ప్రతి బాటిల్కూ.. పక్కా లెక్క!
* మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు.. కంప్యూటర్లు
* అక్రమ వ్యాపారానికి ఎక్సైజ్ ముకుతాడు
* ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలుకు అధికారుల పట్టు
* ఈ నెల చివరి వారంలో అమలుకు సన్నాహాలు
* దీనిపై ఇప్పటికే ఓసారి కోర్టుకెళ్లిన వ్యాపారులు
* ఈసారైనా అమలవుతుందా?
సాక్షి, హైదరాబాద్: డిస్టిలరీల్లో మద్యం బాటిల్ తయారీ నుంచి అమ్మకం వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు ప్రభుత్వం ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమల్లోకి తీసుకురానుంది. ఫలితంగా మద్యం అక్రమ అమ్మకాలకు చెక్ పెట్టవచ్చని, ప్రతి బాటిల్ మద్యం అమ్మకాలకు పక్కా లెక్కలు తెప్పించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాదే ఈ ఆన్లైన్ విధానాన్ని చేపట్టాలని మద్యం వ్యాపారులకు సూచించగా, వారు కోర్టులను ఆశ్రయించడంతో ఈ విధానం వాయిదా పడింది.
మరోపక్క, ఆన్లైన్ అమ్మకాలకు అవసరమైన సాఫ్ట్వేర్ను అందించడంలోనూ జాప్యం జరగడంతో ఈ విధానం పట్టాలెక్కలేదు. తాజాగా.. ఇప్పుడు మద్యం షాపులపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కంప్యూటర్లు ఏర్పాటు చేయించి మద్యం అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టేందుకు సర్కారు రంగంలోకి దిగింది. జనవరి చివరి వారం నుంచి కచ్చితంగా ప్రతి దుకాణంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు కంప్యూటర్కు నెట్ సౌకర్యం, టూ డీ స్కానర్ తదితర పరికరాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తైవాన్ నుంచి ఈ పరికరాలను తెప్పించి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానం అమల్లోకి తెచ్చేందుకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ విధానం అమల్లోకి రావడం వల్ల మద్యం దుకాణాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఉన్నతాధికారులు తమ కార్యాలయాల నుంచే పర్యవేక్షించే అవకాశం లభించనుంది. అడెసివ్ లేబుళ్లను స్కాన్ చేసి రసీదును మద్యం బాటిల్ కొనుగోలు చేసిన వారికి ఇవ్వాలి. దీంతో ఎన్డీపీ(నాన్ డ్యూటీ పెయిడ్) లిక్కర్ అమ్మకాలు సాగించే వీలుండదు. మద్యం బాటిళ్లలో డైల్యూషన్కు అవకాశం ఉండదు. ఫలితంగా మద్యం అమ్మకాల్లో పారదర్శకత ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే, ఈ విధానంపై మద్యం సిండికేట్ల లాబీయింగ్, వ్యూహం ఎలా ఉంటుందోనని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడేం జరుగుతోంది?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా రూ.700 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే అధిక ధరకు మద్యాన్ని అమ్ముతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా ఈ అక్రమ లావాదేవీల విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటోందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సిండికేట్లకు ముకుతాడు వేసి, మద్యం అక్రమాలకు తెరదించాలని నిర్ణయించింది.
తెరపైకి.. ట్రాక్ అండ్ ట్రేస్
మద్యం అక్రమాలకు తెరదించే క్రమంలో అధికారులు ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని అమలు చే సేందుకు సిద్ధమయ్యారు. ఈ విధానంలో ప్రతి దుకాణంలోనూ సీసీ కెమెరాలు, కంప్యూటర్, స్కానర్ తదితర పరికరాలను ఏర్పాటు చేయాలి. దీనికిగాను రూ. లక్ష ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత ఎక్సైజ్ ఏడాది మరో 6 మాసాల్లో ముగుస్తుండడం, వచ్చే ఏడాది నుంచి తమిళనాడు, కేరళ తరహా మద్యం విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేవలం ఆరు మాసాల తంతుకు రూ. లక్ష ఖర్చు చేయబోమని దుకాణ దారులు ఇప్పటికే తేల్చి చెప్పారు.
అయితే, ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిన ఎక్సైజ్ శాఖ.. నెలవారీ చెల్లింపుల(ఈఎంఐ) కింద నెలకు రూ. 4 వేలు చెల్లించే పద్ధతిలో ఆయా పరికరాలను దుకాణాలకు అందించేందుకు సిద్ధమైంది. అయితే, ఇదింకా కార్యరూపం దాల్చలేదు. ఈ విధానం అమల్లోకి వచ్చి.. మద్యం అక్రమాలకు కళ్లెం పడడం ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.