
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌పై దాడి
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌పై కొందరు రైతుల ముసుగులో దాడి చేశారు. ఒక్కసారిగా భయానక వాతావరణం సృష్టించడంతో మార్కెట్ అధికారులు అక్కడ నుంచి పరుగులు తీశారు. కొందరు అధికారులు సమీపంలోని బాత్‌రూంలలో దాక్కొన్నారు. వివరాలు.. ఖమ్మం మార్కెట్‌లోని పత్తి యార్డుకు 62 మంది రైతులు గురువారం పత్తిని విక్రయానికి తీసుకొచ్చారు. అధికారులు ఆ సరుకును గేట్ వద్ద ఆన్ లైన్ విధానంలో ఎంట్రీ చేశారు. ట్రేడర్లు పంట ఉత్పత్తులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాల ఆధారంగా బిడ్ చేయాల్సి ఉంది.
కానీ ఈ కార్యక్రమానికి ముందే ఒక్కసారిగా దాదాపు వందమంది గేట్ ఎంట్రీ గది వద్ద దాడి చేశారు. దీంతో గది అద్దాలు పగిలిపోయాయి. ఆ గదిలో ఉన్న కంప్యూటర్ కూడా దెబ్బతిన్నది. ఆ గదిలో ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులు జరిగిన హఠాత్పరిణామంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. కమీషన్ వ్యాపారులు, ట్రేడర్లు అధికారులతో మాట్లాడుతూ పాత పద్ధతిలో కొనుగోళ్లు నిర్వహించాలని కోరారు. దాడి జరిగే సమయంలో వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ శ్యామూల్ రాజు, డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాసరావు అక్కడే ఉన్నారు.
జిల్లా మార్కెట్ అధికారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు, జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిలకు పరిస్థితిని వివరించారు. దీంతో వారు ఖమ్మం డీఎస్పీ సురేష్‌కుమార్‌తో పాటు ముగ్గురు సీఐలు, వంద మంది పోలీసుల బృందాన్ని మార్కెట్‌కు పంపించింది. డీఎస్పీ మార్కెట్ అధికారులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. మార్కెట్‌లోని సీసీ కెమెరాల సాయంతో విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తిం చొచ్చని అధికారులు నిర్ణయించారు.
అయితే ఈ దాడి జరిగిన సమయంలో రైతులు, కమీషన్ వ్యాపారులు, బయటి వ్యక్తులు ఉన్నారు. ఈ-నామ్ అమలే దాడికి ప్రధాన కారణమని కొందరు చెబుతున్నారు. పొరుగు జిల్లాల్లో అమలు చేయని ఈ-నామ్‌ను ఖమ్మంలో అమలు చేయడమేంటని వాదిస్తున్నారు. కాగా, ఈ-నామ్‌పై రగడ నేపథ్యం లో రైతులు ఇబ్బంది పడకుండా శనివారం వరకు పాత పద్ధతిలోనే పంట ఉత్పత్తులు కొనుగోళ్లు చేయాలని మార్కెట్ అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ అనుమతి తీసుకున్నారు.