కూటమి సేవలో 'ఘనాపాఠి' | IG Tripathi Support of violence in Palnadu | Sakshi
Sakshi News home page

కూటమి సేవలో 'ఘనాపాఠి'

Published Fri, May 24 2024 4:03 AM | Last Updated on Fri, May 24 2024 4:03 AM

పోలింగ్‌ రోజున నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేసి కార్లను  ధ్వంసం చేస్తున్న టీడీపీ గూండాలు..  (ఇన్‌సెట్‌లో) సర్వశ్రేష్ఠ త్రిపాఠి

పోలింగ్‌ రోజున నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేస్తున్న టీడీపీ గూండాలు.. (ఇన్‌సెట్‌లో) సర్వశ్రేష్ఠ త్రిపాఠి

చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి.. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు

కీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారి

పోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలు

కౌంటింగ్‌ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనం

పచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్‌ చేయకపోవడమే నిదర్శనం

టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్‌

పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్‌ యంత్రాంగం

సాక్షి, అమరావతి: సర్వ శ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాఠి గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి! ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ  మూకలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఓటింగ్‌లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసు లాఠీని అందించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలకు ఈ ఖాకీ కొమ్ము కాశారు. 

పోలింగ్‌ అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీమూకలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నా వారిని అరెస్ట్‌ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గూండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేయిస్తు­న్నారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు, పురందేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారి­ద్దరి నమ్మకాన్ని వమ్ము చేయలేదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థ రాజకీయ బురద పులుముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలుగుతుందో చెప్పేందుకు ఈ ‘పచ్చ’ ఖాకీ కథే నిదర్శనం!

పోలింగ్‌కు ముందు పల్నాడులో పచ్చ జట్టు 
పల్నాడులో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందని గుర్తించిన చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే కుట్రకు తెరతీశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారు. గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ శివశంకర్‌రెడ్డితోపాటు క్షేత్రస్థాయిలో కీలకమైన డీఎస్పీలు, సీఐలపై అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫిర్యాదులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా కథ నడిపించారు. టీడీపీ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులపైనే ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. 

అంతేకాదు.. ఆ అధికారుల స్థానాల్లో ఎవర్ని నియమించాలో సూచిస్తూ ఆమె ఏకంగా జాబితా సమర్పించడం గమనార్హం. అంటే ఈసీ అధికార పరిధిలో పురందేశ్వరి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, బీజేపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గినట్టు అనంతరం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని ఈసీ ఆకస్మికంగా బదిలీ చేసింది. వారి స్థానాల్లో టీడీపీ అనుకూలురైన పోలీసు అధికారులు నియమితులయ్యారు. గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్‌ బాధ్యతలు చేపట్టారు.

జాబితా పంపిన నిమ్మగడ్డ, వర్ల
చంద్రబాబుకు నమ్మిన బంటు అయిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఎస్పీగా నియమించిన గరికపాటి బిందు మాధవ్‌ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుకు బంధువు. ఐజీగా రాగానే త్రిపాఠి టీడీపీ కుట్రలను అమలు చేశారు. పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు మాచర్ల టౌన్‌ సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్సై ఎం.రామాంజనేయులును బదిలీ చేయడం గమనార్హం. 

వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను సైతం ఆయనే పంపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఇచ్చిన జాబితాలనే ఆయన పంపడం గమనార్హం. టీడీపీకి అనుకూలురైన కోటేశ్వరరావు మాచర్ల టౌన్‌ సీఐగా, కారంపూడి సీఐగా నారాయణస్వామి నియమితులయ్యారు. రెంటచింతల మండలానికి చెందిన నారాయణస్వామి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు సన్నిహితుడు.

పోలీసులను కట్టడి చేసి..
పల్నాడు అంతా టీడీపీ అనుకూల పోలీసు అధికారుల ద్వారా తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన రెండో దశ కుట్రను అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, పేద వర్గాలకు చెందిన ఓటర్లను బెంబేలెత్తించి వారు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలన్న పచ్చ పన్నాగానికి ఐజీ త్రిపాఠి కొమ్ము కాశారు. జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తనకు చెప్పకుండా కాలు కదపటానికి వీల్లేదని ఆదేశించారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం అందినా సరే తాను అనుమతిస్తేనే వెళ్లాలని స్పష్టం చేశారు. టీడీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ప్రాంతాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకే త్రిపాఠి ఇలా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.

అరాచకాలకు అండదండలు
⇒ పోలింగ్‌కు మూడు రోజుల ముందు మాచర్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి, మాజీ ఎంపీపీ వెల్దుర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లపై కూడా పచ్చమూకలు దాడి చేయడం గమనార్హం. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడికి పాల్పడిన వారిని కనీసం స్టేషన్‌కు పిలిచి కూడా మాట్లాడలేదు.

⇒ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యా సంస్థలకు చెందిన బస్సులో టీడీపీ కార్యకర్తలు హోలోగ్రామ్‌లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులు, డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో వాటిని జప్తు చేయకుండా వదిలేశారు. 

⇒ పోలింగ్‌కు రెండు రోజుల ముందు అంటే మే 11న రెంటచింతలలో టీడీపీ వర్గీయులతో సమావేశమైన సీఐ నారాయణస్వామి.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా తాము పట్టించుకోబోమని భరోసానిచ్చారు. అదే రోజు కారంపూడి మండల వైఎస్సార్‌సీపీ జేసీఎస్‌ కన్వీనర్‌ వెంకటేశ్వరరెడ్డిని ఆయన కాలితో తన్నారు. వెంకటపల్లిలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు సమాచారం అందినా ఒక్క కానిస్టేబుల్‌ను అక్కడకు పంపారు. అనంతరం ఆయనే ఆ గ్రామానికి వెళ్లి బాధితుడైన మహేశ్‌ను ఓ విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టారు. 

⇒ మే 12న సీఐ నారాయణస్వామి టీడీపీ వర్గీయులతో కలసి రెంటచింతల వెళ్లారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకి చెందిన మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో ఉదాశీనంగా వ్యవహరించారు. తద్వారా దాడులకు తెగబడ్డా, ఓటర్లను బెదిరించినా పట్టించుకోబోమని టీడీపీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.

కుట్రలకు సహకారం..
కీలకమైన పోలింగ్‌ రోజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తానో పోలీస్‌ ఉన్నతాధికారిననే విషయాన్ని విస్మరించి టీడీపీ కార్యకర్త తరహాలో చెలరేగిపోయారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఆయన ఓ వర్గానికి వత్తాసు పలికారు. స్వయంగా పల్నాడులో తిష్ట వేసి మరీ టీడీపీ రిగ్గింగ్‌కు కొమ్ము కాయడం విభ్రాంతి కలిగిస్తోంది. మాచర్లలోని కేసీపీ సిమెంట్స్‌ గెస్ట్‌ హౌస్, జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కేంద్రంగా టీడీపీ కుట్రలకు సంపూర్ణ సహకారం అందించారు. 

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటతోపాటు పరిసర గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను ఐజీ త్రిపాఠీనే నియమించడం గమనార్హం. అంతేకాదు.. ఆయనతోపాటు ఎస్పీ బిందుమాధవ్‌  ఆ గ్రామాల్లోనే ఉన్నారు. ఒక అదనపు ఎస్పీ, ఒక ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీ, ఇద్దరు సీఐలను అక్కడ నియమించారు. అదే త్రిపాఠీకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తిలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారో లేదో చూడాలని కూడా అనిపించలేదు.

రిగ్గింగ్‌ నిరోధించాలని పిన్నెల్లి మొర పెట్టుకున్నా.. 
టీడీపీ వర్గీయులు కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు, రెంటాల, జెట్టిపాలెం, పాల్వాయి గేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి, ఒప్పిచర్ల, పేట సన్నెగండ్ల, చింతపల్లి, ముటుకూరు, అడిగొప్పుల, పోలేపల్లి, వెల్దుర్తి, లోయపల్లి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట గ్రామాల్లో రిగ్గింగ్‌కు కుట్ర చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ 20 గ్రామాల్లో సక్రమంగా పోలింగ్‌ జరిగేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. 

ఆ కాపీని ఐజీ త్రిపాఠీకి అందచేసి టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడకుండా కట్టడి చేయాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెల్దుర్తితోపాటు ఆ 20 గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి చితకబాది బూత్‌ల నుంచి వెళ్లగొట్టినా స్పందించలేదు. టీడీపీ రౌడీమూకలు ఆరు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశాయి. దీనిపై సమాచారం అందినా ఆ పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఒక డీఎస్పీని కూడా పంపలేదు. త్రిపాఠి ఆ పోలింగ్‌ కేంద్రాలను కనీసం సందర్శించ లేదు.

పదేపదే ఫోన్లు చేసినా..
పల్నాడు అంతటా టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోవద్దని సంకేతాలిచ్చి ఐజీ త్రిపాఠి పోలీసుల చేతులు కట్టేశారు. అదే అదనుగా అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు  పట్టుకుని స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తుండి పోయింది. పోలింగ్‌ రోజు ఉదయం 9 గంటలలోపే యథేచ్చగా రిగ్గింగ్‌ పాల్పడాలన్న టీడీపీ కుట్రకు త్రిపాఠి కొమ్ము కాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలు అత్యధికంగా ఉన్న పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ విధ్వంసకాండ సృష్టించింది. 

మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు... ఇలా పల్నాడు అంతటా పచ్చ ముఠాలు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డాయి. పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు వెళ్లగొట్టినా, ఓటర్లను బెదిరించి పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నా, టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌ చేస్తున్నా పోలీసులు మౌనముద్ర దాల్చారు. దీనిపై ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌లకు వైఎస్సార్‌సీపీ నేతలు పదేపదే ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేయడంతో ఉదయం 9 గంటల తరువాత వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను అనుమతించారు.

కౌంటింగ్‌ రోజు అక్రమాలకు అభయం!
ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దన్నుతో పల్నాడులో భయానక వాతావరణం సృష్టించిన పచ్చ ముఠాలు ఓట్ల లెక్కింపు రోజైన జూన్‌ 4న మరోసారి దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు లేకుండా చేసి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలని పన్నాగం వేశాయి. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఐజీ త్రిపాఠి నిర్లిప్తంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్‌ సందర్భంగా దాడులకు పాల్పడిన రౌడీమూకలను ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. 

పల్నాడు జిల్లాలో 581 మంది దాడుల్లో పాల్గొన్నట్టు నిర్థారించగా ఇప్పటివరకు 274 మందినే గుర్తించారు. మరో 307 మందిని ఇంతవరకు గుర్తించలేదు. వీరిలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గానికి చెందినవారే 245 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గానికి చెందినవారు 62 మంది ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో కేవలం 19 మందినే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరంతా గురజాల నియోజకవర్గానికి చెందినవారే. 

మాచర్ల, నరసరావుపేట నియోకజవర్గాల్లో పోలింగ్‌ రోజు దాడులకు పాల్పడ్డ వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదంటే ఐజీ త్రిపాఠి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఎంత చేష్టలుడిగి చూస్తోందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల దాడులపై వీడియోలతో స్పష్టమైన ఆధారాలున్నా అరెస్ట్‌ చేయకపోవడం వెనుక టీడీపీ ఒత్తిళ్లు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఓట్ల లెక్కింపు రోజు వరకూ ఆ నిందితులను అదుపులోకి తీసుకోకూడదన్నది పోలీసుల ఉద్దేశంగా ఉంది. తద్వారా మరోసారి దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితి సృష్టించేందుకు పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు  స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement