కర్నూలు అగ్రికల్చర్ : డీఆర్‌డీఏ - వెలుగులో అక్రమార్జనే లక్ష్యంగా పని చేస్తున్న నలుగురిపై జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి పీడీ కన్నబాబు వేటు వేశారు. ఒకరిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించగా, మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్‌డీఏ-వెలుగు అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరుగా మారింది. త్వరలో మరో 36 మందిపై వేటు వేయడానికి జేసీ రంగం సిద్ధం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పని చేస్తున్న బీమా కాల్ సెంటర్‌లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ బాధ్యతలను సీఐడీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మిగనూరు క్లస్టర్‌లో సీసీగా పని చేస్తున్న ఎం.జయరాముడు(డీఎంజీ) మహిళా సమాఖ్య నుంచి గ్రామైక్య సంఘాలకు వెళ్లే నిధులను, స్త్రీనిధి నిధులను తన భార్య ఖాతాకు మళ్లించి స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్వాహా మొత్తం లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ దీనిపై సమగ్రంగా విచారణ జరిపించగా వాస్తవాలు వెల్లడయ్యాయి. తిన్న మొత్తంలో రూ.3 లక్షల వరకు రికవరీ చేసినట్లు సమాచారం. అక్రమాలకు సీసీ జయరాముడిని బాధ్యుడిని చేస్తూ సర్వీస్ నుంచి తొలగించారు. ఆత్మకూరు మండల ఏపీఎం కె.సుబ్బయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. గ్రామైక్య సంఘం సమావేశం గ్రామంలో జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా మండల సమాఖ్యలో నిర్వహించడం వివాదాస్పదం అయింది. ఇది పోలీస్ కేసు వరకు వెళ్లింది. వడ్ల రామాపురం, నల్ల కాల్వ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై ఆత్మకూరు ఏపీఎంను సస్పెండ్ చేశారు. మద్దికెర ఏపీఎం మహేశ్వరయ్యను సస్పెండ్ చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల రికవరీ నిమిత్తం వసూలు చేసి బ్యాంకులకు జమ చేయకుండా రూ.14 లక్షలు స్వాహా చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. పత్తికొండ క్లస్టర్ డీఎంజీ రవికుమార్ రూ.13.50 లక్షలు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయనను సస్పెండ్ చేస్తూ సమగ్ర విచారణ జరపాలని అదనపు పీడీ లలితాబాయిని ఆదేశించారు.
వెలుగు అక్రమార్కులపై జేసీ వేటు
Published Sat, Dec 20 2014 2:58 AM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM
Advertisement
Advertisement