పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడ
వారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం
అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులు
తొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్
తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలు
తెలంగాణలో ఇన్‌పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో
సాక్షి, అమరావతి: పేదలంటే ఏమాత్రం పట్టని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పదం వింటేనే అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక వారికి ఏదైనా మేలు జరిగితే.. గుండెలు బాదుకోవడం.. గగ్గోలు పెట్టడం.. పెడబొబ్బలు.. ఆర్తనాదాలే. పుట్టుకతో సహజసిద్ధంగా ఆయనకు అబ్బిన ఈ లక్షణాలు ఇప్పుడు మరీ వికృతరూపం దాల్చి కరాళ నృత్యం చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన పథకాలను ఎన్నికల కోడ్ ముసుగులో ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
అసలు ఎన్నికల కోడ్ లేని సమయంలోనే పేదల చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడితే దానిపై ‘పచ్చ’ముఠా పెట్టిన గగ్గోలు అంతాఇంతా కాదు. ఆ విధానాన్ని అమలుచేయకుండా చేయని కుట్రలులేవు. అలాగే, అప్పట్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములను సేకరిస్తే వాటిపైనా న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంది. ఆఖరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ తమ పెత్తందారీ ధోరణిని ప్రదర్శించింది.
ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కోర్టుల్లో కేసులు వేసింది. కానీ, సీఎం జగన్ సర్కారు వీటన్నింటినీ ఛేదించుకుని తన యజ్ఞాన్ని నిర్వఘ్నంగా కొనసాగించింది. ఇందుకు సుప్రీంకోర్టుకూ వెళ్లి పచ్చ మాఫియాపై విజయం సాధించింది. కానీ, ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకుని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. దీంతో మండుటెండల్లో వృద్ధులు, వికలాంగులు సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేసి అనేకమంది మృతికి ఈ పెత్తందార్లు కారణమయ్యారు. తమ రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగుల ప్రాణాలుపోయినా పర్వాలేదనే ధోరణిలో చంద్రబాబు బ్యాచ్ వ్యవహరించింది.
ఎప్పటినుంచో కొనసాగుతున్న పథకాలకూ బ్రేకులు..
నిజానికి.. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ అన్నది కొత్త కార్యక్రమమేమీ కాదు. ఎప్పటి నుంచో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సూర్యోదయంలోపే వైఎస్సార్ పెన్షన్ కానుకను అందిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న విధానానికి ఎన్నికల కోడ్ వర్తించకపోయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి బాబు బృందం ఫిర్యాదు చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతవులును రోడ్డుపాల్జేసింది. అలాగే.. పేద విద్యార్థుల చివరి త్రైమాసికం విద్యాదీవెన, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందకుండా చేసింది. అసలివి ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీ పథకాలే.
లబ్ధిదారులు సైతం పాత వారే తప్ప కొత్తగా ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. అయినాసరే, చంద్రసేన ఒత్తిడితో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇవి చెల్లించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వాస్తవానికి.. 2023లో కరువు కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడమనేది ఇప్పటికే కొనసాగుతున్న ప్రక్రియే. చంద్రబాబు కుట్రల కారణంగా.. కరువుతో పంటలు కోల్పోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోళ్లకు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక అప్పులు పాలవుతారనే కనీస ఆలోచన కూడా లేకుండా రైతులపట్ల కర్కశంగా, నిర్దయగా వ్యవహరించింది. ఇలా బాబు నిర్వాకంతో రాష్ట్రంలో 6,95,897 కరువు బాధిత రైతులకు చెల్లించాల్సిన రూ.847.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయాయి.
తెలంగాణలో ఓకే.. ఏపీలో మాత్రం నో..
కానీ, తెలంగాణలో వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం ‘నో’ చెప్పింది. ఈ విషయంలో ఏపీపట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పేద విద్యార్థుల పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ గత ఐదేళ్ల నుంచి విద్యాదీవెన పథకం కింద డీబీటీ రూపంలో బటన్‌నొక్కి ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది.
విద్యాదీవెన కింద చివరి విడత కిస్తీని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కూడా ఇప్పటికే కొనసాగుతున్న పథకం అయినప్పటకి చంద్రబాబు బృందం ఒత్తిడితో ఎన్నికల సంఘం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.610.79 కోట్ల విద్యాదీవెన చెల్లింపులను నిలుపుదల చేసింది. విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరనే కనీస జ్ఞానం కూడా లేకుండా రాజకీయానికే బాబు బ్యాచ్ ప్రాధాన్యతనిచ్చింది. దీంతో అప్పులుచేసి పేద విద్యార్థులు ఫీజులు చెల్లించే స్థితికి బాబు తీసుకొచ్చారు.
‘చేయూత’ నిధులకూ చెక్..
ఇక మరోపక్క.. పేద అక్కచెల్లమ్మలకు ‘చేయూత’ కింద ఆఖరి విడత నిధులను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రారంభించినప్పటికీ బాబు బృందం ఒత్తిడితో ఆ నిధుల చెల్లింపులకూ ఎన్నికల సంఘం మొకాలడ్డింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళల జీవనోపాధికి సాయం అందించే ‘చేయూత’ పథకం అమలు కూడా ఎప్పుడో ప్రారంభమైంది.
ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం అమలుచేసింది కూడా. ఇప్పుడు చివరి విడత కింద 29 లక్షల మంది పేద మహిళలకు సాయం అందాలి. దీనికి కూడా బాబు బృందం ఒత్తిడితో కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు కోటరీ పెత్తందారీ పోకడలతో అడ్డుకోవడం ద్వారా పేద విద్యార్థులు, రైతులు, మహిళల పొట్టకొట్టి తమ వికృతరూపాన్ని ఆ ముఠా చాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment