ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్ల ప్రక్రియ అంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే..
ఎన్నికల కోడ్‌తో ప్రారంభోత్సవానికి బ్రేక్
టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటికి జెండా ఊపుతోంది అంతే..
కానీ, ఇదంతా తామే చేసినట్లుగా బిల్డప్.. నాటి ప్రభుత్వంపై విమర్శలు
2019–23 మధ్య జగన్ సర్కార్ కొనుగోలు చేసిన కొత్త బస్సులు 1,406
2023లో మళ్లీ కొనుగోలు చేయాలని నిర్ణయించిన బస్సులు 2,736
ఇందులో మొదటి దశలో వచ్చిన కొత్త బస్సులు 1,500(వీటికే ఇప్పుడు టీడీపీ జెండా ఊపుతోంది)
2,736 కొత్త బస్సుల కొనుగోలుకు నిర్ణయం
రాబోయే మూడేళ్లలో ఆర్టీసీకి 2,736 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే గత మూడేళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సు లను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కొనాలని నిర్ణయించిన 2,736 బస్సుల్లో మొదటి దశ కింద 1,500 బస్సుల టెండర్ ప్రక్రియ చేపట్టాం. డిసెంబర్ లేదా జనవరి నుంచి వీటిని.. మిగిలిన వాటిని ఆ తర్వాత దశలవారీగా ప్రవేశపెడతాం. – 2023, మార్చి 7న అప్పటి ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించిన విషయం
సాక్షి, అమరావతి : 2023లో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1,500 కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. టెండర్లు పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసేసింది. బస్సులు కూడా వచ్చేశాయి. వాటిని ప్రారంభించడమే తరువాయి.. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చి బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడా బస్సులను ప్రస్తుత ప్రభుత్వం కేవలం జెండా ఊపి ప్రారంభిస్తోందంతే. కానీ, అంతా తామే చేశామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం యమా బిల్డప్ ఇస్తోంది.
ఈ బస్సుల కొనుగోళ్లలో వీరి పాత్ర పిసరంత కూడా లేకపోయినా తెగ డబ్బా కొట్టుకుంటున్నారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుగా ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు. విషయం ఏమిటంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత సర్కారు ప్రారంభిస్తూ అంతా తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్న జాబితాలో ఆర్టీసీ కొత్త బస్సుల ప్రారంభం కూడా చేరింది.
టీడీపీ ప్రభుత్వం 1,400 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవం ఏమిటంటే.. ఆ బస్సుల కొనుగోళ్లకు సంబంధించి కర్త, కర్మ, క్రియ అంతా వైఎస్సార్‌సీపీ సర్కారే. ఇప్పుడు వాటిని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రారంభిస్తోందంతే. కానీ, ఆ వాస్తవాన్ని మరుగునపెట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది.
మూడు దశల్లో 2,906 బస్సుల కొనుగోలు
నిజానికి.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. ముందుగా 2019–20లో కొత్త బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజిల్ బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే.
రెండేళ్లపాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ మొత్తం 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఇక 2023 చివరిలో మరో 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఎన్నికల ముందు సరఫరా చేశాయి. ఎన్నికల నియమావళి ఉండటంతో గత ప్రభుత్వం ప్రారంభించలేదు. వాటినే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.. అంతే!
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు కోసం ఇప్పటివరకు టెండర్లు పిలవనే లేదు. మరి టెండర్లు పిలవకుండానే కొత్త బస్సులను రెండు నెలల్లో ఎలా కొనుగోలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. వాస్తవానికి ఈ బస్సులన్నింటికీ టెండర్లు పిలిచి డబ్బులు చెల్లించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.
ఈ బస్సులకు మహా అయితే ఈ రెండు నెలల కాలంలో తుది మెరుగులుదిద్ది ఉంటారు. ఇప్పుడు వీటికి జెండా ఊపుతూ అదేదో మొత్తం తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటూ టీడీపీ లేబుల్ వేసుకుంటున్న తీరుని చూసి జనం నవ్వుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment