generic medicines
-
జెనరిక్ ఔషధాలంటే నాసిరకం కాదు!
వైద్యులు తప్పనిసరిగా జెనరిక్ ఔషధాలనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసి, వైద్యుల ఆందోళన అనంతరం ఆ నిర్ణయాన్ని నిలిపివేసింది. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్ ఔషధాలు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు వాటిని ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ ‘బ్రాండెడ్’ మందులను తీసుకోవడానికే మొగ్గుచూపు తున్నారు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం, లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నాసిరకం మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) ఉత్పత్తవుతాయి. అందువల్ల, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ప్రపంచ ఫార్మసీగా భారత్‌ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో జెనరిక్ మందులు భారత్ నుండి ఎగుమతి అవుతాయి. 21వ శతాబ్ది ప్రారంభం వరకు, మన దేశంలోని పేటెంట్ వ్యవస్థ ఉత్పత్తి పేటెంట్లను కాకుండా ప్రక్రియ పేటెంట్లను మాత్రమే అనుమతించింది. ఇది భారతీయ ఔషధ పరిశ్రమకు, పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడకుండా ఔషధాలను తయారు చేయడానికి అవకాశాన్ని కల్పించింది. ‘రివర్స్ ఇంజనీరింగ్’ విధానం వల్ల వివిధ తయారీ ప్రక్రియలు అభివృద్ధి చెందగలవు. భారతీయ తయారీ రంగం విజయగాథల్లో ఒకటిగా భారతదేశ ఔషధ రంగాన్ని పరిగణిస్తున్నారు. ప్రత్యేకంగా, హెచ్ఐవి/ ఎయిడ్స్, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ లు వంటి సంక్లిష్ట రంగాల్లో ఇవాళ మనం ప్రపంచం మొత్తానికి జెనరిక్ ఔషధాలకు సంబంధించి అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నాము. ‘బ్రాండెడ్’ ఔషధాల లాగే జెన రిక్ మందులు కూడా అదేవిధమైన క్రియాశీల పదార్థం కలిగినవి కాబట్టి, ఒకేరకమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. జెనరిక్ ఔషధాల ధర తక్కువగా ఉండటమే వాటిని సమర్థించ డానికి ప్రధాన కారణం. ఎందుకంటే అవి పదేపదే జంతు, క్లినికల్ అధ్యయనాలకు గురికావాల్సిన అవసరం లేదు. ధర సమస్య దృష్ట్యా, అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా ముఖ్యమైనవి. అలాగే ఇవి ప్రపంచానికి విపరీతంగా ప్రయోజనం చేకూర్చాయి. ఔషధాల నాణ్యత విషయంలో ఏ విధమైన రాజీ ఉండకూడదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్ మందులు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు సహేతుకంగానే జెనరిక్ ఔషధాలను ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ బ్రాండెడ్ మందులను తీసుకోవడానికే వీరు తరచుగా మొగ్గు చూపు తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి ఔట్లెట్లలో పేలవమైన అమ్మకాలే దీనికి నిదర్శనం. వైద్యులు తప్పనిసరిగా జెనరిక్ మందులనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న జెనరిక్ ఔషధాల నాణ్యతకు సంబంధించిన తీవ్రమైన సమస్యను ఇది తెరపైకి తెచ్చింది. ఆ ప్రకటనపై వైద్యులు సముచితమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీంతో జెనరిక్ ఔషధాలను వైద్యులు తప్పని సరిగా రాయడానికి సంబంధించిన తన నిర్ణయాన్ని ఎన్ ఎంసి ప్రస్తు తానికి నిలిపివేయడం సరైన చర్య. ఏదేమైనప్పటికీ, జెనరిక్ ఔషధాల ప్రాధాన్యతపై దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది. నిజానికి, ఆరోగ్య సంరక్షణ కోసం పెట్టే ఖర్చును తగ్గించడానికి జెనరిక్ ఔషధాల వినియోగం చక్కటి మార్గం. ప్రభుత్వం కూడా నాణ్యమైన జెనరిక్‌లను నిర్ధారించడానికి అన్ని విధాలా కృషి చేయాలి. మన దేశంలో నకిలీ లేదా నాసిరకం ఔషధాలు ఉండటం, ప్రధా నంగా పేలవమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ ఫలితమే. అలాంటి కొన్ని మందుల ఉపయోగం తర్వాత ఉత్పన్నమైన తీవ్రమైన సమస్యలకు సంబంధించిన సంఘటనలు కూడా బయటకు వచ్చాయి. గత సంవత్సరం, ఒక కంపెనీ తయారు చేసిన ప్రొపోఫోల్ ఇంజెక్షన్‌ను ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రతికూల ఫలితాలు, ఆఖరికి మరణం సంభవించడం కూడా చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ దృష్టికి వచ్చింది. భారతదేశం నుండి ఎగుమతైన దగ్గు సిరప్ వాడకం వల్ల గాంబి యాలో నమోదైన మరణాలు, ఫార్మా హబ్‌గా మన దేశానికి ఉన్నపేరు ప్రతిష్ఠను దెబ్బతీశాయి. నాసిరకం మందులు వాడిన తర్వాత ఉండే ప్రమాదాల్లో తగిన రీతిలో లేని ప్రతిస్పందన, ఆ ఔషధానికి నిరోధకత అభివృద్ధి కావడం వంటివి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలు. సమర్థవంతమైన నియంత్రణ యంత్రాంగం లేనప్పుడు, కొన్ని ఔషధ తయారీ సంస్థలు డబ్బును ఆదాచేసుకునే ప్రయత్నంలో, అంత ర్జాతీయంగా ఆమోదించిన ఉత్తమ పద్ధతులను అనుసరించకుండా విస్మరిస్తున్నాయి. వీటి ఉత్పత్తుల విషయంలో కంపెనీలు చాలా తరచుగా రాజీపడి పోతు న్నాయి. నిర్లక్ష్యం, కల్తీ ఉండటం వంటి నిజాయితీ లేని పద్ధతులను కూడా గమనించవచ్చు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నకిలీ మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) సంభవిస్తాయి. ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంది. బ్రాండెడ్ ఔషధాల లాగే ప్రభావవంతమైనవనీ, సురక్షితమైన వనీ, వాటికి ప్రత్యామ్నాయం కాగలవనీ తగిన ధ్రువీకరణ జరిగిన తర్వాత మాత్రమే యూరోపియన్ దేశాలు, అమెరికా జెనరిక్ ఔషధా లను ఉపయోగించడానికి ఆమోదిస్తాయనేది అందరికీ తెలిసిందే. జెనరిక్ ఔషధాలను ఆమోదించడానికి కఠినమైన సమీక్షా ప్రక్రియ అమలులో ఉంటుంది. ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), ఉత్తమ ఉత్పాదక పద్ధతులకు అను గుణంగా ఉండేలా తయారీ ప్లాంట్లను కూడా తనిఖీ చేస్తుంది. ఇది జెనరిక్ ఔషధాలపై రోగి విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఐఎమ్ఎస్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, జెనెరిక్ మందులు అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఒక దశాబ్దంలో (2009– 2019) దాదాపు 2.2 ట్రిలియన్ డాలర్లను ఆదా చేశాయి. జెనరిక్ ఔషధాలు ఎంత ముఖ్యమైనవో ఈ సొమ్మే చెబుతోంది. అందువల్ల, మనం పాఠాలు నేర్చుకుని, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. కచ్చిత మైన నాణ్యతా నియంత్రణ చర్యలు అమలులో లేకుంటే, అసమర్థ మైన మందులు, తీవ్రమైన దుష్ప్రభావాల రూపంలో జంట ప్రమా దాలు అలాగే ఉంటాయి. మన ప్రస్తుత విధాన మార్గదర్శకాలను పునఃపరి శీలించి, అమలు ప్రక్రియను బలోపేతం చేయడం తక్షణ అవసరం. పూర్తి శిక్షణ పొందిన నిపుణులు నిర్వహించే పరీక్షా సౌకర్యాల రూపంలో తగిన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతమున్న చట్టబద్ధమైన, ఇతర రక్షణలకు చెందిన కచ్చి తమైన పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది. చట్టపరమైన నియంత్రణ విధానాలు కంపెనీలు స్వీయనియంత్రణను ప్రోత్సహించే విధంగా నిర్మాణాత్మకంగా ఉండాలి. అయితే వికృతమైన కేసులను సాహసంతో ఎదుర్కో వటానికి సంకల్పం ఉండాలి. భారతదేశంలో ఔషధాల నాణ్యతను నియంత్రించడానికి బాధ్యత వహించే ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ (సీడీఎస్‌సీవో)ను తప్పనిసరిగా బలోపేతం చేయాలి. మన ఔషధ అప్రమత్తత, నిఘా వ్యవస్థ జాగరూకత కార్యక్రమా లను కూడా శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ అనంతరం మన ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి ఇవి మార్గాలు. ఔషధ హెచ్చరికల తర్వాత, వాటిని వెనక్కి తీసుకునే ఏ తదుపరి చర్య నైనా తప్పనిసరిగా పబ్లిక్ డొమైన్ లో వీలైనంత త్వరగా ఉంచాలి. నాణ్యమైన జెనరిక్ ఔషధాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇక బ్రాండెడ్ మందులను మార్కెట్ చేయవద్దని ప్రభుత్వం ఔషధ కంపెనీలను ఆదేశించాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మార్కె టింగ్ బడ్జెట్లను తగ్గించి, పరిశోధన, అభివృద్ధితో పాటు నాణ్యతా నియంత్రణపై ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించాలి. నాణ్యమైన జెనరిక్ ఔషధాలను నిర్ధారించే సవాలును సీడీఎస్సీఓ తప్పనిసరిగా ఎదుర్కోవాలి. మన ఇంటిని మనం చక్కదిద్దుకున్న తర్వాత, జాతీయ వైద్య కమిషన్ ఆదేశాన్ని స్వాగతించవచ్చు. డాక్టర్ కె.కె. తల్వార్ వ్యాసకర్త పీజీఐఎంఈఆర్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్‌లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్‌లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్‌కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
ఇక సహకార జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి, అమరావతి: సొసైటీల ఆధ్వర్యంలో సహకార జన ఔషధి కేంద్రాలు రాబోతున్నాయి. ప్రజలకు అత్యంత తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచడంతోపాటు ఆదాయ వనరులు పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలతో పీఏసీఎస్‌లు లాభాల బాట పట్టాయి. ఇదే కోవలో నష్టాల్లో ఉన్న సంఘాలు తమ ఆర్థిక స్థితిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. బహుళ సేవా కేంద్రాలుగా పీఏసీఎస్‌లను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గ్రామ స్థాయిలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాల ఆర్థిక చేయూత తొలి దశలో జిల్లాకు ఐదు పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 పీఏసీఎస్‌లతోపాటు 13 డీసీఎంఎస్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరిట వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇవ్వనున్నాయి. ఒక్కో జన ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. వీటిద్వారా నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణుల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందిస్తారు. సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు స్థలాలు అందుబాటులో ఉన్న 106 పీఏసీఎస్‌లలో ఒక్కొక్క చోట రూ.25 లక్షల అంచనా వ్యయంతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా డీలర్‌షిప్‌లు మంజూరుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. బంక్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నాయి. 27 పీఏసీఎస్‌లలో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు సంబంధిత శాఖలు ఇప్పటికే ఎన్వోసీలు ఇచ్చాయి. ఆరు చోట్ల పెట్రోల్ బంక్‌లు ప్రారంభించారు. మిగిలిన 83 పీఏసీఎస్‌ల ఆధ్వర్యం బంక్‌ల ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీలను సాధ్యమైనంత త్వరగా సాధించే దిశగా సహకార శాఖ చర్యలు చేపట్టింది. అదే బాటలో ఎంపిక చేసిన పీఏసీఎస్‌లలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సొసైటీల బలోపేతమే లక్ష్యం నష్టాల్లో ఉన్న సొసైటీలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీల జారీలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. పెట్రోల్ బంకులు, జన ఔషధి కేంద్రాలతో పాటు స్థానిక డిమాండ్ ఉన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటును సొసైటీలకు కల్పిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖల మంత్రి -
సహకార సంఘాల్లో ఔషధాల విక్రయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయాధారిత సేవలు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో ఇకపై ఔషధాలను కూడా విక్రయించాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. చౌకగా లభించే జనరిక్ మందులను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాలు రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తున్నాయి. ధాన్యం, ఇతర పంటల కొనుగోలుతోపాటు కొన్ని జిల్లాల్లో పె ట్రోల్ బంక్‌లు, సూపర్మార్కెట్లు, వే బ్రిడ్జిలు కూడా ఈ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలో సొసైటీల్లో జనరిక్ మందులను విక్రయించాలని నిర్ణయించారు. జిల్లాకు నాలుగు సంఘాలు ఎంపిక.. రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాలున్నాయి. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు అనుబంధంగా 798 పీఏసీఎస్‌లు ఉండగా, వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా మరో 108 సహకార సంఘాలున్నాయి. కాగా, ప్రయోగాత్మకంగా ఒక్కో జిల్లాకు నాలుగు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం సూచన మేరకు ఆర్థిక, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు పకడ్బందీగా నిర్వహించే నాలుగు సొసైటీల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల సహకార శాఖాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం జిల్లా సహకార శాఖాధికారుల నుంచి ఎంపిక చేసిన సహకార సంఘాల (సొసైటీ) వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లానుంచి ఐదు సంఘాల పేర్లు పంపించారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, గుమ్మడిదల, ఝరాసంగం, ఏడాకులపల్లి, అందోల్ సహకార సంఘాలు ఇందులో ఉన్నాయి. ఫార్మసీ లైసెన్స్‌లు ఎలా? ఔషధాలు విక్రయించాలంటే ఫార్మసీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే సొసైటీల్లో జన్ ఔషధి కేంద్రాలకు ఫార్మసీ లైసెన్సులు ఎలా? అనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని సహకారశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మసిస్టును నియమించుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశు పోషకులకు తక్కువ ధరలకే నాణ్యమైన పశువుల జనరిక్ మందులను అందించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని గురువారం మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొబైల్ అంబులేటరీ క్లినిక్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశువులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మందుల కోసం పశు పోషకులు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఆ భారం తగ్గించేందుకే ఈ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ డ్రగ్స్‌ను చాలా తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఒక్కో కేంద్రం రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తుండగా.. 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందన్నారు. లబ్ధిదారులు కేవలం 25 శాతం వాటా చెల్లిస్తే సరిపోతుందన్నారు. పశు పోషకులు, ఔత్సాహిక వ్యాపార వేత్తలు, జాయింట్ లయబులిటీ గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలతో పాటు ఆసక్తి కల్గిన ప్రైవేటు వ్యక్తులను కూడా ఈ షాపుల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతి జిల్లా పశు వైద్యశాలలో ఔషధ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుందన్నారు. పశు వైద్యులు జనరిక్ మందులు మాత్రమే ప్రోత్సహించే విధంగా అవసరమైన సహకారాన్ని అందిస్తారన్నారు. అనంతరం వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి పరిశీలించారు. ఈ తరహా ఆస్పత్రులను రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, అదనపు సంచాలకులు పి.సత్యకుమారి పాల్గొన్నారు. -
అతి మూత్ర సమస్యకు చెక్:ఎంఎస్ఎన్ తొలి జనరిక్ మెడిసిన్ లాంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఫెసోబిగ్ పేరుతో ఫెసోటిరోడిన్ ఫ్యూమరేట్‌కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ సమానమైన జనరిక్ వర్షన్‌ను తయారు చేసింది. అతి చురుకైన మూత్రాశయం, మూత్రాన్ని ఆపుకోలేని సమస్యకు ఈ ఔషధం ద్వారా అందుబాటు ధరలో చికిత్స లభిస్తుందని ఎంఎస్ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి తెలిపారు. దేశంలోని స్త్రీ, పురుషుల్లో ఈ సమస్య విస్తృతంగా ఉందని వివరించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన 80 శాతం మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందట. భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆపుకొనలేని సమస్యతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అవగాహన లేకపోవడంతో వృద్ధాప్యంలో ఇది మామూలే అని అనుకుంటున్నారనీ, ఇది వివిధ వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
మన మందులు మంచివేనా?
ఒక భారతీయ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్‌ల వల్ల గాంబియా దేశంలో 66 మంది పిల్లలు చనిపోయారన్న వార్త దేశ ప్రతిష్ఠను దెబ్బతీసింది. భారతదేశంలో తయారయ్యే ఔషధాలు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తున్నాయా? భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నలకు సమాధానం ‘అవును’ కాదు. మన తయారీ నాసిరకపు ఔషధాల వల్ల పేద దేశాల్లోని రోగులే కాదు, లక్షలాది మంది భారతీయులు కూడా ప్రభావితం అవుతున్నారు. లేబుల్ మీద ప్రకటించినంత మందు తీరా మాత్రలో ఉండకపోవడం, ఔషధాల్లో కలిసే అవకాశమున్న విష రసాయనాలను గుర్తించే యంత్రసామగ్రి లేకపోవడం, అసలు మొత్తంగానే ఒక కఠినమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు దేశీయుల ఉసురు తీస్తున్నాయి. భారతీయ ఔషధ పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపుతూ దినేష్ ఎస్. ఠాకూర్, టి.ప్రశాంత్ రెడ్డి రాసిన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ ఎన్నో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్లు గాంబియా దేశంలో 66 మంది పిల్లల మరణాలకు దారితీశాయని వచ్చిన వార్తలు ఇండియాను ఇబ్బందికి గురిచేశాయి. భారతదేశంలో ఔషధాలను ఎలా తయారుచేస్తున్నారో, ఎలా క్రమబద్ధీకరిస్తున్నారో తెలిపే దుర్భరమైన వాస్తవానికి ఇది ఒక సంకేతం మాత్రమే. ఈ నెలలోనే ప్రచురితమైన ‘ద ట్రూత్ పిల్: ద మిత్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని వెల్లడించింది. ఈ పుస్తక రచయితలు దినేష్ ఎస్. ఠాకూర్, టి. ప్రశాంత్ రెడ్డి రెండు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ఒకటి, భారతీయ మందులు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తు న్నాయా? రెండు, భారతీయ తయారీ జనరిక్ ఔషధాలు ఒరిజినల్ మందులంత మంచివేనా? సమాధానం ‘లేదు’ అనే చెప్పాల్సి ఉంటుంది. తొలి ప్రశ్నకు ఈ పుస్తక రచయితలు చెప్పిన సమాధానం ఏమిటంటే... ‘‘మార్కెట్లో పంపిణీ అవుతున్న నాసిరకపు మందుల సునామీని భారతదేశం విప్పారిన నేత్రాలతో చూస్తోంది... దీనివల్ల ప్రభావితులైన రోగుల మొత్తం సంఖ్య... వందలు, వేలు మాత్రమే కాదు బహుశా లక్షల్లో ఉంటుందని మేం అనుమానిస్తున్నాం.’’ ఇక రెండో ప్రశ్నకు జవాబుగా వారు సింపుల్‌గా చెప్పిందేమిటంటే: ‘‘మేము అలా భావించడం లేదు’’ అనే. ఈ పుస్తకంలోని వివరణాత్మకమైన, చక్కటి పరిశోధనతో కూడిన 500 పేజీల అధ్యయనం విస్తృతమైన అంశాలను తడిమింది. దేశంలో ఔషధాలు తయారు చేస్తున్న విధానం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో ఈ పుస్తకం వివరించింది. కొన్ని కంపెనీలు తప్పుడు ప్రక టనలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఎలాంటి లైసెన్సు లేకుండానే మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. అవసరమైన పరీక్షలు చేయడానికి సమర్థమైన యంత్ర సామగ్రి కూడా వీటివద్ద లేకపోవడం గమనార్హం. అనేక తప్పుడు విధానాలు అవలంబిస్తున్న కొన్ని కంపెనీల బండారం బయటపడుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. భారతీయ మందుల దుర్భరమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ గురించిన సమగ్ర వివరాలను కూడా ఈ పుస్తకం పొందుపర్చింది. మన రెగ్యులేటర్లు అరుదుగా, ఎప్పుడో తప్ప ఔషధ తయారీ కర్మా గారాలను భౌతికంగా తనిఖీ చేయరు. దీనికి బదులుగా వాళ్లు ప్రశ్నించదలచిన మందుల తయారీ బ్యాచ్ రికార్డుల కాపీని మాత్రమే అడుగుతుంటారు. వారు అనుసరించే మార్గదర్శకాలు న్యాయ విచారణను సైతం నిరుత్సాహపరుస్తుంటాయి. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వ్యవ హారం కోర్టు వరకూ వెళ్లిన ప్పుడు, చాలా మామూలు శిక్షలు మాత్రమే పడుతుం టాయి. ‘కోర్టు ముగిసే వరకూ విధించే సాధారణ శిక్ష’ లాంటిది. అది అసలు శిక్షే కాదని చెప్పవచ్చు కూడా! ఈ పుస్తక రచయితలు తమ ముందుమాటలో ఇచ్చిన ఉదాహరణతో ఒక భయానక స్థితి గురించి నన్ను వర్ణించనివ్వండి. 2019 సంవత్సరంలో డైయాథిలిన్ గ్లైకాల్ (డీఈజీ)ను కలిగివున్న దగ్గు సిరప్ తీసుకున్న 21 మంది చిన్నపిల్లల చనిపోయారు. దీన్ని తయారుచేసింది డిజిటల్ విజన్ కంపెనీ. డైయాథిలిన్ గ్లైకాల్ అనేది పారిశ్రామిక ద్రావణి(సాల్వెంట్). దీన్ని ‘ఆంటీఫ్రీజ్’గానూ, ‘బ్రేక్– ఫ్లూయిడ్’గానూ ఉపయోగిస్తుంటారు. 1972 నుంచి డీఈజీ అనేది పిల్లలకు విషంగా మారిన ఘటనలు అయిదుసార్లు సంభవించాయి. అయినప్పటికీ ఔషధాల్లో దీని జాడను ఎవరూ కనుగొనలేక పోతున్నారు. కారణం... భారతీయ ఔషధ కంపెనీలు ఔషధ తయా రీకి ముందు తమ ముడి సరుకును గానీ, తయారయ్యాక ఉత్పత్తిని మార్కెట్లోకి పంపడానికి ముందుగానీ పరీక్షించడంలో తరచుగా విఫలమవుతుండటమే! ఇది డిజిటల్ విజన్ కంపెనీ తొలిసారి చేసిన క్షమించరాని తప్పేమీ కాదు. 2012–19 మధ్యకాలంలో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన మందులు నాణ్యతా పరీక్షల్లో మొత్తంమీద 19 సందర్భాల్లో విఫల మయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ పరిధిలోకి వచ్చే డిజిటల్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఆ డ్రగ్ కంట్రోలర్ డీఈజీ మిశ్రమాలను పరీక్షించడానికి తగిన ఏర్పాట్లు కంపెనీ చేయనేలేదని హైకోర్టుకు తెలిపారు. అయితే ఆ డ్రగ్ కంట్రోలర్ ఈ విషయాన్ని కనుగొనడానికి అంతకుముందు 19 సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ అలా పరీక్షించడంలో విఫలమయ్యారు. డ్రగ్ కంట్రో లర్ తనిఖీ సమయంలోనే ఈ లోపాలను కనిపెట్టి ఉండాలనీ, అలా చేసివుంటే కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్సును తక్షణమే రద్దు చేసి ఉండేవారనీ ఈ పుస్తక రచయితలు పేర్కొన్నారు. ఇంకోసంగతి. మరి, ఒక ఔషధం దాని లేబుల్ మీద ప్రకటించిన మేరకు లేకపోతే దాని పరిణామాలేమిటి? ఈ పుస్తకం అజిత్రో మైసిన్కు సంబంధించి ఒక విషయం పేర్కొంటోంది. ఆల్కేర్ లేబొ రేటరీస్ తయారుచేసే అజిత్రోమైసిన్‌లో లేబుల్ ప్రకారం నిజానికి 200 మిల్లీగ్రాముల అజిత్రోమైసిన్ ఉండాలి. కానీ అందులో ఉన్నది 25.69 గ్రాములే. అంటే కేవలం 12.85 శాతమే. ఇలాంటి మందులు వాడినప్పుడు ఉండదగిన పరిణామం గురించి రచయితలు ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘‘రోగి చనిపోవడానికి అత్యధిక అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆ మాత్రలో ఇన్ఫెక్షన్ను నిరోధించడానికి అవసరమైన ‘చాలినన్ని’ యాక్టివ్ ఇన్గ్రేడియెంట్లు లేవన్న మామూలు కారణంతో.’’ భారతదేశంలో చౌక ధరలకు లభ్యమవుతూ జనాదరణ పొందిన జనరిక్ మందులు నిజానికి అసలు మందులతో సమానం కాకపోతే జరిగేదేమిటో కూడా ఈ పుస్తకం వివరించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే జనరిక్ మందులపై జీవ సమానత్వ (బయో ఈక్వలెన్స్) పరీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పరీక్ష అరుదుగానే జరుగు తుంది. ‘‘తప్పనిసరిగా చేయవలసిన జీవసమానత్వ పరీక్ష లేమి కారణంగా దేశంలో వందలాది కాదు, వేలాది జనరిక్ మందుల బ్రాండ్లను ఆమోదించవలసి వచ్చింది. ఇలా ఆమోదం పొందిన చాలా బ్రాండ్లు ఎందరో రోగుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంది’’ అని ఈ పుస్తక రచయితలు చెబుతున్నారు. అనేక భారతీయ ఔషధ ఉత్పత్తి సంస్థలు నాణ్యతతో పాటు, విధానపరమైన నియంత్రణ, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించా యన్నదే ఈ పుస్తకానికి ముగింపు అని నేను చెబుతాను. అయిన ప్పటికీ, ప్రజలను దెబ్బతీస్తున్న లేదా చంపుతున్న నేరాలకు పాల్పడిన ఈ కంపెనీలు అరుదుగా కూడా భౌతిక శిక్షలు ఎదుర్కోవడం లేదు. ఇదే నిజానికి అత్యధికంగా భయపెడుతోంది. కానీ ప్రభుత్వం ఏ చర్యలకూ ఉపక్రమించకపోతే, మనం చేయగలిగేది ఏమీ ఉండదు కదా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కోవిడ్‌పై వదంతులు నమ్మొద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా వైరస్)కు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మరాదని, వైద్యుల సలహా, సూచనలను కచ్చితంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు షేక్హ్యాండ్లను మానేసి ఇతరులను పలకరించేందుకు నమస్కారాన్ని వాడాలని కోరారు. జన్ ఔషధి దివస్ సందర్భంగా శనివారం ప్రధాని మోదీ కొంతమంది జన ఔషధి దుకాణదారులు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో రకరకాల వదంతులు పుట్టుకొస్తాయి. కొంతమంది వైరస్‌కు దూరంగా ఉండేందుకు ఫలానాది తినమని సలహాలిస్తూంటారు. దయచేసి వేటినీ నమ్మవద్దు. ఏం చేసినా.. వైద్యులు చెప్పినట్లు మాత్రమే చేయండి. మీరే వైద్యులు కావొద్దు’అని ఆయన స్పష్టం చేశారు. జన ఔషధి పథకం ద్వారా భారీగా లబ్ధి పొందింది ఈ దేశ పేదలు మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. పీఎంబీజేపీ ద్వారా దేశం మొత్తమ్మీద నెలనెలా కోటి మందికి ఔషధాలు చౌకగా అందుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల జన ఔషధి కేంద్రాల ద్వారా పేదల సొమ్ము రూ.2000 నుంచి 2500 కోట్లు ఆదా చేయగలిగామని వివరించారు. ఈ కేంద్రాల్లో మందులు గరిష్ట అమ్మకం రేటు కంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వివరించారు. కేన్సర్ వ్యాధి చికిత్సకు వినియోగించే మందులు మార్కెట్లో రూ.6500 వరకూ ఉంటే జన ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.850 మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. ఈ కేంద్రాల నిర్వాహకుల శ్రమను గుర్తించేందుకు అవార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మీరు మా దేవుడు... ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డెహ్రాడూన్‌కు చెందిన దీపా షా అనే మహిళ మాట్లాడుతూ.. ‘నేను దేవుడిని చూడలేదు. కానీ మీలో మాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అని వ్యాఖ్యానించడంతో ప్రధాని ఉద్వేగానికి గురయ్యారు. కాసేపు ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. 2011లో పక్షవాతానికి గురైన దీపా మాట్లాడుతూ.. ‘మొదట్లో నా∙మందుల ఖర్చు చాలా ఎక్కువగా ఉండేది. జన ఔషధి కేంద్రాల కారణంగా నెలకు రూ.3500 ఆదా చేయగలుగుతున్నాను’ అని మోదీతో చెప్పారు. ‘మీరు మీ ఆత్మస్థైర్యంతో∙వ్యాధిని జయించారు’అని మోదీ ఆమెతో అన్నారు. సుమారు 3.5 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగమయ్యారని, మూడు లక్షల మంది వృద్ధులకు పింఛన్ లభిస్తోందని ప్రధాని తెలిపారు. -
జనరిక్‌తో ఎంతో ఆదా!
సహజంగా సమాజంలో చాలామందిలో చీప్‌గా వస్తున్నాయంటే చిన్నచూపు...పైగా నాణ్యత తక్కువేమోనని అనుమానాలు....ఎంత ఎక్కువ ధర చెబితే అది అంత గొప్పదనే ఫీలింగ్ ఉంటుంది...మనలో ఉన్న ఆ ఫీలింగ్‌ను అడ్డం పెట్టుకునే మందుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రజలకు అతి తక్కువ ధరలకు మందులు అందించాలనే ఉద్దేశంతో జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటుచేసినా అవగాహన లేమితో ప్రజలు వాటిని ఆదరించడం లేదు. జనరిక్ మందుల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన వైద్యులు తమ కమీషన్ల కోసం కక్కుర్తితో ఆ విద్యుక్తధర్మాన్ని పాటించకుండా ఫార్మా కంపెనీలకే జైకొడుతున్నారు. సాక్షి, గుంటూరు మెడికల్ : రోగులకు వైద్యానికి అయ్యే ఖర్చులో సగం మందుల కొనుగోలుకే అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో 21 జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయించింది. అయితే జనరిక్ మందులను రోగులు వినియోగించేలా వైద్యులు, సంబంధిత అధికారులు అవగాహన కల్పించకపోవటంతో ప్రస్తుతం కేవలం ఆరు షాపుల్లో మాత్రమే జనరిక్ మందుల విక్రయాలు జరుగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి, పెదనందిపాడు, బాపట్ల, రేపల్లెలో మాత్రమే ప్రభుత్వ జనరిక్ షాపుల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రైవేటు సంస్థల వారు సైతం జనరిక్ మందుల షాపులు ఏర్పాటుచేసినా ప్రజలకు జనరిక్ మందులపై అవగాహన లేమి, అపోహలు ఉండటం వల్ల మందుల విక్రయాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. జనరిక్ మందులు వాడటం వల్ల ఖర్చు చాలావరకు ఆదా అవుతుంది. కంపెనీ మందుల రేట్లతో పోల్చితే సగానికన్నా తక్కువ రేట్లకే నెలమొత్తానికి సరిపడా మందులు వస్తాయి. జనరిక్ మందులు రాయాల్సిందే... భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం ప్రతి వైద్యుడు రోగులకు మందుల ఆర్థిక భారం తగ్గించాలని, అందుకోసం జనరిక్ మందలు రాయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పలువురు వైద్యులు మందుల కంపెనీల నిర్వాహకులు ఇచ్చే బహుమతులు, ప్రలోభాల మాయలో పడి బ్రాండెడ్ మందులనే రాస్తున్నారు. పలు ఫార్మా కంపెనీల నిర్వాహకులు తమ మందుల కొనుగోళ్లు పెంచుకునేందుకు వైద్యులకు కుటుంబ సభ్యులతో సహా విదేశీ యాత్రలను సైతం ఉచితంగా కల్పిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఏసీలు, ఫ్రిజ్‌లు, కార్లు, ఇతర ఖరీదైన వస్తువులను సైతం వైద్యులకు కొనిచ్చి తమ కంపెనీ మందులనే రాయాలని మచ్చిక చేసుకుంటున్నారు.ప్రతి నెలా ఒక్కో రకమైన ఆఫర్లు ఇస్తూ వైద్యులను తమ బుట్టలో వేసుకుంటూ తమ కంపెనీ ఉత్పత్తులను పెంచుకుంటూ రోగులకు మందుల ఖర్చులు తడిసి మోపెడయ్యేలా చేయటంలో ఫార్మా కంపెనీల ప్రతినిధులు పోటీ పడుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌తోపాటుగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, ప్రైవేటు వైద్యులు కూడా జనరిక్ మందులు రాయకుండా తమకు కమీషన్లు ఇచ్చే కంపెనీల మందులనే రోగులకు రాస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ మెడికల్ కౌన్సిల్, మెడికల్ ఎతిక్స్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ప్రతినిధులు చొరవ చూపి జనరిక్ మందులను వైద్యులు రాసేలా చర్యలు తీసుకుంటే పేద రోగులకు ఎంతో ప్రయోజనం చేకూర్చినవారు అవుతారు. ధర తక్కువగా ఎందుకు ఉంటుందంటే... జనరిక్ మందులు తక్కువ ధరలకే ఎందుకు ఇస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మందుల్లో సరైన రసాయనాలు కలపకపోవటం వల్లే వాటిని తక్కువ ధరలకు ఇస్తున్నారనే తప్పుడు ప్రచారం, అపోహల వల్ల కూడా చాలామంది జనరిక్ మందులను వినియోగించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఏదైనా జబ్బుకు మందును తయారు చేసిన పిదప వాటిì అమ్మకాల కోసం మెడికల్ రిప్లు, డీలర్లు ఇలా పలువురు మధ్యవర్తులను కంపెనీ యజమానులు నియమించుకుని వారికి మందులు అమ్మినందుకు కమీషన్ ఇస్తుంటారు. వాటితోపాటుగా మందుల వినియోగం కోసం విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటారు. వీటన్నిటికోసం అయ్యే ఖర్చును తయారు చేసిన మందులపైనే వేసి వినియోగదారులకు అమ్ముతూ ఉండటంతో రోగులకు అధికరేట్లకు మందులను అమ్మాల్సి వస్తుంది. జనరిక్ మందుల విషయంలో ఇలాంటి మధ్యవర్తులు ఉండరు. ఎలాంటి ప్రచార ఖర్చులు ఉండవు. ఫలితంగా ఎంఆర్పీ కంటే సగానికి తక్కువ రేట్లకే జనరిక్ మందులు రోగులకు లభిస్తున్నాయి. కంపెనీ పేరు ఉండటం వల్లే అధిక రేట్లు... మందులను తయారు చేసిన పిదప ఫలానా కంపెనీ వారు వాటిని తయారు చేశారని బ్రాండ్‌నేమ్ ముద్రించి అమ్మటం వల్ల మందులు అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తారు. జనరిక్ మందుల వారు కంపెనీపేర్లు ముద్రించకుండా(బ్రాండ్‌నేమ్) లేకుండా అమ్మకాలు చేస్తూ ఉండటంతో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఉదాహరణకు జ్వరం తగ్గించేందుకు మనం వాడే మాత్రను ‘పారాసిట్మాల్’ అనే మందుతో తయారు చేస్తారు. మందుల కంపెనీవాళ్లు పారాసిట్మాల్ మాత్రకు క్రోసిన్, మెటాసిన్, ఫెపానిల్, డోలో–650, మెరిమాల్, కాల్పాల్, పెసిమాల్ తదితర పేర్లు తగిలించి అమ్ముతారు. కంపెనీ పేర్లు వల్ల(బ్రాండ్‌మార్క్) రేట్లు అధికంగా ఉండటమే తప్ప జనరిక్ మందులకు, ఇతర మందులకు ఎలాంటి తేడా ఉండదని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. తక్కువ ధరలకే లభ్యం ప్రతిరోజూ మందులు వినియోగించేవారిలో దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, వృద్ధులే అధికంగా ఉంటారు. బీపీ, షుగర్, గుండెజబ్బులాంటి దీర్ఘకాలిక రోగాలతో రోజూ మందులు కొనలేక ఆర్థిక భారంతో సతమతమవుతుంటారు. దీంతో నో ప్రాఫిట్– నోలాస్ అనే నినాదంతో పేద రోగులందరికీ మందులు అతి తక్కువ ధరలకే అందజేసేందుకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గుంటూరు అరండల్‌పేటలో, కొత్తపేటలో జనరిక్మందుల షాపులను ఏర్పాటుచేశాం. అన్ని రకాల వ్యాధులకు జనరిక్ మందులు లభిస్తున్నాయి. రోగులకు అతిచౌక ధరలకే అందిస్తున్నాం. – డాక్టర్ తాతా సేవకుమార్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, గుంటూరు -
డొక్కు మందులు.. మాయదారి వైద్యులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైద్యో నారాయనో హరిః.. అన్న నమ్మకం పోయి వైద్యుల వద్దకు వెళ్తే ప్రాణాలు హరీ మనక తప్పదనే రీతిలో వ్యవహరిస్తున్నారు కొందరు వైద్యులు. ప్రత్యక్ష దైవంగా భావించే వైద్యులే కమిషన్లకు కక్కుర్తిపడి పనికిరాని కంపెనీలకు చెందిన మందులను రోగులకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చివరకు కార్పొరేట్ వైద్యశాలల్లో సైతం పనికిరాని మందులను తమ సొంత మెడికల్ షాపుల్లో ఉంచి వాటినే ప్రిస్కిప్షన్‌లో రాస్తుండటంతో చేసేదిలేక ప్రజలు వీటినే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లురాసే కంపెనీల మందులు బయట ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడుతుండటంతో రోగులు అధిక ధరలకు వారి వద్దే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మంచి కంపెనీల మందుల కంటే నాసిరకం మందుల కంపెనీలు వైద్యులకు అధిక కమీషన్లు ఎరగా చూపి తమ వ్యాపారాలను పెంచుకుంటున్నారు. రోగుల ప్రయోజనాలను పక్కన బెట్టి ధనార్జనే ధ్యేయంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. చివరకు ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల వద్ద కూడా కమీషన్లకు అలవాటు పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరు వైద్యులు కనీస సౌకర్యాలు కూడా లేని ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లకు రోగులను పంపుతుండటంతో వ్యాధి నిర్ధారణ కూడా సరిగా చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో ఏదో ఒకటి రాసి వీరు పంపడం అది చూసి తూతూమంత్రంగా మందులు రాసివ్వడం కొందరు వైద్యులకు నిత్యకృత్యంగా మారింది. అసలు వ్యాధి నిర్ధారించలేక పోవడంతో జబ్బు తగ్గక రోగులు ఆసుపత్రుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనికితోడు వైద్యులకు కమీషన్లు ఇవ్వాలనే కారణంతో ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆ భారాన్ని కూడా రోగులపై మోపుతుండటంతో ఆసుపత్రులకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. జనరిక్ మందుల ఊసే ఎత్తని వైద్యులు.. రోగులకు అయ్యే వైద్యం ఖర్చులో 60 శాతం వరకూ మందులే ఉంటాయి. అలాంటి మందుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను ప్రవేశపెట్టింది. ఈ మందులను రోగులకు అలావాటు చేసి ఆర్ధిక భారాన్ని తగ్గించాలని వైద్యులకూ సూచించింది. ఒంగోలు నగరంలో కూడా నాలుగైదు జనరిక్ మందుల దుకాణాలు ఉన్నప్పటికీ ఇక్కడి వైద్యులు మాత్రం వీటి ఊసే ఎత్తడం లేదు. జనరిక్ మందులను రాయడం వల్ల తమకు ఒరిగేదేమీ లేకపోవడంతో వాటిని రోగులకు రాయకపోగా ఎవరైనా అడిగినప్పటికీ అవి పని చేయవంటూ చెప్పడం చూస్తుంటే వీరు ఏ స్థాయికి దిగజారారో అర్ధం చేసుకోవచ్చు. కంపెనీ ప్రతినిధులు తమ మందులను రోగులకు రాయడంతో వైద్యులకు ఆరునెలలు లేదా ఏడాదికొకసారి కమీషన్లను వారి బంధువుల పేరుతో ఖాతాల్లో జమ చేస్తున్నారు. రోగులకు నాసిరకం మందుల కంపెనీలను అంటగడుతూ ప్రతిఫలంగా కొందరు వైద్యులు ఫ్యామిలీలతో ఫారెన్ ట్రిప్పులకు వెళ్తుండటం చూస్తుంటే మందుల కంపెనీలు వైద్యులను బుట్టలో వేసుకున్నారని చెప్పకనే చెప్పవచ్చు. ఇంతే కాకుండా వైద్యులకు ప్రతి నెలా ఖరీదైన బహుమతులు కూడా అందిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మందుల కంపెనీల వద్ద కమీషన్లు తీసుకుని రోగులకు ఆ కంపెనీ మందులను అంటగట్టే సంస్కృతి అనైతికమని ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎంసీఐ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఇవేమీ అవినీతి వైద్యుల చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా వైద్యులు ఆలోచించి రోగుల ప్రాణాలతో చెలగాట మాడటం మానుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ...
న్యూఢిల్లీః పెట్రోల్ బంకుల్లో జన్ ఔషధి మెడికల్ స్టోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రాణ రక్షక ఔషధాలను చవక ధరలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, చమురు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఎల్ఈడీ బల్బుల విక్రయానికి ఆయిల్ రిటైలర్లతో ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో త్వరలో జనరిక్ దుకాణాలనూ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జనరిక్ స్టోర్స్ నిర్వహణకు క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అవసరం ఉన్నందున ఫార్మసిస్ట్‌ల కొరతను అధిగమించి ఈ దుకాణాలను ముందుకు తీసుకువెళ్లడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఈ తరహా ఔట్లెట్లను అనుమతించడంతో యువతకు ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
జనరిక్ మందుల పంపిణీకి ఇంటింటా సర్వే
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి జనరిక్ మందులు అందించేందుకు వారి వివరాలను ఇంటింటా తిరిగి సేకరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఏ అధికారుల సమావేశంలో జనరిక్ మందుల విక్రయాలు, చంద్రన్న బీమా పథకం అంశాలపై కలెక్టర్ సమీక్షిం చారు. జిల్లాలో ఏటా రూ.వెయ్యి కోట్లు విలువైన మందుల అమ్మకాలు జరుగుతున్నాయని, డ్వాక్రా గ్రూపుల ఆధ్వర్యంలో జిల్లాలో 200 జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసి కనీసం రూ.200 కోట్ల మందులను విక్రయించేస్థాయికి చేరేలా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ డాక్టర్లు బ్రాండెడ్ బదులు జనరిక్ మందులనే ప్రిస్కిప్షన్‌లో రాసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, మెప్మా పీడీ డాక్టర్ ఎన్.ప్రకాశరావు పాల్గొన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీపై అవగాహనకు గ్రామ సభలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు చెల్లించే ఆర్ ఆర్ ప్యాకేజీ పునరావాస కార్యక్రమాలపై అవగాహన కలిగించడానికి ఈనెల 30 నుంచి జూన్ 12 వరకు 19 గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, తదితర అంశాలపై ఐటీడీఏ పీఓ షాన్‌మోహన్‌తో కలెక్టర్ చర్చించారు.నిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కలిగించడానికి విస్తృతమైన చర్చ జరపాలని షాన్మోహన్ను కలెక్టర్ ఆదేశించారు. 30న టేకూరు, చీడూరు, 31న కొరుటూరు, శివగిరి, జూన్ 1న సిరివాక, తెల్లదిబ్బలు, 2న తూటిగుంట, 3న పల్లవూరు, పైడాకులమామిడి, 5న సరుగుడు, యర్రవరం, 6న కొత్తూరు, 7న కొత్తమామిడిగొంది, మాధాపురం, 8న ములగలగూడెం, గాజులగొంది, 9ప వాడపల్లి, 10న తల్లవరం, 12న కోండ్రుకోట గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. జేసీ పి.కోటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న పాల్గొన్నారు. -
జనరిక్ మందుల వినియోగంపై అవగాహన కల్పించండి
అనంతపురం అర్బన్ : జిల్లాలో జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృతస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ సమావేశం నిర్వహించి, అధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేయాలన్నారు. ఆహార పదార్థాల కల్తీ, తూనికలు - కొలతల్లో మోసాలు, గడువు దాటిన మందుల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో కిరాణా, జనరల్, వస్త్ర దుకాణాలు తదితర వాటిపై దాడులు నిర్వహించి, 35 కేసులు నమోదు చేసి, రూ.65 వేలు అపరాధ రుసుం వసూలు చేశామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 ఆహార నమూనాలు సేకరించి, పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపామన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో 24 మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ పుట్లూరు మండలం గోపరాజుపల్లి చౌక దుకాణంలో బియ్యం, కిరోసిన్, చక్కెర నిలువను తనిఖీ చేశామన్నారు. అవకతవకలు ఉండంతో రూ.6,949 విలువజేసే సరుకు స్వాధీనం చేసుకున్నామన్నారు. పౌర సరఫరాల అధికారుల పని తీరుపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డీఎస్ఓ శివశంకర్‌రెడ్డి, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ వై.జి.శంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పి.ఎల్లమ్మ, ఎం.రవిశంకర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంధ్య పాల్గొన్నారు. దీపం గ్రౌండింగ్ వేగవంతం చేయండి : దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరు వేగవంతం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మీ –సేవ అర్జీలు సత్వరం పరిష్కరించాలన్నారు. -
ఇదేమి ఔషధ మాయ..?
(మంథా రమణమూర్తి) పక్కన వేరే వాళ్లుంటే సొంత ఇంట్లో కూడా కళ్లు మూసుకుని నిద్రపోలేం. కానీ డాక్టరు పరీక్ష చేసినా, చికిత్స చేసినా ఆయన ముందు నిశ్చింతగా కళ్లు మూసుకుంటాం! బయటికెళ్తే మంచి నీళ్లు తాగటానికి వెనకాడేవారు సైతం.. డాక్టరు రాసిన మందును క్షణాల మీద వేసుకుంటారు. ఎందుకంటే.. వైద్యం ఒక అవసరం. వైద్యుడొక నమ్మకం! ఈ నమ్మకాన్నిపుడు పూర్తిగా ధన దాహం కమ్మేసింది. చికిత్స చేసే వైద్యుడి నుంచి, పరీక్షలు చేసే సెంటర్లు, మందులమ్మే షాపులు అన్నిటినీ ‘నాకేంటి?’ అనే వ్యాపారసూత్రమే నడిపిస్తోంది. అందుకే.. తక్కువ ధరకు దొరికే జనరిక్ మందులన్నీ బడా బ్రాండ్ల ముందు వెలవెలబోతున్నాయి. వీటిని కొంటే రోగికి నాలుగు డబ్బులు మిగిలే అవకాశం ఉన్నా... కొనిపించే వ్యవస్థ మాత్రం కరువవుతోంది. ఈ అవ్యవస్థలో ఎవరి పాత్ర ఎంతో తెలియజేసే ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు నేటి నుంచి.. - జనరిక్ మందులతో రోగుల ఖర్చు మూడొంతులకు పైగా ఆదా - ప్రత్యేక షాపుల ద్వారా విక్రయానికి ప్రభుత్వం యత్నాలు - కానీ వీటివల్ల తమ కమీషన్లు పోతాయని ఆసుపత్రులు, వైద్యుల భయం - నాసిరకానివని చెబుతూ విక్రయాలకు అడ్డుపుల్ల - మన దేశంలో తయారవుతున్నవన్నీ జనరిక్ మందులే - కొన్నింటికి మాత్రం రిప్రజెంటేటివ్‌లు, డాక్టర్ల ద్వారా ప్రచారం - ఆ ఖర్చులన్నీ మందుపైనే.. దాంతో ఆకాశాన్నంటుతున్న ధర - అదే మందు ప్రచారం లేకుండా షాపుల్లో విక్రయిస్తే తక్కువ ధర - కానీ కమీషన్లు, గిఫ్ట్‌లు ఇచ్చిన కంపెనీలకే వైద్యులు, యాజమాన్యాల వత్తాసు - మందుల బ్రాండ్ పేరు బదులు ఔషధం పేరే రాయాలని గతంలోనే ఎంసీఐ ఆదేశాలు.. అయినా పట్టించుకోని వైద్యులు ► ప్రకాశ్‌కు బీపీ, షుగర్ రెండూ ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా మందులు వాడుతున్నాడు. జీవితాంతం వాడాలి కూడా. మొదట్లో మందులకు నెలకు రూ.2 వేల దాకా అయ్యేది. భారం కావటంతో ఓసారి ఫార్మా డిస్ట్రిబ్యూషన్లో ఉన్న స్నేహితుడికి చెప్పాడు. ఆయన జనరిక్ దారి చూపించాడు. అచ్చంగా ప్రకాశ్ కొంటున్న మందుల్లో వాడే ఔషధాలనే వాడుతూ... ఇతర కంపెనీలు తయారు చేస్తున్న మందుల్ని సూచించాడు. వాటిని తక్కువ ధరలకే విక్రయించే మెడికల్ షాపులూ దొరకటంతో ప్రకాశ్‌కు ఇప్పుడు నెలకు రూ.2 వేల బదులు రూ.600 మాత్రమే ఖర్చవుతోంది. అలా ప్రకాశ్ మందుల ఖర్చులు దాదాపు 70 శాతం ఆదా అయ్యాయి. ► దినకర్ది కూడా ఇలాంటి పరిస్థితే. కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) తీవ్రం కావటంతో దీర్ఘకాలం మందులు వాడాల్సి వచ్చింది. డాక్టర్లు రాసిన మందులకు నెలకు రూ.4 వేల పైనే ఖర్చు కావటంతో... బ్రాండ్పేరున్న జనరిక్స్‌కు బదులుగా పెద్దగా బ్రాండ్ పేరు లేని జనరిక్ మందులను ఆశ్రయించాడు. దీంతో నెలకు రూ.వెయ్యి మాత్రమే ఖర్చువుతోంది. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు దినకర్. ఈ రెండు కేసుల్లోనూ తేలిందేమిటంటే.. మందులు మార్చినా వ్యాధి తగ్గటంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. బ్రాండెడ్ జనరిక్స్ ఎలా పని చేస్తాయో... బ్రాండ్ లేని జనరిక్స్ కూడా అలానే పనిచేశాయి. మందుల్లో ధన దాహమెందుకు? కార్పొరేట్ల రాకతో వైద్య ఖర్చులు అమాంతం పెరిగాయి. డాక్టరు, ఆస్పత్రుల ఫీజులు చెల్లించేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి. మరి మందుల సంగతో..? చిత్రమేంటంటే వీటికి బీమా కవరేజీ కూడా వర్తించదు. మన దేశంలో డాక్టర్లు రాసిన మందులు కొనలేక రోగాన్ని దేవుడికే వదిలేసిన ప్రాణాలు తక్కువేమీ కాదు. ఓవైపు ఆస్పత్రుల బిల్లు, కన్సల్టేషన్ ఫీజులంటూ రోగుల్ని బాదేస్తూ మరోవైపు మందుల్లోనూ అంత దాహమెందుకు? తక్కువ ధరకే దొరికే జనరిక్ మందులు సిఫారసు చేయొచ్చుగా? ఇదే ప్రశ్న ఆస్పత్రులనడిగితే...? డాక్టర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు కనుక వారు ఏ మందులు రాస్తారన్నది తమ చేతుల్లో ఉండదని చెబుతున్నాయి. మరి డాక్టర్లేమో... రోగుల ఆరోగ్యం తమ చేతుల్లో పెడతారు కనుక నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని, ఏ కంపెనీవి పడితే ఆ కంపెనీ మందులు సిఫారసు చేయలేమని చెబుతున్నారు. నిజంగా మీవి నాణ్యత లేని మందులా? అని ఫార్మా కంపెనీలనడిగితే.. మందుల తయారీకి ప్రతి కంపెనీ నిబంధనల్ని పాటిస్తుందని, అలా పాటించకపోతే లెసైన్సులు రద్దవుతాయని, అందుకని నాణ్యత తక్కువుండే ప్రసక్తే లేదని చెబుతున్నాయి. కాకుంటే తాము డాక్టర్లకు బహుమతులు, రిప్రజెంటేటివ్‌ల ఖర్చులు పెట్టం కనుక తక్కువ ధరకు ఇవ్వగలుగుతామని చెబుతున్నాయి. నాణ్యత లేకుంటే తామెందుకు అనుమతులిస్తామనేది ప్రభుత్వం తరఫున కూడా ఎదురు ప్రశ్నే!! వైద్యులను నేరుగా మందుల పేర్లు రాయకుండా సాధ్యమైనంత వరకూ జనరిక్ పేర్లనే రాయమంటున్నామని, ఈ మేరకు రెండు దఫాలు ఆదేశాలు కూడా ఇచ్చామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) కూడా స్పష్టంగా చెబుతోంది. ఎవరి ‘లెక్క’ వారిది.. ఈ మొత్తం వ్యవహారంలో ఏ ఒక్కరిదీ తప్పున్నట్టు అనిపించదు. చట్టం మాదిరి అంతా తమ పని తాము చేసుకుపోతున్నారనిపిస్తుం ది. కానీ లోతుగా చూస్తే అసలు గుట్టు బయటపడుతుంది. మందుల నాణ్యతను నియంత్రించే ప్రభుత్వం.. అన్నీ జనరిక్‌లే అయినపుడు ఒకే జనరిక్ మందుకు ఇన్ని రకాల ధరలెందుకున్నాయని ఎన్నడూ ప్రశ్నించదు. అలా ప్రశ్నిస్తే ఇలా ధరల్లో తేడా ఉండదుగా! ఒక మందుకు ఒకే ధర అనేది బహుశా ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుందేమో! ధరలపై ఎలాగూ నియంత్రణ లేదు. బడా ఫార్మా సంస్థలకేమో లాభాలు కావాలి. మందులకు బహిరంగంగా ప్రచారం చేయకూడదు కనుక ఆ పనిని డాక్టర్ల ద్వారా చేయిస్తుంటాయి. ప్రచారానికి వెచ్చించాల్సిన సొమ్మును డాక్టర్ల విదేశీ పర్యటనలకు, ఖరీదైన బహుమతులకు వెచ్చిస్తుంటాయి. ఆ కంపెనీ బాగుంటేనే తమ బాగు కనుక డాక్టర్లు, ఆస్పత్రులు సైతం యథాశక్తి ఆ బ్రాండ్‌నే రాస్తారు. చౌకగా దొరికే ఇతర జనరిక్ల జోలికి వెళ్లరు. మెడికల్ షాపులేమో డాక్టర్లు రాసిన మందులు లేకపోతే కొన్ని సందర్భాల్లో జనరిక్‌లు ఇస్తూ ఉంటాయి. డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ జనరిక్స్‌పై ముద్రించిన రేటుకే ఇస్తాయి. అది చాలా ఎక్కువుంటుంది. బ్రాండ్ లేని జనరిక్లకు కంపెనీలు అంత రేటు పెట్టకూడదు. కానీ డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ఉండదు.. మందుల షాపులవాళ్లు తామే చొరవతో వాటిని అమ్మాలి కనుక వాటికి 70-80% లాభాలివ్వటానికి అంత రేటు పెడతారు. అంతిమంగా నష్టపోతున్నది మాత్రం రోగే. ఒకవైపు వ్యాధి, మరోవైపు వీళ్లందరి దాహానికి బలవుతున్నది వినియోగదారుడే. జనరిక్ మందులు అంటే? ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలోని కంపెనీలు తయారు చేసి విక్రయిస్తున్నవన్నీ జనరిక్ మందులే. సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా వంటి దేశీ దిగ్గజాలు తయారు చేస్తున్న మందులన్నీ జనరిక్‌లే. ఎందుకంటే ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇప్పటిదాకా సొంత మందు ఒక్కటి కూడా ఆవిష్కరించలేదు. ఇవి తయారు చేస్తున్న మందులన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఓ విదేశీ కంపెనీ కనుగొన్నదే. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో అందులోని ఔషధాల్ని వేరు చేసి.. అదే మోతాదులో ఈ కంపెనీలు సొంత మందులు తయారు చేస్తాయి. వాటినే జనరిక్ మందులుగా పిలుస్తారు. జనరిక్స్ కానివేంటి? ఫార్మా కంపెనీలు వివిధ వ్యాధులకు మందులు తయారు చేయడానికి సొంతంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాల్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొన్నేళ్లపాటు అధిక వ్యయ ప్రయాసలకోర్చి.. ట్రయల్స్ వంటివి నిర్వహించి చివరికి మందును కనుగొని, దానికి అనుమతులు సంపాదిస్తాయి. ఆ కంపెనీ సదరు మందు కోసం అప్పటికే బోలెడంత డబ్బు వెచ్చించి ఉంటుంది కనుక ఆ మందుపై దానికి పేటెంట్ హక్కులుంటాయి. సాధారణంగా ఈ హక్కులు 20 ఏళ్లపాటు ఉంటాయి. 20 ఏళ్లు ముగిసే వరకూ ఆ కంపెనీ ఒక్కటే దాన్ని తయారు చేస్తుంది. దాని ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్లలోగా ఏదైనా ఇతర కంపెనీ ఆ మందును తయారు చేయాలంటే.. కనుగొన్న కంపెనీకి రాయల్టీ ఇవ్వాలి. కానీ 20 ఏళ్లు ముగిశాక పేటెంట్ హక్కులు పోతాయి. అప్పుడు ఏ కంపెనీ అయినా దాన్ని తయారు చెయ్యొచ్చు. అదే జనరిక్. ఇండియాలో కంపెనీలన్నీ తయారు చేస్తున్నవి ఇవే. 20 ఏళ్ల తర్వాత దాన్ని కనుగొన్న కంపెనీ కూడా.. పోటీ ఉంటుంది కాబట్టి ధర తగ్గించేస్తుంది. అప్పటికే అది ఆ మందుపై పెట్టిన ఆవిష్కరణ ఖర్చుల్ని రాబట్టుకుంటుంది. జనరిక్స్‌ను తెలుసుకోవటమెలా? ఒక మందుకు తక్కువ ధరలో ఇంకా ఏయే జనరిక్స్ దొరుకుతున్నాయో తెలుసుకోవటం ఎలా? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఇప్పుడు చాలా మందుల షాపుల్లో... కంప్యూటర్లో ఒక మందు ఎంటర్ చెయ్యగానే దానికి ప్రత్యామ్నాయ మందులేంటన్నది చెప్పే సాఫ్ట్వేర్ ఉంది. 1ఎంజీ డాట్ కామ్, జనరిక్వాలా డాట్ కామ్... ఇంకా పలు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్లో వాడటానికి 1ఎంజీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒక మందు పేరును ఎంటర్ చెయ్యగానే... అది ఎందుకు పనిచేస్తుంది? సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా? ఆ మందులో ఏఏ ఔషధాలుంటాయి? ధర ఎంత? దానికి ప్రత్యామ్నాయ మందులేంటి? వాటి ధరలెంత? ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి. ప్రతి మందునూ ఏ కంపెనీ తయారు చేసిందో కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి మందులు కొనుక్కోవచ్చు. -
నిలిచిన జనరిక్ మందుల కొనుగోళ్లు
స్టే విధించిన హైకోర్టు... 330 రకాల మందుల కొనుగోళ్లు వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ)లో టెండర్ వివాదం నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 330 రకాల జనరిక్ మందుల సరఫరా ఆగిపోయింది. మందుల సరఫరాకు అధికారులు కొత్త కాంట్రాక్టు విధానాన్ని రూపొందించి ఏప్రిల్‌లో టెండర్లు పిలి చారు. టెండరు నిబంధనల ప్రకారం ఆయా కంపెనీలు మార్కెటింగ్ స్టాండర్డ్, టర్నోవర్ తదితర ధ్రువపత్రాలను ఆన్లైన్లో కొన్ని, మాన్యువల్‌గా మరి కొన్నింటినీ సమర్పించాలని సూచించారు. ఈ మేరకు సుమారు 70 కంపెనీలు టెండర్లో పాల్గొన్నాయి. టెండరు తెరిచి చూశాక సుమారు 220 రకాల డ్రగ్స్‌ను ఒకే కాంట్రాక్టర్ తక్కువ ధరకు కోట్ చేసి దక్కించుకున్నారు. మాన్యువల్‌గా సమర్పించిన తమ ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని కొంతమంది, సదరు కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు ఏకపక్షంగా వ్యవహరించారని మరో కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో 330 రకాల మందుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. -
నాసిరకం జనరిక్ మందులపై సర్కారు ఆగ్రహం
నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం బ్రాండెడ్ కంపెనీలతో సమావేశానికి యోచన సాక్షి, హైదరాబాద్: జనరిక్ మందుల దుకాణాల్లో నాసిరకం ఔషధాల విక్రయాలపై తెలంగాణ సర్కారు ఆగ్రహంతో ఉంది. వాటిపై తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే చాలా తక్కువ ధరకు జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నా వాటి నాణ్యతపై సందేహాలు తలెత్తడంతో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలు చేస్తుంది. అనేకచోట్ల జనరిక్ ఔషధాలు సంబంధిత రోగాలపై పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అడ్రస్ లేని కంపెనీల ఔషధాలను జనరిక్ దుకాణాల్లో పెట్టి విక్రయిస్తుండటంతో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం మంజూరు చేసినా: జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జనరిక్ ఔషధ దుకాణాలున్నాయి. వీటిని మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు నెలల క్రితం రాష్ట్రానికి 25 జనరిక్ మందుల దుకాణాలను మంజూరు చేసింది. వాటిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అవసరమైన ఔషధాలను కేంద్రమే సరఫరా చేస్తుంది. దుకాణాలను, సిబ్బందిని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. జనరిక్ ఔషధ దుకాణాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్ఎల్ఎల్ సంస్థ నిర్వహించనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలి. అయితే ఎప్పటిలోగా ఒప్పందం కుదుర్చుకుంటారనే విషయంపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు తాజాగా లేఖ రాసింది. కానీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. జనరిక్ దుకాణాల్లో నాసిరకం మందులు అమ్ముతున్నారనే కారణంతో తన నిర్ణయాన్ని పక్కన పెడుతోంది. బ్రాండెడ్ జనరిక్ ఔషధాల కోసం... అడ్రస్‌లేని కంపెనీల జనరిక్ ఔషధాలతో జనానికి అనేక సమస్యలు వస్తున్నాయని.. ప్రస్తుతం ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న నాసిరకం మందులను అడ్డుకోవాలని సర్కారు యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 25 జనరిక్ మందుల దుకాణాలను నెలకొల్పడానికి ముందుగా బ్రాండెడ్ ఔషధ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ కేంద్రంగా అనేక ఫార్మసీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తున్నాయి. తెలంగాణకు ఉన్న ఈ ప్రత్యేకతను ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బ్రాండెడ్ జనరిక్ ఔషధాలను తక్కువ ధరకు తయారు చేయాలని కోరనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కోరినట్లు తెలిసింది. వారితో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో 25 జనరిక్ ఔషధ దుకాణాలపై ఒప్పందం కుదుర్చుకోవాలని మంత్రి భావిస్తున్నట్లు సమాచారం.