ఎన్నికల వేళ రాష్ట్రానికి భారీగా గోవా మద్యం సరఫరా
ఇంతపెద్దమొత్తంలో మద్యం పట్టుబడడం ఇదే ప్రథమం
మునగపాక : ఎన్నికల కోడ్ కూతతో రాష్ట్రంలో మద్యం పారించేందుకు టీడీపీ కుయుక్తులు పన్నింది. గోవా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేసి విక్రయాలకు పాల్పడుతోంది. ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు ఇప్పటికే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్తనూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు పంపారు.
ఈ వ్యవహారంలో సూత్రధారులెవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందంటే.. యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్ కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు రప్పించి తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టారు.
ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాకనుంచి అక్రమ మద్యం రవాణా అవుతోందని వచ్చిన సమాచారంతో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి తనిఖీ చేశారు. వారి వద్ద 5 కేసుల్లో 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి.
మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్టు వారు చెప్పడంతో గడ్డివాము వద్ద తనిఖీలు చేపట్టి స్వాదీనం చేసుకున్నారు. మొత్తం రూ.50 లక్షల విలువైన 39,168 క్వార్టర్ బాటిళ్లు (7వేల లీటర్ల మద్యం) స్వాధీనం చేసుకుని ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త బి.ప్రసాద్‌నూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.
కాగా.. వెంకటస్వామి, ధర్మతేజ దినేష్కుమార్ యలమంచిలి నియోజకవర్గం కట్టుబోలుకు ఇదే తరహాలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి అక్రమ వ్యాపారం చేసేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మునగపాక ఎస్‌ఐ పి.ప్రసాదరావు వారి యత్నానికి గండికొట్టారు. కేసు విచారణ సమయంలో పోలీసులకు మరింత సమాచారం అందినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మద్యాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో సహకరించిన అందరి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇంతపెద్దమొత్తంలో మద్యం స్వా«దీనం చేసుకోవడం ఇదే ప్రథమమని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment