తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయం
తాజాగా కాకినాడ పోర్టులో హడావుడి
ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న వేళ పర్యటన
జనసేనాని తీరుపై కూటమి నేతల్లో అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు.
ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్‌తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.
సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు.
ఇందులో బాయిల్ రైస్‌తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం.
పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులు
కాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సాక్షి కథనంతో కలకలం..
కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్‌ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment