► శ్వేతపుష్కరిణిలో మునిగి ఇద్దరు యువకులు మృతి
► మృతులు విజయనగరం, రాయగడ వాసులు
► తాత అస్థికలు నిమజ్జనం చేసేందుకు వచ్చి అనంతలోకాలకు..
► ప్రాణాలతో బయటపడిన మరో యువకుడు
► శ్రీకూర్మంలో ఘటన
శ్రీకూర్మం(గార): తాత అస్థికలు నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు పుష్కరిణిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు కన్నవారికి విషాదాన్ని మిగిల్చా రు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన శ్రీకూర్మంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. విజయనగరం పట్టణంలోని గాజులరేగకు చెందిన పట్నాన అరుణ్‌కుమార్ అలియాస్ నవీన్‌కుమార్ (25), అతని బంధువు.. ఒడిశాలోని రాయగడకు చెందిన కొత్తకోట జనార్దనరావు (20) తన తాత వారణాసి సుబ్బారావు అస్తికలు నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకూర్మం వచ్చారు. శ్రీకూర్మనాథాలయ సమీపంలో గది అద్దెకు తీసుకొని లగేజీరి అందులో ఉంచారు.
పిల్లలందరినీ గదిలోని బాతు రూంలోనే స్నానాలు చేయాలని అరుణ్‌కుమార్ తల్లి బాలి సూచించింది. అయితే ఆలయం ఎదురుగా ఉన్న శ్వేతపుష్కరిణిలో స్నానాలు చేస్తామని చెప్పి అరుణ్‌కుమార్, జనార్దనరావు, వారణాసి శరత్ అనే మరో యువకుడు కలసి వెళ్లారు. మెట్ల మార్గం వద్ద నీటిలో దిగి స్నానం చేసేందుకు ప్రయత్నించారు. లోపలికి వెళ్లి నీటిలోనే ఆటలాడారు. దీన్ని చూసిన స్థానికులు అక్కడ లోతు ఎక్కువుగా ఉంటుందని హెచ్చరికలు చేసినప్పటికీ యువకులు పట్టించుకోలేదు సరికదా.. మరింత లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈత రాకపోవడంతో ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న కండ్రవీధికి చెందిన మత్స్యకారులు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే అరుణ్‌కుమార్, జనార్దనరావు చనిపోయారు. మరో యువకుడు శరత్‌ను కాపాడడంతో ప్రాణంతో బయటపడ్డాడు.
పట్నాన నాగేశ్వరరావు, తల్లి బాలి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చనిపోయిన అరుణ్‌కుమార్ పెద్ద కుమారుడు. అలాగే కొత్తకోట వెంకటరమణ, ఉమావతి దంపతులకు జనార్దన్ ఒక్కడే కుమారుడు. అందివచ్చిన పిల్లలు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కన్నవారు కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాద సమాచారం తెలుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు, డీఎస్పీ భార్గవరావు నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, సర్పంచ్ బరాటం రామశేషు, ఆలయ ఈవో వి.శ్యామలాదేవి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆలయ అధికారుల వైఫల్యం: కూర్మనాథ ఆలయ అధికారుల వైఫల్యం వల్లే ఇద్దరు యువకులు మృతి చెందారని స్థానికులు విమర్శించారు. మూడు నెలల కిందట కూడా ఓ వ్యక్తి ఇలాగే పుష్కరిణలో మునిగి చనిపోయాడని స్థానికులు తెలిపారు. అప్పుడే బారికేడ్లు పెట్టాలని సూచిం చినా ఆలయ ఈవో శ్యామలాదేవి పట్టించుకోలేదని ఎంపీటీసీ సభ్యులు కోరాడ వెంకటరావు, వీవీ గిరి, టీపీ రాఘవాచార్యులు అన్నారు.
జేసీ ఆగ్రహం: కూర్మనాథాలయ శ్వేత పుష్కరిణిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోవడంపై జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చిన ఆయన ఆలయ ఈఓ వి.శ్యామలాదేవికి పలు సూచనలు చేశారు. సీనియర్ అధికారులుగా ఉండి బారికేడ్లు ఏర్పా టు చేయకపోవడం తగదన్నారు. స్నా నాల రేవు వద్ద సిబ్బందిని ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఔట్‌సోర్సింగ్ ద్వారా ఇద్దరిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవాలయ అధికారులపై స్థానికుల నుంచి ఫిర్యాదులు ఉండకూడదన్నారు. హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచిం చారు. క్లోరినేషన్ చేయించాలని, పారిశుద్ధ్య పనులు జరిపించాలని ఆదేశించా రు. బారికేడ్ల పనులు తక్షణమే చేపట్టి నివేదిక అందజేయాలని స్పష్టం చేశా రు. ఇద్దరు యువకుల మరణపై జిల్లా పంచాయతీ అధికారిచే సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానికులు టీపీ రాఘవాచార్యులు, వీవీఎస్ గిరి, కోరాడ వెంకటరావు, మైగాపు ప్రభాకర్ తదితరులు ఆలయ ఈవో దేవాలయంపై దృష్టిసారించడం లేదని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. రెగ్యులర్ ఈవోని నియమించాలని కోరారు.
కాటేసిన పుష్కరిణి..
Published Sat, Mar 4 2017 3:12 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
Advertisement