సాక్షి, అమరావతి: సొసైటీల ఆధ్వర్యంలో సహకార జన ఔషధి కేంద్రాలు రాబోతున్నాయి. ప్రజలకు అత్యంత తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచడంతోపాటు ఆదాయ వనరులు పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలతో పీఏసీఎస్‌లు లాభాల బాట పట్టాయి. ఇదే కోవలో నష్టాల్లో ఉన్న సంఘాలు తమ ఆర్థిక స్థితిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. బహుళ సేవా కేంద్రాలుగా పీఏసీఎస్‌లను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గ్రామ స్థాయిలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభుత్వాల ఆర్థిక చేయూత
తొలి దశలో జిల్లాకు ఐదు పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 పీఏసీఎస్‌లతోపాటు 13 డీసీఎంఎస్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరిట వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇవ్వనున్నాయి. ఒక్కో జన ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. వీటిద్వారా నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణుల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందిస్తారు.
సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు
స్థలాలు అందుబాటులో ఉన్న 106 పీఏసీఎస్‌లలో ఒక్కొక్క చోట రూ.25 లక్షల అంచనా వ్యయంతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా డీలర్‌షిప్‌లు మంజూరుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. బంక్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నాయి.
27 పీఏసీఎస్‌లలో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు సంబంధిత శాఖలు ఇప్పటికే ఎన్‌వోసీలు ఇచ్చాయి. ఆరు చోట్ల పెట్రోల్ బంక్‌లు ప్రారంభించారు. మిగిలిన 83 పీఏసీఎస్‌ల ఆధ్వర్యం బంక్‌ల ఏర్పాటుకు అవసరమైన ఎన్‌వోసీలను సాధ్యమైనంత త్వరగా సాధించే దిశగా సహకార శాఖ చర్యలు చేపట్టింది. అదే బాటలో ఎంపిక చేసిన పీఏసీఎస్‌లలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సొసైటీల బలోపేతమే లక్ష్యం
నష్టాల్లో ఉన్న సొసైటీలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుకు అవసరమైన ఎన్‌వోసీల జారీలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. పెట్రోల్ బంకులు, జన ఔషధి కేంద్రాలతో పాటు స్థానిక డిమాండ్ ఉన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటును సొసైటీలకు కల్పిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖల మంత్రి
Comments
Please login to add a commentAdd a comment