- ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలు చేయనందుకు ఆబ్కారీ శాఖ కన్నెర్ర
- శనివారం మధ్యాహ్నం దాకా ‘సరుకు’ ఇవ్వని డిపోలు
- 4వ తేదీ కల్లా కంప్యూటర్, స్కానర్ సమకూరుస్తామని హామీ పత్రం ఇచ్చాక సరఫరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరిగేలా ఆబ్కారీ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ట్రాక్ అండ్ ట్రేస్ విధానం కింద కంప్యూటర్, స్కానర్లను ఏర్పాటు చేయని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులకు శనివారం మద్యం సరఫరాను నిలిపి వేశారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఆదేశాల మేరకు 17 డిపోల్లో సరుకు సరఫరాను ఆపేశారు. దీంతో డీడీలు చెల్లించి డిపోల వద్దకు వెళ్లిన మద్యం వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. 4వ తేదీ ( సోమవారం) కల్లా దుకాణాలు, బార్లలో కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేసి, మందు సీసాలను స్కాన్ చేసి బిల్లులు ఇవ్వడం ద్వారా విక్రయిస్తామని హామీ ఇవ్వడంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సరుకును సరఫరా చేశారు.
డిస్టిలరీల్లో తయారయ్యే మద్యం సీసాలు డిపోల నుంచి దుకాణానికి, అక్కడి నుంచి వినియోగదారుడికి చేరేంత వరకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానం అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఆ విధానం అమలు కాలేదు. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తూ మంత్రి టి. పద్మారావు కూడా ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. మద్యం తయారై డిపోలకు వచ్చే ముందు మందు సీసాలపై వేసే హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అదేసివ్ లేబుల్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ సీసా చరిత్ర కంప్యూటర్‌లో తెలుస్తుంది. మద్యం రిటైల్ అమ్మకం దారులు ఆ లేబుల్‌ను స్కాన్ చేసి వినియోగదారుడికి విక్రయించగానే, ఆ రికార్డు ఏకకాలంలో ఎక్సైజ్ శాఖకు, డిపోలకు తెలుస్తుంది. తద్వారా మద్యం అమ్మకాల్లో అవకతవకలు, మోసాలు తగ్గుతాయన్నది సర్కార్ ఆలోచన.
దుకాణాలకు ‘మందు’ నిలిపివేత
Published Sun, Apr 3 2016 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement