
కొత్త లిక్కర్ బ్రాండ్ల సరఫరా కోసం నోటిఫికేషన్
ఇప్పటికే రిజిస్టర్ అయిన కంపెనీలతో పాటు కొత్త కంపెనీలకూ చాన్స్
దరఖాస్తులకు మార్చి 15 వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: విదేశాలతో పాటు దేశీయంగా తయారయ్యే కొత్త మద్యం బ్రాండ్ల(New liquor brands)ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వనిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్)కు కొత్త బ్రాండ్లను సరఫరా చేసేందుకు కంపెనీలను ఆహ్వనిస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో మద్యం (బీర్, లిక్కర్) సరఫరా చేస్తున్న కంపెనీలతో పాటు కొత్త కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 15వ తేదీ వరకు గడువు ఉంది. విదేశాల్లో, దేశీయంగా తయారయ్యే మద్యం బ్రాండ్లను సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే టీజీబీసీఎల్‌కు మద్యాన్నిసరఫరా చేస్తున్న కంపెనీలు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొత్త కంపెనీలు మాత్రం దరఖాస్తుతో పాటు ఇతర రాష్ట్రాల్లో లేదంటే మరే ప్రాంతంలోనైనా మద్యాన్ని సరఫరా చేసే క్రమంలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా జరుపుతున్నట్టు నిర్ధారించే పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్ల సరఫరా కోసం వచ్చే దరఖాస్తులను పది రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని, ఈ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను విచారించిన అనంతరం టీజీబీసీఎల్‌కు మద్యం సరఫరా చేసే అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. కొత్త బ్రాండ్లకు అనుమతినివ్వాలని సీఎం రేవంత్ సమక్షంలో ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో.. గతంలో మద్యం సరఫరాకు అనుమతులిచ్చి ఆరోపణల నేపథ్యంలో వెనక్కు తీసుకున్న డిస్టలరీలు కూడా ఈసారి కొత్త బ్రాండ్ల పేరుతో మళ్లీ తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment