కొత్త సంవత్సర వేడుకలకు భారీగా మద్యం అమ్మకాలు
ఆరు రోజుల్లో డిపోల నుంచి షాపులకు రూ.1,220 కోట్ల మందు
సోమవారం ఒక్కరోజే రూ.402 కోట్ల మేరకు..
సాధారణ రోజుల్లో విక్రయాలు రూ.117కోట్ల వరకే
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,523 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, చివరి ఆరు రోజుల్లోనే రూ.1,220 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు 40 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది.
ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే (డిసెంబర్ 30) రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ రూ. 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.117 కోట్ల విలువైన మద్యం అమ్ముకాలు జరగ్గా.. సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివారం (డిసెంబర్ 29) కూడా మద్యం డిపోలు తెరచే ఉంచారు.
బ్యాంకులు లేకపోయినా వైన్‌షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో రూ.50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక, గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్‌లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం. 2023, డిసెంబర్ నెలలో రూ.4,147.18 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా, ఈ డిసెంబర్‌లో రూ.3,523 కోట్లకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment