'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం'
విశాఖ: ఎక్సైజ్ శాఖకు గత నెల జనవరి వరకు వ్యాట్ సహా రూ. 10, 270 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మార్చి నాటికి రూ. 12, 500 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలనేది తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. సోమవారం ముఖేష్ మీనా విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో నాటు సారా నియంత్రణలో ఉందని చెప్పారు. ఇంకా మూడు, నాలుగు జిల్లాల్లో నియంత్రణ కావాల్సి ఉందని అన్నారు.
రెండు వేల మంది నాటుసారా అమ్మకందారులపై బైండోవర్లు కేసులు నమోదు చేశామన్నారు. మరో 2, 800 మందిపై బైండోవర్లు చేయాల్సి ఉందని తెలిపారు. 4 వేల దుకాణాలకు కంప్యూటీకరణ పూర్తియిందని చెప్పారు. వచ్చే నెల నాటికి మిగిలిన మద్యం దుకాణాలు కంప్యూటీకరణ చేసుకోవాలని సూచించారు. లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.