
నరసరావుపేటలో రోడ్డెక్కిన బార్ యజమానులు
వైన్స్‌లో అనధికార పర్మిట్ రూముల ఏర్పాటుపై తీవ్ర ఆగ్రహం
బార్ అండ్ రెస్టారెంట్లకు తాళం వేసి ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన
తాము నిర్వహించలేమని బార్‌ల తాళాలు అధికారులకు అప్పగింత
కూటమి నేతలకు లబ్ధి కోసం తమను ముంచారని మండిపాటు
రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు
నరసరావుపేటటౌన్: మద్యం దుకాణాల యజమానులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడంపై బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. అధికార కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్సైజ్ అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసి యజమానులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
తాము బార్లు నిర్వహించలేమని తాళాలను అధికారులకు అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట పట్టణంలో 17 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మరో 11 వైన్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఆ వైన్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి బార్ అండ్ రెస్టారెంట్‌లకు దీటుగా నిర్వహిస్తున్నారు.
మాంసం, బిర్యానీ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉండటం, మద్యం కూడా బార్ అండ్ రెస్టారెంట్‌ల కన్నా తక్కువ ధరకు వస్తుండటంతో ఎక్కువ మంది వైన్ షాపుల వద్దకే వెళుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి.
కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు
ఎక్సైజ్ శాఖ ఆడుతున్న ఆటలో తాము బలైపోతున్నామంటూ నరసరావుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బార్‌ల తాళాలను ఎక్సైజ్ శాఖ సీఐ సోమయ్యకు అందజేసి తాము వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పారు. వైన్ షాపుల్లో అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకునేవరకు తాము బార్లు తెరవబోమని స్పష్టం చేశారు.
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బార్లు ఏర్పాటు చేసుకుంటే తమకు నెలకు రూ.5లక్షల వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఉందని, ఇలాగైతే వ్యాపారం చేయలేం మహాప్ర¿ో... అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనను విరమించి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment