జనరిక్ మందుల వినియోగంపై అవగాహన కల్పించండి
అనంతపురం అర్బన్ : జిల్లాలో జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృతస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సమావేశం నిర్వహించి, అధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేయాలన్నారు. ఆహార పదార్థాల కల్తీ, తూనికలు - కొలతల్లో మోసాలు, గడువు దాటిన మందుల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో కిరాణా, జనరల్, వస్త్ర దుకాణాలు తదితర వాటిపై దాడులు నిర్వహించి, 35 కేసులు నమోదు చేసి, రూ.65 వేలు అపరాధ రుసుం వసూలు చేశామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 ఆహార నమూనాలు సేకరించి, పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపామన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో 24 మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ పుట్లూరు మండలం గోపరాజుపల్లి చౌక దుకాణంలో బియ్యం, కిరోసిన్, చక్కెర నిలువను తనిఖీ చేశామన్నారు. అవకతవకలు ఉండంతో రూ.6,949 విలువజేసే సరుకు స్వాధీనం చేసుకున్నామన్నారు. పౌర సరఫరాల అధికారుల పని తీరుపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డీఎస్‌ఓ శివశంకర్‌రెడ్డి, తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ వై.జి.శంకర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పి.ఎల్లమ్మ, ఎం.రవిశంకర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంధ్య పాల్గొన్నారు.
దీపం గ్రౌండింగ్ వేగవంతం చేయండి : దీపం పథకం కింద కనెక‌్షన్ల మంజూరు వేగవంతం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మీ –సేవ అర్జీలు సత్వరం పరిష్కరించాలన్నారు.