
రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్
ఎక్సైజ్‌శాఖను సంక్షేమ శాఖగా మార్చుతాం
మంత్రి కొల్లు రవీంద్ర
మంగళగిరి : రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వచ్చిన ఆయన స్థానిక శివాలయంలో రెండు గంటల పాటు వినాయకహోమం నిర్వహించారు. అనంతరం నృసింహుని దర్శించుకుని ఆలయ సన్నిధిలో కొలువై వున్న శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ ఈ నెలతో ముగియనుందని, కొత్తపాలసీని రెండు మూడు రోజులలో నిర్ణయిస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖను సైతం సంక్షేమశాఖగా మార్చి బె ల్ట్ షాపులను లేకుండా చేయడంతో పాటు మద్యం అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా త్వరలోనే రూ.165 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఉపాధి కల్పించే పరిశ్రమలకు 40 శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు అందజేస్తామన్నారు. మంత్రి వెంట పార్టీ నాయకులు గంజి చిరంజీవి, సంకా బాలాజిగుప్తా, నందం అబద్దయ్య, వల్లభనేని సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.