టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది. పార్టీ టికెట్లపై నిర్ణయం తీసుకోలేక తల బొప్పి కట్టిపోతోంది. జనసేనతో పొత్తు నిర్ణయంతో టికెట్ రాదన్న భయంతో టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. తమ టికెట్ సంగతి తేలిస్తేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఎక్కడికక్కడ నేతలు తెగేసి చెబుతుండటంతో తండ్రీ కొడుకులకు నిద్ర కరువైంది.
తెలుగుదేశం పార్టీ అంతర్గత పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఇప్పటికే పాతాళానికి కుంగిన ఆ పార్టీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా లోతుకు కూరుకుపోతోంది. క్షేత్రస్థాయి కేడర్‌లో ఇప్పటికే పూర్తిగా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పార్టీకి ఇన్‌ఛార్జ్‌లు లేకపోవడాన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతోంది. నాయకులు ఉన్న చోట కూడా కుమ్ములాటలతో సతమతమవుతోంది.
జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉంటూ.. బీజేపీతో కూడా పొత్తు ప్రయత్నాలు చేస్తుండటంతో గందరగోళం ఇంకా పెరిగిపోయింది. టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుందో.. ఏ స్థానంలో తాము పోటీలో ఉంటామో తెలియక టీడీపీ కేడర్ అయోమయంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కీలక నేతలు చంద్రబాబును ధిక్కరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకుండా తమ సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు.
సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును చంద్రబాబు గాల్లో పెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకసారి గెలిచిన చోట మళ్లీ పోటీ చేయని గంటా.. వచ్చే ఎన్నికల్లో తనకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు ఇవ్వాలని కోరుతుండగా, చంద్రబాబు ఎటూ తేల్చడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక గంటా తంటాలు పడుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబం సైతం చంద్రబాబు వైఖరిపై రగిలిపోతోంది.
పార్టీకి అండగా ఉన్న తమను దూరం పెడుతున్నారని వాపోతోంది. అయ్యన్న తనకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతుండగా.. ఎవరో ఒకరికి మాత్రమే సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఆయన అలక వహించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా.. మౌనంగా ఉంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సీటు జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండటంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన సీటు జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న ఆయన.. అవసరమైతే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు సీట్లు ఇవ్వకపోతే టీడీపీ సంగతి తేలుస్తామని గాజువాక, అనకాపల్లి నేతలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్‌లు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేశారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య జనసేన చిచ్చు పెట్టింది. ఇక్కడ అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకు ఇస్తే తాను మరో దారి చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే బహిరంగంగా తన సీటు జనసేనకు ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ ఇస్తే తాను ప్రత్యామ్నాయం చూసుకుంటానని హెచ్చరించారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా పార్టీని ధిక్కరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు తనకివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతుండగా, చంద్రబాబు మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు. తేడా వస్తే ఆయన జంప్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
కృష్ణా బెల్ట్‌లో విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుతో ఢీకొట్టి మరీ తెలుగుపార్టీకి రాజీనామా చేయడంతో టీడీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పడంతో.. అదే బాటలో మరికొందరు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లేదని చెప్పడంతో ఆయన లోలోన కుంగిపోతూ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మైలవరం సీటును ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన తనను మోసం చేశారని వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన స్థానంలో బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఇస్తుండడంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు కూడా సత్తెనపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడటంతో చంద్రబాబుపై శివాలెత్తిపోవడంతో పాటు టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరి నుంచి లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ శపథం చేశారు. చిలకలూరిపేట సీటు విషయంలో భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మధ్య పోటీ నెలకొంది. సీటు లేకపోతే టీడీపీని వదిలేందుకు పుల్లారావు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సింహపురిలో నెల్లూరు సిటీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉండడంతో మొదటి నుంచి అక్కడ పని చేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం దక్కలేదంటూ ఆయన టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కదన్న అనుమానంతో ఆనం రాంనారాయణరెడ్డి ఆఫీసు తీసుకుని మరీ.. మళ్లీ మూసేసుకున్న పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడు ఆనం కూడా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయారు.
రాయలసీమ ప్రాంతంలోనూ వర్గ విభేదాలతో తెలుగుపార్టీలో అగ్గి రగులుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గ్రూపులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఎవరికి సీటిచ్చినా రెండో వర్గం తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు ధర్మవరం ఇన్‌ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తుండగా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సీటు తనదేనని చెప్పుకుంటున్నారు.
దీంతో పరిటాల ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనను నమ్మించి పని చేయించుకుని ఇప్పుడు మాట మారిస్తే ఊరుకోనని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒక ఇంట్లో ఒకరికే టికెట్ అని చంద్రబాబు చెప్పడంతో రాప్తాడులో పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఇన్‌ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను నియమించడంతో ఆ నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంది.
ఇదీ చదవండి: సంగివలసలో సీఎం జగన్ సింహనాదం
బ్రహ్మానందరెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆలూరు సీటు ఇవ్వకపోతే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నారు. డోన్ అభ్యర్థిగా చంద్రబాబు.. ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించగా, కేఈ ప్రభాకర్ తాను రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నారు. అదే జరిగితే ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment