సాక్షి, అమరావతి: అప్పులపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో పలు సార్లు కేంద్ర ఆర్దిక మంత్రి,తో పాటు ఆర్‌బీఐ, కాగ్ అప్పులపై గణాంకాలను వెల్లడించినా సరే ఆ గణాంకాలను కాదని లేని అప్పులున్నట్లు ఏ ప్రాతిపదికన, ఏ ఆధారాలతో చంద్రబాబు, ఎల్లో మీడియా చెపుతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు.
ఎల్లో మీడియా వాస్తవాల గురించి వివరణలు తీసుకోకుండా అన్యాయంగా తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర అప్పులతో పాటు అన్ని అనర్దాలకు చంద్రబాబే కారణమని ఆయన స్పష్టం చేశారు. మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగులకు, సబ్సిడీలకు వ్యతిరేకంగా రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఇస్తానంటూ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘మోసం నేర్చెన్’.... అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదనే పాటలా బాబు వ్యవహారం ఉందని ఆర్దిక మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. అప్పులపైన గణాంకాలతో పాటు, చంద్రబాబు గత నిర్వాకాలను ఆధారాలతో సహా గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్దిక మంత్రి బుగ్గన వివరించారు. ఆయన మాటల్లోనే..
అప్పులపై నిరాధార ఆరోపణలు:
రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల అప్పు చేసిందని ఒకరు.. రూ. 8 లక్షల అప్పు చేసిందని మరొకరు ఇష్టానుసారం ఆరోపిస్తున్నారు. నిజానికి మీరంతా (టీడీపీ నేతలు) గతంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ఇలా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు?
‘రుణకంఠుడు’ అంటూ.. సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెచ్చిన అప్పులు రూ. 7.34 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ ఆధారాలతో చంద్రబాబు, మా ప్రభుత్వం రూ. 13 లక్షల అప్పు చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదే మాట మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంటున్నారు. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయి.
కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగాల్సిన స్థాయిలో పెరగలేదని గతంలో నేను స్పష్టంగా చెప్పాను. అందు కోసం కేంద్రం ఇచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు కూడా చూపాను. పార్లమెంటులో కొందరు సభ్యులు వేసిన ప్రశ్నలకు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా, స్పష్టంగా సమాధానం చెప్పింది. అయినా ఇక్కడ మీడియా దారుణంగా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కడా వాస్తవాలు రాయడం లేదు. ఇది చాలా అన్యాయం. రాజకీయంగా ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే.. అందులో వాస్తవాలను మీడియా బేరీజు వేసుకోవాలి కదా?
అప్పటి కంటే ఇప్పుడు బెటర్
చంద్రబాబు పాలన కంటే మా ప్రభుత్వం ఎన్నో విధాలుగా బెటర్. ఎందుకంటే అప్పటి కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. అప్పు శాతం కూడా వారి కంటే తక్కువే చేశాం. అయితే రావాల్సినంత ఆదాయం కోవిడ్ వల్ల రాలేదు. అలాగే ఖర్చు కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను.
వాస్తవాలు మర్చి నిందలు:
ప్రభుత్వం ఏకంగా రూ. 10 లక్షల అప్పు చేసిందని ఆరోపించారు. రుణకంఠుడు సీఎం అంటూ రాసిన స్టోరీలో ఆ ఫిగర్ వేశారు. కానీ ఆ స్టోరీలో రాసిన మొత్తం అప్పు చూస్తే.. అ మొత్తం కేవలం రూ. 7,68,641 కోట్లు మాత్రమే. మరి రూ. 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.
ఇంకా పెండింగ్ బిల్లులు రూ. 1.70 లక్షల కోట్లు ఉన్నాయని రాశారు. ఆ లెక్కలు మీకు ఎవరు చెప్పారు? ఏ ఆధారాలతో మీరు అది రాశారు? ఇంకా డిపాజిట్లు, ఇతర మొత్తాలు కలిపి రూ. 28,286 కోట్లు అని రాశారు. అది ఎవరు చెప్పారు? ఇలా అన్నీ చూపుతూ.. తప్పుడు ఫిగర్ చెబుతున్నారు.
ఆ అప్పుల్లో మీరు చేసినవే ఎక్కువ:
మీ ప్రకారం లెక్క వేసుకున్నా.. మీరన్నట్లు రూ. 3.76 లక్షల కోట్లు బహిరంగ రుణాలు ఉంటే.. అందులో పాత రుణం రూ. 2,64,451 కోట్లు ఉన్నాయి కదా? 2019, మే నాటికే ఆ అప్పు ఉంది కదా?
అదే విధంగా ఉదయ్ బాండ్స్. రూ. 8,256 కోట్లు అన్నారు. అది తీసుకుంది 2016లో కదా?
ఇంకా ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 33,118 కోట్ల రుణం. పాత ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుల కింద అందులో రుణం తీసుకుంది కదా?
నాన్ గ్యారెంటీ లోన్ çపవర్ సెక్టర్‌లో రూ. 95 వేల కోట్ల రుణం అన్నారు. అందులో రూ. 69,596 కోట్ల రుణం.. పాత ప్రభుత్వం తీసుకున్నదే కదా? అ రుణం 2019, మే నాటికే ఉంది.
సీఆర్‌డీఏ బాండ్స్ రూ. 1500 కోట్లు. ఆ అప్పు చేసింది మీరు కాదా? పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ. 50 వేల కోట్ల అప్పు అంటున్నారు. కానీ నిజానికి అందులో రూ. 22 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణమే.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 50 వేల కోట్ల రుణం తీసుకున్నారని రాశారు. కానీ నిజానికి ఆ రుణ మొత్తం రూ. 36 వేల కోట్లు మాత్రమే.
ఇతర కార్పొరేషన్ల ద్వారా రూ. 1.45 లక్షల కోట్ల అప్పు అని రాశారు. ఆ మొత్తంలో పవర్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ. 95 వేల కోట్లు కూడా ఉంది. మరోవైపు ఆ రుణాన్ని కూడా వేరుగా చూపారు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 95 వేల కోట్లలో కూడా దాదాపు రూ. 70 వేల కోట్ల అప్పు గత ప్రభుత్వ హయాంలో చేసిందే.
నిజానికి రాష్ట్రానికి ఉన్న అప్పు రూ. 7 లక్షలకు అటు ఇటుగా ఉంటే.. దాన్ని దారుణంగా పెంచి రూ. 10 లక్షల కోట్లు అని రాయడం అంత కంటే తప్పు.
ఇంకా చెప్పాలంటే ఆ రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో కూడా దాదాపు రూ. 4 లక్షల కోట్లు గత ప్రభుత్వ హయాంలో చేసినవే. అయినా అన్నీ కప్పి పుచ్చి, మొత్తం అప్పును ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. రుణకంఠుడు సీఎం అంటూ రాయడం చాలా దారుణం. కనీసం జర్నలిజం విలువలు పాటించాలి కదా? ఎంత అన్యాయం?
రాష్ట్ర అప్పు అప్పటికి రూ.4.28 లక్షల కోట్లు:
గతంలో చాలాసార్లు చెప్పాం. మళ్లీ చెబుతున్నాం. ‘ఎ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్’ అని చెప్పి 15 ఏళ్ల డేటాతో ఆర్బీఐ ఒక్కోసారి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ)తో పాటు, వివిధ కేంద్ర రంగ సంస్థల నుంచి తీసుకున్న వివరాల (డేటా) ఆధారంగా ఆర్బీఐ ఆ డాక్యుమెంట్ (బుక్) రిలీజ్ చేస్తుంది. ఆ బుక్‌లో 15 ఏళ్ల డేటా ఉంటుంది.
ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 2023 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పు రూ. 4,28,715 కోట్లు. ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం 2019, మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,64,512 కోట్లు.
ఆ తర్వాత మా ప్రభుత్వం ఏర్పడే నాటికి.. అంటే మార్చి 2019 తర్వాత రెండు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 7,346 కోట్లు. అంటే గత ప్రభుత్వం దిగి పోయే నాటికి.. అంటే 2019, మే చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 2,71,797 కోట్లు.
మరి 2023, మార్చి 31 నాటికి ఉన్న ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 4,28,715 కోట్లలో.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ. 2,71,797 కోట్లు తీసేయాలి కదా?
బాబు హయాంలోనే ఎక్కువ అప్పులు
వాస్తవాలు ఇలా ఉంటే.. మొత్తం అప్పులను ఈ ప్రభుత్వానికి ఆపాదించి రాయడం అత్యంత దారుణం.
ఇక గత ప్రభుత్వ హయాంలో.. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ అప్పు ఎలా పెరిగింది? ఆ తర్వాత 2019 నుంచి నాలుగేళ్లలో ఎంతెంత పెరిగిందని చూస్తే..
-2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న ప్రభుత్వ అప్పు రూ. 1,53,346 కోట్లు కాగా.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 మే చివరి నాటికి ఆ రుణం రూ. 4,12,288 కోట్లకు చేరింది.
అదే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో ప్రభుత్వ అప్పు రూ. 6,38,217 కోట్లు
అంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ప్రభుత్వ వార్షిక అప్పు 21.8 శాతం పెరగ్గా.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా పెరిగిన అప్పు కేవలం 12 శాతమే. అది కూడా కోవిడ్ వంటి మహమ్మారి ఉన్నా కూడా.. చేసిన అప్పు తక్కువే.
ప్రతి దానికి లెక్క. అన్నీ డాక్యుమెంట్లలో..:
మా ప్రభుత్వంలో కార్పొరేషన్ల పేరుతో చెప్పకుండా రుణాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది. ప్రతి దానికి అక్కౌంట్స్, చెకింగ్స్ ఉంటాయి.
బడ్జెట్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వ అప్పులను ఫారమ్ డీ-4లో చూపుతాం. అది పబ్లిక్ డాక్యుమెంట్. మరోవైపు 5వ వాల్యూమ్‌లో అప్పుల గురించి పూర్తి వివరాలు చెబుతాము. ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో ఒక భాగం. ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అప్పు తీసుకునేది ఆర్థిక సంస్థల నుంచే కదా? అది ఆటోమేటిక్‌గా బ్యాంక్ బుక్స్‌లో కూడా ఉంటుంది. పీఏసీ బుక్స్‌లో కూడా ఉంటాయి.
ఇంకా డిబెంచర్ల రూపంలో రుణాలు సేకరించాలంటే.. బహిరంగంగానే చేయాలి. ఇందులో ఎక్కడా గోప్యత ఉండదు. ఏదీ రహస్యం కాదు.
అప్పులో గోప్యత అసాధ్యం
నిజానికి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగితే.. కేంద్ర ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అయినా దాన్ని రాయరు. చెప్పరు.
ఆర్బీఐకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, సీఏజీకి తెలియకుండా, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా ఎక్కడైనా అప్పు చేయడం సా«ధ్యమేనా?
బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు కోసం ప్రత్యేకంగా చట్టం కూడా చేశాం. ఆ అప్పును ఎలా వినియోగిస్తామో కూడా అందులో స్పష్టంగా చెప్పాం. మహిళలు, రైతులకు సంబంధించిన నాలుగు పథకాల కోసం అని చెప్పడం జరిగింది.
జీడీపీతో పోల్చినా.. అప్పుడే ఎక్కువ అప్పులు
-ఇక మన స్థూల ఉత్పత్తి (రాష్ట్ర జీడీపీ)తో పోల్చి గత ప్రభుత్వ హయాంలో చేసిన, పెరిగిన అప్పు చూస్తే..గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఆ 5 ఏళ్లలో చేసిన అప్పు రూ. 2.59 లక్షల కోట్లు. అది రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే 7.45 శాతం . అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు దాదాపు రూ. 2.26 లక్షల కోట్లు. దాన్ని రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే అది కేవలం 5.2 శాతం మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే.. దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఆర్‌డీఏ బాండ్లు చాలా గొప్పవని చెబుతారు. అవి ఒకటిన్నర శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయంటారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బెవరేజెస్ బాండ్స్ 4.5 శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినా.. దాని గురించి రాయరు. చెప్పరు.
అనుమతి లేకుండానే నిధుల వినియోగం
టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా రూ. 1,10,599 కోట్లు ఖర్చు చేసిందా అని ఆయన అడిగితే.. కేంద్రం ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాసనసభ అనుమతి లేకుండా రూ. 1.62 లక్షల కోట్లు ఖర్చు చేశారని సమాధానం చెప్పారు. అయినా దాని గురించి రాయరు.
నోటికి ఏది వస్తే..అదే మాట్లాడతారా?
మరో ఎంపీ రాష్ట్ర అప్పుల గురించి సభలో అడిగితే కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం.. 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం.. ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లు అని చెప్పారు. అదే 2022 రివైజ్డ్ ఎస్టిమేషన్‌నే తీసుకుంటే, అప్పు రూ. 3,93,718 కోట్లు మాత్రమే. ఆ మేరకు 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినా, ప్రభుత్వ అప్పు కేవలం రూ. 4.42 లక్షల కోట్లు మాత్రమే అయినా.. ప్రభుత్వ అప్పు రూ. 10 లక్షల కోట్లు అని, రూ. 13 లక్షల కోట్లు అని.. నోటికి ఎంత వస్తే అంత మొత్తం చెబుతున్నారు. ఎంత దారుణం ఇది?
-చంద్రబాబు తన పరిపాలన బ్రహ్మాండం అంటారు. ఆయన పరిపాలన హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు రూ. 6.95 లక్షల కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలో సగటు స్థూల ఉత్పత్తి రూ. 10.84 లక్షల కోట్లు. రెండింటి మధ్య తేడా చూడండి. స్థూల ఉత్పత్తి పెరిగితే రెవెన్యూ కూడా పెరగాలి అంటారు కదా?. దానికి సమాధానం.
రెవెన్యూ రాబడి-వాస్తవాలు
చంద్రబాబు గతంలో మంత్రిగా, సీఎంగా పని చేశారు. 1999 నుంచి 2004 వరకు చూస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూ రాబడి 12.4 శాతం పెరిగింది. అదే 2004 నుంచి 2009 వరకు వైయస్సార్‌గారి హయాంలో 21.6 శాతం.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14.4 శాతం పెరగ్గా.. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే మన ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది. ఇవన్నీ లెక్కల్లో స్పష్టంగా ఉంటాయి కదా? ప్రభుత్వానికి ఎలా ఏ రూపంలో ఆదాయం వచ్చిందనేది ఉంటుంది కదా? చంద్రబాబు పాలన బాగుంటే, రెవెన్యూ రాబడి ఎందుకు పెరగలేదు?
ఇప్పుడు ఉద్యోగులు పెరిగారు
ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు.ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే.. 2018-19లో 44.86 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటే.. 2022-23 నాటికి ఆ సంఖ్య ఏకంగా 60.75 లక్షలకు పెరిగింది. అంటే ఉద్యోగుల సంఖ్య పెరిగితేనే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు పెరుగుతాయి కదా?
చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు దాదాపు 20 లక్షల ఉద్యోగులు పెరిగినట్లే కదా? రాష్ట్రంలో నిరుద్యోగులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో 2018-19లో నిరుద్యోగ శాతం 5.3 ఉంటే.. అది 2022-23 నాటికి అది 4.1 శాతానికి తగ్గిందని. అంటే చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. ఇవన్నీ పార్లమెంటులో భూపేందర్‌సింగ్ హుడా, కపిల్ సిబల్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు.
బాబు మాటలు-నీటి మూటలు
2014లో సీఎం అయిన చంద్రబాబు, ప్రజలను మభ్య పెట్టేందుకు కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు.. స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఔకులో పారిశ్రామిక వాడ, బెంగళూరు పారిశ్రామిక వాడ, టెక్నాలజీ క్లస్టర్, కోయిలకుంట్లలో సిమెంట్ పరిశ్రమ, న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్, సోలార్ అండ్ విండ్ పవర్ స్టేషన్లు.. విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల పరిశ్రమ.. వీటిలో ఒక్కటైనా ఏర్పాటు చేశారా? ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ తప్ప. ఎందుకంటే వ్యవసాయానికి తగిన భూములు లేవు కాబట్టి.
అది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పంప్డ్ స్టోరేజీ కింద అంత కంటే బాగా చేశాం. విమానాశ్రయాన్ని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవుకులో రామ్‌కో సిమెంట్ కంపెనీ ఇటీవలే ఏర్పాటైంది కదా? ఇప్పుడు మేము కదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. అంటే, ఆనాడు మీరు ఏమీ చేయకపోగా.. ఇంకా ఏం చెప్పారు. ఆలూరులో జింకల పార్కు. శ్రీశైలంలో పులుల పార్క్.అవి కూడా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు తన విధానాలు, ఆయన అనైతిక రాజకీయాల వల్ల ఇష్టానుసారం అప్పులు చేశారు. అందుకోసం ఏమేమో చేస్తామని చెప్పారు.
బాబు దిగజారుడు మాటలు:
ఇప్పుడు ఏవేవో పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యేలకు ఒక్కో పేరు పెడుతున్నారు. మరి మేము కూడా ఆ పని చేయలేమా? నీకు, నీ కుమారుడికి కూడా పేరు పెట్టలేమా? కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే మేము నీలా దిగజారి మాట్లాడం.
నీతి లేని నాయకుడు చంద్రబాబు
చంద్రబాబు రాజకీయ జీవితం చూస్తే.. ఎక్కడైనా విలువలకు కట్టుబడి ఉన్నాడా? ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు దగ్గరయ్యాడు కదా? 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్‌పేయి వేవ్‌లో గెల్చాడు. 2001లో మోదీని గుజరాత్ సీఎంగా దింపాలన్నాడు. 2004 వచ్చే సరికి మళ్లీ యూటర్న్. బీజేపీతో కలిసి ఎన్నికల్లో నిలబడి, ఓడిపోయిన తర్వాత ఓడిపోవడంతో.. తనది హిస్టారికల్ మిస్టేక్ అన్నాడు. మళ్లీ 2009 వచ్చే సరికి మరోసారి యూటర్న్. టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంతో మహాకూటమి. ఎన్నికల్లో పోటీ. అప్పుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై నిశిత విమర్శలు చేశాడు. దానిపై ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.
2014 వచ్చే సరికి మళ్లా బ్యాక్. బీజేపీ, జనసేన. కాంగ్రెస్‌పై నిశిత విమర్శలు. మన్మోహన్‌సింగ్‌ను ఏకంగా సోనియాగాంధీ పెంపుడు కుక్క అన్నాడు. 2016 వచ్చే సరికి డీమోనిటైజేషన్. తానే మోదీకి సలహా ఇచ్చానని అన్నాడు. అది బూమరాంగ్ కావడంతో.. అది చరిత్రాత్మక తప్పిదం అన్నాడు.
2018 వచ్చే సరికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టాడు. 2019 ఎన్నికలు వచ్చే సరికి మోదీకో హఠావో.. దేశ్‌కో బచావో అన్నాడు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో.. మోదీ వంటి నేత దేశానికి అవసరం అన్నాడు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం ఒక్క వైయస్సార్ కాంగ్రెస్‌తో తప్ప.. అన్ని పార్టీలతో రాయబారాలు జరుపుతున్నాడు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌తో కూడా మాట్లాడుతున్నాడు.
బాబు ఊసరవెల్లి రాజకీయాలపై పాట
చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై రూపొందించిన ఒక పాట వీడియో ప్రదర్శించి చూపారు.‘మోసం నేర్చెను.. అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదు’.. అన్న పాట.
బాబు మనసులో మాట
ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక బుక్ రాశాడు. ‘అది మనసులో మాట’.
ఆ బుక్‌లో పేజీ నెం.117లో ఏముందంటే.. మనం అవసరానికి మించి ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం.
119వ పేజీ. ఎన్టీఆర్ కిలో బియ్యం రూ. 2 చేశారు. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్లీ రూ. 3.50 చేశాను.
సబ్సిడీ ఇవ్వడం అంటే పులి మీద స్వారీ మాదిరిగానే. సబ్సిడీ ఇచ్చినా ఎన్టీ రామారావు, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఓడిపోయింది.
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న అకాళీదల్ ఎన్నికల్లో ఓడిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉద్యోగుల యొక్క, ఉద్యోగుల చేత, ఉద్యోగుల కోసం అన్నట్లుగా మారాయి.
పేజీ నెం.124. విద్యుత్ మాత్రమే కాక, ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో ఎక్కువ భాగం తింటున్నాయి. పేదలకు సబ్సిడీ ఇళ్లు. ఖరీదైన పథకం. కొన్ని వర్గాలకు ఉచిత ప్రయాణం సరికాదు.
మరి అదే ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అంటున్నాడు. ఇలా ప్రతిదీ ఫ్లిప్‌ఫ్లాప్.
పేజీ నెం.62. ఉద్యోగుల్లో అవినీతి పెరిగింది. వివిధ శాఖల్లో అవినీతి పరులైన ఉద్యోగులు చాలా మంది పెరిగారు
ఉద్యోగులు, వారి జీతభత్యాలు. పెన్షన్లు పెరుగుతున్నాయి. దాని కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక విష వలయం.
స్వార్థ రాజకీయాలు:
చంద్రబాబు రాజకీయ పొత్తులు చూస్తుంటే.. హాలీవుడ్ యాక్టర్ ఎలిజబెత్ టేలర్ గుర్తుకు వస్తుంది. ఆమె ఏడుసార్లు పెళ్లి చేసుకుంది. అందులో ఒకరిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. చంద్రబాబు రాజకీయ పొత్తులు కూడా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్. ఆ తర్వాత బీజేపీ. మళ్లీ కాంగ్రెస్. మళ్లీ బీజేపీ. జనసేన. ఇంకా వామపక్షాలు. నిజానికి ఆ పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వేరు. కానీ చంద్రబాబు మాత్రం అందరితో చర్చలు.
విభజనలోనూ చంద్రబాబు అనైతిక రాజకీయాలు:
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ. దీనికి చంద్రబాబు కూడా కారణం కాదా? 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశాడు. ఆ తర్వాత 2011లో శ్రీకృష్ణ కమిటి నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. 2012లో మరో లేఖ రాసి, తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాడు.
రెండు కళ్ల సిద్ధాంతం చెప్పాడు. రాష్ట్రం విడిపోతే, తమ పార్టీ జాతీయ పార్టీ అవుతుందని అన్నాడు. అటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాడు. ఇటు తెలంగాణ ఏర్పాటు చేయాలని కూడా కోరాడు.
ఇన్నిసార్లు ఐడియాలజీ మార్చుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఏనాడైనా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాడా? రాష్ట్ర అప్పులకు ఆయన కాదా కారణం. ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతానన్నా, తామే కడతామని తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానన్నాడు. కంప్యూటర్ కనిపెట్టానని చెప్పాడు. రాష్ట్ర విభజన సమయంలో ఉచిత సలహాలు కూడా ఇచ్చారు కదా?
విభజన తర్వాత మనకు అన్యాయం జరిగింది. స్థూల ఉత్పత్తిలో సేవా రంగం (సర్వీస్ సెక్టర్) 45 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగం 33 నుంచి 38 శాతానికి పెరిగింది. హైదరాబాద్ మనకు లేకుండా పోవడం వల్ల మనకు దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల ఆదాయం పోయింది. అవన్నీ మీకు తెలియదా? మీరు నిపుణులు కాదా?
అప్పులనేమో జనాభా ప్రాతిపదికన చేశారు. కానీ ఆస్తులను లొకేషన్ ప్రకారం విభజించారు. దాని వల్ల హైదరాబాద్ పోయింది. ఇక్కడ జనాభా ఎక్కువ కావడం వల్ల అప్పులు పెరిగాయి.
విద్యుత్ రంగానికి వచ్చే సరికి, వినియోగం ఆధారంగా విభజించారు. దాని వల్ల తెలంగాణకు 54 శాతం, ఆ«ంధ్రప్రదేశ్‌కు 46 శాతం ఇచ్చారు. అంత అన్యాయంగా విభజన చేశారు. మీరు, కాంగ్రెస్ కలిసి చేశారు. రాష్ట్రానికి నష్టం, అన్యాయం చేశారు. మీ లక్ష్యం ఒక్కటే. జగన్‌గారిని ఇబ్బంది పెట్టాలి.
విభజన తర్వాతా బాబు అన్యాయమే..:
విభజన తర్వాత కూడా మీరు రాష్ట్రానికి అన్యాయం చేశారు. హోదా వద్దన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చుకోలేకపోయారు. వెనకబడిన ప్రాంతాల నిధి కూడా జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున సాధించలేకపోయారు. 2014-17 మధ్య రెండేళ్లు ఆ నిధి తెచ్చుకోలేకపోయారు. ఆ నిధిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించుకుంది.
పోలవరం ప్రాజెక్టును 2014-15 నాటి ధరలకు అనుగుణంగా ఎలా పూర్తి చేస్తామని తెచ్చుకున్నారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తోంది. మీరు ప్రాజెక్టును ప్రొటోకాల్ ప్రకారం చేయలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం స్పిల్‌వే పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్‌లు కట్టారు. మధ్యలో గ్యాప్ ఇచ్చారు. దాని వల్ల పనులన్నీ అస్తవ్యస్తం అయ్యాయి.
రెవెన్యూ లోటు. దాన్ని కూడా మీరు సాధించలేదు. కానీ మేము రూ. 12 వేల కోట్లు తెచ్చుకున్నాం. మేము వచ్చాకనే రామాయపట్నం, కడప స్టీల్ ప్లాంట్ కడుతున్నాం కదా?
పౌరసరఫరాల శాఖ అప్పుల్లో తెలంగాణ తన వాటా రూ.600 కోట్లు కట్టకపోతే.. ఎస్‌బీఐ కొంపల్లి శాఖలో ఖాతా ఫ్రీజ్ అయితే, మేము వచ్చాక ఆ డబ్బులు కట్టించి, మన వాటా తెచ్చుకున్నాం. ఇది వాస్తవమా? కాదా?
ఇప్పుడు వచ్చి ఏదేదో చేస్తామంటున్నారు. మేము కేంద్రంతో మాట్లాడి అన్నీ సాధిస్తే.. కుమ్మక్కు అయ్యామంటారు. మీరు చేయలేదు. మేము చేస్తే.. విమర్శలు.
ఇన్ని అనర్థాలకు కారణం బాబే..:
ఈరోజు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అంటే.. ప్రధాన కారకుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబు.. ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఆయన చర్యలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు. అన్నీ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించేవే.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ఉద్యోగుల భవిష్యత్తు కోసమే..:
ఉద్యోగులకు సంబంధించి రాబోయే 30 ఏళ్లలో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిర్ణయాలు తీసుకున్నాం. ఓపీఎస్ గురించి నిర్ణయం తీసుకుంటే.. భవిష్యత్తులో అది మరింత భారమై, ఉద్యోగులకే నష్టం చేస్తుంది. ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే జీపీఎస్ అమలు చేస్తున్నాం. దాన్ని కేంద్రం కూడా ఆమోదిస్తోంది.
మేము వచ్చాకే కొత్త ఉద్యోగాలు:
మా ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య ఆరోగ్య శాఖలో ఎందరిని భర్తీ చేశాం. సచివాలయాల ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియడం లేదా?
చంద్రబాబు మనసులో మాట పుస్తకం ద్వారా ఉద్యోగులపై తన మాట చెప్పాడు. ఇప్పుడు ఆయనే మళ్లీ ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు.
అందుకే చంద్రబాబు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతారు. మీ లీడర్ చెబితే చేయాలంటారు,..మా లీడర్ చెప్పడమే తప్ప చేయడం ఉండదని టీడీపీ నేతలే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment