సీనియర్లు పక్కకు వెళ్ళిపోండి.. డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఇదే. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో చంద్రబాబు వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంటున్నారు. జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా డబ్బుతో వచ్చేవారికే టిక్కెట్ అని తేల్చి చెప్పేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటినుంచీ ఉన్నవారిని, వారి వారసుల్ని కాదని కొత్తవారి కోసం వెతుకుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా సీనియర్లంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఆ జిల్లా ఏదో.. ఆ నేతలెవరో చూద్దాం.
తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పచ్చ జెండా ఎగురుతోంది. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ అడ్రస్ గల్లంతయింది. జిల్లాలోని కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు టీడీపీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీ జెండాను మోసాయి. మూడు కుటుంబాలు టీడీపీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలిగారు.
అయితే మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డాయి. దీంతో సీనియర్ నేతల కుటుంబాలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని పచ్చ పార్టీ బాస్ చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. డబ్బు గుమ్మరించే వారిని తీసుకురండి అని చెబుతున్నారు. అటువంటి వారు కనిపిస్తే వారికే టిక్కెట్ అని హామీలిచ్చేస్తున్నారు. ఆక్..పాక్..కరివేపాక్..అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు కోడలు లలితకుమారికి ఈసారి టిక్కెట్ లేదని చెప్పేశారు. టీడీపీ ఏర్పడకముందు ఇండిపెండెంట్‌గా గెలిచిన కోళ్ల అప్పలనాయుడు టీడీపీ వచ్చాక ఆ పార్టీ తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత అప్పలనాయుడు కోడలు లలిత కుమారి రెండు సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్.కోట టీడీపీలో ఈ కుటుంబానిది తిరుగులేని నాయకత్వం. కానీ ఈ ఎన్నికల్లో లలిత కుమారికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన NRI పారిశ్రామిక వేత్త గొంప కృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నేపధ్యం లేకపోయినా బాగా డబ్బున్న వ్యక్తి కావడం అనే కారణంతో కోళ్ల కుటుంబాన్ని పక్కన పెట్టి గొంప కృష్ణకు ఎస్.కోట టికెట్ ఇవ్వబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది.
నెల్లిమర్ల నియోజకవర్గంలో పతివాడ నారాయణస్వామి 7 సార్లు టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈయన అనుభవం అపారం. అయితే వృద్దాప్యం కారణంగా వారసులుకి అవకాశం కల్పించాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ ధనికులకే టికెట్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చిన చంద్రబాబు.. పతివాడ నారాయణస్వామి కుటుంబం విన్నపాన్ని విస్మరించారు. ఎయిర్‌పోర్ట్ వస్తున్న భోగాపురం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించిన కర్రోతు బంగార్రాజుకు నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీల యజమాని అయిన లోకం మాధవి జనసేన తరపున టికెట్ రేసులోకి వచ్చారు. బంగార్రాజు కంటే ఈమె దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలియడంతో నెల్లిమర్ల సీటును టీడీపీ తరపున లోకం మాధవికి ఇస్తామని హింట్ ఇచ్చారు. దీంతో రియల్టర్ బంగార్రాజు ఖంగు తిన్నారు.
పార్వతీపురం నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవి మాస్టర్ టిడిపి తరపున మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. బోనెల విజయచంద్ర అనే వ్యాపారవేత్తను పార్వతీపురం రాజకీయ తెరమీదకు తీసుకుచ్చారు. ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా చంద్రబాబు విడిచి పెట్టలేదు. డబ్బు బాగా ఖర్చు పెట్టగలవారికే టికెట్ అని తేల్చి చెప్పేశారు. విజయచంద్రకు రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్వతీపురం టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
బలమైన కేడర్, పార్టీతో లాంగ్ జర్నీ, ఆపద కాలంలో పార్టీని నిలబెట్టారు అనే సెంటిమెంట్, ఎమోషన్ ఏ మాత్రం లేకుండా డబ్బున్నోడు కనబడగానే సీనియర్లను పూచిక పుల్లల్లా తీసి పక్కన పడేస్తున్నారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు నైజం తెలుసుకుంటున్న జిల్లా సీనియర్లు ఆయనపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment