Welfare Department
-
సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి: పేద పిల్లలు చదువుకునే సంక్షేమ హాస్టళ్ల(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు)పై ఇంత నిర్లక్ష్యమా? అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పిల్లలెందుకు నేలపై నిద్రిస్తున్నారని నిల దీసింది. సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంత నిధులు కేటాయించారు? అందులో ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? ఆ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? తదితర వివ రాలను గణాంకాలతో సహా తమ ముందుంచాలని సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆన్లైన్లో హాజరవ్వాలని తేల్చిచెప్పింది. అలాగే ప్రతి జిల్లాలో కనీసం ఐదు సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి.. నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. విద్యార్థులతో సంభాషించి వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని.. పౌష్టికాహారం, తాగునీరు, దుప్పట్లు, దోమ తెరలు వంటి కనీస అవసరాలు తీరుతున్నాయో, లేదో తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలకు.. కులాలతో ఏం సంబంధం?జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సంక్షేమ హాస్టళ్లలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని.. కానీ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఆ పరిస్థితులు లేవంటూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అరుణ్ శౌరి వాదనలు వినిపిస్తూ.. సంక్షేమ హాస్టళ్లలో తగినన్ని బాత్రూమ్లు లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధర్మాసనం స్పంది స్తూ.. దీనిపై మీ వైఖరి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. సంక్షేమ హాస్టళ్లకు నిధుల కేటాయింపులు పెంచామని చెప్పారు. అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పెంచుతామని.. ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. 1:7 నిష్పత్తిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. ఈ విషయాలను కౌంటర్లో పేర్కొన్నామని ఆమె తెలిపారు. కాగా, ఆ కౌంటర్లో హాస్టళ్లలో చదువుతున్న పిల్లల కులాలను పొందుపరచడాన్ని ధర్మాసనం గమనించింది. పిల్లలకు కులాలతో ఏం సంబంధమని.. పిల్లలు పిల్లలేనని ధర్మాసనం వ్యా ఖ్యా నించింది. ప్రభుత్వ కౌంటర్ సాదాసీదాగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. పూర్తి వివరా లతో నివేదికను కోర్టు ముందుంచుతామని ప్రణతి చెప్పారు.ఇంత తక్కువ నిధులతో నిర్వహణ ఎలా సాధ్యం?బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిధులిస్తుంటే.. విద్యార్థులు ఎందుకు నేలపై నిద్రపోతారని ప్రశ్నించింది. తగినన్ని మరుగుదొడ్లు, బెడ్లు, బెడ్షీట్లు, పౌష్టికాహారం తదితరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దోమ తెరలు అందించాలని ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంక్షేమ హాస్టళ్ల కోసం రూ.143 కోట్లే కేటాయించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తంతో హాస్టళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. భావిభారత పౌరుల కోసం నామామాత్రంగా నిధులు కేటాయిస్తే ఎలా? అంటూ నిలదీసింది. 90,148 మంది విద్యార్థులకు ఇంత తక్కువ మొత్తం ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. ఇప్పటి వరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నివేదిక, జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు అందించే నివేదికలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. -
త్వరలో ‘కేసీఆర్ విద్యా కానుక’: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసనమండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రులు స్పందించారు. బీసీ సంక్షేమంపై మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీసీల్లో ఆత్మగౌరవం ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. త్వరలోనే కేసీఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎవరూ చేయలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన వర్గాలను కేసీఆర్ జనజీవనంలో ఉన్నతస్థానంలో నిలిపారన్నారు. -
8 సుస్థిరాభివృద్థి లక్ష్యాల పర్యవేక్షణకు కమిటీ
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి పేర్కొన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీఎస్డీజీ ప్రత్యేక పోర్టల్ ద్వారా సేకరించే సమాచారం దునియోగం కాకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిటీలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, మైనార్టీ, గిరిజన సంక్షేమ కార్యదర్శులు సభ్యులుగా, ఐటీశాఖ కార్యదర్శి సభ్య కన్వినర్‌గా వ్యవహరిస్తారని వివరించారు. 10 నుంచి 19 ఏళ్ల బాలికల్లో ఎనీమియా, 15 నుంచి 49 ఏళ్ల మధ్యలో గర్భందా ల్చిన మహిళల్లో ఎనీమియా, ఐదేళ్లలోపు వయసులో బరువు తక్కువగా ఉన్న వారిలో పౌష్టికాహారలోపం, ఐదేళ్లలోపు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగని పిల్లల్లో పౌష్టికాహారలోపం, 1–8 తరగతుల విద్యార్థుల ప్రాథమిక విద్య నమోదు, ఇంటర్మిడియట్ విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి, పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, పాఠశాలల్లో విద్యార్థినుల టాయిలెట్స్ వంటి ఎనిమిది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎప్పటికప్పుడు సేకరించి ఏపీఎస్డీసీ పోర్టల్‌లో నమోదు చేస్తారు. -
‘సంక్షేమం’ కాస్త మెరుగు !
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలకు 2023–24 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు మెరుగుపడ్డాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి నిధులు కాస్త పెరిగాయి. నూతన నియామకాలు, ఇతరత్రా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. అయితే పెరిగిన కేటాయింపులతో మాత్రం క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలకు పెద్దగా ప్రయోజనం లేదు. గత బడ్జెట్లో సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు జరిగినట్లుగానే ఈదఫా అటుఇటుగా కేటాయింపులు చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)కు గత బడ్జెట్ కంటే దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈసారి కూడా రూ.17,700 కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం కింద 2022–23లో ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఆ నిధులనే ఈసారి క్యారీఫార్వర్డ్ చేశారు. బీసీలకు అంతంతే...! బడ్జెట్ వెనుకబడిన తరగతుల్లో పెద్దగా ఉత్సాహం నింపలేదు. ఈసారి బీసీ సంక్షేమ శాఖకు రూ.6,229 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.531 కోట్లు పెరిగాయి. తాజాగా బీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. గత బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు కేటాయించగా... ఈసారి రూ.100 కోట్లు తగ్గింది. 2022–23లో ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి సంబంధించిన పథకాలేవీ అమలు కాలేదు. దీంతో గత కేటాయింపులే ఈసారీ జరిపినట్లు చెప్పొచ్చు. ఇక రజక, నాయూ బ్రాహ్మణ ఫెడరేషన్లకు గత బడ్జెట్ మాదిరిగానే ఈసారీ రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. కల్లుగీత కార్మికుల ఫెడరేషన్‌కు కూడా గతంలో మాదిరిగానే రూ.30 కోట్లు కేటాయించగా... మిగతా ఫెడరేషన్లకు నామమాత్రపు నిధులే కేటాయించడంతో ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసినట్లైంది. బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో 2023–24 సంవత్సరంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ప్రస్తుత సంస్థల అప్‌గ్రెడేషన్, తరగతుల పెరుగుదల, కొత్తగా ఉద్యోగుల నియామకాలు తదితరాలకు నిధుల ఆవశ్యకత పెరగడంతో కేటాయింపుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అదేవిధంగా క్రిస్టియన్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్లకు ఆర్థిక చేకూర్పు పథకాల కింద 270 కోట్లు కేటాయించారు. కార్మిక సంక్షేమ శాఖకు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలకు కూడా కేటాయింపులు కాస్త మెరుగుపడ్డట్లు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ శాఖల పరిధిలో కొత్త పథకాల ఊసులేదు. -
‘ఫీజు’కు తప్పని నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు మరింత నిరీక్షణ తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అటు సంక్షేమ శాఖల వద్ద భారీగా బిల్లులు పేరుకుపోగా.. ఇటు సంక్షేమశాఖలు ఈపాస్ ద్వారా ఆన్లైన్లో క్లియర్ చేసిన బిల్లులకూ ట్రెజరీల్లో చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. దీనితో కాలేజీల యాజమాన్యాల నుంచి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ శాఖల గణాంకాల ప్రకారం.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి రూ.1,867.66 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.460.96 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2021–22కు సంబంధించి 1,406.70 కోట్లు చెల్లించాలి. ఇక 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ మొదలుకాలేదు. ట్రెజరీలో ఆగిన రూ.560 కోట్లు పోస్ట్‌మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలతోపాటు అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ముందుగా కాలేజీ యాజమాన్యాలు పరిశీలించి ఆమోదం కోసం సంక్షేమశాఖ అధికారులకు పంపుతాయి. సంక్షేమశాఖల అధికారులు వాటిని పరిశీలించాక ఆమోదించి నిధుల విడుదల కోసం ట్రెజరీకి బిల్లులు పంపుతారు. ట్రెజరీ అధికారులు వాటిని పరిష్కరించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సుమారు రూ.560.16 కోట్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపగా.. అధికారులు ఆమోదించి టోకెన్లు జనరేట్ చేశారు. కానీ ఆర్థికశాఖ విధించిన ఆంక్షలతో నిధుల విడుదల చివరిదశలో నిలిచిపోయింది. ఆంక్షలు సడలించాకే నిధులు విడుదలవుతాయి. చెల్లింపుల్లో పెరుగుతున్న జాప్యం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చెల్లింపులు ఒక ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా విద్యా సంవత్సరం ముగియగానే.. ఆ ఏడాదికి సంబంధించిన నిధుల చెల్లింపుల ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో చెల్లింపుల్లో జాప్యం పెరిగింది. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు దాదాపు 20 శాతం చెల్లించాల్సి ఉంది. 2021–22కు సంబంధించి 50 శాతం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా చెల్లింపులు మొదలుకాలేదు. -
‘ఉపకార’ సంస్కరణలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల విషయంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావించిన సంక్షేమ శాఖలకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలను సమర్పించాయి. ప్రధానంగా సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ, పరిశీలన, ఆమోదం విషయంలో సవరణలకు సంబంధించిన ప్రతి పాదనలను సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా..వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం అవలంభిస్తున్న పద్ధతులతోనే పథకాలను అమలు చేయాలని భావించి పాత విధానాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేశాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి విద్యార్థుల నుంచి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేలా గడువును నిర్దేశించాయి. సులభతరం కోసం సంస్కరణలు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఇవన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరిస్తున్నప్పటికీ.. పరిశీలన ప్రక్రియలో పలు అంచెలన్నీ మాన్యువల్ పద్ధతిలోనే సాగుతున్నాయి. దీంతో పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సులభతర విధానం కోసం దరఖాస్తుల ప్రక్రియలో మార్పులు చేయాలని సంక్షేమ శాఖలు పలు దఫాలుగా చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఏదైనా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకసారి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పిస్తే కోర్సు ముగిసే వరకు ఆ దరఖాస్తును సాంకేతికంగా అప్డేట్ చేయాలని, ఈ బాధ్యతలను కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే విద్యార్థి పదేపదే దరఖాస్తు చేసే పని ఉండదని, సంక్షేమ శాఖ అధికారులు మొదటి ప్రతిపాదన చేశారు. విద్యార్థుల నుంచి ప్రతిసారి ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, అఫిడవిట్లు తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని, ఇక ప్రతి విద్యార్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో పత్రాలను సమర్పించడం కాకుండా ఆన్లైన్ విధానాన్నే పాటించడం, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియంతా కాలేజీలో నిర్వహించడంలాంటి పద్ధతులతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలు మరింత సులభతరమవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇదంతా జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో పాత విధానాన్నే అనుసరించాలని, ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేస్తూ కాలేజీ యాజమాన్యాలకు జిల్లా సంక్షేమ శాఖల నుంచి ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు. -
ప్రతీ జిల్లాకు బీసీ గురుకుల పాఠశాల
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులు ప్రవేశం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. దీంతో ప్రతి జిల్లాలో కొత్తగా 5,6,7 తరగతుల్లో అదనపు ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. లొకేషన్లకు గ్రీన్ సిగ్నల్... రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 33 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి కీలకమైన లొకేషన్ల ఫైనలైజేషన్ పూర్తయింది. జిల్లా కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సమ్మతించింది. ఈ క్రమంలో వీటి ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించేందుకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసే గురుకుల పాఠశాలల్లో 5,6,7 తరగతుల్లో అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా పాత పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాక కొత్త పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. వచ్చేనెల మొదటి వారంలో అడ్మిషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది. అతి పెద్ద సొసైటీగా... రాష్ట్రంలో నాలుగు సంక్షేమ శాఖల పరిధిలో గురుకుల సొసైటీలుండగా...ప్రస్తుతం అతి పెద్ద సొసైటీగా ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఆవిర్భవించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలలతో పోలిస్తే ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్లో 294 గురుకుల పాఠశాలలున్నాయి. ఆ తర్వాత టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో 267 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది. మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 206 పాఠశాలలు, గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో 186 పాఠశాలలున్నాయి. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా సంక్షేమ శాఖల ద్వారా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ తెరవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. అందులోనూ కేవలం ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు మాత్రమే స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తుండగా... మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలు మాత్రం స్టడీ సర్కిళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా అన్ని సంక్షేమ శాఖలకు జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేయగా... గత వారం సీఎస్ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకొక స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రస్తుతం కొనసాగుతున్నవి, ఎక్కడెక్కడ అవసరం ఉంది తదితర సమగ్ర వివరాలతో సంక్షేమ శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే స్టడీ సర్కిళ్లు శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిరంతరంగా శిక్షణ ఇకపై ప్రతి జిల్లాలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తే వాటిని నిరంతరంగా కొనసాగించేలా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోంది. సంక్షేమ శాఖల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా వీటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయి వెంటనే ఉద్యోగార్థులతో ఒక బ్యాచ్‌ను ఎంపిక చేసి శిక్షణ మొదలు పెడతారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్లు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లు రెగ్యులర్‌గా ఉండటంతో వీటికి నిరంతరంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ శాఖల వారీగా ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
అంధులు, బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు అంధులు, బధి రుల ఆశ్రమ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 462 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థి వయసు 5 సంవత్సరాలు పైబడి ఉండాలని, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 3 జతచేసి దరఖాస్తులు పంపాలన్నారు. ఈ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, ఉచిత భోజనం, అన్నివేళలా వైద్య సౌకర్యం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ కల్పి స్తారన్నారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి, సాంకేతిక బాష నేర్పబడతాయన్నారు. ఖాళీలు ఇలా.. ► విజయనగరంలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో 1నుంచి 8వ తరగతి వరకు 43 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 83175–48039, 94403–59775 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ► విశాఖపట్నం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 54 ఖాళీలు ఉన్నాయి. బాలికలకు మాత్రమే. వివరాలకు ఫోన్ 94949–14959, 90144–56753 నంబర్లలో సంప్రదించాలి. ► హిందూపురం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 106 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 77022–27917, 77805–24716 నంబర్లలో సంప్రదించవచ్చు. ► విజయనగరం బధిరుల పాఠశాలలో 1నుం చి 8వ తరగతి వరకు 20 ఖాళీలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఫోన్ 90000–13640, 99638–09120 నంబర్లలో సంప్రదించాలి. ► బాపట్ల బధిరుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 78 ఖాళీలు ఉన్నాయి. ఫోన్ 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. ► ఒంగోలు బధిర పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 136 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 94404–37629, 70132–68255 నంబర్లలో సంప్రదించవచ్చు. ► బాపట్ల బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు, బాలికలకు 25 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. -
716 కళాశాలలకు... ఏదీ గుర్తింపు..?
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల పరిశీలన ప్రహసనంగా మారింది. 2019–20 విద్యా సంవత్సరానికి గాను పలు కళాశాలలు ఇప్పటికీ యూనివర్సిటీ/బోర్డు గుర్తింపు పొందిన పత్రాలను సంక్షేమ శాఖలకు సమర్పించలేదు. ఏటా పునరుద్ధరీకుంచుకున్న తర్వాత వాటిని సంక్షేమశాఖ కార్యాలయంలో, ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన 716 కాలేజీలు ఇప్పటికీ గుర్తింపు/రెన్యువల్ పత్రాలను సమర్పించకపోవడం గమనార్హం. 5,712 కళాశాలలకు లభించిన ధ్రువీకరణ.. రాష్ట్ర వ్యాప్తంగా 6,428 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కాలేజీలున్నాయి. ఇందులో అత్యధికంగా 2,888 ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొంది ఉన్నాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గాను అవన్నీ గుర్తింపు పత్రాలు సమర్పించాయి. మిగతా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల్లో చాలా వరకు గుర్తింపు పత్రాలను సమర్పించలేదు.కొన్ని ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయి డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా సంక్షేమ శాఖాధికారులు వాటిని ధ్రువీకరించలేదు.రాష్ట్రంలో 6,428 కాలేజీల్లో ఇప్పటివరకు కేవలం 6,120 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో 5,712 మాత్రమే ధ్రువీకరణ పొందాయి. ఆ కాలేజీ విద్యార్థులకే ఫీజులు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేనాటికే గుర్తింపు పత్రాలు, రెన్యువల్ వివరాలను సంక్షేమ శాఖలకు సమర్పించాలి. అలాంటి వాటికే వెబ్సైట్లో పొందుపరుస్తారు. అప్పుడు ఆయా కళాశాలల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.కానీ గుర్తింపు పత్రాల సమర్పణ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పూర్తి కావడం లేదని, పలు యూనివర్సిటీలు/ బోర్డులు వీటిని జారీ చేసేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నందున విద్యార్థుల దరఖాస్తుకు అనుమతి ఇవ్వాలని పలు కాలేజీల యాజమాన్యాలు కోరాయి.దీంతో స్పందించిన ప్రభుత్వం ఆమేరకు అవకాశం కల్పించింది. 2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 12.58లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో ధ్రువీకరణ పొందిన కాలేజీ విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా ధ్రువీకరణ పొందని వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిని అందుకున్న కళాశాలలు స్పందించి పత్రాలు సమర్పించకుంటే ఆ కాలేజీ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తారు. మొత్తంగా అన్ని పత్రాలు సమర్పించిన కళాశాలల విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఉపకార దరఖాస్తులకు ఈ నెల 31 వరకే గడువు
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన దరఖాస్తుల సమర్పణ గడవు ఆగస్టు నెలాఖరుతో ముగియాల్సి ఉన్నా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మరికొంత సమయం పెంచాలని ప్రభుత్వాన్ని సం క్షేమ శాఖలు కోరాయి. దీంతో మరో నెల గడువును పెంచుతూ సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయినప్పటికీ సంక్షేమ శాఖల అంచనాల్లో కనీసం 50 శాతం దరఖాస్తులు కూడా రాకపోవడంతో చివరి అవకాశంగా డిసెంబర్ నెలాఖరు వరకు గడువును పొడిగించిన ప్రభుత్వం... ఆ తర్వాత ఎలాంటి మార్పులుండవని, నిర్దేశించిన గడువులోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించకుంటే అనర్హులవుతారని స్పష్టం చేసింది. ] 2019–20 విద్యా సంవత్సరంలో 13.45 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా ఇప్పటివరకు 12.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. మరో పది రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండటంతో సంక్షేమ శాఖాధికారులు కాలేజీ యాజమాన్యాలకు ఎస్ఎంఎస్ల ద్వారా గడువు తేదీని గుర్తుచేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కాలేజీల విద్యార్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావాల్సి ఉందని ఆయా జిల్లాల అధికారులు చెబు తున్నారు. ఈ నెల 31 తర్వాత గడువు పెంచే అవకాశం లేకపోవడంతో ఆలోగా దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసు కోవాలని కాలేజీల యాజమాన్యాలతోపాటు విద్యార్థులకు సూచనలు చేస్తున్నారు. -
ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు బీసీ గురుకుల సొసైటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17 నుంచి కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. గురుకుల బోధన ఉన్నతంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు వీటిసంఖ్య 257కు పెరిగిందన్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా 2019– 20 విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. అలాగే 19 జూనియర్ కాలేజీలు, ఒక మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త గురుకులాలకు భవనాలు సిద్ధం కొత్తగా ఏర్పాటయ్యే 119 గురుకుల పాఠశాలలకు భవనాలు సిద్ధం చేశామని మంత్రి ఈశ్వర్ చెప్పారు. ఈ పాఠశాలల్లో 2019–20 విద్యాసంవత్సరంలో 5, 6, 7 తరగతులు ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రిన్సిపాళ్ల బాధ్యతల విషయంలో పాత స్కూల్లో పనిచేస్తున్నవారికి కొత్త స్కూళ్ల అదనపు బాధ్యతలు ఇచ్చామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త స్కూళ్లకు 3,689 పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిని వివిధ దశల్లో భర్తీ చేస్తామన్నారు. అప్పటి వరకు పాత పాఠశాలల నుంచి ఇద్దరు టీచర్ల చొప్పున కొత్త పాఠశాలలకు డిప్యుటేషన్ మీద పంపు తున్నట్లు చెప్పారు. అవసరమున్నచోట పీఈటీ, స్టాఫ్ నర్సులు, బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 98 శాతం పాఠశాలలకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తి అయిందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు రూ.2 లక్షలు ప్రొవిజన్స్ కోసం మంజూరు చేశామన్నారు. సమావేశంలో మల్లయ్యభట్టు, వీవీ రమణారెడ్డి, బాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఉచిత కార్పొరేట్ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఇంటర్మీడియట్లో ఉచిత కార్పొరేట్ విద్యనందిస్తోంది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన పేదలను ఈ పథకం కింద ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. జూన్ 9లోపు ఆన్లైన్ ద్వారా ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 13న ప్రకటిస్తారు. జూన్ 14 నుంచి సర్టిఫికెట్లు పరిశీలించి 17లోగా తుది జాబితాను వెల్లడిస్తారు. పలు సంక్షేమ శాఖల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2,262 మందిని ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు. ఏటా రూ. 38 వేల ఫీజు.. ఉచిత ఇంటర్ కార్పొరేట్ విద్య పథకం కింద ఎంపికైన విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.38 వేలు ఖర్చు చేస్తోంది. ఎంపికైన విద్యార్థికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పి స్తుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నందున కాలేజీల ఎంపికను ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేపడుతోంది. అన్ని రకాల మౌలిక వసతులతోపాటు కాలేజీ రికార్డు, ఫలితాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తోంది. ఈ పథకం కింద తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఫీజులు నిర్ధారించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫీజులు పెంచాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరు అర్హులు.. 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 7 జీపీఏ పైబడి స్కోర్ సాధించి, స్థానిక విద్యార్థి అయి ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.1.5 లక్షలు మించరాదు. పూర్తి వివరాలను సంక్షేమ శాఖ అధికారులు ఈపాస్ తెలంగాణ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థి కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు రేషన్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్ తప్పనిసరి. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించాలి. మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా సంక్షేమ అధికారిని నేరుగా సంప్రదించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
వర్సిటీలకు అధ్యాపక నియామక మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పోస్టుల భర్తీకి అవసరమైన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని ఆయా వర్సిటీలకు పంపింది. వర్సిటీల వైస్ చాన్స్లర్ల కమిటీ ఇచ్చిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది. యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్ నిబంధనల మేరకే భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీల్లో మొత్తం 1,551 పోస్టులు ఖాళీ ఉండగా, తొలి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేటగిరీ, సబ్జెక్టుల వారీగా 1,061పోస్టుల భర్తీని ప్రభుత్వం గతంలోనే ఆమోదించింది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వర్సిటీలు డ్రాఫ్ట్ నిబంధనలను రూపొందించే పనిలోపడ్డాయి. ఇది పూర్తి కాగానే వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో వీటి భర్తీకి ఆమోదం తెలుపుతాయి. పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్లపై పలు సంక్షేమ శాఖల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఇదంతా పూర్త య్యాక ప్రభుత్వ ఆమోదం తీసుకొని వర్సిటీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అయితే ఇది పూర్తయ్యేందుకు దాదాపు 2 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇవీ ప్రధాన నిబంధనలు.. - పోస్టుల భర్తీకి యూనివర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇవి జాతీయ స్థాయి నోటిఫికేషన్లుగానే ఉంటాయి. - భర్తీ ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్టు ఉండదు. అన్ని వర్సిటీలకు ఒకే రకమైన పరీక్ష విధానం ఉంటుంది. - సబ్జెక్టును బట్టి పరీక్ష అంశాల్లో మార్పు ఉంటుంది. విధానంలో ఏ మార్పు ఉండదు. అలాగే వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. -
గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా?
కేసీఆర్ ఇంటి ఇల్లాలితో సహా అధికారం కావాలి ⇒ మాయ మాటలతో మభ్యపెడుతున్నారు: సంపత్‌కుమార్ ⇒ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారపక్షం ⇒ వృత్తిని నమ్ముకున్న వాళ్లకే నిధులన్న మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ‘గొల్లోడు గొర్రెలు కాయా లి.. చాకలోడు బట్టలు ఉతకాలి. మంగలోడు గుండ్లు కొట్టాలి.. మా (కేసీఆర్) ఇంటి ఇల్లాలి తో సహా అధికారం కావాలి. ప్రతిపక్షాలకు మాత్రం బిస్కెట్లు వేస్తారు’’అని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దీంతో శుక్ర వారం శాసనసభ ఒక్కసారిగా వేడెక్కింది. సంక్షే మ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడారు. కులవృత్తులను ప్రోత్స హించేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరపడం వెనక ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నిం చారు. ‘తెలంగాణ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. మా ఆక్రందన, ఆర్తనాదాలు, కడుపు మంటను ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. దళితుడిని సీఎం చేస్తానన్న గొప్ప మ నిషిని చూడలేదని సంబర పడ్డాం. కానీ మోసగిం చడంతో ఓర్చుకోవడం అలవాటైంది. దళిత పారిశ్రామికవేత్తలకు రూ.400 కోట్లు ఇచ్చామని మంత్రి కేటీఆర్ సభలో పేర్కొన్నారు. ఒక్క రూపాయీ ఇవ్వ లేదు. మాయమాటలతో ఎన్నిసార్లు మోసం చేస్తారు?’ అని నిలదీశారు. టీఎస్ఐపాస్, టీప్రై డ్ అంటూ కేటీఆర్ పదేపదే చెప్పే మాటలతో చెవులు గిల్లుమంటున్నాయని వ్యాఖ్యానించా రు. గిరిజన, ఆదివాసీ, అంబేడ్కర్, పూలే భవ నాలకు శిలాఫలకాలు వేసి మరిచిపోయారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. రుణమాఫీకి ఎస్సీ,ఎస్టీ నిధుల మళ్లింపు ‘రుణమాఫీ కింద చెల్లించిన సొమ్ములో 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచే మళ్లించారు. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 26 శాతం ఉన్నా.. వారందరికీ భూములు లేవు. అందరూ రుణాలు తీసుకోలేదు..’’అని సంపత్ స్పష్టం చేశారు. 30 లక్షల మంది భూమి లేని ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూములు పంపిణీ చేస్తామని చెప్పి కేవలం 3,671 మందికి 9,663 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. సంపత్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల బదులిచ్చారు. దేశమంతటా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు ఇలానే ఉందని, సబ్‌ప్లాన్ నిధులను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఖర్చు చేయడం సాంప్రదాయమని చెప్పారు. 30 లక్షల మంది ఎస్సీలకు ఒకేసారి భూములిస్తామని తాము ఎక్కడా హామీ ఇవ్వలేదన్నారు. అది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియని పేర్కొన్నారు. కుల వృత్తులకు నిధుల కేటాయింపుపై వివరణ ఇస్తూ.. గొప్పగా చదువుకున్నవాళ్లకు, వ్యాపారాలున్న వాళ్లకు నిధులివ్వబోమని.. వృత్తిని నమ్ముకుని బతికేవాళ్లకే ఇస్తామని ఈటల చెప్పారు. కుల వృత్తుల వారిని తక్కువ చేసి చూడవద్దని, మాట్లాడవద్దని సూచించారు. కొత్త సభ్యుడైన సంపత్‌కు అనుభవం, సంయమనం లేదని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌ల నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా సంపత్ మాటల నుంచి సారాన్ని తీసుకుని సమాధానం ఇవ్వాలని విపక్షనేత కె.జానారెడ్డి సర్దిచెప్పారు. గృహ నిర్మాణం అస్తవ్యస్తం రాష్ట్రంలో గృహ నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని, పూర్తిగా ఎత్తేసినట్లు కనిపిస్తోందని సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. విచారణ పేరిట 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు నిలిపివేశారన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, ఐడీహెచ్ కాలనీల్లో కట్టిన 1,400 డబుల్ ఇళ్లను ప్రభుత్వం గొప్పగా చూపించుకుంటోందని.. డబుల్ ఇళ్ల కోసం వచ్చిన 4 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ మూడేళ్లలో 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను మాత్రమే చేపట్టారని విమర్శించారు. -
ఫీజు బకాయిలు రూ. 3,391.91 కోట్లు
-
ఫీజు బకాయిలు రూ. 3,391.91 కోట్లు
⇒ నిధుల విడుదలలో జాప్యంతో పేరుకుపోతున్న బకాయిలు ⇒ 2016–17కు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ⇒ దరఖాస్తుల ఆధారంగా రూ. 2,171.35 కోట్లు అవసరమని అంచనా ⇒ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన సంక్షేమ శాఖలు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఏయేడుకాయేడు ఏక కాలంలో నిధులు ఇవ్వకపోవడం.. దఫదఫాలుగా ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో బకాయిలు రెట్టింపవుతున్నాయి. 2016–17 వార్షికసంవత్సరం మరో పక్షం రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారం వరకూ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,65,052 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా సంక్షేమ శాఖలు ఆయా దరఖాస్తులను పరిశీలించి అవసరమైన బడ్జెట్‌పై అంచనాలు సిద్ధం చేశాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రూ. 2,171.35 కోట్లు అవసరమని నిర్ధారించారు. ఇందులో ఉపకారవేతనాలకు సంబంధించి రూ.564.44 కోట్లు కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.1,606.86 కోట్లుగా ఖరారు చేశారు. తాజాగా ఈ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి నివేదించారు. 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజుల చెల్లింపుల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మెజార్టీ విద్యార్థులు కోర్సు పూర్తిచేసినప్పటికీ ఫీజులు చెల్లించని కారణంగా ఆయా విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. దీంతో వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో 14.41 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిగృహాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం రూ.2,920 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్‌లోనే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు మూడు దఫాలుగా రూ.1,700 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.1,220.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 2016–17 వార్షిక సంవత్సరం సైతం ముగియనుండడంతో బకాయిలు కాస్త రూ.3,391.91 కోట్లకు చేరాయి. అయితే ప్రభుత్వం ఈ నిధుల విడుదలపై ఊసెత్తడం లేదు. దీంతో ఇవి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. విద్యార్థుల్లో ఆందోళన... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై మెజారిటీ విద్యార్థులు ఆధారపడి చదువును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారిలో 85 శాతం ప్రభుత్వ పథకాన్నే నమ్ముకున్నారు. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం, నిధులు ఇవ్వడంలో జాప్యం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. కోర్సు పూర్తిచేసినా సర్టిఫికెట్లు పొందని పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ... కాలేజీలో ఫీజులు చెల్లించని కారణంగా సర్టిపికెట్లను సదరు కంపెనీల్లో సమర్పించకపోవడంతో ఉద్యోగాన్ని సైతం దక్కించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. -
‘గురుకుల’ అర్హతలపై రేపు స్పష్టత
టీఎస్పీఎస్సీకి సంక్షేమ శాఖల వెల్లడి సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యుల పోస్టులకు సంబంధించి సవరించిన అర్హతలపై సోమవారానికి పూర్తి స్పష్టత, నిబంధనల వివరాలను అందిస్తామని సంక్షేమ శాఖలు టీఎస్పీఎస్సీకి తెలియజేశాయి. విద్యార్హతల వివరాలు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ వర్గాలు శనివారం ఆయా శాఖలను కోరగా.. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి కొత్త నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని, పూర్తిస్థాయి వివరాలను సోమవారం అందిస్తామని లిఖితపూర్వకం గా తెలియజేశాయి. మరోవైపు విద్యార్హతల విషయంలో టీఎస్పీఎస్సీకి ఎలాంటి సం బంధం ఉండదని, సంక్షేమ శాఖలు నిర్దేశిం చిన నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. మంత్రులకు తెలిసే... మూడు శాఖలకు చెందిన మంత్రులకు తెలిసే గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలను ఆయా గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. తెలం గాణ గురుకుల సొసైటీ పరిధిలోని పోస్టుల కు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల పోస్టులకు సంబంధించిన నిబంధనల ఫైలుపై సంబంధిత మంత్రి జగదీశ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ గురుకులాల పోస్టుల నిబంధనల ఫైలుపై మంత్రి చందూ లాల్ సంతకాలు చేశారు. ఆ సమయంలో ఎన్సీ టీఈ నిబంధనలు ఎలా ఉన్నాయన్నది కూడా మంత్రులు పరిశీలించలేదు. దీంతో గురుకుల సొసైటీలు పోస్టుల భర్తీకి టీఎస్పీ ఎస్సీకి ఇండెంట్లు సమర్పించాయి. అయి తే సంబంధిత శాఖల అధికారులు కూడా మంత్రులకు ఎన్సీటీఈ నిబంధనలపై స్పష్టం చేయకుండానే మంత్రుల ఆమోదం తీసుకున్నట్టు సమాచారం. -
ఎన్సీటీఈ నిబంధనలు బేఖాతరు!
‘గురుకుల’పోస్టుల విద్యార్హతలపై సంక్షేమ శాఖల ఇష్టారాజ్యం 6, 7, 8 తరగతుల బోధనకు డిగ్రీలో 50% ఉంటే చాలన్న ఎన్సీటీఈ డిగ్రీతో పాటు రెండేళ్ల డీఎడ్ చేసిన వారికి అవకాశమివ్వాలని సూచన ఈ నిబంధనలను పక్కనబెట్టి మరీ అర్హతల నిర్ణయం లక్షల మంది అభ్యర్థులకు అవకాశం దూరం పీఈటీ పోస్టుల్లో బీపీఈడీ వారికి ఇవ్వని అవకాశం సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఆదేశాలను రాష్ట్ర సంక్షేమ శాఖలు తుంగలో తొక్కాయి. 6, 7, 8 తరగతులకు బోధించేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులుంటే చాలన్న నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆందోళన నింపాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ అర్హులు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇందులో మూడు లక్షల మంది వరకు గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. కానీ ఇప్పుడు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన కారణంగా.. దాదాపు 2 లక్షల మంది వరకు అర్హత కోల్పోతున్నారు. ఇక పీజీటీ పోస్టులకు విద్యార్హతలతోపాటు కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలన్న నిబంధన కారణంగా గత మూడేళ్లలో పీజీ పూర్తి చేసిన వారు అనర్హులు అవుతున్నారు. అసలు ఎన్సీటీఈ నిబంధనల్లో ఈ అంశమే లేకపోవడం గమనార్హం. మరోవైపు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పీఈటీ పోస్టులకు ఇంటర్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులన్న నిబంధన విధించారు. కానీ డిగ్రీ చదివి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) పూర్తి చేసిన వారిని విస్మరించారు. మరోవైపు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పీజీతోపాటు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పూర్తి చేసిన వారు అర్హులని ప్రకటించారు. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఉన్నవి ఈ రెండు కేటగిరీల పోస్టులే. కానీ ఎందులోనూ బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడం ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఇంగ్లిషులోనే ప్రశ్నపత్రం ఇస్తామనడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు. డిగ్రీ, రెండేళ్ల డీఎడ్ ఉన్నవారికి అన్యాయం! డిగ్రీ చదివి, రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 6, 7, 8 తరగతులకు బోధించే అవకాశం కల్పించాలని ఎన్సీటీఈ నిబంధనలున్నాయి. కానీ గురుకులాల్లో 6, 7, 8 తరగతులకు బోధించే టీచర్ల విషయంలో.. డిగ్రీ, డీఎడ్ వారికి అవకాశం ఇవ్వలేదు. డిగ్రీతో బీఎడ్ చేసిన వారు మాత్రమే టీజీటీ పోస్టుకు అర్హులని నిబంధన విధించాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా ఉపాధ్యాయులకు ఉండాల్సిన అర్హతలను ఎన్సీటీఈ నిర్ణయిస్తుందని కేంద్రం 2010 ఏప్రిల్‌లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్సీటీఈ 2002 నాటి అర్హతలను సవరిస్తూ 2010 ఆగస్టులో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిపై గెజిట్ జారీ చేసిన కేంద్రం.. 2002 ఎన్సీటీఈ నిబంధనలకు ముందు అర్హతలు పొందిన వారికి మాత్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ గెజిట్‌లోని ప్రధాన అంశాలు.. ► 1 నుంచి 5 తరగతులకు బోధించే వారు సీనియర్ సెకండరీ (ఇంటర్)లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే రెండేళ్ల డీఎడ్ కోర్సు చేసి ఉండాలి. అదే ఇంటర్లో 45 శాతం మార్కులు ఉంటే.. డీఎడ్ మాత్రం 2002 ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఉండాలి. ► 6, 7, 8 తరగతులకు బోధించే వారు డిగ్రీ, రెండేళ్ల డీఎడ్ చేసి ఉండాలి.. లేదా 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు బీఎడ్ చేసి ఉండాలి.. లేదా 45 శాతం మార్కులతో డిగ్రీ చేసి ఉంటే బీఎడ్ ఎన్సీటీఈ నిబంధనల మేరకు ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో ఇంటర్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ► వీటన్నింటితోపాటు ప్రతి ఉపాధ్యాయ అభ్యర్థి ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’లో అర్హత సాధించి ఉండాలి. ► 9, 10 తరగతులకు బోధించేవారికి డిగ్రీలో 50శాతంతోపాటు బీఈడీ, 11, 12 తరగతులకు బోధించేవారికి పీజీలో 50శాతంతోపాటు బీఈడీ చేసి ఉండాలని పేర్కొంది. ఒకవేళ డిగ్రీ, పీజీల్లో 45 శాతమే ఉంటే.. బీఎడ్ మాత్రం ఎన్సీటీఈ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. బీసీలకు అన్యాయం విద్యార్హతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు 5 శాతం సడలింపు వర్తిస్తుందని ఎన్సీటీఈ స్పష్టం చేసింది. కానీ ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉండాలని.. బీసీ, ఇతరులైతే 60 శాతం ఉండాలని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. అంటే ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే 5 శాతం సడలింపు ఇచ్చింది. దీంతో బీసీలకు, వికలాంగుల కు అన్యాయం తప్పడం లేదు. విద్యాశాఖ చెప్పినా.. విద్యా శాఖ ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలపై సంక్షేమ శాఖలకు వివరాలిచ్చినా పట్టించుకో లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్సీటీఈ జారీ చేసిన ఉత్తర్వులను సైతం సంక్షేమ శాఖలకు అందజేశా మని.. అయినా ఇష్టానుసారం నిబంధన లు పెట్టారని పేర్కొంటున్నారు. -
వారి విరమణ వయస్సు పెంచుదామా?
వైద్య అధ్యాపకుల పదవీ విరమణపై కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్న రాష్ట్ర సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్, ఆయుష్ కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు సహా ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 70 ఏళ్ల వరకు పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యోచిస్తోంది. వైద్య విద్యకు చెందిన వివిధ అంశాలపై కేంద్రం ప్రతిపాదనలు తయారు చేసింది. వాటిపై రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల విరమణ వయస్సు 58 ఏళ్లు. హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్‌లో 60 ఏళ్లుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో కూడా ఇదే వయస్సు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్‌ల లో 62 ఏళ్లు, హరియాణా, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 65 కాగా బిహార్‌లో 67 ఏళ్లుంది. ఇక కేంద్ర ఉద్యో గుల ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎయి మ్స్ వంటి వైద్య బోధనా సంస్థల్లో 65 ఏళ్లు. ఎంసీఐ నిబంధనల ప్రకారం వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 70 ఏళ్ల వరకు ఉండొచ్చు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా ఇదే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం చేసిన తాజా ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపు తోంది. పెంపు వల్ల లాభ నష్టాలు, పదోన్నతులపై ప్రభావం వంటివి అంచనా వేస్తోంది. -
ఆరె కటికల సమస్యల పరిష్కారానికి కృషి
మంత్రి జోగు రామన్న హామీ హైదరాబాద్: ఆరె కటికల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మాటలు చెప్పడం కన్నా చేతల ద్వారా చూపించాలన్న తపన ఉందని పేర్కొన్నారు. పరిష్కార హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఆరె కటిక పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో 53 శాతంగా ఉన్న బీసీలకు మంచి చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకుగాను తనను ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపారు. బీసీలు ఫెడరేషన్లు కావాలని కోరుతున్నారని, కానీ, వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గోగికర్ సుధాకర్ మాట్లాడుతూ ఆరె కటికలకు ప్రభుత్వపరమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కోరారు. అరెకటికల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 7, 8 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంఘం 31 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుని మంత్రి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ప్రశాంత్, ఈశ్వర్‌చౌదరి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
స్టయిఫండ్ రూ. 5వేలకు పెంచాలి
కర్నూలు(అర్బన్): ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు చెందిన న్యాయవాదులకు ఇస్తున్న రూ.1000 స్టయిఫండ్‌ను రూ.5 వేలకు పెంచాలని ఎస్సీ, ఎస్టీ లాయర్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల హాల్లో న్యాయవాది ఎంఏ తిరుపతయ్య అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లాయర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎంఏ తిరుపతయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా జే పుల్లన్న, ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా రవిరాజు, కార్యదర్శులుగా బండారు వీరన్న, బంగి శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణానాయక్, మహేష్, కోశాధికారిగా హెచ్ నాగలక్ష్మిని ఎన్నుకున్నారు. -
వికలాంగుల అభివృద్ధికి సహకరించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ భాస్కరరెడ్డి కోరారు. ఈ యేడాది ఎంపీ నిధులతో 179 మందికి మోటార్ సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. శుక్రవారం యూరోపియన్ యూనియన్, లిమోనార్డ్ చెషైర్ డిజేబిలిటీ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎల్సీడీడీపీ) సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో వికలాంగుల పథకాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆ సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ గోవిందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ పారా ఒలింపిక్స్‌లో భారత వికలాంగుల ప్రదర్శన అత్యద్భుతమన్నారు. ఉపకార వేతనాలు పొందేందుకు వికలాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ, చంద్రన్న బీమా పథకం ప్రాజెక్టు మేనేజర్ రాజాప్రతాప్ మాట్లాడుతూ 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన బడుగు, బలహీన వర్గాల వారు ఒకేసారి రూ.15 చెల్లించి చంద్రన్న బీమాలో చేరవచ్చన్నారు. ఈ పథకంలో సభ్యుల సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. వికలాంగులు కూడా ఈ పథకంలో చేరి లబ్ధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డ్వామా తరపున కృష్ణమోహన్, ఉపాధిహామీ పథకం వికలాంగుల సమన్వయకర్త సురేష్‌కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆంజనేయులు, మద్దిలేటి, చంద్రశేఖర్, నిర్మల పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు 530 కోట్లు
► ఇంకా విడుదల కాని 2015-16 నిధులు ► పాసవుట్ విద్యార్థులకు ► సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం, ఇందుకు ప్రతిగా కోర్సులు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీలు నిరాకరిస్తుండటంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కంపెనీలు ఇం టర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావా లని పేర్కొంటుండగా కళాశాలల తీరుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో వివిధ సంక్షేమశాఖల్లో రూ.530 కోట్లు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రెజరీల్లోనే బ్రేక్... పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2015-16 వార్షిక సంవత్సరంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తయింది. బ్యాంకు ఖాతాలు సరిపోలక పోవడం, దరఖాస్తుల్లో పొరపాట్లతో దాదాపు 10% దరఖాస్తులు ఇంకా కళాశాలల యూజర్ ఐడీల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన దరఖాస్తులు సంక్షేమ శాఖ అధికారుల లాగిన్ నుంచి ట్రెజరీ అధికారుల ఖాతాకు బదలాయిం చారు. అనంతరం సంక్షేమాధికారులు దరఖాస్తుల సమర్పణకు టోకెన్ నంబర్లూ పొందారు. ఈ ప్రక్రియ 5 నెలల క్రితమే ముగిసినా... నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. ట్రెజరీల్లో నిధుల విడుదలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రీయింబర్స్మెంట్ విడుదల కాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఫీజు బకాయిల కోసం ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తీవ్రం చేయడంతో ఒకట్రెండు రోజుల్లో రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సర్కారు ఇటీవల హామీ ఇచ్చింది. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు సమ్మతించినప్పటికీ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సంక్షేమ శాఖల వారీగా ఫీజు బకాయిలు..(రూ. కోట్లలో) శాఖ బకాయిలు ఎస్సీ 74.50 బీసీ 208.00 ఎస్టీ 82.05 మైనార్టీ 84.15 ఈబీసీ 81.22 వికలాంగ 0.15 మొత్తం 530.07 -
గురుకులాల్లో ‘ఔట్సోర్సింగ్’ చిక్కులు
- తాము చెప్పిన వారికి ఇవ్వాలంటున్న ఎమ్మెల్యేలు - కాదంటున్న సంక్షేమ శాఖలు.. - భారీగా చేతులు మారుతున్న డబ్బులు సాక్షి, హైదరాబాద్ : వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భర్తీ అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 221 గురుకులాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులు, సిబ్బంది నియామకానికి ఐదారు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల అంచనా. అయితే ఆయా సేవలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకుని తమ తమ నియోజక వర్గాల్లో ప్రారంభం కానున్న గురుకులాల్లో తాము చెప్పిన వారినే ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో భర్తీ చేయాలని ఆయా సంక్షేమ శాఖలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎస్సీ గురుకులాల్లోనే ఈ పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 133 కొత్త ఎస్సీ గురుకులాల్లో 900 మందిని ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఈ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. కార్మికశాఖ ఆమోదం పొందిన ఏజెన్సీలకే ఈ కాంట్రాక్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్న నిబంధనలున్నాయి. అయినా ఎమ్మెల్యేలు తమ వారిని నియమించాలని తమ లెటర్‌ప్యాడ్‌లపై అధికారులకు లేఖలు కూడా పంపిస్తున్నారు. ఎస్సీ గురుకులాల కార్యాలయం నుంచి మాత్రం ఎస్ఆర్ శంకరన్ పేరిట ఉన్న ఏజెన్సీకి చెందిన వారినే ఈ పోస్టుల్లో భర్తీచేయాలని లేఖ అందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల లేఖలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, సందట్లో సడేమియా అన్నట్లు సచివాలయంలోని ఓ మంత్రి పేషీతో పాటు ఒక సంక్షేమ శాఖ కార్యదర్శి పేషీలోని సిబ్బంది ఈ పోస్టులను ఇప్పిస్తామంటూ పలువురి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ కార్యదర్శి పేషీలో పోస్టు ఇప్పించాలని లేదంటే డబ్బు తిరిగివ్వాలని సిబ్బంది, బయట వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. -
ఎస్సీ, ఎస్టీ ‘కల్యాణలక్ష్మి’ ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కౌంటర్ సంతకంతో జాబితా సిద్ధం చేసి, వారి ద్వారానే ప్రీ ప్రింటెడ్ చెక్కులను అందజేసేలా మార్పులు చేసింది. వారంలో ఒకరోజు మండల/ తాలుకా కేంద్రాల్లో వీటిని పంపిణీ చేసేలా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు వధువు బ్యాంకు ఖాతాలోకి రూ.51 వేలను నేరుగా జమ చేస్తుండగా, మార్పు చేసిన విధానాల ప్రకారం పెళ్లి కుమార్తె తల్లి పేరిట చెక్కును అందజేస్తారు. ఈ దరఖాస్తులను ఎమ్మార్వోలు మాత్రమే పరిశీలించేలా మార్పు చేశారు. ప్రస్తుత విధానం ప్రకారం వధూవరుల ఆధార్‌కార్డులను స్కాన్‌చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ పథకం విధివిధానాల్లో మార్పులు చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, ట్రెజరీలో బిల్లులను సిద్ధం చేసి మంజూరు ఇచ్చాక వధువు బ్యాంక్ అకౌంట్లోకి నగదు బదిలీ చేయడం వంటి విషయాల్లో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం వల్ల ఇబ్బందులు తలెత్తడాన్ని ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) కింద సహాయాన్ని అందిస్తున్న మాదిరిగా ప్రీప్రింటెడ్ చెక్కులను జిల్లా సంక్షేమశాఖల అధికారులు ట్రెజరీ నుంచి తీసుకుంటారు. లబ్ధిదారుల పేరిట చెక్కును జారీ చేస్తారు. ఈ-పాస్ వెబ్సైట్ లాగిన్ సౌకర్యాన్ని తహసీల్దార్లకు కల్పించేందుకు, ఎస్సీ, ఎస్టీ శాఖల డెరైక్టర్లను సంప్రదించి కల్యాణలక్ష్మి దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఠీఠీఠీ.జౌజీట.్ట్ఛ్చజ్చ్చ. జౌఠి.జీ. వెబ్సైట్లో పొందుపరిచారు. ఎస్టీల విదేశీవిద్యకు రూ.20 లక్షల సాయం విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించే ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇచ్చే సహాయాన్ని పెంచాలని ఎస్టీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి విద్యకే ఉంది
సెస్ డెరైక్టర్ గాలబ్ సాక్షి, హైదరాబాద్: బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) డెరైక్టర్ ఎస్. గాలబ్ అన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తే బాల్య వివాహాల్ని నిరోధించ వచ్చన్నారు. యంగ్‌లైవ్స్ ఇండియా, చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫౌండేషన్ (సిఫ్) బాల్య వివాహాలకు సంబంధించి చేసిన పరిశోధనల వివరాలు తెలిపేందుకు మంగళవారం అమీర్ పేటలోని సెస్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న గాలబ్ మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, శిశు సంరక్షణ కమిటీలు యుక్త వయస్కులతో క్రియాశీలకంగా పనిచేసి బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భవతులవడానికి అడ్డుకట్ట వేయాలన్నారు. యంగ్ లైవ్స్ డెరైక్టర్ రేణు మాట్లాడుతూ.. ‘మా పరిశోధన ప్రకారం 28 శాతం ఆడపిల్లలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు జరిగాయి. ఒక శాతం అబ్బాయిలే 18 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లయిన 59 శాతం అమ్మాయిలు 19 ఏళ్ల వయసులోనే మొదటి బిడ్డకు తల్లయ్యారు. 15 ఏళ్ల లోపు చదువు మానేసిన అమ్మాయిలు 18 ఏళ్ల లోపే పెళ్లి చేసుకున్నా రు. ఇది చదువుతున్న వారితో పోలిస్తే నాల్గిం తలు ఎక్కువని తెలిపారు. యంగ్లైవ్ పరిశోధకురాలు ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ... నిరుపేదలైన అమ్మాయిలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లవడం, ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయిలతో పోలిస్తే రెండింతలు ఎక్కువని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు నిపుణులు పాల్గొని ప్రసంగించారు. -
విద్యాప్రమాణాలు పాటించాల్సిందే
♦ కళాశాలలకు స్పష్టం చేసిన ప్రభుత్వం ♦ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తున్నందున తనిఖీలు తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాల కల్పనకు కచ్చితమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పకడ్బందీగా అమలుకు, బోగస్ విద్యార్థుల నివారణకు కాలేజీల తనిఖీలను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతున్నందున, వీరికి మెరుగైన శిక్షణ అంది కోర్సు ముగిశాక ఉపాధి లభించేలా కాలేజీల్లో విద్యా బోధన ఉండేలా చూడాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు కాలేజీల్లో ఫీజులకు అనుగుణంగా ప్రభుత్వపరంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నారు. కొన్ని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒక్కో ఏడాదికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు కూడా ఈ విద్యార్థులకు ఫీజుల కింద చెల్లిస్తున్నారు. 20 శాతం కాలేజీలతోనే ఇబ్బందులు ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందుతున్న అన్ని కాలేజీల్లో విద్యాప్రమాణాలు, సౌకర్యాల కల్పన విషయంలో తనిఖీలు తప్పనిసరని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ‘మొత్తం కాలేజీల్లో 80 శాతం ఇబ్బందులు లేకుండా నడుస్తున్నా, మిగిలిన వాటిల్లో విద్యా ప్రమాణాలు ఇతరత్రా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఇలాంటి కాలేజీల్లో వృత్తివిద్యా కోర్సులు పూర్తి చే సిన వారికి ఎలాంటి ఉపాధీ లభించకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాలేజీల తనిఖీలకు నిర్ణయం తీసుకున్నాం. అంశాల వారీగా చేపట్టిన కాలేజీల పరిశీలనలో ఏవైనా అవకతవకలు, నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం మా దృష్టికి వస్తే విద్యార్థులను మెరుగైన కాలేజీలకు మార్చేందుకు చర్యలు చేపడతాం’ అని ఉన్నతాధికారి చెప్పారు. ఉపాధిపై దృష్టితోనే ‘కొత్తగా ఏర్పాటు చేయనున్న సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా కొత్త కోర్సులను రూపొందిస్తున్నాం. కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉపాధి పొందగలిగేలా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారేలా శిక్షణనిస్తాం. ఈ కోర్సుల సిలబస్‌లకు ప్రభుత్వం తుది రూపునిస్తోంది’ అని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
పకడ్బందీ ‘స్వయం ఉపాధి’కి కసరత్తు
♦ జవాబుదారీతనం కోసం ఫొటోలు, వీడియోలు తీయాలని నిర్ణయం ♦ ఈ ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇచ్చేలా ఎస్సీ అభివృద్ధిశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల్లో జవాబుదారీతనం పెంపొందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. సబ్సిడీ రూపేణా అందించే రుణాలు కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. స్వయం ఉపాధి, ఆర్థికస్వావలంబన పథకాల ద్వారా ప్రయోజనం పొందేవారు ఏ అవసరం కోసం దానిని తీసుకున్నారో వారు కచ్చితంగా ఆయా యూనిట్లను నెలకొల్పేలా తనిఖీలు, ఇతరత్రా రూపాల్లో నియంత్రణ ఉండేవిధంగా చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ద్వారా అందిస్తున్న రుణాలకు సంబంధించి జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆయా యూనిట్లను నెలకొల్పేందుకు లబ్ధిదారులకు ముందుగా అవసరమైన శిక్షణను అందించనున్నారు. యూనిట్లను మొదలుపెట్టడం, నిర్వహించడం వంటి వాటిని వీడియోరికార్డు, ఫొటోల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన డేటాబేస్‌ను తయారు చేసి, దశలవారీగా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. థర్డ్‌పార్టీ పరిశీలన కింద జిల్లాస్థాయిల్లో ఆయా యూనిట్ల వద్ద పరిశీలించి ఆన్లైన్లో ఫొటోలు, వీడియోలను, తనిఖీ అంశాలను తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రతి లబ్ధిదారుడి వివరాలను సేకరించి, ఆయా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయా.. లేదా అన్నది పరిశీలించనున్నారు. రుణానికి తగ్గట్టు పనులు చేయనివారిని, దుర్వినియోగం చేసే వారిని డిఫాల్టర్లుగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 10 వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ఈ ఏడాది 10 వేల మంది నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాల శిక్షణను అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ డా.ఎం.వి.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పదో తరగతి పాసైనవారు, ఫెయిలైన వారు ఖాళీగా ఉండకుండా ఆయా రంగాల్లో శిక్షణను అందిస్తామన్నారు. టీవీ, ఫ్రిజ్, ఇతర గృహోపకరణాల మరమ్మతు, ఎలక్ట్రీషియన్ శిక్షణ, ఇతరత్రా అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్‌లో ఒకనెల రోజులపాటు శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు. -
సంక్షేమానికి భారీ కేటాయింపులు
బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు పెరగనున్న నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెరగనున్నాయి. దీనిపై కొంతకాలంగా సీఎం కేసీఆర్ మొదలుకొని కింద వరకు వివిధ స్థాయిల్లో సాగిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ శాఖల కు అదనంగా 20శాతం నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సంక్షేమ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు, ఆయా శాఖల మం త్రులు, కార్యదర్శులు, అధికారుల తర్జనభర్జనల అనంతరం సంక్షేమరంగానికి రూ.28 వేల కోట్ల వరకు బడ్జెట్ కేటాయించవచ్చని తెలుస్తోంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.6వేల కోట్లు, ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.10వేల కోట్లు, గిరిజన సంక్షేమశాఖకు రూ.1,800 కోట్లు, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.6,100 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.2,200 కోట్ల మేర ఆయా శాఖలు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక కింద రూ.8,089 కోట్లు, ఎస్సీ శాఖకు రూ.4 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల ఉపప్రణాళిక కింద 5,036 కోట్లు, ఎస్టీశాఖకు 1,142 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ. 2,020 కోట్లు కేటాయించారు. విడిగా బీసీ సబ్‌ప్లాన్ యోచన... వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్లో విడిగా ఉపప్రణాళిక కింద నిధులు కేటాయించాలని కొంతకాలంగా బీసీ సంఘా లు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా యి. ప్రత్యేక ప్రతిపత్తితో బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీన్ని బీసీ సంక్షేమశాఖ బడ్జెట్లో కాకుండా విడిగా విధా న ప్రకటనగా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈక్రమంలో బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ ఉంటుందా లేదా అన్నది స్పష్టం కాలేదు. సంచార జాతుల సంక్షేమానికి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
4 జిల్లాల్లో ‘నై’పుణ్య శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల పరిధుల్లోని శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోని నిరుద్యోగులతోపాటు ఆయా రంగాల్లో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(కార్పొరేషన్) నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల తీరు అధ్వానంగా ఉంది. మరో 25 రోజుల్లో ప్రస్తుత ఆర్థికసంవత్సరం ముగియనుండగా, స్కిల్‌డెవలప్‌మెంట్ కింద రాష్ట్ర రాజధానిలో కనీసం ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వకపోవడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కరికి కూడా నైపుణ్యాల మెరుగుదల కింద శిక్షణ ఇవ్వలేదు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 505, మిగతా 9 జిల్లాల్లో 500 చొప్పున అంటే 5,005 మందికి శిక్షణను అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు రూ.10 కోట్లను కేటాయించారు. ఫిబ్రవరి ఆఖరుకల్లా మొత్తం 1,072 మందికి రూ.2.10 కోట్లే ఖర్చు చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 500 మందికిగాను 380 మందికి, కరీంనగర్లో 224, నిజామాబాద్‌లో 220, నల్లగొండలో 102, మహబూబ్‌నగర్‌లో 86, ఖమ్మంలో 60 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఎస్టీలకూ అంతంతే: షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక కార్పొరేషన్(ట్రైకార్) ద్వారా భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు (ఆదిలాబాద్) ఐటీడీఏల పరిధిలో 7 వేల మందికి శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో వారిని నియమించేలా నిర్ణయించారు. అయితే 997 మందికి శిక్షణనిచ్చి, వారిలో 700 మందికి ప్లేస్మెంట్ ఇచ్చారు. నేరుగా ప్లేస్మెంట్ ద్వారా 1,194 మందికి అవకాశం కల్పించినట్లు ఎస్టీ కార్పొరేషన్ గ ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వయం ఉపాధి కింద మూడు ఐటీడీఏలను కలుపుకుని 4,483 మందికి శిక్షణను ఇవ్వగా, ఇంకా 169 మంది శిక్షణను కొనసాగిస్తున్నారు. ఈ 3 ఐటీడీఏల్లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ) ద్వారా స్వయం ఉపాధి, శిక్షణ ఇస్తున్నారు. వైటీసీల ద్వారా భద్రాచలంలో మొత్తం 2,967 మందికి, ఏటూరునాగారంలో 2135 మందికి, ఉట్నూరులో అత్యధికంగా 6,672 మందికి ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. -
బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ సేవలు
హన్మకొండ అర్బన్ : ఇంతకాలం ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టి వారితో సంక్షేమ హాస్టళ్లలో పనులు చేయించుకున్న ప్రభుత్వం.. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలకనుంది. హాస్టళ్లలో చేయాల్సిన వివిధ రకాల పనులు కేటగిరీల వారీగా విభజించి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల్లో తొలిసారిగా అమలు చేయనున్న ఈ విధానంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. అయితే ప్రస్తుతం ప్రవేశ పెడతున్న విధానం కొత్తది కావడంవల్ల సాధ్యాసాధ్యాలు, లాభ నష్టాలు అంచనాలతో నివేదికలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పనిలో పనిగా ఈ విద్యాసంవత్సరం ఆఖరులో(మార్చి ఆఖరు) ఈ విధానం క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పనులూ ఔట్ సోర్సింగ్‌కే.. ఈ విధానం ద్వారా హాస్టల్లో ఉన్న పిల్లల సంఖ్య ఆధారంగా ఒక్కో హాస్టల్‌కు విడిగా టెండర్లు పిలవనున్నారు. హాస్టల్ పిల్ల లకు కావాల్సిన అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనా లు, స్నాక్స్ వంటివి టెండరు పొందిన కాంట్రాక్టర్... పిల్లలకు తయారు చేసి అందజేయాలి. ఉదాహరణకు ఒక హాస్టల్లో 50మంది విద్యార్థులు ఉన్నట్లయితో వారికి సంబందించి స రుకులు ప్రతిరోజూ హాజరు ప్రకారం వార్డెన్ సిద్ధంగా ఉంచు తారు. వాటిని కాంట్రాక్టర్ తన సిబ్బందితో హాస్టల్లోనే వం డి విద్యార్ధులకు వడ్డన చేయించాలి. ఇక పారిశుద్ధ్యం విష యంలో కూడా ఇదే పద్ధతి. హాస్టల్లో టాయిలెట్స్, పరిస రాలు శుభ్రం చేసే పనిని కూడా కాంట్రాక్టర్‌కు ఇస్తారు. ఒ ప్పందం ప్రకారం ప్రతి రోజూ పరిశుభ్రత పనులు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు హాస్టల్ విద్యార్థుల రక్షణ కోసం వాచ్‌మన్‌ను ఏర్పాటు చేసి రక్షణ కల్పించే విషయంలో కూడా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు ఇవ్వనున్నారు. 49 హాస్టళ్లలో అమలుకు చర్యలు జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 49 హాస్టళ్లలో ఈ విధమైన ఔట్ సోర్సింగ్ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 49 ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మొత్తం 2800 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు నిబంధనల ప్రకారం ఒక్కో హాస్టల్‌కు ఒక కామాటి, కుక్, వాచ్మెన్ ఉండాలి. మొత్తంగా 96మంది ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నియామకాలే లేని కారణంగా ఉద్యోగ విరమణ చేసి పోతున్నవారి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం 96 మందికి 52 మంది మాత్రమే ఉన్నారు. ఇక వార్డెన్ల విషయంలో 32మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 17పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ సేవల వల్ల సిబ్బంది కొరత సమస్య కూడా తీరుతుందని ప్రభుత్వం లెక్కలేస్తోంది. ఉద్యోగుల్లో ఆందోళన హాస్టల్లో సేవలు పూర్తిగా ఔట్ సోర్సింగ్ ద్వారా పొందాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సిబ్బందిలో ఆందోళన మొద లైంది. ఒకవేళ ప్రభుత్వం ఇదే విధానంతో కొనసాగితే రానున్న రోజుల్లో క్లాస్ ఫోర్త్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థక మే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న వారిని ఎక్క డో ఓ చోట సర్దుబాటు చేస్తామని అధికారులు చెపుతున్నా... కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలపై స్పష్టత లేదు. పను లన్నీ ఔట్ సోర్సింగ్ ద్వారా పొందిన తరువాత ఇక పూర్తి స్థాయి సిబ్బందితో పెద్దగా పని ఉండకపోవచ్చని అంటున్నా రు. ఇదే సమయంలో ప్రయోగాత్మకంగా అమలైదేగానీ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమని స్థానిక అధికారులు అంటున్నారు. త్వరలో టెండర్లు పిలుస్తాం జిల్లాలో మార్చి ఆఖరునుంచి ఔట్సోర్సింగ్ ద్వారా సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. శాఖ మంత్రి, కమిషరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ముందుగా ఇలాంటి విధానం అమలవుతున్న గురుకులాల్లో పరిశీలించాలని నిర్ణయానికి వచ్చాం. ఒకటి రెండు రోజుల్లో ఇది పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. కార్యక్రమం మొదలయ్యాక లాభనష్టాలు పరిశీలిస్తాం. కుకింగ్, శానిటేషన్, సెక్యురిటీ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సేవలు పొందాలని నిర్ణయించాం. - జి.హృషికేష్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అక్రమాలు తగ్గే అవకాశం.. ఒక వేళ భోజనం విషయంలో ఔట్సోర్సింగ్ విధానం ద్వారా పనులు చేపడితే మాత్రం కొంతలో కొంతైనా విద్యార్ధులకు న్యాయం జరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన బీసీ హాస్టళ్లకు ఇచ్చిన మెనూలో 50శాతం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ధరల పెరుగు దల, బిల్లుల చెల్లింపు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధానంతో కొంతమేరకైనా వి ద్యార్ధులకు నాణ్యమైన భోజనం లభించే అవకాశం ఉం దని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాం ఘిక సంక్షేమ గురుకులాల్లో టెండర ్లవిధానం కొంత తేడా గా ఉన్నప్పటికీ విజయవంతంగా విధానం అమలు అవుతోంది. -
పథకాలు పేదలకు సత్వరం అందేలా చూడండి
మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు పేదలకు సత్వరం అందేలా చూడాలని అధికారులను మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మంగళవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సంక్షేమ శాఖల ద్వారా అందిస్తున్న స్కాలర్షిప్లు, హాస్టళ్ల స్థితిగతులు తదితరాల వివరాలను తెలుసుకున్నారు. గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఉన్న బకాయిలు, ఈ 2015-16 ఫీజుల కోసం వివిధ శాఖలకు అవసరమైన నిధులు తదితర వివరాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సహకార శాఖ వినూత్న రీతిలో పనిచేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. రైతులకు ఎరువుల సరఫరా, ధాన్యం సేకరణ తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మార్క్‌ఫెడ్, హౌజ్‌ఫెడ్, హాకాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. -
వచ్చే వారం టెట్ షెడ్యూల్!
♦ ఏప్రిల్ 9న టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ♦ జూన్‌లో డీఎస్సీ నిర్వహణపై పరిశీలన ♦ విద్యాశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), జిల్లా ఎంపిక కమిటీలు (డీఎస్సీ) నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గతంలోనే ఆదేశించిన సుప్రీంకోర్టు తాజాగా సోమవారం కూడా మరోసారి టీచర ్ల నియామకాల స్థితిపై వివరణ కోరింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తాము చేపడుతున్న చర్యలు, ఇతరత్రా ప్రక్రియపై నివేదికను సుప్రీంకు అందజేసేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు నియామకాల నోటిఫికేషన్ కంటే ముందుగానే టెట్‌ను నిర్వహించాల్సి ఉండటంతో టెట్ ఏర్పాట్లపైనా దృష్టిపెట్టింది. టెట్ నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి తేదీల వివరాలు ఉండేలా షెడ్యూలును సిద్ధం చే యాలని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే నెల్లోనే టెట్ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్‌ను మార్చి 1న జారీ చేసి, ఏప్రిల్ 9న టెట్ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ తొలుత భావించింది. అయితే మార్చిలోనే నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న విద్యా వలంటీర్లు అంతా సెలవులు పెట్టి వెళ్లిపోతారని, విద్యా కార్యక్రమాలకు, వార్షిక పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందని విద్యాశాఖ ఆలోచించింది. దీనికితోడు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా వేసవి సెలవుల్లోనే టెట్, డీఎస్సీకి చర ్యలు చేపట్టాలని కోరాయి. లేదంటే తమ పాఠశాలల్లో టీచర్లు లేకుండాపోతారని చెప్పాయి. కానీ ప్రస్తుతం టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించడంతో సాధ్యమైనంత ముందుగానే టెట్ నిర్వహించాలని, తద్వారా డీఎస్సీ కూడా ముందుగా నిర్వహించడం సాధ్యమవుతుందని భావిస్తోంది. దీంతో మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ 9న పరీక్ష నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. జూన్‌లోనే డీఎస్సీ డీఎస్సీ నిర్వహణ తేదీల పైనా విద్యాశాఖ పరిశీలన జరుపుతోంది. డీఎస్సీ షెడ్యూలుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉన్నందున ప్రతిపాదనలను సర్కారుకు పంపేందుకు సిద్ధమవుతోంది. మొత్తంగా డీఎస్సీని జూన్‌లో నిర్వహించాలని భావిస్తోంది. ఈలోగా డీఎస్సీల్లో నష్టపోయిన వారి వ్యవహారం కూడా తేలే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హేతుబద్ధీకరణను కూడా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డీఎస్సీ నోఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. విద్యాశాఖతోపాటు ఇతర సంక్షేమ శాఖల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 15,628 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అందులో విద్యాశాఖ పరిధిలో 10,961 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో డీఎస్సీల్లో నష్టపోయిన వారికి ఎన్ని ఇస్తారన్నది తేలాల్సి ఉంది. -
మాకు సలహాదారే ఇన్చార్జి
సాధారణంగా ఎక్కడైనా ఓ ప్రభుత్వ విభాగానికి ప్రభుత్వ అధికారే ఇన్చార్జిగా ఉంటారు. కానీ కుటుంబ సంక్షేమశాఖకు సలహాదారు ఇన్చార్జిగా ఉన్నారట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు ఆ శాఖ ఉద్యోగులే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశాఖకు ఒక సలహాదారును నియమించారు. ఆయనకు కోఠిలోని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చాంబర్‌కు పది అడుగుల దూరంలోనే చాంబర్ ఇచ్చారు. ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సిన టెండర్ల నుంచి వాళ్ల రిపోర్టులు చూసే వరకూ అన్నీ ఆయనే చూస్తుంటారని ఆశాఖ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా మెడాల్ సంస్థకు రక్తపరీక్షల టెండరు అప్పజెప్పడంలో సలహాదారే కీలక పాత్ర పోషించారని, మేమంతా అక్కడున్నా డమ్మీలుగానే ఉన్నామని చెబుతున్నారు. జాయింట్ డెరైక్టర్లు, డిప్యూటీ డెరైక్టర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు ఇలా అందరూ సలహాదారు కిందనే పనిచేస్తున్నామని కూడా చెబుతున్నారు. అంతెందుకూ ఆయన చెబితే మా ఉన్నతాధికారులెవరైనా తలవంచుకుని క్షణాల్లో పనిచేయాలని అంటున్నారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి చాలా తెలివైన వారని, సీఎం కార్యాలయం సిబ్బందే చెప్పారట..అందుకే కుటుంబ సంక్షేమశాఖలో సలహాదారు అంటే చచ్చేంత వణుకు ఉద్యోగులకు..పాపం. అందుకే మాకు సలహాదారే ఇన్చార్జి అంటున్నారు వాళ్లు. -
‘ఫీజు’ ఇబ్బందుల్లో 3 వేల మంది విద్యార్థులు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని దుస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2014-15 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి.. ఈసెట్‌లో లేటరల్ ఎంట్రీ ద్వారా 163 కాలేజీల్లో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరిన దాదాపు 3 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కష్టాలు వచ్చి పడ్డాయి. విద్యాశాఖ, సంక్షేమ శాఖల నిర్లక్ష్యం వల్ల వారంతా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేని దుస్థితి దాపురించింది. ఈ విషయంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని కలసి విజ్ఞప్తి చేశాయి. అసలేం జరిగిందంటే: ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టిన జేఎన్టీయూ... 170 కాలేజీలకు అఫిలియేషన్లను నిరాకరించింది. వసతులున్నా నిరాకరించిందంటూ ఆయా కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు తీర్పు అనుసరించి సదరు కాలేజీల్లో ఇతర వర్సిటీలకు చెందిన బృందాలు మళ్లీ తనిఖీలు చేశాయి. ఆ తనిఖీ నివేదికల ఆధారంగా 163 కాలేజీల్లో 807 కోర్సులకు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని పేర్కొంటూ, జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించింది. ఈ ప్రక్రియ అంతా ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించినదే. దీంతో 2014-15 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను చేపట్టడానికి వీల్లేకపోయింది. ఇక ఆయా కాలేజీల్లో ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సర కోర్సులు కొనసాగుతున్నాయి. అదే ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు దాదాపు 3 వేల మంది ఆయా కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో కన్వీనర్ కోటా కింద చేరారు. వారంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులే. కానీ సంక్షేమ శాఖ ఆ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. వారి వివరాలను ఆన్లైన్లో పెట్టలేదు. దీంతో ఆ విద్యార్థులంతా ఈ-పాస్ వెబ్సైట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. వారి దరఖాస్తులను సాఫ్ట్వేర్ యాక్సెస్ చేయకుండా సంక్షేమ శాఖ బ్లాక్ చేసింది. దీంతో ద్వితీయ సంవత్సరంలో చేరిన విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులేనని జేఎన్టీయూ లేఖ రాసింది. అయినా సంక్షేమ శాఖ ఆ విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించకుండా ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో పడ్డారు. -
బది‘లీల’లు
ఎమ్మెల్యేల లేఖ ♦ ఒంగోలులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పట్టుమని పది నెలలు కూడా కాకముందే అతని స్థానంలో మరొకరిని సిఫార్సు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. చీరాలలో డిప్యుటేషన్లో ఉన్న ఉద్యోగికి అక్కడే స్థానం కల్పించాలంటూ మరో ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారు. దీంతో తనకు ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదనుకున్న ఆ ఉద్యోగికి కూడా బదిలీ తప్పనిసరి పరిస్థితైంది. ఇలా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తున్న స్థానాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. కనీసం తమకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల అవకాశం కల్పించాలంటున్నా ససేమిరా అంటున్నారు. ♦ జెడ్పీలోలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్నవారిని మాత్రం బదిలీల పేరుతో బయటకు నెట్టాలని నిర్ణయించారు. వారి స్థానంలో అధికారపక్షం అండదండలున్న వారిని నియమించడానికి రంగం సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, : అధికార పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి సిఫార్సు లేఖ ఇస్తే పోస్టింగ్ ఖాయం. లేకపోతే ఎక్కడికి బదిలీ చేస్తారో ఎవరికీ తెలియదు. జిల్లాలో బదిలీలకు ఒక్కరోజే గడువు ఉండటంతో అడ్డతోవలు తొక్కడానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే, ఇన్ఛార్జీలు ఇచ్చిన లేఖలు తీసుకుని అధికారులు, సిబ్బంది క్యూ కట్టారు. ఎంపీడీవో బదిలీలు, జెడ్పీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖలో బదిలీలపై వివాదం నెలకొంది. నిబంధనలను పక్కన పెట్టి సిఫార్సులకే పెద్ద పీట వేయడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించి మినిస్టీరియల్ సిబ్బంది, నాల్గో తరగతి ఉద్యోగులు, రికార్డు అసిస్టెంట్ల బదిలీలను జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, అకౌంట్స్ ఆఫీసర్ ప్రారంభించారు. సాధారణంగా ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరవుతుండడం పరిపాటి. కానీ సంఘాల నాయకుల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. ఐదు సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు తప్పవని సూచించడంతో వారంతా దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమంది పరస్పరం బదిలీలు కోరుకున్నవారు కూడా తమ దరఖాస్తులను అధికారులకు పంపించారు. వారి విజ్ఞప్తుల మేరకు ముందస్తు బదిలీలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం నుంచి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో అధికారులు ప్రజాప్రతినిధులు సూచించిన వారికి బదిలీలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పైరవీలు దందాకు తెరలేచింది. ఎమ్మెల్యేలు లేనిచోట: మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట అధికార పార్టీ ఇన్‌ఛార్జులు కూడా సిఫార్సు లేఖలు హవా సాగింది. సంతనూతలపాడులో ఒక ఉద్యోగికి ఆ స్థానం ఖాళీ చేయాలంటూ లేఖ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగిని ఎక్కడకు పంపిస్తారో మాత్రం తెలియని పరిస్థితి . ► పొదిలిలో ఒక ఉద్యోగిని మార్పు చేయాలంటూ ఒంగోలులో ఒక అధికార పార్టీ నాయకునితోపాటు మార్కాపురం ప్రాంతానికి చెందిన టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి నుంచి కూడా ఉత్తర్వులు అధికారులకు అందాయి. ► శుక్రవారం రాత్రి వరకు నిర్వహించినా బదిలీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో శనివారం ఎంపీడీవో, సూపరింటెండెంట్లకు సంబంధించిన బదిలీలు నిర్వహించనున్నారు. వీటికి కూడా పెద్ద ఎత్తున సిఫార్సులు వచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటే కనీసం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల విజ్ఞప్తి కూడా పరిగణనలోకి తీసుకోవాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ నాయకులు ఇప్పటికే జెడ్పీ సీఈవోను, జిల్లా పరిషత్ చైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పంచాయతీరాజ్ శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ► జిల్లాలో ముగ్గురు డివిజనల్ పంచాయతీ అధికారులు, 32 మంది ఈవోఆర్డీలు, మరో 500 మంది వరకు పంచాయతీ కార్యదర్శులున్నారు. కార్యదర్వులు ఇప్పటికే అధికార పార్టీ నుంచి లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒంగోలు పక్కనే ఉన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఏకంగా 25 మంది కార్యదర్శులకు సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. వ్యవసాయ శాఖలో కూడా బదిలీల ఫీవర్ కొనసాగుతోంది. శుక్రవారం జిల్లా సహకార అధికారితోపాటు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. -
రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్
ఎక్సైజ్‌శాఖను సంక్షేమ శాఖగా మార్చుతాం మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరి : రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వచ్చిన ఆయన స్థానిక శివాలయంలో రెండు గంటల పాటు వినాయకహోమం నిర్వహించారు. అనంతరం నృసింహుని దర్శించుకుని ఆలయ సన్నిధిలో కొలువై వున్న శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ ఈ నెలతో ముగియనుందని, కొత్తపాలసీని రెండు మూడు రోజులలో నిర్ణయిస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖను సైతం సంక్షేమశాఖగా మార్చి బె ల్ట్ షాపులను లేకుండా చేయడంతో పాటు మద్యం అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా త్వరలోనే రూ.165 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఉపాధి కల్పించే పరిశ్రమలకు 40 శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు అందజేస్తామన్నారు. మంత్రి వెంట పార్టీ నాయకులు గంజి చిరంజీవి, సంకా బాలాజిగుప్తా, నందం అబద్దయ్య, వల్లభనేని సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డన
ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)అధికారుల స్వలాభం మహిళా శిశు సంక్షేమశాఖకు భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లకు కాంట్రాక్టర్లు ఒక్కోగుడ్డుకు 10పైసలు తీసుకుంటుండగా.. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా సరఫరా అవుతున్న ఒక్కోగుడ్డుకు 60 పైసలు అధికారులు చెల్లిస్తున్నారు.. దీంతో ప్రభుత్వ ఖజానాకు నెలకు దాదాపు రూ.29 లక్షల భారం పడుతోంది.. కాగా, ‘ఆరోగ్య లక్ష్మి’ నిబంధనలకు విరుద్ధంగా సరఫరా చేస్తున్నారు.. - కోడిగుడ్ల రవాణా పేరిట చార్జీల మోత - ఐకేపీ సంఘాల ద్వారా అదనపు భారం - ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.29 లక్షలు గండి - ఇప్పటివరకు రూ.1.50 కోట్లు చెల్లింపు సాక్షి, హన్మకొండ : జిల్లాలో 18 అంగన్వాడీ ప్రాజెక్టుల పరిధిలో 4,196 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నారుు. ఇందులో గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయసున్న పిల్లలు కలిపి 2,23,323 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలలో 26 రోజులపాటు కోడిగుడ్లు పౌష్టికాహారంగా అందిస్తారు. ఆ ప్రకారం అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 58,06,398 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇంత భారీసంఖ్యలో గుడ్లు కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు తక్కువగా ఉండాలి. కానీ, జిల్లాలో పది రెట్లు అదనంగా రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సరఫరా చేయాల్సి రావడంతో అదనపు భారం పడుతోంది. నెలకు రూ.29 లక్షలు అదనం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్ల సంఖ్య ఒక నెలకు 58,06,398. లబ్ధిదారులు 2,23,323 ఉండగా ఒక్కొ గుడ్డుకు రవాణా చార్జీగా రూ.0.60 చెల్లిస్తున్నారు. దీనితో కోడిగుడ్లకు రవాణాకు నెలకు రూ.34,83,838 ఖర్చవుతోంది. కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర సంక్షేమ హస్టళ్లకు టెండర్ల విధానం ద్వారా కాంట్రాక్టర్లు కేవలం పది పైసలకే రవాణా చేస్తున్నారు. ఇదే పద్ధతి ఐసీడీఎస్‌లో అమలైతే నెలకు రూ.5,80,639లోపే రవాణా చేయవచ్చు. కానీ ఐకేపీ సంఘాల ద్వారా గుడ్ల సరఫరా బాధ్యత అప్పగించడం వల్ల ప్రతీ నెల దాదాపు రూ.29 లక్షలు అదనంగా రవాణా చార్జీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.1.50 కోట్లు అదనపు భారం పడింది. ఐకేపీతోనే తంటా.. కలెక్టర్‌గా జి.కిషన్ కొనసాగిన కాలంలో అమృతహస్తం పథకంలో భాగంగా అంగన్వాడీల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న గుడ్ల సరఫరా బాధ్యతను ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఐకేపీ సంఘాలు ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలకే గుడ్లు సరఫరా చేయాల్సి రావడంతో రవాణా చార్జీలు పెరిగాయి. దీనికితోడు పెద్ద సంఖ్యలో గుడ్లను సరఫరా చేయడంలో మహిళా సంఘాల అనుభ వలేమి, మౌలిక సదుపాయల కొరతను ఆసరా చేసుకున్న కొందరు అధికారులు గుడ్ల సరఫరాలో తమ మార్క్ దందాను కొనసాగిస్తున్నారు. కాగితాల్లోనే మహిళా సంఘాల ద్వారా సరఫరా అని పేర్కొంటూ.. వాస్తవంలో పర్సంటేజీ స్వీకరించి కాంట్రాక్టర్ల ద్వారానే కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణా చార్జీల రూపంలో భారీగా మిగులు ఉండటంతో ఇటూ కాంట్రాక్టర్లు, అటూ అధికారులకు కాసుల పంట పండుతోంది. దీనితో ఇదే పద్ధతిని కొనసాగించేందుకు సుముఖత చూపుతున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ‘ఆరోగ్యలక్షి్ష్మ’తో రాని మార్పు 2015 జనవరి నుంచి అమృత హస్తం పథకం స్థానంలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ పథకం నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ద్వారానే కోడిగుడ్లను సరఫరా చేయాలి. అయితేటెండర్ల ద్వారా గుడ్లు అందివ్వాలనే నిబంధనలు అమలు చేసేందుకు ఐకేపీ అధికారులు విముఖత చూపుతున్నారు. ఐదు నెలలుగా టెండర్లను ఆహ్వానించకుండా ఐకేపీ మహిళా సంఘాల ద్వారానే గుడ్ల సరఫరాను కొనసాగిస్తున్నారు. -
సంక్షేమ పథకాలకు గడువు పొడిగింపు
సాక్షి,సిటీబ్యూరో : సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పథకాల దరఖాస్తు గడువును జూన్ వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆయా సంక్షేమ శాఖలు లబ్ధిదారుల కోసం వేట ప్రారంభించారు. అందుకోసం ఈ నెల 7 నుంచి బస్తీల వారిగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల నుంచి 1000 పైగా దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ రుణాల మంజూరు తదితర పథకాలకు ఎస్సీ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ, యువజన సంక్షేమ శాఖలకు నిధులు విడుదల చేశారు. 2014-15 సంవత్సరానికి ఎస్సీ,ఎస్టీ,యువజన సంక్షేమ శాఖలకే రూ.14.90 కోట్లు నిధులు మంజూరు చేయగా,..ఆర్థిక సంవత్సరంలో రూ. 2.76 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నిధులు రూ.12.14 కోట్ల నిధులను జూన్ నెలాఖరుకల్లా ఖర్చు చేసే విధంగా ఆయా సంక్షేమ శాఖలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. లబ్థిదారుల కోసమే క్యాంపులు: ఏజేసీ సంజీవయ్య సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకుగాను అర్హుల ఎంపిక కోసం జిల్లాలోని 8 ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం. క్యాంపులు ముగియగానే లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తాం. -
సంక్షేమంలో ‘అవార్డుల’ చిచ్చు
ఇందూరు : సంక్షేమ శాఖల్లో ‘అవార్డుల’ సంఘటన దుమారం రేపుతోంది. సీనియర్లను కాదని, పనిచేసే వారిని సైతం పక్కనబెట్టి జూనియర్లను అవార్డుకు ఎలా ఎంపిక చేస్తారని శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వసతిగృహాల వార్డెన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుకుంటు బండారాన్ని బయటపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారుతోంది. సంక్షేమంలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అహర్నిశలు కష్టపడి, విధి నిర్వహణలో బెస్ట్ అనిపించుకున్న వారికి పోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రతిఏడాది ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపిక కాబడిన ఉద్యోగులకు ప్రభుత్వ తరపున అవార్డు అందజేస్తారు. ఈ అవార్డులను ఆగస్టు 15న మంత్రిచే, జనవరి 26న కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తారు. జిల్లా స్థాయి అధికారులు తమ శాఖలో పనిచేసే ఉద్యోగుల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి కలెక్టర్‌కు ఒక రోజు ముందు పంపుతారు. అయితే ఈ ఎంపిక స్వార్థపరంగా, ఆర్థిక కారణంతో తెలిసిన, అనుకున్న వారికి అనుగుణంగా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లో బహిరంగ విమర్శలు వస్తున్నాయి. ఒక్కో శాఖలో ఇద్దరు వార్డెన్లు, ఇద్దరు శాఖ ఉద్యోగులకు అవార్డులు వచ్చాయి. అయితే వార్డెన్లలో అర్హత లేకున్నా, స్థానికంగా ఉండి విధి నిర్వహణ సక్రమంగా చేయని ఒకరిద్దరి వార్డెన్లను అవార్డుకు ఎంపిక చేసినందుకు సీనియర్ వార్డెన్లు మండిపడుతున్నారు. అంటే తామంతా పనికి రాని వాళ్లమా..? స్థానికంగా ఉండి వసతిగృహాల్లో ఇన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా మమ్మల్ని అవార్డుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఏంటనీ పలువురు వార్డెన్లు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి వర్కర్ స్థాయి నుంచి వచ్చిన స్థానికంగా ఉండని మారుమూల నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా వార్డెన్‌కు ఏరకంగా అవార్డునిచ్చారని ఆగ్రహంతో ఉన్నారు. కాగా బీసీసంక్షేమ శాఖ నుంచి కేవలం మహిళా వార్డెన్లను మాత్రమే ఎంపిక చేశారని, పురుషులను ఎంపిక చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇంచార్జ్‌గా ఉన్న అధికారిని తన ఇష్టారాజ్యంగా అవార్డుల ఎంపిక చేశారనిఆరోపిస్తున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖలో కూడా సీనియర్ వార్డెన్లను కాదని, ఇటు శాఖలో మొన్న వచ్చిన ఓ సూపరింటెంటెండ్కు అవార్డుకు ఎంపిక చేయడంతో అధికారుల తీరుపై సీనియర్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవార్డు పొందిన సదరు ఉద్యోగి తానే సొంతంగా ఎంపిక చేసుకుని జాబితాలో పెట్టుకున్నాడమే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా సంక్షేమ శాఖల్లో నువ్వెంత.. నేనెంత అనే విధంగా అవార్డుల వివాదం పెద్దదిగా మారుతోంది. అక్రమాలను, లోటుపాట్లను ఎత్తిచూపి, ఒకరినొకరు బండారాన్ని బయటపెట్టుకుంటున్నారు. అయితే అవార్డుల ఎంపికపై ఉద్యోగులు, వార్డెన్లు సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా కొట్టి పారేసినట్లు సమాచారం అందింది. ఈ విషయంపై వార్డెన్ల సంఘంలోని పలువురు నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. -
గోల్మాల్ ఉత్తదే!
చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారంతోపాటూ కోడిగుడ్డును ప్రభుత్వం అందజేస్తోంది. అయితే కోడిగుడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి ఏడాదికి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వానికి టోపీ పెడుతున్నట్లు ఇటీవ ల ఆరోపణలు వెల్లువెత్తాయి.అసెంబ్లీలో సైతం ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని ప్రస్తావించగా, మంత్రి వలర్మతి బదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తం గా ఏడాదికోసారి టెండర్లు పిలిచి కోడిగుడ్డు కొనుగోలు బాధ్యతను అప్పగిస్తున్నామన్నారు. టెండర్ల విధానం వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వచ్చిందన్నారు. కోడిగుడ్ల కొనుగోలులో గోల్మాల్ జరిగిదంటూ జరిగిన ప్రచా రం ప్రతిపక్షాల కుట్రగా ఆమె అభివర్ణించారు. జయ ముఖ్యమంత్రిగా రూ.31వేల కోట్ల పధకాలను ప్రకటించగా, వాటిల్లో ఒక్కటైనా పూర్తయిందాఅని డీఎంకే సభాపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. డీఎంకే మైనార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన ప్రగతికంటే మూడేళ్లలో తమ ప్రభుత్వం సాధించిందే ఎక్కువని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బదులిచ్చారు. డీఎంకే ప్రభుత్వాన్ని మైనార్టీ ప్రభుత్వం అని పిలవడంపై ఆ పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారు. తమది మైనార్టీ ప్రభుత్వమైతే ప్రస్తుత ప్రభుత్వం ఏమిటి, ఈ ముఖ్యమంత్రిని ఎలా పిలవాలి అంటూ డీఎంకే వ్యాఖ్యానించడంతో మరింత గందరగోళం నెలకొంది. జయలలితను అన్నాడీఎంకే నేతలు ప్రజల ముఖ్యమంత్రి అని పిలవడంపై పరోక్షంగా డీఎంకే సభ్యులు ఎద్దేవా చేయడంతో అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ విజయపరంపర కొనసాగిస్తున్న జయను ప్రజల ముఖ్యమంత్రి అనడంలో తప్పేమిటని ఇండియా కుడియరసు పార్టీ అధ్యక్షులు, శాసనభ్యులు తమిళరసు డీఎంకే సభ్యులను నిలదీశారు. శాంతి భద్రతల సమస్యకు దారితీసే స్థాయిలో రాష్ట్రంలో జాతి విద్వేషాలు లేవని సీఎం పన్నీర్‌సెల్వం, పుదియ తమిళగం పార్టీ సభ్యులు డాక్టర్ కృష్ణస్వామిప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లలో తూత్తుకూడి, తిరునెల్వేలీ జిల్లాలో జాతి విద్వేష సంఘటనలు, కేసుల వివరాలను సభకు వివరించారు. తిరునెల్వేలీలో 2013లో 5 హత్యలు, 2014లో 10, తూత్తుకూడిలో 2013లో ఒకటి, 2014లో 3 హత్యలు జరిగాయని వివరించారు. అయితే అవేవీ తీవ్రస్థాయిలో శాంతి భద్రతల సమస్యకు దారితీయలేదని సీఎం అన్నారు. జయపై డీఎంకే సభ్యులు, కరుణపై అన్నాడీఎంకే సభ్యులు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు తీవ్రస్థాయికి చేరగా బాహాబాహీకి సిద్ధమయ్యూరు. స్పీకర్ ధనపాల్‌ను డీఎంకే సభ్యులు ప్రశ్నిం చగా, సభా నిర్వహణ తనకు తెలుసని ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హెచ్చరించారు. అంతేగాక మార్షల్స్ చేత వారిని వెలుపలకు గెంటివేసే ప్రయత్నం చేయడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. -
గిరిజనుల ప్రాణాలకు భరోసా లేదు
పార్వతీపురం/కురుపాం: కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణం పూర్తి చేసి, గిరిజనుల ప్రాణాలను కాపాడాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె అ సెంబ్లీలో ప్రస్తావించిన విషయూలను ఫోన్లో ఇక్కడి విలేకరులకు వివరించారు. 2008లో సుమారు రూ.3.5కోట్ల రాష్ట్రీయ సమ వికాస్ యోజన(ఆర్‌ఎస్‌వీవై) పథకం నిధులతో అప్పటి అటవీశాఖా మంత్రి శత్రు చర్ల విజయరామరాజు పూర్ణపాడు-లాభేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణానాకి శంకుస్థాపన చేశారని, అప్పట్లో దీనినిర్మాణ బా ధ్యతలు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లకు అప్పగించారని తెలిపారు. వారు ఏడాది తర్వాత అంచనాల మొత్తం చాల దంటూ నిర్మాణాన్ని నిలుపుదల చేసినట్టు చెప్పారు. అనంతరం రూ.5.25 కోట్ల అంచనా వ్యయంతో ఆర్అండ్ బీ నేచురల్ హెల్పింగ్ హేండ్స్‌కు నిర్మాణ బాధ్యతలు అప్ప గించారని, వారు కూడా పనులు చేపట్టలేకపోవడం తో 2009లో రూ.6కోట్ల నిర్మాణ వ్యయంతో ఆర్అండ్బి రెగ్యులర్‌కు అప్పగించినట్టు వివరించారు. వారు కూడా పనులు చేపట్టలేకపోవడంతో రూ.3.5 కోట్ల నాబార్డు నిధులు విడుదల చేశారన్నారు. దీంతో పాటు ఆర్‌ఎస్‌ఈవై నిధులు 3.5కోట్లు మొ త్తం రూ.7 కోట్ల నిర్మాణ వ్యయంతో పలుమార్లు టెండర్లు జరిగినా..ఇప్పటివరకు పనులు జరగలేదన్నారు. వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఏటా వర్షాకాలంలో గిరిజ నులు నరకయూతన అనుభవిస్తున్నారన్నారు. వంతెన లేకపోవడంతో 1996లో కూనేరు వద్ద నాటు పడవ మునిగి 33 మంది మృత్యువాత పడిన విషయూన్ని గుర్తు చేశారు. వంతెన నిర్మాణం పూర్తరుుతే కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాలతో పాటు ఒడిశాకు చెందిన ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నా రు. అంతేకాకుండా సుమారు 30 గ్రామాల ప్రజలకు 50 కిలోమీటర్ల మేర దూరం తగ్గి మండల కేంద్రానికి రాకపోకలకు చేసేందుకు వీలవుతుందన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ విషయూన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారని, తమహయాంలో వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు శతవిధాలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. -
సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్
ఇవే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు! - హైదరాబాద్-వరంగల్ మార్గంలో ప్రత్యేక కారిడార్ - ఫార్మా, పౌల్ట్రీ, టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్ అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలే ఉన్నందున వారి కోసం సంక్షేమ శాఖలను తన వద్దే పెట్టుకున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్ సన్నిహిత మంత్రి ఒకరు మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి విజన్‌ను వివరించారు. ‘ఉద్యమాలు ముగిశాయి. ఇక కేసీఆర్ తన దృష్టిని పూర్తిగా తెలంగాణ అభివృద్ధిపైనే కేంద్రీకరించారు. చంద్రబాబు మాదిరిగా ప్రచారం పొందాలని చూడటం లేదు. సాగునీరు, సంక్షేమం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ‘తమిళనాడు తరహాలో పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్నారు. 125 గజాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు’ అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఏఐబీపీ నిధులను తెచ్చుకుని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తెలంగాణలో చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-వరంగల్ హైవేలో ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసి ఫార్మా, టూరిజం, పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రహదారి పొడవునా 36 ఫార్మా కళాశాలలు, వందలాది పౌల్ట్రీ ఫారాలతోపాటు ప్రస్తుతమున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సదరు మంత్రి వెల్లడించారు. -
తెలంగాణకు ‘ఫీజుల’ భారం
* కొత్త రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 3,553.04 కోట్లు అవసరం * అంచనాలు రూపొందించిన సంక్షేమ శాఖ * ఉమ్మడి రాష్ర్టంలో ప్రస్తుతం కేటాయించిందే రూ. 4000 కోట్లు * ఈ ఏడాది చెల్లింపులే అంతంత మాత్రం సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల్లో చేరే పేద విద్యార్థులకు చేయూతనిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెలంగాణకు భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి ఈ పథకం కింద వేల కోట్ల బడ్జెట్‌ను భరించడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. తాజాగా సంక్షేమ శాఖ రూపొందించిన అంచనాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 4,700 కోట్లు చెల్లించేందుకే ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటి వరకు సుమారు రూ. 1,800 కోట్లను మాత్రమే విద్యార్థులకు చెల్లించింది. ఈ నేపథ్యంలో 2014- 15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోటా నుంచి నిధులు వెచ్చిస్తే గాని బకాయిలు తీర్చే పరిస్థితి లేదు. ఇక తెలంగాణ పది జిల్లాలకు ఫీజు రీయింబర్స్మెంట్/ స్కాలర్‌షిప్పుల కింద రూ. 3,553.04 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సంక్షేమ శాఖ అంచనా వేసింది. సీమాంధ్రతో పోల్చితే తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు విద్యా సంస్థలు ఉండటం, రాష్ర్ట విభజన జరిగినా ఇప్పటి వరకు తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులు కూడా ఇక్కడే స్థానికులుగా మారుతుండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాలు తయారయ్యాయి. తదనుగుణంగా తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా 6,20,318 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత పొందుతారని సంక్షేమ శాఖ తేల్చింది. ఇక రెన్యువల్ చేసుకునే వారి సంఖ్య 8,68,284గా ఉంటుంది. అంటే మొత్తం 14,88,602 మంది విద్యార్థులకు వచ్చే ఏడాది ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో 27.88 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీని ఆధారంగానే సీమాంధ్ర, తెలంగాణలకు విద్యార్థుల సంఖ్యను తేల్చినట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే విద్యా సంవత్సరంలో తెలంగాణకే మూడున్నర వేల కోట్లకుపైగా అవసరమని అంచనా వేయ గా.. ఇందులో బకాయిలే రూ. 1005.22 కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. అదే సమయంలో సీమాంధ్రలో 15,02, 986 మంది విద్యార్థులకు రీయింబర్స్మెంట్ కింద రూ. 3,644.84 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇక్కడ కూడా బకాయిల కింద రూ. 1,037.34 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటాన్ అకౌండ్ బడ్జెట్ నుంచి రూ. 700 కోట్లను గత విద్యా సంవత్సరం బకాయిల కింద సర్దుబాటు చేశారు. మిగ తా బడ్జెట్‌ను రెండు రాష్ట్రాలకు పంచితే వచ్చేది కూడా ఆయా రాష్ట్రాల్లో పాత బకాయిల చెల్లింపులకే సరిపోతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లింపులకు తెలంగాణ కొత్త సర్కారు చమటోడ్చాల్సి రావచ్చని అధికారులు చెబుతున్నారు. -
సంక్షేమ శాఖల్లో విభజన కొలిక్కి
* 58:42 ప్రాతిపదికన సీమాంధ్ర, తెలంగాణలకు పంపకాలు * గిరిజన శాఖలో మాత్రం 46 : 54 నిష్పత్తిని సూచించిన అధికారి * సంక్షేమ భవన్లో తెలంగాణకు మూడు, సీమాంధ్రకు నాలుగు ఫ్లోర్లు.. ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: సంక్షేమశాఖల్లో విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఆస్తులు, అప్పులతో పాటు ఉద్యోగుల విభజన పై కూడా ప్రతిపాదనలు తయారుచేసిన సంక్షేమ శాఖల అధికారులు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి పంపించారు. 58 :42 నిష్పత్తిలో సీమాంధ్ర, తెలంగాణలకు విభజనను పూర్తిచేశారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమశాఖలు పనిచేస్తున్నాయి. 23 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లా యూనిట్‌గా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఉద్యోగులు, అధికారుల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో గత నెల రోజులుగా ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక రూపొందించినట్టు ఉన్నతాధికారి ఒకరు‘సాక్షి’కి తెలిపారు. గిరిజనశాఖ విషయంలో జనాభా పట్టని వైనం తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల జనాభా సీమాంధ్ర కన్నా ఎక్కువ కాబట్టి... తెలంగాణకు 54 శాతం, సీమాంధ్రకు 46 శాతం కింద పంపకాలుండాలని,ఆమేరకు నివేదిక రూపొందించాలని ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే అధికారి చెప్పిన విధంగా ఓ నివేదికను రూపొందించినప్పటికీ, ఆన్లైన్లో మాత్రం సీమాంధ్రకే 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రకారమే విభజనను ప్రతిపాదించి అప్లోడ్ చేసినట్టు తెలిసింది. సీమాంధ్రకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రాతిపదికన పంపకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని సంక్షేమ శాఖలు నివేదికలు రూపొందించాయి. ఓపెన్ కేటగిరీ కింద ఉద్యోగాలు సంపాదించి హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కూడా అవే మార్గదర్శకాలనే పాటించారు. కాగా గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి జనాభా ఆధారంగా విభజించాలని, సీమాంధ్ర కన్నా తెలంగాణలో గిరిజనులు అధికంగా ఉన్నందున పంపకాల విషయంలో ఉన్నతస్థాయి వర్గాల నుంచి కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అయినప్పటికీ మిగిలిన శాఖల మాదిరిగానే పంపకాలతో నివేదిక పంపించినట్టు తెలిసింది. సంక్షేమ భవన్ రెండు విభాగాలుగా... మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌ను కూడా 58:42 ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణలకు విభజించారు. ఏడు అంతస్తులున్న ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు అంతస్తులను తెలంగాణకు, నాలుగు నుంచి ఏడు అంతస్తులను సీమాంధ్రకు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, అధికారులు పై మూడు అంతస్తులను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, వారికి ప్రాధాన్యత ఇస్తూ తదనుగుణంగా మార్పులు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. శ్రీశైలం ఐటీడీఏ నుంచి వేరుకానున్న మహబూబ్‌నగర్ శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలున్నాయి. విభజన కారణంగా శ్రీశైలం సీమాంధ్రకు వెళుతున్నందున మహబూబ్‌నగర్ జిల్లాను ఈ ఐటీడీఏ నుంచి వేరుచేశారు. ఇప్పటికి తెలంగాణలో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఐటీడీఏలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ అటవీప్రాంతం, చెంచుగ్రామాల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.