ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు
మద్యం సరఫరాపై ఎక్సైజ్ శాఖకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
మద్యం రేట్ల పెంపు విషయంలో కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు
ధరల నిర్ణాయక కమిటీ నివేదికను వీలైనంత త్వరగా తెప్పించండి
మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలి
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూగర్భ విద్యుత్ లైన్లు వేయాలి
దీనిపై వివిధ దేశాల్లో అత్యున్నత విధానాలను పరిశీలించండి
ఎక్సైజ్, విద్యుత్ శాఖలపై వేర్వేరుగా సీఎం సమీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడం కోసం కొత్త కంపెనీలను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్యం సరఫరా కంపెనీలను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించాలని.. ఇందుకోసం కనీసం నెల రోజులు గడువు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేయాలని.. ఇప్పటికే సరఫరా చేస్తున్న కంపెనీల కోసం సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని స్పష్టం చేశారు.
మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ బీర్ల ధరల పెంపు డిమాండ్, బకాయిలు చెల్లించనందున తెలంగాణలో తమ బ్రాండ్ మద్యాన్ని సరఫరా చేయబోమని ప్రభుత్వానికి లేఖ రాసిన అంశంపై చర్చించినట్టు తెలిసింది.
కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు
యూబీ కంపెనీ వాదనను అధికారులు వివరించగా.. మద్యం కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో పొరుగునే ఉన్న ఏపీ, మహారా ష్ట్రలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లను పరిశీలించాలని సూచించారు. కంపెనీలకు ఇచ్చే రేట్లను హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణాయక కమిటీ నిర్ధారిస్తుందని, ఆ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. ఆ కమిటీ తన నివేదికను త్వరగా ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా ఎక్సైజ్ బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా క్రమంగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో మద్యం తయారీ, సరఫరా కోసం ఐదు సంస్థలకు అనుమతినిచ్చి, నిలిపివేసిన నేపథ్యంలో ఇప్పుడు వాటి గురించి పరిశీలించాలని సీఎం సూచించినట్టు సమాచారం. అయితే ఈ ఐదు సంస్థల్లో ఒక సంస్థకు డిస్టిలరీ ఏర్పాటు తోపాటు మద్యం తయారీకి గతంలో అనుమతినిచ్చారు. విమర్శలు రావడంతో అనుమతులను నిలిపివేశారు. ఇప్పుడు సీఎం ఆదేశాలతో పునః పరిశీలించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ అంతటా భూగర్భ విద్యుత్ కేబుల్స్
గ్రేటర్ హైదరాబాద్‌లో, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతమంతా పూర్తిగా భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనితో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడమేకాక, విద్యుత్ అంతరాయాలను కూడా అధిగమించడానికి వీలవుతుందని సూచించారు. దీనికి సంబంధించి వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర రాజధాని నగరంలో వేసే భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ దేశంలోనే అత్యు త్తమంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్ మాత్రమే గాక.. వివిధ రకాల కేబుళ్లు కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఆదేశించారు. శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ– 2025’ పాలసీని ఆవిష్కరించిన అనంతరం విద్యుత్ రంగంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.
ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, పాఠశాలలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు కంపెనీలను ఆహ్వానించి, ఏ విధానంలో వారికి పనులు అప్పగించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ గూడేలలో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ, గిరిజన సంక్షేమం, ఇతర శాఖలతో సమావేశమై నివేదిక రూపొందించాలన్నారు. ఇక రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట(పీక్) డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరిందని.. అది ఈసారి 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనితో గరిష్ట విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి, సరఫరా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment