ప్రతి చెరువుకు సాగునీటి వినియోగదారుల సంఘం
ఎన్నికలు లేకుండా రైతులతో ప్రభుత్వమే నియమించాలి
గత 10 ఏళ్లలో చెరువుల నిర్వహణ అస్తవ్యస్తం
2025ను చెరువుల సంవత్సరంగా ప్రకటించాలి
చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టాలి
ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ,రైతు సంక్షేమ కమిషన్ సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రతి చెరువుకు ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గతంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకునేవారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది.
ఇప్పుడు ఎన్నికలకు బదులు ప్రభుత్వమే చెరువు కింద సాగుచేసే రైతులతో సాగునీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ సూచించింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
చిన్న నీటిపారుదల శాఖను ఏర్పాటు చేయండి
నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్న నీటిపారుదల శాఖను నీటిపారుదల శాఖలో విలీనం చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్వహణకే నీటిపారుదల శాఖలోని యంత్రాంగం పరిమితం కావడంతో గత 10 ఏళ్లలో చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని రైతు కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో 46,531 చెరువులుండగా, వాటికింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
గత ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానం చేసి.. వాటిని నింపినప్పటికీ, నిర్వహణను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
దీంతో మళ్లీ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని రైతు కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నుంచి చిన్న నీటిపారుదల శాఖను విభజించి పాత విధానంలో చెరువుల నిర్వహణను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది.
చెరువుల సంవత్సరంగా 2025!
2025 ఏడాదిని చెరువుల సంవత్సరంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. చెరువుల తూములు, కట్టలు, కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉండేది.
ఒక చెరువు నిండితే దాని కింద ఉన్న చెరువులను నింపుకుంటూ నీళ్లు ప్రవహించేవి. చెరువులు ఆక్రమణకు గురికావడం, లేఅవుట్లు రావడంతో గొలుసుకట్ట వ్యవస్థ దెబ్బతిన్నదని రైతు సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, వాటి కింద చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment