సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయాధారిత సేవలు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో ఇకపై ఔషధాలను కూడా విక్రయించాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. చౌకగా లభించే జనరిక్ మందులను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సహకార సంఘాలు రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తున్నాయి. ధాన్యం, ఇతర పంటల కొనుగోలుతోపాటు కొన్ని జిల్లాల్లో పె ట్రోల్ బంక్‌లు, సూపర్‌మార్కెట్లు, వే బ్రిడ్జిలు కూడా ఈ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలో సొసైటీల్లో జనరిక్ మందులను విక్రయించాలని నిర్ణయించారు.
జిల్లాకు నాలుగు సంఘాలు ఎంపిక..
రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాలున్నాయి. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు అనుబంధంగా 798 పీఏసీఎస్‌లు ఉండగా, వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా మరో 108 సహకార సంఘాలున్నాయి.
కాగా, ప్రయోగాత్మకంగా ఒక్కో జిల్లాకు నాలుగు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం సూచన మేరకు ఆర్థిక, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు పకడ్బందీగా నిర్వహించే నాలుగు సొసైటీల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల సహకార శాఖాధికారులను ఆదేశించింది.
ఈ ఆదేశాల ప్రకారం జిల్లా సహకార శాఖాధికారుల నుంచి ఎంపిక చేసిన సహకార సంఘాల (సొసైటీ) వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లానుంచి ఐదు సంఘాల పేర్లు పంపించారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, గుమ్మడిదల, ఝరాసంగం, ఏడాకులపల్లి, అందోల్ సహకార సంఘాలు ఇందులో ఉన్నాయి.
ఫార్మసీ లైసెన్స్‌లు ఎలా?
ఔషధాలు విక్రయించాలంటే ఫార్మసీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే సొసైటీల్లో జన్ ఔషధి కేంద్రాలకు ఫార్మసీ లైసెన్సులు ఎలా? అనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని సహకారశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మసిస్టును నియమించుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment