మాఫియా తరహాలో చెలరేగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ప్రభుత్వ ఆదాయానికి గండి.. నేతలకు కాసులు
లారీలు, కంటైనర్ల ద్వారా హానికరమైన చవక మద్యం దిగుమతి
జిల్లా, మండల, గ్రామస్థాయి నేతల ద్వారా గ్రామాలు, పట్టణాల్లోకి ప్రతి పల్లెలో టీడీపీ లీడర్ల బెల్ట్‌షాపులు
ప్రభుత్వ దుకాణాల వద్దా అక్రమ మద్యం విక్రయం.. లారీలు తనిఖీ చేయొద్దని పోలీసులకు ముందుగానే హుకుం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే లిక్కర్ మాఫియాలా చెలరేగుతున్నారు. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని లారీలు, కంటైనర్లలో తెప్పించి గ్రామగ్రామాన విక్రయిస్తున్నారు. గత నెల రోజుల్లో భారీ మొత్తంలో మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకొని, కాసుల పంట పండించుకుంటున్నారు. భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లారీల నంబర్లు ముందే చెప్పి తనిఖీ చేయొద్దని హుకుం జారీ చేయడంతో పోలీసులు ఆ లారీలను వదిలేస్తున్నారు. దీంతో అక్రమ మద్యం నిరాఘాటంగా రాష్ట్రంలోకి వచ్చేస్తోంది.
కర్నూలులోని ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు కర్ణాటక, గోవా మద్యం సరఫరా అవుతోంది. ఆళ్లగడ్డలో ఇప్పటికే కర్ణాటక నుంచి 3 లారీల మద్యం దిగుమతి అయింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకూ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ మద్యం దందాలో టీడీపీకి చెందిన కొందరు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు భాగస్వామ్యమైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
గోవా బ్రూవరేజి కంపెనీ నుంచి..
కర్నూలు జిల్లాలో మద్యం వ్యాపారంలో ఆరితేరి మంత్రిగా పని చేసిన ఓ నేతకు గోవాలోని ఓ బ్రూవరేజి కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. 2014 డిసెంబర్‌లో టీడీపీ ప్రభుత్వం ఉండగానే గోవా నుంచి కర్నూలు జిల్లాకు వెళుతున్న మద్యం కంటైనర్‌ను గుత్తి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గోవాకు వెళ్లి అక్కడి బ్రూవరీని పరిశీలిస్తే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టమైంది.
అప్పట్లో మంత్రి ప్రమేయంతో ఈ కేసును నీరుగార్చారు. ఇప్పుడు మళ్లీ అధికారం దక్కడంతో అక్కడి బ్రూవరేజి కంపెనీ నుంచి తిరిగి మద్యం సరఫరా మొదలైంది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు రెండు, తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక కంటైనర్ మద్యం వచ్చినట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాహనాల ద్వారా ఈ మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక, గోవా లిక్కర్‌తో భారీ ఆదాయం
మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) బేస్‌డ్‌తో తయారవుతుంది. కర్ణాటక, గోవాలో ఆర్‌ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) బేస్‌డ్‌తో తయారవుతుంది. ఈఎన్‌ఏతో పోలిస్తే ఆర్‌ఎస్ బేస్‌డ్ మద్యం ధర తక్కువ. అందువల్ల కర్ణాటక, గోవా మద్యం తక్కువకు లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈఎన్‌ఏ మద్యం నాణ్యమైనది. కర్ణాటకలో 90 ఎంఎల్ టెట్రాప్యాకెట్ ధర రూ.45, క్వార్టర్ రూ.90 మాత్రమే.
ఇది అక్కడి మద్యం షాపుల్లోని రేటు. నేరుగా బ్రూవరేజెస్ నుంచి తెప్పించుకుంటే మరింత తక్కువకు వస్తుంది. ధర తక్కువ కావడంతో కర్ణాటక, గోవా నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఇది అక్రమంగా వచ్చేది కావడంతో పన్నులు కూడా ఉండవు. దీంతో టీడీపీ నేతలు తక్కువకు కొని, ఎక్కువకు అమ్ముకొని డబ్బులు దండుకొంటున్నారు.
గ్రామాల్లోనే విచ్చలవిడిగా మందు
కర్నూలు నగరంలోని ప్రభుత్వ వైన్‌షాప్ పక్కనే మద్యం తాగుతున్న మందుబాబులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో మద్యం నివారించాలని బెల్ట్‌షాపులను రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతలే జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల ద్వారా గ్రామాల్లోనే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మేస్తున్నారు. మద్యం దుకాణాలు ఉన్న చోట సీటింగ్‌కు కూడా అనధికారికంగా అనుమతి ఇచ్చి, అక్కడా అక్రమ మద్యాన్నే తక్కువ ధరకు అమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment