బినామీ పేర్లతో దక్కించుకునేందుకు రంగం సిద్ధం
ఇతరులు దరఖాస్తు చేయకుండా బెదిరింపులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా సాంకేతిక సమస్యలు
ఎక్సైజ్ కార్యాలయాల వద్ద కాపు కాసి బెదిరిస్తున్న టీడీపీ ముఠాలు
335 దుకాణాలకు వచ్చిoది కేవలం 768 దరఖాస్తులే
అన్నీ బినామీ పేర్లతో వేసిన టీడీపీ సిండికేట్‌వే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలను గుప్పిట పట్టిన టీడీపీ లిక్కర్ సిండికేట్.. ఇప్పుడు కల్లుగీత కులాలకు కేటాయించిన దుకాణాలనూ చేజిక్కించుకొంటోంది. కల్లు గీత కులాల కుటుంబాలకు 10 శాతం మద్యం దుకాణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటని కూడా సొంత సిండికేట్‌కే అప్పగిస్తోంది. అధికార సిండికేట్ బహిరంగంగా సాగిస్తున్న ఈ దందా ఇదిగో ఇలా ఉంది...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి మద్యం దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాచబాట వేసింది. రాష్ట్రంలో అనుమతించిన 3,396 ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఒక్కటి కూడా సామాన్యులకు దక్కకుండా బెదిరింపులకు దిగి, టీడీపీ సిండికేటే మొత్తం చేజిక్కించుకుంది. ఇక కల్లు గీత కులాలకు కేటాయించిన 335 దుకాణాలను కులాలవారీగా రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది.
వీటిని కూడా టీడీపీ సిండికేట్‌కే అప్పజెప్పాలని ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అంటే కల్లు గీత కులాల దుకాణాలు టీడీపీ సిండికేట్ అదనపు దోపిడీకి సాధనంగా చేశారు. టీడీపీ సిండికేట్ వీటికి కూడా బినామీ పేర్లతో దరఖాస్తు చేసింది. కల్లు గీత కులాలకు చెందిన సామాన్య వ్యాపారులు, రాజకీయ నేపథ్యంలేని వారు దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే వారిని బెదిరించి బెంబేలెత్తించింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, సాంకేతిక సమస్యలు సృష్టించి ఆ విధానం పనిచేయకుండా చేసింది. ఎక్సైజ్ కార్యాలయాల వద్ద టీడీపీ సిండికేట్ ముఠాలు మకాం వేసి, దరఖాస్తు చేసేందుకు వచ్చేవారిని బహిరంగంగానే బెదిరించి వెనక్కి పంపేశాయి.
ఇదిగో మచ్చుతునక..
టీడీపీ సిండికేట్‌దందాకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఉదంతం ఓ మచ్చుతునక. ఒక దుకాణానికి దరఖాస్తు చేసేందుకు బ్రహ్మం గౌడ్ యత్నిoచారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి అనుచరుడైన టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి అతనికి ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు.
దరఖాస్తు చేస్తే చంపేస్తానని బెదిరించారు. దాంతో బ్రహ్మం గౌడ్ భయపడిపోయారు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బెదిరింపుల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా పోలీసులు, టెండర్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోలేదు.
దుకాణానికి 3 దరఖాస్తులు కూడా రాలేదు
టీడీపీ సిండికేట్‌కు భయపడి కల్లు గీత కులాలకు చెందిన వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు కూడా సాహసించడం లేదు. టీడీపీ నేతలే బినామీల పేర్లతో ఈ దుకాణాలకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల తొలి గడువు బుధవారంతో ముగిసింది. వచ్చిoది కేవలం 768 దరఖాస్తులే. అంటే ఒక్కో దుకాణానికి సగటున మూడు దరఖాస్తులు కూడా రాకుండా టీడీపీ సిండికేట్ అడ్డుకుందన్నది సుస్పష్టం.
ఇప్పుడు లాటరీ వేసినా సిండికేట్‌కే దుకాణాలు వస్తాయి. వాస్తవానికి సాధారణ దుకాణాలకు లైసెన్సు ఫీజు రూ.6 లక్షలు. కల్లు గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు లైసెన్సు ఫీజు 50 శాతం తగ్గించి రూ.3 లక్షలే చేశారు. అయినా అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కల్లు గీత కులాల ముసుగులో టీడీపీ సిండికేట్‌కు ప్రయోజనం కలిగించేందుకే లైసెన్సు ఫీజును ప్రభుత్వం 50 శాతం తగ్గించిందని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పొడిగింపు పేరిట డ్రామా..
కల్లు గీత కులాల దుకాణాల కోసం టీడీపీ సిండికేట్ సాగిస్తు న్న దందాపై విమర్శలు రావడంతో ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని బుకాయిoచేందుకు ప్రభు త్వం కొత్త ఎత్తుగడ వేసింది. దరాఖాస్తుల గడువు తేదీని ఈ నెల 8 వరకు పొడిగిస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మూడు రోజుల్లోనూ టీడీపీ సిండికేట్ ఎవరినీ దరఖాస్తు చేయనివ్వబోదన్నది అందరికీ తెలిసిన విషయమే.
Comments
Please login to add a commentAdd a comment