societies
-
ఏమాత్రం సంపాదించారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సమస్త సమాచారాన్ని సేకరించే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం పడింది. వారుంటున్న ఇంటి వివరాల నుంచి వాడే మొబైల్ వరకూ అన్ని వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ఆరు పేజీలతో కూడిన ప్రశ్నావళిని అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపింది. ఎస్‌హెచ్‌జీలోని సభ్యుల రుణాలు, మొత్తం గ్రూపు ఎంతమేర రుణం తీసుకుంది? నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ ఎంత అనే వివరాలతో పాటు ఆయా సంఘాల్లో ఉంటున్న సభ్యుల కుటుంబాల్లోని ఇతరుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది.ఈ మేరకు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలతో పాటు పట్టణాల్లోని మెప్మా పీడీలకు కూడా ఈ ప్రశ్నావళిని ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలను సేకరించి మెప్మా, డీఆర్డీఏ పీడీల సంతకాలతో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కేవలం గ్రూపులకు సంబంధించిన సమాచారం, ఆయా గ్రూపుల్లో ఉన్న మహిళల సమాచారం మాత్రమే కాకుండా మొత్తం వారి కుటుంబ ఆదాయ వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో ప్రభుత్వం మంజూరుచేసే సంక్షేమ పథకాల అమలులో కోత విధించేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లు నుంచి సెల్లు వరకూ..రాష్ట్రవ్యాప్తంగా 11.46 లక్షల పొదుపు సంఘాలున్నాయి. ఇందులో కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ అన్ని గ్రూపులకు సంబంధించిన సమాచారంతో పాటు గ్రూపులో ఉన్న మహిళలందరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. వారుంటున్న ఇంటి నుంచి.. వాడే సెల్‌ఫోన్ వరకూ అన్ని వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. నివాసం ఉంటున్న ఇల్లు సొంతానిదా? అద్దెకు ఉంటున్నారా? ఇల్లు ఏ రకానికి చెందినది.. అంటే, గుడిసె, పెంకుటిల్లు, భవంతి, అపార్టుమెంట్ అనే వివరాలను సేకరిస్తోంది. ఇంటి స్థలం, ఇల్లు, ఇతరత్రా ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందారా? అని కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.అలాగే, వివిధ ప్రభుత్వ బీమా పథకాల ద్వారా లబ్ధిపొందారా? ఎంత మొత్తం పొందారు? ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? కారు ఉందా? తదతర వివరాలను కూడా నింపాలని పేర్కొంది. ఇక సభ్యురాలి మొబైల్ నెంబరుతో పాటు ఎటువంటి ఫోన్ వినియోగిస్తున్నారు? డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఎంత మొత్తం నిర్వహిస్తున్నారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ ఎస్‌హెచ్‌జీ ద్వారా ఏమైనా స్వయం ఉపాధి పొందుతుంటే.. తద్వారా వచ్చే ఆదాయం ఎంత? జీఎస్టీ నెంబరు వివరాలను కూడా సేకరిస్తున్నారు.సంక్షేమ పథకాల కోతకేనా!?కేవలం ఎస్‌హెచ్‌జీలో ఉంటున్న మహిళల ఆదాయ వివరాలతో ఆగకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే, పొదుపు మహిళలు స్వయం ఉపాధి ద్వారా పొందుతున్న ఆదాయంతో పాటు కుటుంబంలోని సభ్యుల ఆదాయాన్ని కూడా తెలుసుకోనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల కోసం సేకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సేకరిస్తున్న వివరాలన్నీ ప్రభుత్వానికి చేరితే ఇస్తున్న కొద్దిపాటి సంక్షేమానికి కూడా కోతలు పెడతారనే భయాందోళనలను ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక.. ఇంట్లో వాడుతున్న గ్యాస్ నెంబరును కూడా ఆర్పీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుండటంతో వారు కలవరపడుతున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని జిల్లాల మెప్మా, డీఆర్డీఏ పీడీలు సేకరించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీకావడంతో వారు ఈ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. -
AP: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అందుకున్నారు. దిగులు లేని అవ్వాతాతలు ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగులు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. 2,750 నుంచి రూ.10 వేల దాకా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికే వచ్చి డబ్బులు అందజేస్తుండటంతో గతంలో లాగా పింఛన్ అందుకోవడానికి పడే తిప్పలు వారికి తప్పాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో పింఛనుకు అర్హత ఉండీ దానిని అందుకోవాలంటేనే ఓ ప్రహసనం. ప్రభుత్వ ఆఫీసులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు కూడా అయిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. పింఛన్ తీసుకునేవాళ్లు నడవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, కొత్తగా పింఛన్ల మంజూరు సహా ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పథకాలు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా 65.54 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగున్నర ఏళ్లలో రూ. 81,947 కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 23 లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక మనరాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ విధానాన్ని పలు రాష్ట్రాలు చూసి అక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహిళా సాధికారతకు పట్టం.. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో పొదుపు సంఘాల మహిళలు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా సూపర్ మార్కెట్ (వైఎస్సార్ చేయూత మహిళామార్ట్)లు ఏర్పాటు చేసుకొని వాటిని లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. 2022 ఆగస్టు 22న మొట్టమొదటిగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో చేయూత మార్ట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మార్టులు ఏర్పాటయ్యాయి. శుక్రవారం వరకు ఆయా మార్టుల్లో రూ. 58.18 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సంఘటిత శక్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పొదుపు సంఘాల వ్యవస్థ బలోపేతం పొదుపు సంఘాల వ్యవస్థను అవసరాలకు తగిన విధంగా బలోపేతం చేయడానికి శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.49 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా 3,648 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో యూపీఐ పేమెంట్ తదితర డిజిటల్ లావాదేవీలు, ఆరి్థక భద్రత అంశాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పొదుపు సంఘాల సభ్యుల లావాదేవీలను ఆన్లైన్లో పర్యవేక్షించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
అవును.. సీఎం జగన్ మహిళా పక్షపాతే
సాక్షి, అమరావతి : అవును.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతే. ‘ఈనాడు’ తనకు నచ్చలేదని ‘పచ్చ’వాతం జబ్బుతో తప్పుడు రాతలు రాస్తే కాకుండాపోతారా! డ్వాక్రా (పొదుపు సంఘాల) మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాక పైసా విదల్చకుండా రాష్ట్రంలో మహిళలను మోసం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఎవ్వరూ పైసా కట్టొద్దంటూ 2014 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీని నమ్మి మహిళలు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన మోసానికి బలైన పేదింటి మహిళలు వారు తీసుకున్న రుణాలపై ఐదేళ్ల పాటు వడ్డీలపై వడ్డీలు కట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ. 25,571 కోట్లు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు. ఇంకొకటి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించారు. గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో రూ. 4,969.05 కోట్లు వడ్డీని చెల్లించి, అక్కచెల్లెమ్మలపై భారాన్ని తగ్గించారు సీఎం వైఎస్ జగన్. అడుగడుగునా వంచించిన చంద్రబాబును మహిళా వ్యతిరేకిగా, అన్ని విధాలుగా ఆదుకొంటున్న సీఎం వైఎస్ జగన్ సర్కారును మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పేద మహిళలు ఎందుకు భావించకుండా ఉంటారు? డ్వాక్రా రుణాల మాఫీ, సున్నా వడ్డీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పి, అక్కచెల్లెమ్మలను మోసం చేసిన వైనాన్ని ఏ రోజూ ప్రశ్నించలేని ‘ఈనాడు’ పత్రిక.., ఇప్పుడు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డిపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఈనాడు ఆరోపణ: డ్వాక్రా సున్నా వడ్డీ కోత. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5 లక్షల రుణం వరకు వర్తింపు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రూ. 3 లక్షలకు కుదింపు. వాస్తవం: సున్నా వడ్డీ పథకానికి గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడేసింది. 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. మొత్తం ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు చివరి మూడేళ్లు పథకాన్ని చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిన పథకానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కోత పెట్టిందని రాయడం ‘ఈనాడు’ ప్రజలను వంచించడమే. ఆరోపణ: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రుణ పరిమితిని తగ్గించింది వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సి, డి గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఎ, బి‘ గ్రేడ్ లోకి చేరాయి. మరోవైపు గత నాలుగేళ్లుగా ఏటా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆరోపణ: సున్నా వడ్డీ పథకంలోనూ కేంద్రం వాటా ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. వాస్తవం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఈ నాలుగు సంవత్స రాలలో ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘాలు బ్యాంకులకు కట్టవ లసిన వడ్డీని వారి తరపున ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటివరకు 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969.05 కోట్లు వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది. రాష్ట్రంలోని పేద మహిళలపై ఒక్క పైసా భారం వేయలేదు. ఆరోపణ: గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయడం మహిళాపక్షపాతమా? వాస్తవం: గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీకి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పులు మొత్తం సుమారు రూ. 25,571 కోట్లు. ఆ మొత్తాన్ని నాలుగు విడతల్లో ఆయా మహిళలందరికీ చెల్లించేలా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా’ పథకం అమలు చేస్తోంది. అంటే, చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే బేషరతుగా మాఫీ చేస్తానన్న రూ. 14 వేల కోట్ల అప్పులు, ఆ తర్వాత ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571 కోట్లు అయ్యాయి. ఈ మొత్తం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పేద మహిళలను మోసం చేసి ఎగ్గొట్టిందే. ఇందులో డ్వాక్రా మహిళల రుణ మొత్తాలతో పాటు ఆ ఐదేళ్లలో మహిళలపై వడ్డీ రూపంలో పెరిగిన అదనపు భారం కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. అలాంటప్పుడు.. గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్న ఆరోపణే అబద్ధం. అయినా, రూ.2100 కోట్లు బకాయిలు ఎగవేత అని ప్రచురించడం లో ‘ఈనాడు’కున్న ‘పచ్చ’వాతం జబ్బును తెలియజేస్తోంది. -
ఇక సహకార జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి, అమరావతి: సొసైటీల ఆధ్వర్యంలో సహకార జన ఔషధి కేంద్రాలు రాబోతున్నాయి. ప్రజలకు అత్యంత తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచడంతోపాటు ఆదాయ వనరులు పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలతో పీఏసీఎస్‌లు లాభాల బాట పట్టాయి. ఇదే కోవలో నష్టాల్లో ఉన్న సంఘాలు తమ ఆర్థిక స్థితిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. బహుళ సేవా కేంద్రాలుగా పీఏసీఎస్‌లను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గ్రామ స్థాయిలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాల ఆర్థిక చేయూత తొలి దశలో జిల్లాకు ఐదు పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 పీఏసీఎస్‌లతోపాటు 13 డీసీఎంఎస్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరిట వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇవ్వనున్నాయి. ఒక్కో జన ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. వీటిద్వారా నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణుల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందిస్తారు. సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు స్థలాలు అందుబాటులో ఉన్న 106 పీఏసీఎస్‌లలో ఒక్కొక్క చోట రూ.25 లక్షల అంచనా వ్యయంతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా డీలర్‌షిప్‌లు మంజూరుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. బంక్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నాయి. 27 పీఏసీఎస్‌లలో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు సంబంధిత శాఖలు ఇప్పటికే ఎన్వోసీలు ఇచ్చాయి. ఆరు చోట్ల పెట్రోల్ బంక్‌లు ప్రారంభించారు. మిగిలిన 83 పీఏసీఎస్‌ల ఆధ్వర్యం బంక్‌ల ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీలను సాధ్యమైనంత త్వరగా సాధించే దిశగా సహకార శాఖ చర్యలు చేపట్టింది. అదే బాటలో ఎంపిక చేసిన పీఏసీఎస్‌లలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సొసైటీల బలోపేతమే లక్ష్యం నష్టాల్లో ఉన్న సొసైటీలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీల జారీలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. పెట్రోల్ బంకులు, జన ఔషధి కేంద్రాలతో పాటు స్థానిక డిమాండ్ ఉన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటును సొసైటీలకు కల్పిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖల మంత్రి -
సొసైటీల రిజిస్ట్రార్‌కు ఆ అధికారం లేదు
సాక్షి, అమరావతి: సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద ఆయా సొసైటీలు సమర్పించే వార్షిక జాబితాలను ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం సొసైటీల రిజిస్ట్రార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సొసైటీలు అందించిన వివరాలు తనకు అందినట్లు ధ్రువీకరించడం (అక్నాలడ్జ్) మినహా వాటి ఆమోదం, తిరస్కారం విషయంలో రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకోజాలరని పేర్కొంది. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఉన్న ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్ఆర్ఐ ఆస్పత్రి) ఆఫీస్ బేరర్లకు సంబంధించి డాక్టర్ మంతెన నరసరాజు తదితరులు సమర్పించిన సవరణ జాబితాను ఆమోదించి, మరికొందరు డాక్టర్లు సమర్పించిన జాబితాను సొసైటీల రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రిజిస్ట్రార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌ను రద్దుచేసింది. ఆఫీస్ బేరర్ల వివాదం తేలేంతవరకు ఇరుపక్షాలు సమర్పించిన జాబితాను రికార్డుల్లో ఉంచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రికి సంబంధించిన ఆఫీస్ బేరర్ల విషయంలో డాక్టర్ మంతెన నరసరాజు తదితరులు సమర్పించిన జాబితాను ఆమోదించి, తమ దరఖాస్తును సొసైటీ రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ పోలవరపు రాఘవరావు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఈ వ్యవహారంలో అనేక వివాదాస్పద విషయాలున్నాయని, ఈ కోర్టు వాటి జోలికి వెళ్లడంలేదని తెలిపారు. ఇరుపక్షాలు చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను, న్యాయపరమైన మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్‌కు ఇరుపక్షాలు సమర్పించిన జాబితాలు సంబంధిత కోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
14 నుంచి సహకార వారోత్సవాలు
బోట్‌క్లబ్ (కాకినాడ): జిల్లాలోని అన్ని సొసైటీల్లోను సహకార వారోత్సవాల సందర్భంగా పతాకాలు ఆవిష్కరించాలని జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ పేర్కొన్నారు. స్థానిక డీసీసీబీలో శుక్రవారం ఈ నెల 14 నుంచి 20 వరకూ జరిగే 63వ సహకార వారోత్సవాలపై సహకార సంఘ అధ్యక్షుడు, సీఈవోలుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలు అందించాలన్నారు. సహకార విద్యాధికారి ఆదిమూలం వేంకటేశ్వరరావు మాట్లాడుతూ సహకార వారోత్సవాలను ఈ నెల 14న డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా డీసీసీబీలో ప్రారంభిస్తారన్నారు. కాకినాడ డివిజ¯ŒS సహకార అధికారి కె.పద్మ ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు. పెద్దాపురం డివిజ¯ŒS సహకార అధికారి ఎ.రాధాకృష్ణ పరపతేతర వ్యాపారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు దున్నా జనార్థనరావు, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు. -
సొసైటీలు పారదర్శకంగా పనిచేయాలి
జిల్లా సహకార అధికారి రాజేశ్వరరావు నెల్లూరు రూరల్ : గ్రామ స్థాయిలో ప్రాథమిక పరపతి సంఘాలు(సొసైటీలు) పారదర్శకమైన సేవలు అందించాలని జిల్లా సహకార అధికారి రాజేశ్వరరావు సొసైటీల ముఖ్య కార్యనిర్వాహణ అధికారులకు సూచించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో క్రిభ్కో ఆధ్వర్యంలో నిఘా అవగాహణ వారోత్సవాలను గురువారం నిర్వహించారు. డీసీఓ మాట్లాడారు. రైతులకు అవినీతి రహిత సేవలు అందించాలన్నారు. గ్రామాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనా«ద్‌రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు సకాలంలో ఎరువులు అందజేస్తూ, స్టాకు, క్రయ, విక్రయాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు చేరకుండా సొసైటీలు సహకరించాలన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రతి వ్యవస్థలో నిఘా విభాగాన్ని పటిష్టంగా పనిచేయాలన్నారు. క్రిభ్కో సీనియర్ మేనేజర్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో ఎరువుల కర్మాగారం నిర్మిస్తున్నట్లు చెప్పారు. డీలర్లు, సహకార సంఘాలు ఎరువులను రైతులకు సకాలంలో అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంకు సీఈఓ రాజారెడ్డి, డీఎల్సీఓ తిరుపాల్‌రెడ్డి, శరభయ్య, డీసీఎంఎస్ మేనేజర్ సుధాభారతి, విజిలెన్స్ ఏఓ ధనుంజయరెడ్డి, క్రిభ్కో డిప్యూటీ మేనేజర్ రియాజ్ అహ్మద్, పీఏసీఎస్ సీఈఓలు, తదితరులు పాల్గొన్నారు. -
వికలాంగుల అభివృద్ధికి సహకరించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ భాస్కరరెడ్డి కోరారు. ఈ యేడాది ఎంపీ నిధులతో 179 మందికి మోటార్ సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. శుక్రవారం యూరోపియన్ యూనియన్, లిమోనార్డ్ చెషైర్ డిజేబిలిటీ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎల్సీడీడీపీ) సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో వికలాంగుల పథకాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆ సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ గోవిందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ పారా ఒలింపిక్స్‌లో భారత వికలాంగుల ప్రదర్శన అత్యద్భుతమన్నారు. ఉపకార వేతనాలు పొందేందుకు వికలాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ, చంద్రన్న బీమా పథకం ప్రాజెక్టు మేనేజర్ రాజాప్రతాప్ మాట్లాడుతూ 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన బడుగు, బలహీన వర్గాల వారు ఒకేసారి రూ.15 చెల్లించి చంద్రన్న బీమాలో చేరవచ్చన్నారు. ఈ పథకంలో సభ్యుల సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. వికలాంగులు కూడా ఈ పథకంలో చేరి లబ్ధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డ్వామా తరపున కృష్ణమోహన్, ఉపాధిహామీ పథకం వికలాంగుల సమన్వయకర్త సురేష్‌కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆంజనేయులు, మద్దిలేటి, చంద్రశేఖర్, నిర్మల పాల్గొన్నారు. -
‘స్వచ్ఛంద’ వేదిక అభినందనీయం
– కేఎన్ఎన్ జిల్లా సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్జీవోలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ఎన్జీవోస్ నెట్వర్క్(కేఎన్ఎన్) మొట్టమొదటి జిల్లా సమాశాన్ని బుధవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఎన్జీవోలు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమన్నారు. అందరూ కలిస్తే రాష్ట్ర వ్యాప్త సేవలుఅందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్జీవోలందించే సేవల పట్ల ఎవరైనా అధికారులు పట్టించుకోకపోతే తన దష్టికి తేవాలన్నారు. తాను నేరుగా కేంద్ర ప్రభుత్వ దష్టికి తీసుకెళతానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ ట్రస్టు ద్వారా ప్రజలకు విద్య, వైద్యపరమైన ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 132 సంస్థలు కలిశాయని కేఎన్ఎన్ జిల్లా చైర్మన్ మోహన్‌రాజ్ తెలిపారు. ప్రభుత్వం వెళ్లలేని చోటకు సేవా సంస్థలు వెళతాయన్నారు. కన్వీనర్ పాల్ రాజారావు మాట్లాడుతూ.. కరవు కాటకాలు వచ్చినా, సామాజిక సమస్యలు ఉత్పన్నమైనా ఎన్జీవోలు ముందుంటారన్నారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుకను సన్మానించారు. కార్యక్రమంలో హఫీజ్ ఖాన్ ట్రస్టు వ్యవస్థాపకుడు ఎం.ఎ.మోయీజ్ ఖాన్, వైఎస్ఆర్సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్, కేఎన్ఎన్ కర్నూలు డివిజన్ అధ్యక్షుడు మద్దిలేటి, నంద్యాల మురళీకష్ణ, ఆదోని ఓంకారాచారితో పాటు ప్రసాద్, శైలజ, త్యాగరాజు, రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.