెక్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వేమూరి రవికిరణ్, ఏఎస్ఓ పీతల సురేష్, వివిధ గ్యాస్ ఏజెన్సీల డీలర్లు పాల్గొన్నారు. -
నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపండి
అనంతపురం అర్బన్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేద క్రైస్తవులకు కానుక కింద అందిస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తే వెనక్కి పంపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. స్థానిక మార్కెట్ యార్డులోని పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. క్రిస్మస్ కానుక సరకుల నాణ్యతను పరిశీలించారు. పాడైనట్లు గుర్తించిన సరుకుని డీలర్లకు పంపించవద్దని ఆదేశించారు.