Liquor supply
-
AP: కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే లిక్కర్ మాఫియాలా చెలరేగుతున్నారు. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని లారీలు, కంటైనర్లలో తెప్పించి గ్రామగ్రామాన విక్రయిస్తున్నారు. గత నెల రోజుల్లో భారీ మొత్తంలో మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకొని, కాసుల పంట పండించుకుంటున్నారు. భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లారీల నంబర్లు ముందే చెప్పి తనిఖీ చేయొద్దని హుకుం జారీ చేయడంతో పోలీసులు ఆ లారీలను వదిలేస్తున్నారు. దీంతో అక్రమ మద్యం నిరాఘాటంగా రాష్ట్రంలోకి వచ్చేస్తోంది. కర్నూలులోని ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు కర్ణాటక, గోవా మద్యం సరఫరా అవుతోంది. ఆళ్లగడ్డలో ఇప్పటికే కర్ణాటక నుంచి 3 లారీల మద్యం దిగుమతి అయింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకూ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ మద్యం దందాలో టీడీపీకి చెందిన కొందరు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు భాగస్వామ్యమైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. గోవా బ్రూవరేజి కంపెనీ నుంచి.. కర్నూలు జిల్లాలో మద్యం వ్యాపారంలో ఆరితేరి మంత్రిగా పని చేసిన ఓ నేతకు గోవాలోని ఓ బ్రూవరేజి కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. 2014 డిసెంబర్లో టీడీపీ ప్రభుత్వం ఉండగానే గోవా నుంచి కర్నూలు జిల్లాకు వెళుతున్న మద్యం కంటైనర్‌ను గుత్తి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గోవాకు వెళ్లి అక్కడి బ్రూవరీని పరిశీలిస్తే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టమైంది. అప్పట్లో మంత్రి ప్రమేయంతో ఈ కేసును నీరుగార్చారు. ఇప్పుడు మళ్లీ అధికారం దక్కడంతో అక్కడి బ్రూవరేజి కంపెనీ నుంచి తిరిగి మద్యం సరఫరా మొదలైంది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు రెండు, తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక కంటైనర్ మద్యం వచ్చినట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాహనాల ద్వారా ఈ మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, గోవా లిక్కర్‌తో భారీ ఆదాయం మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) బేస్డ్తో తయారవుతుంది. కర్ణాటక, గోవాలో ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) బేస్డ్తో తయారవుతుంది. ఈఎన్‌ఏతో పోలిస్తే ఆర్ఎస్ బేస్డ్ మద్యం ధర తక్కువ. అందువల్ల కర్ణాటక, గోవా మద్యం తక్కువకు లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈఎన్ఏ మద్యం నాణ్యమైనది. కర్ణాటకలో 90 ఎంఎల్ టెట్రాప్యాకెట్ ధర రూ.45, క్వార్టర్ రూ.90 మాత్రమే. ఇది అక్కడి మద్యం షాపుల్లోని రేటు. నేరుగా బ్రూవరేజెస్ నుంచి తెప్పించుకుంటే మరింత తక్కువకు వస్తుంది. ధర తక్కువ కావడంతో కర్ణాటక, గోవా నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఇది అక్రమంగా వచ్చేది కావడంతో పన్నులు కూడా ఉండవు. దీంతో టీడీపీ నేతలు తక్కువకు కొని, ఎక్కువకు అమ్ముకొని డబ్బులు దండుకొంటున్నారు. గ్రామాల్లోనే విచ్చలవిడిగా మందు కర్నూలు నగరంలోని ప్రభుత్వ వైన్‌షాప్ పక్కనే మద్యం తాగుతున్న మందుబాబులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో మద్యం నివారించాలని బెల్ట్‌షాపులను రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతలే జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల ద్వారా గ్రామాల్లోనే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మేస్తున్నారు. మద్యం దుకాణాలు ఉన్న చోట సీటింగ్‌కు కూడా అనధికారికంగా అనుమతి ఇచ్చి, అక్కడా అక్రమ మద్యాన్నే తక్కువ ధరకు అమ్ముతున్నారు. -
టీడీపీ ‘కిక్కు’రొకో.. ఎన్నికల వేళ రాష్ట్రానికి భారీగా గోవా మద్యం సరఫరా
మునగపాక : ఎన్నికల కోడ్ కూతతో రాష్ట్రంలో మద్యం పారించేందుకు టీడీపీ కుయుక్తులు పన్నింది. గోవా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేసి విక్రయాలకు పాల్పడుతోంది. ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు ఇప్పటికే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్తనూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు పంపారు. ఈ వ్యవహారంలో సూత్రధారులెవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందంటే.. యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్ కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు రప్పించి తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టారు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాకనుంచి అక్రమ మద్యం రవాణా అవుతోందని వచ్చిన సమాచారంతో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి తనిఖీ చేశారు. వారి వద్ద 5 కేసుల్లో 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్టు వారు చెప్పడంతో గడ్డివాము వద్ద తనిఖీలు చేపట్టి స్వాదీనం చేసుకున్నారు. మొత్తం రూ.50 లక్షల విలువైన 39,168 క్వార్టర్ బాటిళ్లు (7వేల లీటర్ల మద్యం) స్వాధీనం చేసుకుని ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త బి.ప్రసాద్‌నూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. కాగా.. వెంకటస్వామి, ధర్మతేజ దినేష్‌కుమార్ యలమంచిలి నియోజకవర్గం కట్టుబోలుకు ఇదే తరహాలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి అక్రమ వ్యాపారం చేసేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మునగపాక ఎస్ఐ పి.ప్రసాదరావు వారి యత్నానికి గండికొట్టారు. కేసు విచారణ సమయంలో పోలీసులకు మరింత సమాచారం అందినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మద్యాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో సహకరించిన అందరి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇంతపెద్దమొత్తంలో మద్యం స్వా«దీనం చేసుకోవడం ఇదే ప్రథమమని పోలీసులు చెబుతున్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్?
సాక్షి, కరీంనగర్: ఏ ఎండకు ఆ గొడుగు చందంగా రాజకీయ నాయకులు పార్టీల గోడలు దూకడం తెలిసిందే. ప్రస్తుత హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఆయా పార్టీలు ఓ అడుగు ముందుకేసి, జనాలనూ మార్చేస్తున్నాయి. అభ్యర్థుల ముందు ఆ సమయానికి కండువా కప్పుకుంటే చాలంటున్నారు నేతలు. ఫొటోలు క్లిక్‌మనిపిస్తూ ఆ జనసమూహాన్ని తమ సైన్యంగా చూపించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సామాన్యులకూ లాభదాయకంగా మారింది. ఆ రోజుకు బీరు, బిర్యానీతోపాటు రూ.500 ఇస్తున్నారు. తమ అధినేతల వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు గల్లీ నాయకులు పక్క వీధిలోని అపరిచితుల్నీ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పిస్తున్నారు. తామే ఎక్కువ మందిని పార్టీలో చేర్పించామని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఒకరిచేత కండువా కప్పించుకున్న గల్లీ కార్యకర్తలు మరుసటిరోజు మరో పార్టీ కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్ అని బేరాలాడుతున్నారు. ఇదో ఎన్నికల చిత్రం! చదవండి: హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్ గరిటె తిప్పేటోళ్లు కావాలండోయ్ కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమాని వంట తయారీదారులకు డిమాండ్ పెరిగింది. ప్రచారపర్వంలో భాగంగా సమావేశాలకు హాజరయ్యే వారికి అభ్యర్థులు ఉదయం అల్పాహారంతోపాటు రెండుపూటలా భోజనం ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో గరిటె తిప్పేటోళ్లకు భలే గిరాకీ లభిస్తోంది. అభ్యర్థులు వంటవారిని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు తమ వద్దే పనిచేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఏదేమైనా ఉపఎన్నిక పాక ప్రావీణ్యులకూ కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతటా ఒకే బ్రాండ్ మద్యం కరీంనగర్‌టౌన్: హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకొని, గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, మాంసం, డబ్బును ఎరచూపి ఓట్లు వేయించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం గ్రామగ్రామాన తమ అనుచరగణాన్ని దింపి, పోలీసుల కంటపడకుండా ఇంటింటి పంపిణీకి శ్రీకారం చుట్టాయి. అయితే ప్రజలు మాత్రం పార్టీలు పంచే మందుపై ఆసక్తి చూపడం లేదు. గత కొద్ది రోజులుగా అందరూ ఒకే బ్రాండ్ మందు బాటిళ్లను ఇస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది. ఇదెలా సాధ్యమని ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు టికెట్ ఆశించి, భంగపడినట్లు సమాచారం. సదరు నాయకుడు గతంలోనూ హుజూరాబాద్ టికెట్ ఆశించినట్లు తెలిసింది. ఆయనను శాంతింపజేసేందుకు సదరు పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఏకంగా విస్కీ డీలర్షిప్ దక్కేలా కృషి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నాయకుడు తమ పార్టీతోపాటు ఇతర పార్టీలకు కూడా ఒకే బ్రాండ్‌కు చెందిన మందు బాటిళ్లు సరఫరా చేస్తున్నట్లు పలువురు అనుకుంటున్నారు. ఇతర బ్రాండ్లు తెచ్చే ప్రయత్నం చేసినా పోలీసులకు దొరికే ఛాన్స్ ఉండటంతో అన్ని పార్టీల నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో అదే బ్రాండ్ మందు పంపిణీ చేయక తప్పడం లేదని సమాచారం. మొత్తమ్మీద హుజూరాబాద్ పోరులో పార్టీల మధ్య తేడాలున్నా మద్యం విషయంలో మాత్రం అందరూ ఒకే బ్రాండ్‌ను నమ్ముకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రిటైర్డ్ పోలీసులు పాలిటిక్స్‌లోకి.. కరీంనగర్‌టౌన్: ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు సేవ చేసే అవకాశం పోలీసులకు, పొలిటీషియన్లకు మాత్రమే దక్కుతుంది. అయితే రాజకీయ నాయకులు జీవితకాలం తమ సేవలను కొనసాగిస్తే, పోలీసులు మాత్రం ఉద్యోగ విరమణ పొందేవరకు మాత్రమే సేవలందించగలుగుతారు. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉండాలంటే పొలిటీషియన్‌గా మారడం ఒక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారు. పూర్తిగా భిన్న ధృవాలుగా ఉండే ఈ రెండు వర్గాలు పోలీసుల రిటైర్మెంట్ తర్వాత ఒక్కటవుతున్నాయి. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నో సిత్రాలు చోటుచేసుకుంటున్నారు. మాజీ పోలీసు అధికారి దాసరి భూమయ్య గత నెలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో వరంగల్‌కు చెందిన రిటైర్డ్ ఎస్సై ఉపేందర్‌రావు సోమవారం కిట్స్ కళాశాలలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గతంలో చాలా మంది పోలీసు అధికారులు పొలిటీషియన్లుగా మారి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్లో కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరికొంత మంది రిటైర్డ్ పోలీసులు కూడా పొలిటికల్ కేరీర్‌ను ఎంచుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
గ్రేటర్‌కు ‘విదేశీ’ కిక్కు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నెలకు సుమారు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుండగా.. ఇందులో ఏకంగా రూ.75 కోట్లు విదేశీ మద్య మేనని ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తు తం నగరంలో ఉన్న 500 బార్లు, 400 మద్యం దుకాణాల్లో విదేశీ మద్యం లభించేవి దాదాపు 100 వరకు ఉన్నాయి. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఉన్న బార్లలో వినియోగదారుల అభిరుచి మేరకు విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఫారిన్ సరుకుకు విని యోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో పలు బార్ల యజమానులు ఆబ్కారీ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటున్నట్లు నగర ఆబ్కారీ శాఖ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. నగరం లో రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల బీరు.. 5 లక్షల లీటర్ల దేశ, విదేశీ రకాల మద్యాన్ని కుమ్మేస్తున్నట్లు ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే వీకెండ్లలో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. రూ.లక్షల విలువ చేసే బ్రాండ్లు... జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని ‘టానిక్’ బడా లిక్కర్ మాల్ మందుబాబులను, గ్రేటర్ సిటిజన్లు విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ లిక్కర్ మాల్ ఆసియాలోనే అత్యంత పెద్దది కావడం గమనార్హం. ఇక్కడ నెలకు రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయని, ఇందులో సింహభాగం విదేశీ మద్యానిదేనని నిర్వాహకులు తెలిపారు. ఇక బంజారాహిల్స్‌లోని లిక్కర్ బ్యాంక్‌లోనూ విదేశీ మద్యం విరివిగా అమ్ముడవుతోంది. నెలకు సుమారు రూ.3 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక్కడ కూడా దేశ, విదేశాలకు చెందిన పలు లిక్కర్ బ్రాండ్లు గ్రేటర్ సిటిజన్లను ఆకర్షిస్తున్నాయి. జానీవాకర్, చివాస్రీగల్ వంటి బ్రాండ్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అధికం.. రూ.25 కోట్లకు పైగానే!
తిమ్మాజిపేట(నాగర్ కర్నూల్): కొత్త సంవత్సరం వేడుకలు ‘మత్తు’గానే జరిగినట్లు చెప్పొచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలోని వైన్స్‌లు, బార్లకు సరఫరా అయిన మద్యాన్ని పరిశీలిస్తే ఈ విష యం అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లా జిల్లా మొత్తానికి మద్యం సరఫరా చేసే డిపో తిమ్మాజిపేటలో ఉంది. ఇక జిల్లాలో మొ త్తంగా 225 వైన్స్, బార్లు ఉన్నాయి. వీటి యాజమానులు గత ఏడాది ఇదే సమయంలో 1,94,266 కాటన్ల మద్యం, 1,76,287 కాటన్ల బీరు తీసుకువెళ్లారు. ఈ మద్యం విలువ రూ.95.70 కోట్లు. ఈసారి రూ.121.58 కోట్ల విలువైన 2,36,005 కాటన్ల మద్యం, 3,41,520 కాటన్ల బీర్లు తీసుకువెళ్లారు. అంటే గత ఏడాదితో పోలి స్తే ఉమ్మడి జిల్లాలోని మద్యం ప్రియులు రూ.25.88 కోట్ల మద్యం అదనంగా సంబరాల్లో ఉపయోగించినట్లు! -
అనంతలో భారీ అగ్నిప్రమాదం.. రూ.21 కోట్ల నష్టం
- భారీగా మద్యం కేసులు దగ్ధం - రూ.21 కోట్ల నష్టం (సాక్షిప్రతినిధి, అనంతపురం): అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్దనున్న మద్యం సరఫరా గోడౌన్ (ఐఎంఎల్ డిపో) పూర్తిగా తగలబడిపోయింది. మంగళవారం రాత్రి 9.45 గంటలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది పరుగు పరుగున బయటకు వచ్చేశారు. చూస్తుండగానే క్షణాల్లో డిపో పూర్తిగా తగలబడిపోయింది. నష్టం సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అంచనా. ఈ గోడౌన్ దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. ప్రతి నెలా రూ.65కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. 40 ఏళ్లకిందట చేసిన వైరింగే ఇప్పటిదాకా ఉంది. కరెంటు తీగలు డిపోలో ప్రమాదకరంగా ఉండటాన్ని సిబ్బంది ఇంతకుముందే గుర్తించారు. అయితే, కొత్తగా వైరింగ్ చేయడంపై శ్రద్ధ చూపలేదు. ఇదే ప్రమాదానికి కారణమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే డిపో తగలబడిపోయిందని తెలుస్తోంది. ముందు జాగ్రత్తలేవీ? మద్యం గోడౌన్లో మంటలు ఆర్పేందుకు కార్బన్ సిలిండర్లను ఏర్పాటు చేయలేదు. వీటిపై డిపో అధికారులు ఏనాడూ దృష్టి సారించలేదు. సిలిండర్లు ఉన్నాయా, లేదా అన్న విషయాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పట్టించుకోలేదు. సిలిండర్లు ఉండి ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే మంటలను ఆర్పే అవకాశం ఉండేదని డిపోలోని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. షార్ట్‌సర్క్యూట్ వల్లే జరిగిండొచ్చు - అనురాధ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చాం. తగలబడిన మద్యం విలువ దాదాపు రూ.5కోట్లు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం. -
దుకాణాలకు ‘మందు’ నిలిపివేత
- ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలు చేయనందుకు ఆబ్కారీ శాఖ కన్నెర్ర - శనివారం మధ్యాహ్నం దాకా ‘సరుకు’ ఇవ్వని డిపోలు - 4వ తేదీ కల్లా కంప్యూటర్, స్కానర్ సమకూరుస్తామని హామీ పత్రం ఇచ్చాక సరఫరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరిగేలా ఆబ్కారీ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ట్రాక్ అండ్ ట్రేస్ విధానం కింద కంప్యూటర్, స్కానర్లను ఏర్పాటు చేయని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులకు శనివారం మద్యం సరఫరాను నిలిపి వేశారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఆదేశాల మేరకు 17 డిపోల్లో సరుకు సరఫరాను ఆపేశారు. దీంతో డీడీలు చెల్లించి డిపోల వద్దకు వెళ్లిన మద్యం వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. 4వ తేదీ ( సోమవారం) కల్లా దుకాణాలు, బార్లలో కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేసి, మందు సీసాలను స్కాన్ చేసి బిల్లులు ఇవ్వడం ద్వారా విక్రయిస్తామని హామీ ఇవ్వడంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సరుకును సరఫరా చేశారు. డిస్టిలరీల్లో తయారయ్యే మద్యం సీసాలు డిపోల నుంచి దుకాణానికి, అక్కడి నుంచి వినియోగదారుడికి చేరేంత వరకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానం అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ విధానం అమలు కాలేదు. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తూ మంత్రి టి. పద్మారావు కూడా ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. మద్యం తయారై డిపోలకు వచ్చే ముందు మందు సీసాలపై వేసే హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అదేసివ్ లేబుల్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ సీసా చరిత్ర కంప్యూటర్లో తెలుస్తుంది. మద్యం రిటైల్ అమ్మకం దారులు ఆ లేబుల్‌ను స్కాన్ చేసి వినియోగదారుడికి విక్రయించగానే, ఆ రికార్డు ఏకకాలంలో ఎక్సైజ్ శాఖకు, డిపోలకు తెలుస్తుంది. తద్వారా మద్యం అమ్మకాల్లో అవకతవకలు, మోసాలు తగ్గుతాయన్నది సర్కార్ ఆలోచన. -
'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం'
విశాఖ: ఎక్సైజ్ శాఖకు గత నెల జనవరి వరకు వ్యాట్ సహా రూ. 10, 270 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మార్చి నాటికి రూ. 12, 500 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలనేది తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. సోమవారం ముఖేష్ మీనా విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో నాటు సారా నియంత్రణలో ఉందని చెప్పారు. ఇంకా మూడు, నాలుగు జిల్లాల్లో నియంత్రణ కావాల్సి ఉందని అన్నారు. రెండు వేల మంది నాటుసారా అమ్మకందారులపై బైండోవర్లు కేసులు నమోదు చేశామన్నారు. మరో 2, 800 మందిపై బైండోవర్లు చేయాల్సి ఉందని తెలిపారు. 4 వేల దుకాణాలకు కంప్యూటీకరణ పూర్తియిందని చెప్పారు. వచ్చే నెల నాటికి మిగిలిన మద్యం దుకాణాలు కంప్యూటీకరణ చేసుకోవాలని సూచించారు. లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. -
ఓటర్లను ప్రభావితం చేయలేరు: భన్వర్‌లాల్
ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసు: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ డబ్బు, మద్యంతో వారి అభిప్రాయాన్ని మార్చలేరు పార్టీలు, అభ్యర్థులు అలాంటి తప్పుడు చర్యలను మానాలి డబ్బు ఇచ్చినా.. తీసుకున్నా క్రిమినల్ కేసులు పెడతాం దేశవ్యాప్తంగా రూ. 265 కోట్లు స్వాధీనం.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 103 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటెవరికి వేయాలో ఓటర్లందరికీ తెలుసని, డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్ల అభిప్రాయాన్ని మార్చలేరని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బుల పంపిణీ వంటి తప్పుడు చర్యలను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులిచ్చిన వారితో పాటు తీసుకున్న వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల బ్యాలెట్ పత్రాల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మొదట పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసే కంపార్ట్మెంట్ ఉంటుందని, ఇక్కడ వినియోగించే ఈవీఎంపై తెలుపు రంగు బ్యాలెట్ ఉంటుందన్నారు. అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసేందుకు కేటాయించే రెండో కంపార్ట్మెంట్లో వాడే ఈవీఎంపై గులాబీ రంగు పత్రం ఉంటుందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని వివరిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద పోస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గురువారం సచివాలయంలో ఉదయం రాజకీయ పార్టీల ప్రతినిధులు, సాయంత్రం బ్యాంకుల ప్రతినిధులతో భన్వర్‌లాల్ సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, అక్రమ నగదు పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నిరోధించేందుకు గట్టి చర్యలను చేపట్టాం. బ్యాంకుల నెట్వర్క్ ద్వారా అకౌంట్లకు డబ్బులు బదిలీ అవుతున్నాయి. ఈ డబ్బును ఏటీఎంల ద్వారా డ్రా చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇటీవ లే కొన్ని బ్యాంకు ఖాతాల్లో అకస్మాత్తుగా భారీగా డబ్బులు జమయ్యాయి. జిల్లాల్లో కొన్ని ఏటీఎంల నుంచి విత్‌డ్రాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల లావాదేవీలను పరిశీలించాలని ఈసీ నిర్ణయించింది. బ్యాంకుల ప్రతినిధులందరూ ఎన్నికల సమయంలో లావాదేవీలపై సమాచారాన్ని పంపిస్తారు. దాని ఆధారంగా డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయో విశ్లేషిస్తాం. డబ్బులు ఇచ్చిన.. తీసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తాం. కొంత మంది ఓటర్లకు కూపన్లు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటి ద్వారా ఓటర్లకు మిక్సీలు, గ్రైండర్ల వంటివి ఇస్తున్నారు. కూపన్లు ఎవరు కొంటున్నారు, వాటికి ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారనే విషయంలో దుకాణాలపై నిఘా పెట్టి సంబంధితులపై కేసులు నమోదు చేస్తాం. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై రాష్ట్రం బదనాం అయిపోయింది. చాలా బాధాకరం. దేశంలో ఇప్పటి వరకు రూ. 265 కోట్లు స్వాధీనం చేసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 103 కోట్లు దొరికాయి. 79 కేజీల బంగారం, 300 కేజీల వెండితో పాటు 3.76 లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నాం. 19,043 ఆయుధాల లెసైన్స్‌లు డిపాజిట్ చేశారు. డబ్బు, మద్యం పంపిణీ నిరోధించేందుకు తటస్థులతో పాటు యువత సహకరించాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు అందించాలి. అలాగే ఏ నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారో దాని సంఖ్య వేసి సమాచారాన్ని 8790499899 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. వెంటనే అది సర్వర్‌కు వెళ్తుంది. ఆ సమాచారం కంప్యూటర్ ద్వారా ఆ నియోజకవర్గంలోని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు నిమిషాల్లో చేరుతుంది. వాళ్లు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి డబ్బులను స్వాధీనం చేసుకుంటారు. పంపిణీ చేస్తున్న వారిని అరెస్టు చేస్తారు. మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఆయన ఓటర్లకు పెద్ద ఎత్తున చీరలు, ఇతర దుస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వాటిపై బీజేపీ గుర్తుతో పాటు నరేంధ్రనాథ్ పేరు కూడా ముద్రించి ఉంది. ఇటీవలే జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఓటర్లందరికీ బుధవారం నుంచి ఓటర్ల స్లిప్పుల పంపిణీ ప్రారంభమైంది. బూత్‌స్థాయి ఆఫీసర్లు దీన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు కూడా భాగస్వాములు కావాలి. సీమాంధ్రలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల దాఖలకు గడువు శనివారంతో ముగుస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు సమర్పించాలి. నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ పార్టీ ధ్రువీకరిస్తూ ఇచ్చే ఇంక్ సంతకంతో కూడిన ఏ, బీ-ఫారమ్‌లను కూడా అదే రోజు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల పరిశీలన 21వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు 23వ తేదీ 3 గంటలకు ముగుస్తుంది. పార్టీల స్టార్ ప్రచారకులతో పాటు ఆఫీస్ బేరర్లకు ఐదు వాహనాల చొప్పున ఎన్నికల ప్రచారానికి పాస్‌లను సీఈసీ కార్యాలయం జారీ చేస్తుంది. పాస్‌లు తీసుకున్న వారు మాత్రమే ఆ వాహనాల్లో తిరగాలి. ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయానికి ఎటువంటి పరిమితులు లేవు. పార్టీ పరంగా చేసిన వ్యయాన్ని ఆ పార్టీ వ్యయంగానే పరిగణిస్తారు. పోటీ చేసే అభ్యర్థి పేరుతో పాటు పార్టీ గుర్తు ఉంటేనే ఆ వ్యయాన్ని సదరు అభ్యర్థి ఖాతాలోకి తీసుకుంటారు. సామాజిక మీడియా ద్వారా పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. అభ్యర్థి పేరు సింబల్‌తో సామాజిక మీడియాలో ప్రచారం చేస్తే ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలోకి తీసుకుంటారు.