వికలాంగుల అభివృద్ధికి సహకరించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ భాస్కరరెడ్డి కోరారు. ఈ యేడాది ఎంపీ నిధులతో 179 మందికి మోటార్ సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. శుక్రవారం యూరోపియన్ యూనియన్, లిమోనార్డ్ చెషైర్ డిజేబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎల్‌సీడీడీపీ) సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో వికలాంగుల పథకాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆ సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ గోవిందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ పారా ఒలింపిక్స్‌లో భారత వికలాంగుల ప్రదర్శన అత్యద్భుతమన్నారు. ఉపకార వేతనాలు పొందేందుకు వికలాంగులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ, చంద్రన్న బీమా పథకం ప్రాజెక్టు మేనేజర్ రాజాప్రతాప్ మాట్లాడుతూ 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన బడుగు, బలహీన వర్గాల వారు ఒకేసారి రూ.15 చెల్లించి చంద్రన్న బీమాలో చేరవచ్చన్నారు. ఈ పథకంలో సభ్యుల సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. వికలాంగులు కూడా ఈ పథకంలో చేరి లబ్ధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డ్వామా తరపున కృష్ణమోహన్, ఉపాధిహామీ పథకం వికలాంగుల సమన్వయకర్త సురేష్‌కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆంజనేయులు, మద్దిలేటి, చంద్రశేఖర్, నిర్మల పాల్గొన్నారు.