అవార్డు అందుకుంటున్న సెర్ప్ సీఈవో ఇంతియాజ్
సాక్షి, అమరావతి: ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది.
అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అందుకున్నారు.
దిగులు లేని అవ్వాతాతలు
ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగులు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. 2,750 నుంచి రూ.10 వేల దాకా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికే వచ్చి డబ్బులు అందజేస్తుండటంతో గతంలో లాగా పింఛన్ అందుకోవడానికి పడే తిప్పలు వారికి తప్పాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో పింఛనుకు అర్హత ఉండీ దానిని అందుకోవాలంటేనే ఓ ప్రహసనం.
ప్రభుత్వ ఆఫీసులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు కూడా అయిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. పింఛన్ తీసుకునేవాళ్లు నడవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, కొత్తగా పింఛన్ల మంజూరు సహా ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పథకాలు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ప్రతి నెలా 65.54 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగున్నర ఏళ్లలో రూ. 81,947 కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 23 లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక మనరాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ విధానాన్ని పలు రాష్ట్రాలు చూసి అక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
మహిళా సాధికారతకు పట్టం..
గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో పొదుపు సంఘాల మహిళలు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా సూపర్ మార్కెట్ (వైఎస్సార్ చేయూత మహిళామార్ట్)లు ఏర్పాటు చేసుకొని వాటిని లాభదాయకంగా నిర్వహిస్తున్నారు.
2022 ఆగస్టు 22న మొట్టమొదటిగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో చేయూత మార్ట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మార్టులు ఏర్పాటయ్యాయి. శుక్రవారం వరకు ఆయా మార్టుల్లో రూ. 58.18 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సంఘటిత శక్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
పొదుపు సంఘాల వ్యవస్థ బలోపేతం
పొదుపు సంఘాల వ్యవస్థను అవసరాలకు తగిన విధంగా బలోపేతం చేయడానికి శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.49 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ద్వారా 3,648 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో యూపీఐ పేమెంట్ తదితర డిజిటల్ లావాదేవీలు, ఆరి్థక భద్రత అంశాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పొదుపు సంఘాల సభ్యుల లావాదేవీలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment